శనివారం, ఏప్రిల్ 18, 2009

కుర్రాడు మంచాడేనా?

ఉదయం ఒక తెలిసినతను కలిశాడు. ముఖ పరిచయం కన్నా ఎక్కువ, స్నేహం కన్నా తక్కువ. కాసేపు అవీ, ఇవీ మాట్లాడి మీకు ఫలానా కుర్రాడు తెలుసుకదా అన్నాడు. గత అనుభవాల దృష్ట్యా అతను ఏం చెప్పబోతున్నాడో సరిగానే ఊహించా. "మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాం.. ఆ కుర్రాడైతే బాగుంటాడని అన్నారు. మీరు కొంచం అతని మంచీ, చెడూ కనుక్కుని ఓ మాట చెప్తే మేం ముందుకు వెళ్తాం.." అతను చెప్పేసి నాకేసి చూస్తున్నాడు. "సరే" అనడం తప్ప ఇంకేమీ అనలేని పరిస్థితి.

పెళ్లి సంబంధం వెతకడం అంటే మాటలు కాదు. అమ్మాయికైనా, అబ్బాయికైనా ఒకే తరహా జాగ్రత్త అవసరం. ఐతే సహజంగానే అమ్మాయికి సంబంధం విషయంలో కొంచం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అబ్బాయి ఎలాంటి వాడో అన్న విషయంలో ఒకటికి పది సందేహాలు ఉంటూ ఉంటాయి. ఓ ఆడ పిల్లకి పెళ్లి చేసిన అనుభవం తో ఈ ఆదుర్దాను నేను అర్ధం చేసుకోగలను. సమానత్వం అని ఎంతగా మాట్లాడుతున్నా మనదింకా మేల్-డామినేటెడ్ సమాజమే. ఏ కారణం వల్ల పెళ్లి విఫలం అయినా అబ్బాయితో పోలిస్తే అమ్మాయికి నష్టం కొంచం ఎక్కువే.

చదువు, ఉద్యోగం, అందం, ఆస్తిపాస్తులు..ఇవన్నీ చూశాక అప్పుడు కుటుంబ నేపధ్యం గురించి కనుక్కుని.. ఇక చివరికి వచ్చేసరికి అబ్బాయి గుణగణాల దగ్గర ఆగుతారు. నిజానికి అన్నింటికన్నా క్లిష్టమైన విషయం ఇదే. అబ్బాయి ఎలాంటి వాడు? అన్నది నూటికి నూరుపాళ్ళు సరిగ్గా ఎవరు చెప్పగలరు? అతని తల్లిదండ్రులా, స్నేహితులా, సహోద్యోగులా? తల్లిదండ్రులకి, స్నేహితులకి అతని గురించి తెలిసినా వాళ్ళు మంచి గుణాలను మాత్రమే ఏకరువు పెడతారు. సహోద్యోగులు చెప్పేదాన్ని గుడ్డిగా నమ్మలేం. అతనికి, వాళ్ళతో ఏవైనా గొడవలుంటే మనకి బాడ్ రిపోర్ట్ రావొచ్చు.

సరిగ్గా ఇందుకే, తెలిసిన వాళ్ళు నలుగురికి చెప్పి ఎంక్వయిరీ బాధ్యత అప్పగిస్తారు. ఆ నలుగురూ 'పర్లేదు' అంటే దేవుడి మీద భారం వేసి ముందుకి వెళ్తారు. చాలా పెళ్ళిళ్ళలో 'ఆ నలుగురిలో' ఒకడినైన నాకు చిత్రమైన అనుభవాలు ఉన్నాయి. ఒకటి మాత్రం నాకు పెద్ద పాఠం నేర్పింది. ఓ కుర్రాడి గురించి నా పద్ధతి లో నేను ఎంక్వయిరీ చేసి, అమ్మాయి వాళ్ళకి ప్రొసీడవొచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశా. వాళ్ళు తాంబూలాలు మార్చేసుకున్నారు. అప్పుడు ఆ అబ్బాయి ఇంట్లో వాళ్లకి చెప్పకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

నిజానికి ఇందులో నా తప్పు ఏమీ లేకపోయినా, అమ్మాయి వాళ్ళ దగ్గర నాకు ముఖం చెల్లలేదు. అబ్బాయి జీత భత్యాలు, అలవాట్ల గురించి వేరే వేరే సోర్సుల్లో కనుక్కున్నా, కాని అతనితో మాట్లాడ లేదు. బహుశా అతనితోనే నేరుగా మాట్లాడి ఉంటే ఈ విషయం తెలిసేదేమో. ఇంక అప్పటినుంచి, అబ్బాయితో మాట్లాడి అరేంజ్డ్ మ్యారేజ్ ఇష్టమో కాదో కనుక్కున్నాక మాత్రమే రిపోర్ట్ ఇస్తున్నా. కొన్ని కొన్ని విషయాలు మాత్రం నాకు అర్ధం కావు. అబ్బాయి సిగరెట్ కాలుస్తాడు.. కొంత మందికి ఇది పెద్ద విషయం. మరికొందరు ఈ రోజుల్లో కాల్చని వాళ్ళు ఎవరు? అంటారు. వారానికోసారి, అదీ రెండు పెగ్గులే, బీరు తాగుతాడు.. ఇదీ అంతే.

నేను తెలుసుకున్నది ఏమిటంటే, మనకి తెలిసిన విషయాలను యధాతధంగా అవతలి వాళ్లకు చెప్తే, వాళ్ళే నిర్ణయించుకుంటారు. అయినా ఇంకొకరి తరపున మనం నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదు కదా. ఎన్ని చేసినా కళ్ళ ముందే పెళ్లి ఫెయిల్ కావడం చూసినప్పుడు మాత్రం 'పెళ్ళంటే ఓ పెద్ద లాటరీ' అనిపించక మానదు. కేవలం అరేంజ్డ్ మేరేజెస్ మాత్రమే ఫెయిల్ అవుతున్నాయనే సాహసం చేయను కానీ, ప్రేమ పెళ్ళిళ్ళలో ఐతే అబ్బాయి, అమ్మాయి ఒకరి గురించి ఒకరికి తెలిసి ఉంటుంది. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తుంటే అరేంజ్డ్ పెళ్ళిళ్ళ సంఖ్య క్రమంగా తగ్గుతుందనిపిస్తోంది. అప్పుడు ఈ ఎంక్వయిరీ లు, అవి సరిగా చేయలేదని బాధ పడడాలు ఉండవు కదా..

10 కామెంట్‌లు:

  1. మీ పోస్టు సంగతేమో గానీ, ఈ టాపిక్ మీద ఎన్నికథలు చదివానో లెక్కే లేదు :)

    నిజమేనండీ ఈ విధంగా మధ్యవర్తిత్వం వహించినవారు ఎప్పుడో ఒకసారి ఎదురుదెబ్బ తినడం చూస్తూ ఉంటాం. ఎవరేమీ అనకున్నా, ఆ వివాహం ఒడిదొడుకుల్లో పడితే, మన తప్పు లేకున్నా, ఆ గిల్టీ ఫీలింగ్ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  2. అబ్బాయి గురించి ఎన్నో enquiries చేస్తారు ... ఎందరినో అడుగుతారు ... ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు ... కానీ అమ్మాయిని మాత్రం 'నీకు అబ్బాయి నచ్చాడా?' అని అడగరు!!

    రిప్లయితొలగించండి
  3. అమ్మో! ఇది మాత్రం బహు డేంజరస్ టాస్క్.. ఏ చిన్న తేడా వచ్చినా మనకి గిల్టీ ఫీలింగ్ లైఫ్ లాంగ్ ఉంటుంది!

    చైతన్య గారు, ఎందుకు అడగరండీ! కాకపోతే నచ్చలేదన్నా పెద్ద పట్టించుకోరు :-)

    రిప్లయితొలగించండి
  4. ఈ మధ్యవర్తుల వల్ల కొంత ప్రయోజనం వుంది.మనకేమన్నా బాధొచ్చినప్పుడు చెత్త సంబధం తెచ్చాడు అని తిట్టుకుని ఉపశమనం పొందొచ్చు.అదే ప్రేమ పెళ్ళిళ్ళలో ఆ సౌకర్యం వుండదు :) లాంగ్ లివ్ మధ్యవర్తులూ :)

    రిప్లయితొలగించండి
  5. మురళి గారు , మీరన్న రిస్క్ లవ్ మేరేజెస్ లో కూడా ఉంటుంది కదా ! ఇద్దరూ రోజుకో రెండు గంటలు పార్క్ లోనో ,సినిమా హాల్లోనో ...ఎక్కడైనా కలిసినా వాళ్ల ప్లస్ లు చూపించుకుంటారు .మైనస్ లు కాదు. పైగా ప్రేమలో ఉన్నప్పుడు అన్నీ అందంగా అనిపిస్తాయి . కొద్ది రోజులు సహజీవనం చేస్తే ఏమో కానీ ..అది మన సంస్కృతీ కాదు . పైగా కొత్తగా కలిసి ఉండేప్పుడు కూడా వాళ్ల లోపాలు బయటకు రానివ్వరు. క్రమేపీ నిజ స్వరూపాలు బైట పడతాయి. మీరన్న ఒకరి గురించి ఒకరు తెలిసి ఉండటం అంటే ఏవిటి ? ఒకే ఫ్లేవర్ ఐస్ క్రీం , ఒకే యాక్టర్ , ఒకే ప్రొఫెషన్ ఇలాంటివేగా ? ఇలా అంటున్నానని ప్రేమకు వ్యతిరేకినని అనుకోకండి . కానీ పెద్దల అంగీకారంతో చేసుకుంటే వారి అండ ఉంటుంది . విఫలమయ్యే పెళ్ళిళ్ళలో ప్రేమ పెళ్లిల్లె ఎక్కువ . ఇక్కడ విఫలం అంటే విడాకులు కాదు . ప్రేమించిన మనిషిమీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు .కనుక పెళ్లి తర్వాత జీవితం అనుకున్నవిధం గా లేకపోయినా సర్దుకు పోతారు . పెద్దలు చూసిన సంబంధంలో ఎంత రిస్క్ ఉంటుందో లవ్ మేరేజెస్ లోనూ అంతే రిస్క్ ఉంటుంది .పెద్దల అంగీకారంతో జరిగిన ఏ పెళ్ళిలో అయినా దంపతులకి ముఖ్యంగా అమ్మాయిలకి సపోర్ట్ ( రక్షణ ) ఉంటుంది .ఇది నా అభిప్రాయం మాత్రమే .

    రిప్లయితొలగించండి
  6. వ్యాఖ్య రాసిన అందరికి ధన్యవాదాలు.
    పరిమళం గారు, ప్రేమ పెళ్ళిళ్ళలో పెద్దల బాధ్యత ఉండదు. 'ఎవరినో తెచ్చి నా గొంతు కోశారు' అని పిల్లలు పెద్దవాళ్ళను అనే అవకాశం ఉండదు. మీరు ఉదహరించినవి 'ఆకర్షణ' ని 'ప్రేమ' అనుకుని పెళ్లి చేసుకుంటున్న వాళ్లకి సరిగ్గా సరిపోతాయి. పరిణతి చెందినా ప్రేమికులూ ఉన్నారు కదండీ..

    రిప్లయితొలగించండి
  7. ammayya mee post chadivinantha sepu nenu anukontunna maatlau ..chivari lo chepparu ....brathikincharu ...

    ammayilu antha tana life partner ni valle verify chesiko galagali ani manasaaraa asistunnanu .

    రిప్లయితొలగించండి
  8. Testing Wheel: మీ కోరిక నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నాను.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. Mee rachana chamathkruthi emiyo gani varahamu nennukuni kavinchina a kavya rachanambu sahithya priyulaina maa manasamunu saithamu akarshinchu kada...

    రిప్లయితొలగించండి
  10. @కృష్ణ: ఓహ్.. మీ వ్యాఖ్య ఈ టపా దగ్గర పబ్లిష్ అయ్యిందండీ.. ఇప్పుడింకా దొరికే అవకాశం లేదండీ ప్చ్ :( ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి