సోమవారం, జూన్ 06, 2011

జర్నలిజంలో సృజనరాగాలు

మునిపల్లె రాజు పేరు పరిచితమే. కొన్ని కథలూ, వ్యాసాలూ ఇదివరకే చదివి ఉన్నాను. మిత్రులతో పుస్తకాలను గురించి చర్చ వచ్చినప్పుడు గత సంవత్సరం రాజు గారి పుస్తకం 'జర్నలిజంలో సృజనరాగాలు' ప్రస్తావనకి వచ్చింది. "బాగుంది..చదవ" మని మిత్రులు సిఫార్సు చేయడంతో కొన్నానే కానీ చదివిన పాపాన పోలేదు. అలా కొనేసి చదవకుండా ఉంచిన పుస్తకాలని తిరగేస్తుండగా కనిపించడంతో ఇప్పుడు చదివేశాను.

రాజు గారి అభిరుచులు మూడు. సాహిత్యం, సాహిత్యం మరియు సాహిత్యం. కవిత్వం కానివ్వండి, వచనం కానివ్వండి ఆయన దానిని ఆస్వాదించే విధానం నుంచి చాలా నేర్చుకోవచ్చు. అలాగే ఆయన 'కవికుల' సర్కిల్ చాలా పెద్దది. కొందరు మనకి తెలిసిన వాళ్ళు మరి కొందరు పేరు కూడా పరిచయం లేని వాళ్ళు. అయితేనేం? ఈ సృజనరాగాలని ఆలకిస్తున్నప్పుడు తెలిసినవాళ్ళలో తెలియని కోణాలను తెలుసుకోగలం.

మొత్తం ఎనభై ఏడు వ్యాసాలు. వీటిలో "కొన్ని ఆత్మీయ పరామర్శలు, మరి కొన్ని అపురూప సమీక్షలు, ఇంకొన్ని అశ్రు తర్పణాలు, అన్నీ కలిసి ఒక యాత్రికుడి అడుగుజాడలు" అని చెప్పేశారు ప్రకాశకులు కణ్వస గ్రంధమాల వారు. అందువల్లనే కాల క్రమ పద్ధతిని పాటించలేదని చెప్పి పక్కకి తప్పుకున్నారు. కవిత్వం, కథలు, నవలలు, విమర్శ వ్యాసాలు, కవులు, రచయితలు, విమర్శకులు, అనువాదకులు... ఒకటనేమిటి? చదవగలిగినన్ని సంగతులు.


"జ్ఞానానికీ జీవితానికీ ఉన్న సంబంధం తీర్చి దిద్దబడాలంటే రెండే కర దీపికలు. ఒకటి దుఃఖం, రెండు సాహిత్యం" అంటారు మునిపల్లె రాజు 'ఎన్నో అనుభవాలతో నిండిపోయిన జీవనపాత్ర' శ్రీపతిని పరిచయం చేస్తూ. కవయిత్రి ఆదూరి సత్యవతీ దేవితో మొదలుపెట్టి, మధురాంతకం, అజంతా, శారద, దాశరధి రంగాచార్య, వాకాటి పాండురంగారావు, అంపశయ్య నవీన్ మీదుగా నేటి కాశీభట్ల వేణుగోపాల్ వరకూ ఎందరూ రచయితల, కవుల శైలీ శిల్పాలని ఆదరంగా పరామర్శించారు రాజు.

గుంటూరు జిల్లా మునిపల్లెకి చెందిన రాజు, తెనాలి ప్రముఖులు దాదాపు అందరినీ తల్చుకోవడమే కాక ఆరేడు దశాబ్దాలకు పూర్వపు తెనాలి సామాజిక, ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక స్వరూపాన్నీ పాఠకుల కళ్ళముందు ఉంచే ప్రయత్నం చేశారు. రాజుకి చలం అన్నా, కొడవటిగంటి అన్నా, రష్యన్ మాస్టర్స్ అన్నా మక్కువ ఎక్కువ అన్న విషయం అర్ధం కావడానికి ఎన్నో పేజీలు తిరగేయల్సిన అవసరం లేదు. కథా సాహిత్యాన్ని పరామర్శించాల్సిన ప్రతి సారీ వీరినే తలచుకున్నారు. ఫలితంగా పునరుక్తులు చాలానే కనిపించాయి.

తెలుగు సినిమాపై ఏమాత్రం సదభిప్రాయం లేని రాజు మెచ్చిన తెలుగు చిత్రాలు కేవలం రెండే రెండు. ఒకటి వినోదా వారి 'దేవదాసు' రెండోది బి. నరసింగరావు 'రంగులకల.' సినిమా వాళ్ళలో ఈయన పలకరించింది 'రక్త కన్నీరు' నాగభూషణాన్నీ, చిత్తూరు నాగయ్యనీ, నిర్మాత రామనాధ్ నీ మాత్రమే. అయితే ఇటలీ సినిమాలనీ, మరాఠీ సినిమాలనీ బాగానే మెచ్చుకున్నారు. ఆంధ్రాంగ్ల భాషల్లో వెలువరించిన కొన్ని స్వీయ కవితలకీ, ఒక కథకీ కూడా స్థానం ఇచ్చారు ఈ సంపుటిలో.

శీర్షిక లో 'జర్నలిజం' చూసి కుండబద్దలు కొట్టినట్టుగా ఉండే సమీక్షలనీ, విమర్శల్నీ ఊహించిన నన్ను ఆశ్చర్య పరుస్తూ వ్యాసాలన్నీ 'నొప్పించక తానొవ్వక' ఛందంలోనే ఉన్నాయి. విమర్శ కన్నా ప్రశంశకే పెద్దపీట వేశారు. తనకి నచ్చని విషయాలని సున్నితంగా, చెప్పీ చెప్పనట్టుగా చెప్పారు తప్ప సూటిగా చెప్పినవి బహు తక్కువ. కథా రచయిత్రి నిడుమోలు కల్యాణసుందరి భర్త జగన్నాధ్ ఓ పౌరాణిక సినిమాకి దర్శకత్వం వహించారనీ, చక్రవేణు కథ 'కువైట్ సావిత్రమ్మ' హిందీలోకి అనువదింప బడిందనీ తెలిసిందీ పుస్తకం వల్ల.

బి.వి.ఎస్. రామారావు గోదావరి కథల్లో మునిపల్లె రాజుకి నచ్చిన రెండు కథలు 'ఎసరూ-అత్తిసరూ' మరియు 'పుష్కరాల రేవులో పుల్లట్లు.' చలం తో పాటుగా దామల్ చెరువు అయ్యోరు మధురాంతకం రాజారాంనీ, రావిశాస్త్రినీ కూడా కొంచం ఎక్కువగానే తలచుకున్నారు. తెలుగు సాహిత్యానికి సంబంధించి కొన్ని కొత్త సంగతులు తెలుసుకోవడంతో పాటు, కొంత మేరకు రిఫరెన్స్ గానూ ఉపయోగ పడే పుస్తకం ఇది. రెండు వందల యాభై తొమ్మిది పేజీల ఈ పుస్తకం వెల వంద రూపాయలు. ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు ఏవీకెఎఫ్ లోనూ లభ్యం.

4 కామెంట్‌లు:

  1. Inni books chadivae time ela untundi Muraligaru, okati koni chadavali anukuneloape maro pustkam. review baavundandi.


    Sree Raaga

    రిప్లయితొలగించండి
  2. @సిరి: బద్ధకించకుండా చదవడం మొదలు పెట్టేస్తే, పూర్తి చేసే బాధ్యతని పుస్తకాలే తీసుకుంటాయండీ, నిజం! ..ధన్యవాదాలు.

    @Creative Oracle: ధన్యవాదాలండీ..

    @S: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి