శుక్రవారం, జూన్ 10, 2011

కువైట్ సావిత్రమ్మ

ఉన్న ఊరు కడుపుకింత తిండి పెట్టలేకపోతే, తిండి సంపాదించుకునేందుకు తగ్గ పని చూపించలేక పోతే, పొట్ట చేత పట్టుకుని ప్రయాణం కట్టాల్సింది ప్రవాసానికే. పెద్దగా చదువుకోని వాళ్లకి, బరువు పనులు చేయడానికి వెనకాడని వాళ్లకి, వాళ్ళు చేయగలిగినంత పనిచేయించుకుని ప్రతిఫలాన్ని దీనార్లలో ముట్టచెప్పడానికి గల్ఫ్ దేశాలు ఉన్నాయి. పుట్టి పెరిగింది కోనసీమైనా, రాయలసీమైనా, ఊరు ఉపాధి చూపించలేనప్పుడు ప్రయాణం కట్టాల్సింది కొయిటాకే.

సావిత్రమ్మ పెద్దగా చదువుకున్నది కాదు. పెద్దబ్బ ఇంటికి కోడలయ్యింది. పెద్దబ్బ అన్న పేరుకి తగ్గట్టుగానే, ఆ ఊరికంతటికీ వాళ్ళదే చాలా పెద్ద రైతు కుటుంబం. నలుగురికీ మంచీ చెడూ చెప్పే కుటుంబం. వాళ్ళ పేరుమీదనే ఆ ఊరికి పెద్దూరు అని గుర్తింపు వచ్చింది. సావిత్రమ్మ ఆ వైభవాన్ని చూసింది. వ్యాపారంలో నష్టం వచ్చి దివాలా పరిస్థితి వచ్చినపుడు, భర్త అన్నదమ్ములతో వేర్లు పడి, అప్పులకింద తన ఇంటి వాటా తమ్ముళ్ళకి వదిలేసి వచ్చినప్పుడూ దరిద్రాన్ని చూసింది.

వేర్లు పడ్డ ఏడాది తిరక్కుండానే, భర్త మరణించిన తర్వాత సావిత్రమ్మ చూసింది మాత్రం కటిక దరిద్రాన్ని. తన వాళ్ళెవరూ పూట భోజనానికి పిలవలేదు, పిల్లలకి వండి పెట్టమని శేరు గింజలైనా కొలవలేదు. తనే ఏదోలా కుటుంబాన్ని నెట్టుకొస్తోంటే మరుదులు ఆమెని వీధిన పెట్టారు. వ్యభిచారం చేసి ఇంటి పరువు బజార్న పెడుతోందని యాగీ చేశారు. ఊరు విడిచి పెట్టి వెళ్ళాల్సిందే అన్నారు. చిన్న మరిది చిన్నబ్బ అయితే పంచాయితీ పెద్దల ఎదుట వీరంగమాడాడు. "అది నాకు వదిన కాదు. మా అన్న చచ్చిన రోజే నాకు వదిన కాకుండా పోయింది" అనేశాడు.

పిల్లల్ని తన తల్లి దగ్గర వదిలి, ఏజెంట్ రెహ్మాన్ సాయంతో కువైట్ వెళ్ళింది సావిత్రమ్మ. ఆ ప్రాంతం నుంచి ఆ దేశానికి వెళ్ళిన మొదటి మనిషి ఆమె. అందుకే 'కువైట్' అన్నది ఆమె ఇంటిపేరుగా మారిపోయింది. కష్టపడింది సావిత్రమ్మ. రెక్కలు ముక్కలు చేసుకుంది. సంపాదించింది. సంపాదించిన దానితో తన భర్త ఊళ్లోనే స్థలం కొని ఇల్లు కట్టింది, ఒకేసారి కూతురికీ, కొడుక్కీ పెళ్ళిళ్ళు చేసింది. ఊళ్ళో అప్పటివరకూ ఏ పెళ్ళీ అంత వైభవంగా జరగలేదు. అంతేనా, మధ్య మధ్యలో ఊరికి వచ్చిన ప్రతిసారీ వీసాలు తెచ్చి సాయం కోరిన కొందరిని కువైట్ తీసుకెళ్ళింది.

కూతురు కాపురానికి వెళ్ళిన సాయంత్రం, మరిది చిన్నబ్బ, తోడికోడలు రామలక్ష్మమ్మ వచ్చారు ఆమె ఇంటికి. వీసాలు తెచ్చిందేమో అడిగారు. తను తేలేదనీ, రెహ్మాన్ని అడగమనీ చెప్పింది సావిత్రమ్మ. "రెహిమానన్నని అడిగితే మొగోళ్ళకి తేలేదు, ఆడోళ్ళకు కావాలంటే వీసాలు తెచ్చినామని చెప్పినాడు వదినా!" చిన్నబ్బ మొదటిసారిగా నోరు విప్పాడు. ఒకప్పుడు రెహమాన్ సాహిబ్ నూ తననూ ఇంట్లో వేసి అగ్గి పెడతానని గలాటా చేసిన చిన్నబ్బ , 'రెహిమానన్న' అనడం ఆశ్చర్యం అనిపించింది సావిత్రమ్మకి. తనని తీసుకెళ్ళమని ప్రాధేయపడింది రామలక్ష్మమ్మ.

"అక్కడ చానా ఇబ్బందులుంటాయి. వాటిని ఓర్చుకునేట్టుగా ఉంటేనే రావాల. ఒకేల వచ్చినాక అక్కడి పనులు చేయలేమనుకుంటే మీకే నష్టం.. అందుకని ముందుగానే ఆలోచించుకోండి" గట్టిగానే చెప్పింది సావిత్రమ్మ. చిన్నబ్బ "చేనికాడికి పోయొస్తా"నని కదిలాడు. ఇంక ఉండబట్టలేకపోయింది సావిత్రమ్మ. ఏజెంట్ల గుట్టునీ, దళారీతనాన్నీ తోడికోడలికి పూస గుచ్చినట్టు వివరించింది. "నిన్ను తీసుకుపోతా ఉండారే ఏజెంట్లు, వాళ్ళు నిన్ను మర్యాదగా చూస్తారనుకోగాకు. వాళ్లకు కావాల్సిన మొగోళ్ళ దగ్గరకల్లా నిన్ను పంపిస్తారు. వాళ్ళు చెప్పింది చెయ్యకుండా కొవేటుకి పోలేవు. నేను చెప్పేది మాత్రం అచ్చరాల నిజం. అందుకని బాగా ఆలోచించుకో" అంది చివరగా.

మనుషుల మీద డబ్బు ప్రభావం ఎంతగా ఉంటుందో, పేదరికం మనిషి చేత ఏమేం చేయిస్తుందో కళ్ళ ముందుంచే విధంగా ముగుస్తుందీ కథ. కువైట్ కథాంశంగా వచ్చిన అతి కొద్ది కథల్లో ఒకటైన 'కువైట్ సావిత్రమ్మ' చక్రవేణు రచన. 'తెలుగు కథకి జేజే!' సంకలనంలో చదివానీ కథని. ఈమధ్యనే చదివిన మునిపల్లె రాజు పుస్తకం 'జర్నలిజంలో సృజన రాగాలు' లో తెలిసింది, ఈ కథ హిందీలోకి అనువదింపబడిందని. చక్రవేణు ఇతర కథల వివరం తెలిస్తే చెప్పండి..

4 కామెంట్‌లు:

  1. మురళీ గారూ,
    మీ మా సుమన్ బాబు సినిమా-మమత త్వరలో వస్తోందంటండోయ్. ఈ టపాకి సంబంధం లేకుండా రాసినందుకు మన్నించండి.
    సూరంపూడి పవన్ సంతోష్.

    రిప్లయితొలగించండి
  2. ఈ కథ నేను చదవలెదు. కానీ, గల్ఫ్ పని చేయ్యడానికి వెళ్ళే లేబర్ చాలా ఇబ్బందులు పదుతున్నారు. చాలా మోసాలు జరుగుతున్నాయి.. పోస్ట్ బగుంది.

    రిప్లయితొలగించండి
  3. తోడులేని ఒంటరి ఆడవారి కష్టాలకి ఈ సావిత్రమ్మ కూడా ఒక ఉదాహరణ. ఇది ఒక కథలాగా అనిపించటంలేదు. ఎంత బాధో!!!
    We are friends.......:)

    రిప్లయితొలగించండి
  4. @పక్కింటబ్బాయి: అవునండీ.. నేనూ చూశాను.. డేట్ ఇంకా రాలేదు కదా.. :)) ..ధన్యవాదాలు.
    @హరి: నిజమేనండీ.. ధన్యవాదాలు.
    @జయ: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి