'అంటరానితనం నేరం' ఇది గడిచిన ఐదారు దశాబ్దాలుగా మనం గోడల మీద చూస్తున్న ఓ వాక్యం. స్వాతంత్రానికి ముందు కొన్ని వందల ఏళ్ళపాటు మన దేశంలో అమలైన అంటరానితనం కొన్ని కులాలని కనీస హక్కులకి, ఆత్మవిశ్వాసానికీ దూరం చేసింది. వారి కళలకి, సంస్కృతికీ చరిత్రలో దొరికిన స్థానం స్వల్పమే.. తమ కనీస అవసరాలు తీర్చుకోడానికి సైతం ఎన్నో పోరాటాలు చేశారు వారు. దేశానికి స్వాతంత్రం వచ్చినా వారి పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదంటారు జి. కళ్యాణ రావు. కొన్ని తరాల వెతలనీ, పోరాటాలనీ అక్షరబద్ధం చేసి ఆయన విడుదల చేసిన నవల 'అంటరాని వసంతం'.. ఈ నవల పరిచయం 'పుస్తకం' లో...
***
ఇది ఏడుతరాల కథ. ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకోడం కోసం ఎన్నెలదిన్నెమాలలు, మాదిగలు జరిపిన పోరాటం కథ. కాయకష్టం నుంచి కళా సంస్కృతుల వరకు తమకి సంబంధిన వాటినన్నీ ‘కులం’ తక్కెడలో మాత్రమే వేసి తూచే సమాజాన్ని అడుగడుగునా ఎదుర్కొంటూ, ఓడిపోతూ, గెలుస్తూ, పడుతూ, లేస్తూ.. అస్తిత్వాన్ని నిలబెట్టుకున్న వీరుల కథ. తొమ్మిదేళ్ళ క్రితం జి. కళ్యాణ రావు రాసిన ఈ పుస్తకం ఇప్పటివరకు నాలుగు ముద్రణలు పొందింది.. ఐదో ముద్రణ కి సిద్ధ పడుతోంది.
ఎన్నెలదిన్నె మాలపల్లికి చెందిన సిన సుబ్బ, అతని కొడుకు ఎర్రెంకడు, మనవడు ఎల్లన్న, ఎల్లన్న కొడుకు శివయ్య (సీమోను), మనవడు రూబేను, రూబేను కొడుకు యిమ్మానుయేలు, మనవడు జెస్సీ… కాలంతో పాటు మారుతున్న సమాజం లో మారుతున్న సమస్యలు. ప్రతిసారీ ఒకటే సమస్య. అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం, ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం. వీళ్ళ స్త్రీలదీ అదే సమస్య. పోరాటం వీళ్ళ జీవితం లో ఒక భాగం.
రూబేను భార్య రూతు రచయిత్రి. కథలు, కవితలు రాస్తూ ఉంటుంది. ఆమె గొంతుతోనే ఎన్నెల దిన్నె కథని పాఠకులకి చెబుతుంది. వెన్నెల రాత్రుల్లో రూబేను తనకి చెప్పిన కథలు ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ, వర్తమానంలో ఆగుతూ, మరో కథను గుర్తు చేసుకుంటూ.. ఇలా సాగుతుంది నవల. సిన సుబ్బ, ఎర్రెంకడూ కూలీలుగానే జీవిస్తారు. పెద కరణం కేవలం భోజనం పెట్టి వీళ్ళ చేత కూలి చేయించు కుంటాడు. అతని ఆగడాలను మౌనంగా భరిస్తారు వీళ్ళు.
ఊళ్ళో పెద కరణానిదీ, రెడ్లదే రాజ్యం. వాళ్ళ మాటకి ఎదురు లేదు. వాళ్ళు పంచిందే కూలి, కొలిచినవే గింజలు. పెద కరణానికి తగ్గ వాడే అతని కొడుకు చిన కరణం. తప్పు చేసిన తన చెల్లెల్ని తండ్రి హత్య చేస్తుంటే అడ్డుకోడు సరికదా, ఆస్తి కలిసొచ్చిందని సంబరపడతాడు. పల్లెలో ఎర్రెంకడికి మాత్రం చెల్లెలు భూదేవంటే ప్రాణం. ఉన్న కొంచం నేలా అమ్మి ఆమె పెళ్లి చేస్తాడు. ఆమె చూపించిన లింగాలునే తను పెళ్ళాడతాడు. కొడుక్కి ఆమె చెప్పిన పేరే (తన తండ్రి పేరు) పెడతాడు.
మేనత్త భూదేవి దగ్గర పెరిగిన ఎల్లన్న కళాకారుడిగా మారతాడు. చంద్రప్ప శిష్యుడు నాగన్న దగ్గర ఉరుముల నృత్యం నేర్చుకుంటాడు. సుభద్రని పెళ్ళాడతాడు. అతని కళకి కులం అడ్డు పడుతుంది, ఊరి పెద్దల రూపంలో. ఊరు విడిచి మాల బైరాగి గా మారతాడు ఎల్లన్న. అతని ప్రతి పాటలోనూ ‘చుక్కల ముగ్గు కర్ర’ సుభద్ర ఉంటుంది. దేశాటనలో తన కులం మీదా, కళ మీదా జరుగుతున్నా దాడులు అడుగడుగునా అనుభవం లోకి వస్తాయి ఎల్లన్నకి. జీవితపు చరమాంకంలో సుభద్రనీ, కొడుకు శివయ్యనీ కలుస్తాడు ఎల్లన్న.
కరువుకి తనవాళ్ళందరినీ పోగొట్టుకున్న శివయ్య, భార్య శశిరేఖతో కలిసి ఊరు విడిచిపెడతాడు. కూలి చేయడానికి కూడా కులమే అడ్డు. సరిగ్గా అప్పుడే మత బోధకుడు మార్టిన్ కలుస్తాడు. తనతో తీసుకెళతాడు. శివయ్యను సీమోను ను చేస్తాడు. అంటరానితనం లేని క్రైస్తవం ఎంతో నచ్చుతుంది సీమోనుకి. చిన కరణం అల్లుడు, రెడ్ల బంధువులు కూడా క్రైస్తవంలో కలుస్తారు, దొరలతో సాన్నిహిత్యం కోసం, పెత్తనం కోసం.. సీమోను కి రూబేను పుడతాడు. రూబేను నెలల పిల్లవాడుగా ఉన్నప్పుడే అగ్ర కులాలు జరిపిన మారణ కాండలో తనవాళ్ళందరినీ పోగొట్టుకుంటాడు.
చర్చి ఆస్పత్రిలో బోధకుడిగా చేరిన రూబేను ఎంతో కష్టపడి తన గతాన్ని గురించి తెలుసుకుంటాడు. రూతుని పెళ్ళాడి యిమ్మానుయేలు, రోజీ లకి జన్మనిస్తాడు. అధ్యాపకుడిగా ఉద్యోగం సంపాదించు కున్న యిమ్మానుయేలు మేరి సువార్తని పెళ్ళాడి జెస్సీ కి జన్మనిస్తాడు. జెస్సీ పుట్టాక నక్సల్బరి ఉద్యమం లో చేరిన యిమ్మానుయేలు ప్రాణాలు కోల్పోతాడు. పెరిగి పెద్దైన జెస్సీ ని ‘కారంచేడు’ సంఘటన కదిలిస్తుంది. అత్త కూతురు రూబీ ని పెళ్లి చేసుకుని ఆత్మగౌరవ ఉద్యమంలో పనిచేయడం మొదలుపెడతాడు జెస్సీ.
ఈ ప్రధాన కథకి తోడు ఎన్నో ఉప కథలు.. కళ కోసం, అస్తిత్వం కోసం చంద్రప్ప, నాగన్న, కుమ్మరి పేద కోటేశ్వరుడు వంటి కళాకారులు చేసిన పోరాటాలు. పొలానికి నీళ్ళ కోసం ఎన్నెలదిన్నె మాలల పోరు, సుభద్ర తెగువ, ఊరి చెరువులో నీళ్ళు ముంచుకోవడం కోసం ఆవలపాడు మాలలు చేసిన పోరాటం. మహాత్ముడి శుద్ధి ఉద్యమం, ఆలయ ప్రవేశ నినాదం గ్రామ స్థాయిలో మొక్కుబడిగా మారిన వైనం, క్రైస్తవం లోకి మారిన మాల, మాదిగలపై అగ్రవర్ణాల అణచివేత, శ్రీకాకుళ పోరాటం, నక్సల్ బరి ఉద్యమం వీటన్నింటినీ స్ప్రుశిస్తూనే ప్రధాన కథని చెప్పారు రచయిత.
ఇంత విస్తృతమైన కథని కేవలం 230 పేజీల్లో చెప్పారు. ఒకరకంగా ఇది కొండను అద్దంలో చూపించడం. ఏలెక్స్ హెలీ ‘రూట్స్’ నవల ప్రభావం (తెలుగు అనువాదం ‘ఏడు తరాలు,’ రచన: సహవాసి) ఈ నవలపై చాలానే ఉంది. ఐతే ‘రూట్స్’ మనకి కొన్ని వేల మైళ్ళ దూరంలో జరిగిన కథ, ‘అంటరాని వసంతం’ మన మధ్య జరిగిన కథ. మనుస్మృతి నుంచి నండూరి ఎంకిపాటల వరకు ప్రతి రచననూ ఆగ్రహంతో ప్రశ్నిస్తారు రచయిత. పోతన భాగవతమూ ఇందుకు మినహాయింపు కాదు. “అంటరాని వాళ్ళ కళలు, సంస్కృతీ కూడా అంటరానివైపోయాయి” అన్నారు చాలా చోట్ల. భూదేవి, ఎల్లన్న, సుభద్ర పాత్రలు వెంటాడతాయి. విప్లవ రచయితల సంఘం ప్రచురించిన ఈ పుస్తకం వెల రూ. 70. విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవోదయ, దిశ, ఇంకా అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభిస్తుంది.

ఒకప్పుడు గతిలేక మనవాళ్ళూ పరాయిమతాలకెగ బడుతుంటే .....ప్చ్ ...ఇప్పుడు స్వప్రయోజనాల కోసం స్వార్ధం తో ....
రిప్లయితొలగించండిమీ పరిచయం బావుందండీ ! అభినందనలు మురళి గారు !
మురళి
రిప్లయితొలగించండిఎంతమంచి పుస్తకం పరిచయం చేసారు ....మీ రివ్యూ చదివితేనే చదివేయాలనే కోరిక కలిగింది ......మొదలుపెట్టాను ఎనిమిదవ చాప్టర్ లో వున్నాను ...గుండె పిండి (మండి)నట్లున్దండి .నాకు తెలీని నిజాలెన్నో ........చాల చాల ధన్యవాదములు .
ఈ ఫుస్తకం చదివిన కొత్తలో అందరికీ రికమెండ్ చేసేశాను. భలే కోఇన్సిడెంస్, మీర్యు చాలా వరకూ నేను చదివిన పుస్తకాలే పరిచయిస్తున్నారు! :)
రిప్లయితొలగించండిమురళి గారు, నేను మీ రివ్యూలు చదవడం మానేశాను. రివ్యూ చదివి, చదవడానికి పుస్తకం లేక మనసు క్షోభపెట్టడం ఎందుకు. :(
రిప్లయితొలగించండిఆలోచిస్తే గుండెల్ని పిండిచేసే వాస్తవం.
రిప్లయితొలగించండిఎన్నెన్నో విషాద గాధలు..కారణాలేవైనా తరాలకి తరాలే నలిగిపోయాయి.
పుస్తకం లో మీ సమీక్ష చాలా బావుంది.
@పరిమళం : కేవలం మత మార్పిడులని మాత్రమే కాదండి, చాలా సాంఘిక సమస్యలని చర్చించింది ఈ పుస్తకం. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@చిన్ని: పుస్తకం చదవడం పూర్తి చేశాక మీ అభిప్రాయాలు మాతో పంచుకుంటారని ఎదురు చూస్తున్నాం. ధన్యవాదాలు.
@తెరెసా: మీ బ్లాగు చిరునామా ఇవ్వగలరా?ప్రొఫైల్ ద్వారా ప్రయత్నించి విఫలమయ్యాను. పుస్తకాల గురించి మీరు రాస్తున్నవి చదవాలన్ని కుతూహలం కలుగుతోంది.. ధన్యవాదాలు.
@భాస్కర్ రామిరెడ్డి: మీ వ్యాఖ్య చదివాక రాయడం మానేద్దామా అన్న ఆలోచన వచ్చింది ఒక్క క్షణం. ఈ పుస్తక పరిచయాల ఆధారంగా మీరో జాబితా తయారు చేసుకుని వీలుకుదిరినప్పుడు ఆయా పుస్తకాలు కొనుక్కోవచ్చునేమో కదండీ..? వ్యాఖ్యకి ధన్యవాదాలు.
@ ఉమాశంకర్: నిజమేనండి.. ఆరోజుల్లో ఏం జరిగిందో తెలుసుకునే అవకాశం ఇస్తున్నాయి ఇలాంటి పుస్తకాలు. ధన్యవాదాలు..
నాకు బ్లాగు లేదండీ! నేనొట్టి చదువరినే :)
రిప్లయితొలగించండి@తెరెసా: ఆలస్యం ఎందుకు? ఓ బ్లాగు మొదలు పెట్టేయండి మరి..
రిప్లయితొలగించండిసార్ మురళి గారు మనిషిలో మనందరం మనుషులం అని బావన కలిగిన రోజు ఈ అంటరాని తనం పోతుంది .
రిప్లయితొలగించండిఈ స్వార్ధ రాజకీయ నాయకులు, స్వార్ధ కులనాయకులు నశించిన రోజు ప్రజలలో మార్పు వస్తుంది
@పవన్ కళ్యాణ్: ధన్యవాదాలు..
రిప్లయితొలగించండిee vasantam appudoo nishedhame,ippudoo nishedhame anna modati vaakhyaalatone vaari jevana sailini pratibimbinche navala "ANTARAANI VASANTAM". idi yadaardamo kaado naaku teleedu kaani vaari swaatamtryam kosam jeevitaanne arpinchina naarayya, naaganna, ellanna gurinchi chadivi vaarini abhinandinchakapote deenini chadavatam lo artham ledanukuntunnaanu .....ANTARAANI VASANTAM teliyani vaariki parichayam chesinanduku dhanyavaadaalu.
రిప్లయితొలగించండి@సంఘమిత్ర: కొన్ని యదార్ధ సంఘటనలకు, మరి కొంత కథను జోడించి చేసిన రచన అనిపించిందండి నాకు.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి