ఆదివారం, ఏప్రిల్ 05, 2009

తపస్సు

రాయలసీమ కరవును ఇతివృత్తంగా తీసుకుని తెలుగు సాహిత్యం లో ఎన్నో కథలు వచ్చినప్పటికీ, ఐదేళ్ళ క్రితం ప్రచురితమైన 'తపస్సు' కథది ఓ ప్రత్యేక స్థానం. చిత్తూరు జిల్లాలో ప్రాచుర్యంలో ఉన్న 'భారతాల' నేపధ్యం తో వి.ఆర్. రాసాని రాసిన ఈ కథ ఆదివారం ఆంధ్రజ్యోతి లో ప్రచురిత మయ్యింది. ప్రతి వేసవిలోనూ భారతాలని ప్రదర్శించే సంప్రదాయం చిత్తూరు జిల్లాలో ఇప్పటికీ కొనసాగుతోంది.

చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో ఉండే కళాకారులు, మిగిలిన మాసాల్లో వ్యవసాయ పనులతో పొట్ట పోసుకుంటారు. పది నుంచి పదిహేను రోజుల పాటు సాగే భారతాల నిర్వహణ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఐతే, భారతం ప్రదర్శిస్తే వర్షాలు పడతాయన్న నమ్మకం ఇక్కడ ఉంది.

'తపస్సు' కథలో నాయకుడు రంగప్ప ఓ వృద్ధ కళాకారుడు. వయసులో ఉన్నప్పుడు ఏటా భారతాలు ప్రదర్శించిన వాడు. ప్రస్తుతం కరవు కోరల్లో చిక్కుకున్నవాడు. భార్యకి ఒంటిమీద చీరతప్ప మారు చీర లేదు. పెళ్లి చేసి పంపాల్సిన కూతురిని కూలికి పంపుతున్నాడు. కరవు కారణంగా వ్యవసాయమూ లేదు, తను చేయగలిగే పనులూ లేవు. పక్కనున్న పల్లెటూరిలో భారతం ఆడుతున్నారని తెలిసి, ట్రూప్ యజమాని చిన వెంకటప్పని వేషం అడిగి భంగ పడతాడు. అప్పు కట్టలేదని అతని ఇల్లు జప్తు చేస్తారు.

భవిష్యత్తు గురించి రంగప్ప ఆందోళన పడుతున్న సమయంలోనే చిన వెంకటప్ప ట్రూప్ లో వేషగాడు ద్వారకుడు అతని ఇంటికి వస్తాడు. అర్జునుడి వేషం వేసేవాడు ఎవరో అమ్మాయితో వెళ్లిపోయాడని, రంగప్ప మినహా 'తపస్సు మాను' ఎక్క గలిగేవాళ్ళు మరెవరూ లేరని, చిన వెంకటప్ప తన మాటగా చెప్పి తీసుకు రమ్మన్నాడనీ చెబుతాడు ద్వారకుడు.

ఆట పూర్తయ్యేవరకూ ప్రతిరోజూ వేషం ఇస్తామని, పారితోషికం కూడా మిగిలిన కళాకారులకి ఇచ్చిన దానికి రెట్టింపు ఇప్పిస్తాననీ ద్వారకుడు చేసిన ప్రతిపాదన రంగప్పని ఆలోచనలో పడేస్తుంది. డబ్బొస్తే ఆర్ధిక సమస్యలు కొంత వరకైనా గట్టెక్కుతాయనే ఆలోచనతో, ఒంట్లో ఓపిక లేకపోయినా వేషం వేయడానికి ఒప్పుకుంటాడు.

భారతం ఆడే బయలు మధ్యలో ఉన్న కొమ్మలు నరికేసి ఉన్న ఓ నిలువెత్తు అశోక వృక్షం స్వాగతం పలుకుతుంది రంగప్పకి . మర్నాడు అతను ఎక్కవలసిన తపస్సు మాను అదే. ఆ వృక్షం చిటారు కొమ్మన ఓ చెక్కముక్కని కడతారు. చెట్టుకు పొడుగునా ముణుకులు ఏర్పాటు చేస్తారు, ఎక్కడానికి వీలుగా. కాషాయ వస్త్రాలు ధరించి, భుజానికి ప్రసాదాలు ఉన్న జోలె తగిలించుకుని తపస్సు మాను ఎక్కడానికి సిద్ధపడతాడు రంగప్ప.

'పరా బ్రహ్మ పరాత్పర..' పాడుతున్న కళాకారులందరికీ సందేహమే, వృద్ధుడైన రంగప్ప తపస్సు మాను ఎక్కగలడా అని. పిల్లలు లేని స్త్రీలు స్నానం చేసి తడి బట్టలతో వస్తారు వర పడడానికి. దేవుడికో దండం పెట్టుకుని, తపస్సు మాను ఎక్కడం మొదలు పెడతాడు రంగప్ప. మాను చివరికి ఎక్కేసరికి ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది అతనికి. చుట్టూ చూస్తే బీడు భూములు, జనం ముఖాల్లో బతుకు భయం.. తనలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారని, తన ఊరిలాగే చుట్టుపక్కల ఊళ్లూ కరవు బారిన పడ్డాయని తెలుస్తుంది అతనికి.

అడ్డచెక్క మీద జాగ్రత్తగా కూర్చుని, కొబ్బరికాయ కొట్టి, ప్రసాదాన్ని కిందకి విసిరి, మాను చివర కట్టిన పూల దండలో పూలు కొన్ని తెంచుకుని జోలెలో వేసుకుని దిగడం ప్రారంభిస్తాడు. కిందకి చూసి ధైర్యం కోల్పోయిన రంగప్ప ఒకదశలో 'జాగ్రత్తగా దిగ గలనా' అన్న సందేహంలో పడతాడు. తోటి కళాకారులు, జనం దేవుడిని ప్రార్ధించడం మొదలు పెడతారు. కిందకి దిగి, స్పృహ కోల్పోయిన రంగప్ప, స్పృహలోకి వచ్చాక తాను గెలిచినట్టా? ఓడినట్టా? అని ప్రశ్నించుకుంటాడు.

ఈ కథ ప్రచురితమైనప్పుడు నేను తిరుపతి లో ఉన్నాను. అది మే నెల, వరుస కరవులు. పీలేరులో భారతాలు జరుగుతున్నాయని తెలిసి వెంటనే వెళ్లాను. అక్కడ అందరిదీ ఒకటే కోరిక 'వర్షం కురవాలి' అని. నేను వెళ్ళిన రోజు మహా భారత యుద్ధం ఆడుతున్నారు. పక్కన ఉన్నసినిమా హాళ్ళు ఖాళీ గా ఉనాయి, కొత్త సినిమాలు ప్రదర్శిస్తున్నా.. జనమతా 'భారతం బయలు' దగ్గరే. నాకు పరిచయం లేని ఓ కళా రూపాన్ని పరిచయం చేసింది 'తపస్సు' కథ.

7 కామెంట్‌లు:

 1. 'పరా బ్రహ్మ పరాత్పర..

  ఇది వీలైతే పూర్తిగా టైపు చేస్తారా? ఈ శ్లోకం వినగానే మా ఊరి సత్య హరిశ్చంద్ర గుర్తుకొచ్చింది.

  రిప్లయితొలగించు
 2. "నాకు పరిచయం లేని ఓ కళా రూపాన్ని పరిచయం చేసింది 'తపస్సు' కథ". మాక్కూడా ....

  రిప్లయితొలగించు
 3. కంగుంది కుప్పం నుంచీ వచ్చే భారతమోళ్ళు మా ఊర్లో శానా ఫేమస్సు. చిన్నప్పుడు నేనూ బారతానికి బుయ్యేవాడ్ని.

  రిప్లయితొలగించు
 4. చాలాబాగా వ్రాశారు.శుభా కాంక్షలు.

  రిప్లయితొలగించు
 5. మురళి గారూ,

  పరిమళం గారి మాటే నాది కూడా.

  అలాగే మీ ఆసక్తి, నిజంగా నాకు చాలా ఆశ్చర్యాన్నీ ఆనందాన్నీ కలిగిస్తోంది..

  రిప్లయితొలగించు
 6. @భాస్కర్ రామిరెడ్డి: ధన్యవాదాలు. ఆ శ్లోకం ఇదండీ:
  పరా బ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద
  పరంజ్యోతి పరాత్పర పతిత పావన స్వ ప్రకాశ
  వరదాయక సకలలోక వాంఛిత ఫల ప్రదాయా
  పాహి పాహి మాం పాహి …
  @పరిమళం, కట్టి మహేష్ కుమార్, జయచంద్ర: ధన్యవాదాలు.
  @ఉమాశంకర్: చూసే వీలు దొరికింది కాబట్టి చూడ గలిగానండి. మిస్సైనవి చాలానే ఉన్నాయి. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 7. మీరు రాసింది చదువుతుంటేనే ఒక రకమైన భాధ,ఉద్వేగం లాంటిది కలిగింది,అసలు కధ చదివితే ఎలా ఉంటుందో ,బాగా రాసారు

  రిప్లయితొలగించు