బుధవారం, జూన్ 29, 2011

పాలూ-నీళ్ళూ

పాలనీ నీళ్ళనీ వేరు చేయడం ఒక్క హంసకి తప్ప ఇంకెవ్వరికీ సాధ్యంకాదు. కానీ ఇక్కడ రెండు చిక్కులున్నాయి. హంస, చక్కగా నీళ్ళు తాగేసి పాలు మనకి మిగల్చదు. సుబ్బరంగా పాలన్నీ తను తాగేసి, నీళ్ళు మన మొహాన కొడుతుంది. రెండోది, హంస తన స్థాయికి తగ్గట్టు రాజభవంతుల్లోనో, ధగద్ధగాయమానమైన ప్యాలస్లలోనో ఉంటుంది కానీ, జనసామాన్యం నివసించే చోట తిరుగాడదు. సదరు రాజభవంతుల్లో వాడే పాలల్లో నీళ్ళు కలిపే మగదూర్ ఎలాగూ ఎవరికీ ఉండదు. దీనివల్ల బోధ పడేది ఏమిటీ అంటే, మనబోటి నీళ్ళ పాల బాధితులకి సదరు హంస చేయబోయే సాయం అంటూ ఏమీ ఉండదు.

మన పెద్దవాళ్ళు ప్రచారంలోకి తెచ్చిన కొన్ని సామెతలు అసలు ఏ ఉద్దేశ్యంతో పుట్టించారో ఎంత ఆలోచించినా అర్ధం కాదు. ఉదాహరణకి భార్యాభర్తలు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటే 'చక్కగా చిలకా గోరింకల్లా ఉన్నారం'టారు. ఏ చిలకా గోరింకనీ, వైస్ వెర్సా గానూ కూడా పెళ్లాడవు కదా. అలాగే అత్తా కోడలూ కనక కలివిడిగా ఉంటేనో, ఉన్నట్టు కనిపిస్తేనో 'చక్కగా పాలూ నీళ్ళలా కలిసిపోయారు' అంటారు. ఇద్దర్లో పాలెవరు, నీళ్లెవరు? అని ఏ మగ ప్రాణికైనా సందేహం వచ్చినా దానిని బయట పెట్టకపోవడం కుటుంబ క్షేమం మరియు మనశ్శాంతి దృష్ట్యా అత్యవసరం.

పాలూ నీళ్ళూ ఓసారి కలిసిపోయాక, వాటిని కనిపెట్టడం కుంచం కష్టమైన పని. ఇంక విడదియ్యడం అయితే అసాధ్యమే. ఈ సూక్ష్మాన్ని బాగా అర్ధం చేసుకున్నవాళ్ళు పాలవ్యాపారులు. దీనిని వ్యాపార సూత్రం చేసేసి అంత బాగానూ అమలు చేసేస్తున్నారు. మా చిన్నప్పుడు పాలు కొనే అవసరం ఉండేది కాదు. పెరట్లో పాడి ఉండేది కాబట్టి పాలల్లో నీళ్ళు కలపడం అంటే ఏమిటో, ఎందుకో తెలియలేదు. తర్వాత కొన్నాళ్ళకి ఇంటి పాడికి ఇబ్బంది రావడం వల్ల బయట పాలు కొనే వాళ్ళు. "నీళ్ళు కలిపేస్తున్నావ్" అని పాలు తెచ్చే కుర్రాణ్ణి రోజూ సాధించేది బామ్మ. "చంటి పిల్లాడు తాగే పాలు" అని కూడా అనేది, నన్ను చూపిస్తూ. అప్పటికి నేను నాలుగో ఐదో చదివేవాణ్ణి.

"మనం ఏమరుపాటుగా ఉన్నామంటే, బంగారంలో రాగీ పాలల్లో నీళ్ళూ ఇట్టే కలిపేస్తారు" అంటూ ఉండేది కూడా. ఆవిడకి బంగారం అంటే భలే ఇష్టం. నాకేమో కొన్న పాలు, మా ఇంట్లో పాలలాగే అనిపించేవి. నీళ్ళు కలిపినట్టు బామ్మకి ఎలా తెలుసా అని ఆశ్చర్యంగా ఉండేది. అప్పుడు బామ్మ వల్ల తెలిసింది ఏమిటంటే, నీళ్ళు కలిపిన పాలతో కాఫీ బాగా రాదనీ, పెరుగు చిక్కగా తోడుకోదనీ, మీగడ రాదనీ, వీటన్నింటినీ బట్టి నీళ్ళు కలిపిన విషయం తెలుసుకోవచ్చనీను. "మన పెరట్లో పాలైతే చిక్కగా బొట్టెట్టుకునేలా ఉంటాయి. నీళ్ళు కలిపిన పాలని రంగు చూసి కనిపెట్టేయొచ్చు," అన్న రహస్యం కూడా చెప్పేసింది.

నా అంతట నేనుగా పాలు కొనడం మొదలెట్టాక అనుభవంలోకి వచ్చాయి కష్టాలన్నీ. అసలు ఈ గొడవ లేకుండా పేకెట్ పాలు కొనుక్కోవచ్చు కదా అనిపిస్తుంది నాకు. కానీ, ఒక్కళ్ళ ఇష్టం చెల్లే కాలమా ఇది? ఇంట్లో మా పాలబ్బాయి గురించి తరచూ కంప్లైంట్లు వినాల్సి వస్తోంది. నేను గట్టిగా అడిగితే చిక్కగా పోస్తాడని ఓ పిచ్చి నమ్మకం. సరే కొన్ని నమ్మకాలని అలా ఉండనివ్వడం మంచిదిలే అని, నేను కూడా బిల్లిచ్చేటప్పుడల్లా పాల చిక్కదనాన్ని గురించి హెచ్చరిస్తూ ఉంటాను. "ఎంతమాట! పితికినవి పితికినట్టే పోసేత్తాను మీకు," అన్నది అతని రొటీన్ డైలాగ్. కానీ షరా మామూలే.

పాలల్లో నీటి శాతం కనిపెట్టే ఓ పరికరం గురించి మొదటిసారి విన్నప్పుడు ఆశ్చర్యపోయాను. అందరికీ ఉపయోగ పడే పరికరం కదా అనిపించింది. పెద్ద మొత్తంలో పాలు కొనే వాళ్ళు ఆ పరికరాన్ని ఉపయోగిస్తూ ఉంటారుట. కానైతే, నీళ్ళ పాలలో పాలపొడి కలిపేసి చేసే కల్తీలని ఈ పరికరం కనిపెట్టలేదని వినికిడి. ఓ పదేళ్ళ క్రితం అనుకుంటా, మహానగరాల్లో సింధటిక్ పాలు అమ్ముతున్నారన్న వార్త వెలుగులోకి వచ్చి, పెద్ద దుమారం రేపింది. తర్వాత అలాంటిది ఏమీ జరగడం లేదని ప్రభుత్వం ప్రకటన కూడా ఇచ్చేసింది.

మా బంధువొకాయన పాల చిక్కదనం విషయంలో అస్సలు రాజీ పడలేడు. అందువల్ల ఆయన దినచర్య తెల్లవారు ఝాము నాలుగున్నరకి పాల గిన్నె పట్టుకుని పక్క కాలనీ లో ఉండే పాలతని పాకకి వెళ్ళడంతో మొదలవుతుంది. అక్కడికక్కడ తన ఎదురుగానే చిక్కని పాలు పితికించుకుని తెచ్చుకుంటాడు. అదో తృప్తి. అలా చిక్కగా పోసేసినందుకు పాలతను మామూలుకన్నా ఎక్కువ డబ్బు తీసుకుంటాడనీ, అయినా తను లెక్క చెయ్యననీ ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళందరికీ మర్చిపోకుండా చెబుతూ ఉంటాడు కూడా. 'పాలకోసం నల్లరాయి మొయ్యా' లన్న సామెత అయితే ఉంది కానీ, పాలకోసం బంగారం లాంటి నిద్ర పాడుచేసుకోమని ఎక్కడా లేదు కదా..

8 కామెంట్‌లు:

  1. మురళిగారు, బావుందండి. ఇంతకూ మీ పాలబ్బాయి విన్నాడా మీ విన్నపాలు. వినకుంటే తన జులపాలు పట్టుకొని అడగండి, దొరుకుతాయి మీకు మీ ఇంట్లో మురిపాలు.

    రిప్లయితొలగించండి
  2. బంగారంలాంటి నిద్రపోయిలేచాక ఆ పొద్దుపొద్దున్నే తాగే ఓ మాంఛి కాఫీకోసం తప్పనిసరైనా తప్పదు...చిక్కటిపాలు పోసే పాలవాడిదగ్గర వెళ్ళడం.....రేటెక్కువా,నిద్రాభంగం, ఆ పాకలోని అన్నిరకాల వాసనలనీ ముక్కుతెరుచుకొని భరించవలసిరావడం ...కష్టాలన్నీ కమ్మని కాఫీ ముందు బలాదూర్......

    రిప్లయితొలగించండి
  3. హ హ్హ బావుంది
    ఈ పాల మీటర్ లు వేసి దాని బట్టి డబ్బులు ఇచ్చేవాడు డైరీ వాడు తర్వాత తను కాస్త నీళ్ళు వేసేసి అవే పాలను ఎక్కువ ధరకి అమ్మేవాడు
    నాలుగున్నరకి పాల గిన్నె పట్టుకుని పక్క కాలనీ లో ఉండే పాలతని పాకకి వెళ్ళడంతో మొదలవుతుంది.
    ఇది మరీ టూ మచ్ :)

    పాలకోసం బంగారం లాంటి నిద్ర పాడుచేసుకోమని ఎక్కడా లేదు కదా..correct!

    రిప్లయితొలగించండి
  4. nenu meetho ekeebhavisthunnanandi pala kosam bangaaram lanti nidra paaduchesukuntama cheppandi!
    @sudha gaaru
    kshaminchalai naku coffee ante assalu nachchadu so nidre better

    రిప్లయితొలగించండి
  5. @శ్రీ: వావ్.. బాగుందండీ మీ ప్రాస.. చెప్పాను కదండీ.. నాదెప్పుడూ ఒకటే ప్రశ్న.. అతనిది ఒకటే సమాధానం :-) ..ధన్యవాదాలు.
    @సుధ: మంచి కాఫీ తాగడం బాగుంటుంది కానీ, నిద్రపోవడం - అందునా తెల్లవారు జామున - ఇంకా బాగుంటుందండీ :-) :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. @హరేకృష్ణ : అలాంటి డైరీలని నేనూ చూశానండీ.. నిద్రే ఎక్కువనుకుని, కాఫీ విషయంలో కాంప్రమైజై పోతున్నామండీ :-) ..ధన్యవాదాలు.
    @రసజ్ఞ : ఏకీభవించినందుకు ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  7. చిలకా గోరువంకా పెళ్ళాడవు నిజమే. కానీ ఆ సామెత వెనుక అర్థం, ఒకరి పాటను మరొకరు complement చేసుకుంటూ, ఇద్దరి పాటా కలిపి వనాన్ని (ఇంటిని) రసమయం చెయ్యాలి అని అనుకుంటాను.

    మొయ్య, మగదూర్ -- ఈ రెండు పదాలూ నేను ఎప్పుడూ వినలేదు. దయచేసి అర్థం చెప్తారా?

    రిప్లయితొలగించండి
  8. @సందీప్: చిలకాగోరింకలకి మీరు చెప్పిన భాష్యం బాగుందండీ.. అంతే అయి ఉండొచ్చు. ఇక పొతే 'పాలకోసం నల్లరాయి మొయ్యాలి' అన్నది సామెత. మోయాలి/మొయ్యాలి అంతే బరువుని మోసుకుంటూ వెళ్ళడం. ఇక మగదూర్ అంటే ధైర్యం. గురజాడ రచనల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఈ పదం.. ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి