లోపలెక్కడో ఒకటుంటుంది. మనసో, హృదయమో, ఏదో ఉంటుంది దాని పేరు. ఆకారం
ఎలా ఉంటుందో తెలియదు కానీ, కొన్ని తీగెలైతే ఉంటాయి కచ్చితంగా. మన చుట్టూ
ఉండే వాళ్ళందరూ ఆ తీగెల్ని శృతి చేయలేరు. అలా చేయగలిగే వాళ్ళు ఏ కొందరో
ఉంటారు.. వాళ్ళు అప్పటివరకూ అపరిచితులే కావొచ్చు. ఉన్నట్టుండి మనసుని
పట్టుకుంటారు.. తీగెల్ని శృతి చేస్తారు.. మన మనసు పాడే రాగాలని మనం వినేలా
చేస్తారు.. ఆ రాగాలు మనల్ని ఈ జన్మ జ్ఞాపకాల్లోకో, గతజన్మ స్మృతుల్లోకో
తీసుకెళ్లక మానవు.
అనగనగా ఓ రాజారామ్. సముద్రపుటొడ్డున
ఉన్న పాతకాలం ఇంట్లో సంగీతం పాఠాలు చెప్పుకుని పొట్ట పోసుకునే
పార్వతమ్మగారి అబ్బాయి. కాలేజీలో చదువుకునే రాజారామ్ కి చదువుతో పాటు
పరుగంటే ఎంతో ఇష్టం. అతని ఇష్టాన్ని ప్రోత్సహించే పీయీటీ కాలేజీ లో
ఉండడంతో, ఎక్కడ పోటీ జరిగినా అందులో పాల్గొని కప్పు గెలుచుకుని వస్తూ
ఉంటాడు. తన కొడుకు జాతీయ స్థాయిలో బంగారు పతకాన్ని గెలవాలన్నది పార్వతమ్మ
కోరిక. ఆరువేల రూపాయలు వెచ్చించి స్పైక్ షూస్ కొనుక్కునే స్తోమతు లేదని బాధ
పడడు రాజారామ్. బూట్లు లేకుండానే ప్రాక్టీసు కొనసాగిస్తాడు.
అమ్మనీ,
పరుగునీ ప్రేమించే రాజారామ్ జీవితంలోకి ఉన్నట్టుండి ప్రవేశించింది నజీరా.
పేరే చెబుతోంది కదూ ముస్లిం అమ్మాయని. ఎప్పుడూ నిలువెత్తు బురఖాలో ఉండే
నజీరాలో కనిపించేవి పెద్ద కళ్ళు, తేనె రంగు కలిసిన కనుపాపలు. అవిగో, ఆ
కళ్ళని చూసే ఆమెతో ప్రేమలో పడిపోయాడు రాజారామ్. పరుగంటే రాజారాం కి ఉన్న
ప్రేమని చూసింది నజీరా. అతని పట్టుదలనీ చూసింది. అటుపై తల్లితో అతనికున్న
అనుబంధాన్ని గురించీ తెలుసుకుంది. అతన్ని ప్రేమించింది. నజీరా ప్రేమ,
రాజారామ్ ని అతని తల్లికీ, పరుగుకీ దూరం చేయకపోగా మరింత దగ్గర చేసింది.
విజయాన్ని
కోరుకుంటూ తన వెనుక ఒకరు కాదు, ఇద్దరు స్త్రీలు. జాతీయ స్థాయి పోటీల్లో
బంగారు పతకాన్ని గెలుచుకు వచ్చాడు రాజారామ్. ప్రపంచాన్ని గెలిచినంత ఆనందం
అతనిలో. అయితే, ఆ ఆనందం వెనుకే పెనుఘాతం. ఒకటి కాదు, రెండు. ఊహించని
పరిస్థితుల్లో అతను ప్రేమించిన ఇద్దరు స్త్రీలూ అతనికి దూరమైపోయారు.
'నీకోసం ఓ అమ్మాయి ఎక్కడో పుట్టే ఉంటుంది.. ఆమెని పెళ్లి చేసుకో..' అంటూ
నజీరా రాసిన ఉత్తరం ఒక్కటే అతని దగ్గర మిగిలిన ఆమె తాలూకు జ్ఞాపకం.
కాలం
ఎంతటి గాయాన్నైనా మాన్పుతుంది. కానీ, ప్రేమ ఓ గాయమైనప్పుడు దాన్ని
మాన్పగలిగే ఔషధమేది? రాజారామ్ ఇప్పుడు నగరంలో ధనవంతుల్లో ఒకడు. విశాలమైన
'పార్వతమ్మ మేన్షన్' లో జీవితం. డబ్బు, పేరు ప్రఖ్యాతులు. టీనేజ్ కూతురు
పార్వతి ఓ పక్క చదువుకుంటూ, మరోపక్క సంగీతం పాఠాలు చెబుతూ, ఇంకోపక్క రేడియో
జాకీగా పనిచేస్తోంది. ఔత్సాహిక క్రీడాకారులకి గెలుపు పాఠాలు చెబుతున్నాడు
రాజారామ్. "నువ్వు గెలవడం కోసం పరిగెత్తు, మరొకర్ని ఓడించడం కోసం కాదు"
అంటాడతను.
మరి, రాజారామ్ ప్రేమించిన నజీరా ఏమయ్యింది?
ఉంది, విదేశంలో. టీనేజీ కూతురు మెహెక్ తల్లిగా, నజీరా గ్రూప్ ఆఫ్
కంపెనీస్ చైర్ పర్సన్ గా ఇంటా, బయటా బాధ్యతల్లో మునిగిపోయి ఉంది. క్షణం
తీరికలేని విధంగా తన దినచర్యని ప్లాన్ చేసుకున్నా, ఒకే ఒక్క వ్యక్తి ఆమె
జ్ఞాపకాలని ఆవరించుకున్నాడు. అతను రాజారామ్. దారితప్పుతున్న మెహెక్ ని
గాడిలో పెట్టాలంటే, ఆమెని పై చదువుల కోసం ఇండియా పంపాలనుకుంటుంది నజీరా.
"ఒక్కసారి మాత్రమే నిన్ను చూసిన రాజారామ్, ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తూ
ఉంటే, నేను ఇండియాలో చదువుకోడానికి సిద్ధం" అంటుంది మెహెక్. కూతురితో పాటూ
తనూ ఇండియా ప్రయాణం అవుతుంది నజీరా.
ఇంతకీ, నజీరా
రాజారామ్ ని కలిసిందా? అసలు అంతగా ప్రేమించిన అతన్ని వదిలి ఆమె దూరంగా
ఎందుకు వెళ్ళిపోయింది? విడిపోయినా ఒకరినొకరు మరచిపోని ఆ ఇద్దరూ
తల్లిదండ్రులు ఎలా కాగలిగారు? ఈ ప్రశ్నలకి జవాబు గతవారం విడుదలైన తెలుగు
సినిమా 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు.' అభిరుచి గల చిత్ర నిర్మాణ సంస్థ
క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మించిన ఈ సినిమాకి కె. క్రాంతి మాధవ్ దర్శకుడు.
శర్వానంద్ (రాజారామ్), నిత్యా మీనన్ (నజీరా), పవిత్ర లోకేష్ (పార్వతమ్మ)
కీలక పాత్రలకి జీవం పోశారు. సాగరతీరాన జరిగే కథలో సముద్రమంత గంభీరమైన
పాత్రలని అలవోకగా ఒప్పించారు ముగ్గురూ.
ముఖ్యంగా చెప్పుకోవాల్సింది
నిత్యా మీనన్ గురించి. ఆమెని ఈ పాత్రకి ఎంచుకోవడం, ఒప్పించడం ద్వారా సగం
విజయం సాధించాడు దర్శకుడు. 'ప్రస్థానం' సినిమాలో శర్వానంద్ తల్లిగా రెండు
మూడు సీన్లకి పరిమితమైన పాత్ర చేసిన పవిత్ర లోకేష్ కి చాలా చక్కని పాత్ర
దొరికిందీ సినిమాలో. శర్వానంద్ 'వైవిద్యభరితమైన సినిమాలు ఎంచుకుంటాడు' అన్న
నమ్మకాన్ని మరోమారు నిరూపించుకోడమే కాదు, రాజారామ్ పాత్రకి జీవం పోశాడు.
పీయీటీగా సూర్య కి మంచి వేషం దొరికింది చాలా రోజుల తర్వాత. సాంకేతిక
విభాగాల్లో జ్ఞాన శేఖర్ ఫోటోగ్రఫీ, బుర్రా సాయి మాధవ్ సంభాషణలని
ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
లోపాలేవీ లేవా అంటే..
పార్వతమ్మ సంగీతం పాఠాల కోసం ఉపయోగించిన కీర్తలనని తెలుగేతరుల చేత
పాడించారు. కనీసం ఒకట్రెండు ఉచ్చారణ దోషాలున్నాయి ప్రతి కీర్తనలోనూ.
పాటలకన్నా, నేపధ్య సంగీతం బావుంది. సంభాషణల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి,
ప్రతి డైలాగునీ ఓ కొటేషన్ గా మార్చాలన్న తపన వల్ల కొన్ని సన్నివేశాల్లో
(ముఖ్యంగా ప్రధమార్ధం) నాటకీయత పెరిగిపోయింది. ఎడిటర్ కి మరికొంచం పని
చెప్పొచ్చు. కానైతే, పుడకలెన్ని ఉన్నా పానకం పానకమే.. తియ్యతియ్యగా,
ఘాటుఘాటుగా.. ఆ రుచిని ఓ పట్టాన మర్చిపోలేం.
'అమృత
వర్షిణి' అని సంగీతంలో ఒక రాగం. విద్వత్తు ఉన్న వాళ్ళు ఆ రాగాన్ని ఆలపిస్తే
మేఘాలు కరిగి వర్షం కురుస్తుందట. జంత్ర గాత్రాలతోనే కాదు ఓ సినిమాతోనూ ఆ
రాగాన్ని పలికించ వచ్చని నిరూపించాడు క్రాంతి మాధవ్. మనసో, హృదయమో, ఏదో..
అక్కడి తీగెల్ని తన సినిమాతో శృతి చేశాడు. కొన్ని కొన్ని మబ్బుల ఉనికి, అవి
వర్షపు చినుకులుగా మారేవరకూ తెలియదు. అంతేకాదు, తీగెల్లాగే ఆ చినుకులకి
కూడా ఆకృతి ఉండదు. వాన కురిసిన జాడైతే తెలుస్తుంది, కచ్చితంగా..
అబ్బా ఎంత అందంగా రాసారండీ ముఖ్యంగా ఆ చివరి పేరా హ్యాట్సాఫ్ :-) సినిమాకు తగిన విధంగా ఉంది మీ రివ్యూ కూడా... చాలా చాలా బాగుంది.
రిప్లయితొలగించండిసినిమా అంత అందంగా ఉంది మీ సమీక్ష.అంతా ఒకెత్తూ ఆ చివరి పదాలు ఒకెత్తూనండీ. నాకూ ఈ తరం హీరోల్లో శర్వానంద్ చాలా నచ్చుతాడు.నిండైన రూపంతో ఆకర్షణీయంగా ఉంటాడు,మంచి వైవిధ్యమయిన పాత్రలు ఎంచుకుంటూ చక్కటి నటనతో ఆకట్టుకుంటాడు. ఇతగాడు భవిష్యత్తులో ఇంకా చాలా మంచి సినిమాల్లో చెయ్యాలని కోరుకుంటున్నా.నిత్యా గురించి చెప్పాల్సిందేమీ లేదు,కొన్ని పాత్రలు ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె మాత్రమే చెయ్యగలదు అంతే.
రిప్లయితొలగించండిఆఖరి పేరా...
రిప్లయితొలగించండిమీరు మాత్రమే రాయగలరు అలా!!!
హృద్యమయిన సినిమాకి అందమయిన సమీక్ష. మనసు తీగలను మీటారు. అభినందనలు.
రిప్లయితొలగించండిమీ రివ్యూ చదివిన తర్వాత ఈ సినిమా చూసేందుకు వీకెండ్ వరకూ ఆగలేనోమో !?
రిప్లయితొలగించండిఎంత బాగా రాసారు మీరు . మొదటి పేరా , లాస్ట్ పేరా మళ్లీ మళ్లీ చదవాలనిపించేలా రాసారు చాలా థాంక్స్ అండి. రివ్యు చాలా బావుంది .మీ అందరి రివ్యు లు చదివి సినిమా చూడాలనిపిస్తుంది కానీ మా ఉళ్లో దియేటర్ ఉండదు .ఎప్పుడో టివి లో వస్తేనే చూడాలి .
రిప్లయితొలగించండి@వేణూ శ్రీకాంత్: 'సినిమాకి తగిన విధంగా' ఇది చాలా పెద్ద ప్రశంసండీ.. ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి@శ్రీనివాస్ పప్పు: థాంక్యూ.. థాంక్యూ వెరీ మచ్.. అవునండీ, శర్వానంద్, నిత్యా మీనన్ కూడా మంచి పాత్రలు ఎంచుకుంటున్నారు..
@శిశిర: సినిమా రాయించిందండీ అలా.. ..ధన్యవాదాలు..
@ఎస్పీ జగదీశ్: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@మమత: మీకు నచ్చుతుందనే అనుకుంటున్నానండీ.. ధన్యవాదాలు..
@రాధిక (నాని): టీవీలో కొంచం ఆలస్యంగా రావాలని కోరుకుంటున్నానండీ.. (సినిమా హిట్ అయితే టీవీలో ఆలస్యంగా వస్తుంది కదండీ, అందుకని) ..ధన్యవాదాలు..
సాగరతీరాన ఉండే మనుషుల మధ్య సముద్రమంత గంభీరమైన కథ...అంతే చక్కగా మీ సమీక్ష.
రిప్లయితొలగించండిగుర్తుండిపోయేలాంటి డైలాగ్స్ రాసారు, పేరు కొత్తగావుంది ఎవరీ సాయిమాధవ్ అని వెతికా, 'కృష్ణంవందే జగద్గురుమ్' కు మాటలనందించింది ఈయనేట. తెలుగు పరిశ్రమకు 'సిరివెన్నల' లాంటి మాటల రచయిత దొరికాడు.
చూసే అవకాశం లేనివాళ్ళకి కూడా.. ఎప్పటికైనా చూడాల్సిన సినిమాల లిస్ట్ లో రాసిపెట్టుకోవాలనిపించేలా ఉందండీ సమీక్ష. Beautiful!
రిప్లయితొలగించండిరిలీజ్ రోజే చూసానండీ శర్వానంద్ సినిమా అంటే చూడొచ్చని ఓ నమ్మకం :) సినిమా లాగే మీ సమీక్షకూడా బావుంది మలయమారుతం వీచినట్టు :)
రిప్లయితొలగించండి@నాగార్జున: నాటక రంగం నుంచి వచ్చిన రచయితండీ.. ..ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@కొత్తావకాయ: ఏమాత్రం అవకాశం ఉన్నా మిస్ కాకండీసినిమాని.. ధన్యవాదాలు..
@పరిమళం: 'మలయమారుతం' ..మీ అభిమానమండీ.. ధన్యవాదాలు..
మీ రివ్యూలన్నీ చదివి ఎలాగైనా చూడాలన్న తపన పెరిగిపోయింది. మొత్తానికి చూసేసానండీ. సింప్లీ సూపర్బ్. తండ్రి మరణం తర్వాత సీన్ లో నిత్య అద్భుతం అంతే.
రిప్లయితొలగించండినాజర్ పాత్ర చూసాకా అనిపించింది..ఎన్నిసార్లు చస్తూ(చావలేక) బతికేస్తున్నామో అని.
తండ్రికి ప్రేమని ఇచ్చేసానన్న నజీరా అప్పుడు మాత్రం రాజారాం ని ఎందుకు కలుస్తుంది అన్న సందేహం వుండిపోయింది.
@స్ఫురిత మైలవరపు: ప్లస్ లో జరిగిన ఓ చర్చలో మీరడిగిన ప్రశ్నకి మిత్రులు అమృతం గారిచ్చిన జవాబు నచ్చిందండీ నాకు. "తన జీవితంలో విలువైన కాలాన్ని తండ్రి కోసం ఇచ్చేసింది కదా" అంటారాయన. ముగింపు మరోలా ఇస్తే ప్రేక్షకులని ఎంత వరకూ నచ్చుతుంది అన్నది ప్రశ్న. ఏమైనప్పటికీ, గాల్లో సుమోలు లేవడానికి అక్కర్లేని లాజిక్ నే ఇక్కడా ఉపయోగించాలేమో :) (ఈ మాటా అమృతం గారిదే!) ..ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండిసినిమా చూసొచ్చి మీ రివ్యూ మరోసారి చదువుకున్నానండీ.
రిప్లయితొలగించండి@కొత్తావకాయ: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి