మంగళవారం, ఏప్రిల్ 21, 2009

అపార్ధం

'మాట వెండి ఐతే మౌనం బంగారం' అని సామెత. ఇది నిజమనిపించే సంఘటనలు చాలా జరిగాయి నాకు. ముఖ్యంగా నాకు కావలసిన వాళ్ళతో మాట పట్టింపు వచ్చిన ప్రతిసారి నాకు తెలియకుండానే ఈ సామెత గుర్తొస్తుంది. చాలా మాటలకి ఒకటి కన్నా ఎక్కువ అర్ధాలే ఉంటాయి. పలికే విధానం లో తేడాలు కూడా అర్ధాలను మార్చేస్తాయి. మనం ఒక అర్ధంలో అన్న మాటలు అవతలి వాళ్ళు మరొక అర్ధంలో తీసుకున్నప్పుడు వివరణ ఇవ్వక తప్పని పరిస్థితులు ఉంటాయి.

అదేం అదృష్టమో కాని చిన్నప్పటినుంచీ 'నా ఉద్దేశం అదికాదు' అని కొన్ని వేల సార్లు చెప్పి ఉంటాను. తప్పులు మనకి చాలా నేర్పిస్తాయి. నాకు మాట్లాడడాన్ని కొంతవరకు నేర్పించాయి. 'కొంతవరకు' అనడం ఎందుకంటే ఇప్పటికీ అపార్ధాలు దొర్లుతున్నాయి కాబట్టి. ఇవి కూడా నేను బాగా దగ్గర వాళ్ళు అని ఫీలయ్యే వాళ్ళతోనే ఎక్కువ. అవును..ఎక్కువగా మాట్లాడేది వాళ్ళతోనే కదా. ఈ అపార్ధాలు మళ్ళీ రెండు రకాలు. మాటల్లో పొరపాటు, జరిగిన పొరపాటును సరిచేసుకునే క్రమంలో జరిగే పొరపాటు. రెండోది మరీ దారుణం.

అవతలి వాళ్ళు మనం చెప్పేది నమ్మనప్పుడు 'ఒట్టు' అనడం చాలా మందికి అలవాటు. నాకెందుకో కొంచం ఊహ తెలిసిన నాటి నుంచే 'ఒట్టు' మీద నమ్మకం పోయింది. నా మిత్రుల్లో కొందరు దొంగ ఒట్లు వేసుకునే వాళ్ళు. అలా ఎందుకు అని అడిగితే, ఒట్టుని మరీ అంట సీరియస్ గా పట్టించుకో నవసరం లేదనే వాళ్ళు. బహుశా అందుకే అనుకుంటా.. నేను 'ఒట్టు' అనడం మానేశా. 'ఒట్టేయ్.. నమ్ముతాను' అని అవతలి వాళ్ళు అడిగినా నేను వేయననే వాడిని. ఇప్పటికీ ఎవరైనా 'ఒట్టు' అనబోతే 'ఒట్టు వేయొద్దు ప్లీజ్' అంటాను నేను.

మనం చెప్పే నిజం నిజమేనని అవతలి వాళ్ళని ఒప్పించడానికి ఒట్టు ఉపయోగ పడుతుందేమో.. కాని ఒట్టు లేకుండా కూడా ఆ పని చేయొచ్చు కదా. అయినా నమ్మకం మనుషుల మీద ఉండాలి కాని ఒట్ల మీద కాదు. ఇలాంటి విషయాలలో వాదించడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఒక పాయింట్ వరకు చెప్పి వదిలేస్తా. ఇక అర్ధం చేసుకోవడం, చేసుకోక పోవడం అవతలి వాళ్ళ ఇష్టం. చిన్నప్పుడోసారి నేను నా క్లాస్మేట్ ని దొంగతనానికి ప్రోత్సహించానని అనుమానించి, వాళ్ళ నాన్న మా నాన్నకి కంప్లైంట్ చేశారు. నేను చెప్పింది నమ్మకుండా నాన్న నన్ను పనిష్ చేశారు. ఓ వారం తర్వాత క్లాస్మేట్ వాళ్ళ నాన్న మా నాన్నకి సారీ చెప్పారు..నా పాత్ర లేదని తెలిసి.

అపార్ధం కారణంగా నాకు శిక్ష పడిన సందర్భాలు చాలానే ఉన్నప్పటికీ ఇది ఎందుకో నాకు బాగా గుర్తుండి పోయింది. ఎవరితో అపార్ధం వచ్చినా మొదటి ఇదే గుర్తొస్తుంది. నన్ను అవతలి వాళ్ళు అపార్ధం చేసుకోవడమే కాదు, వారిని నేను సరిగా అర్ధం చేసుకోని సందర్భాలూ చాలా ఉన్నాయి. మొదట్లో ఇలా జరగడానికి ఎవరో ఒకరి ప్రభావం ఉండేది. అంటే ఓ స్నేహితుడి గురించి మరో స్నేహితుడు చెప్పే మాటలో ఇలా.. సొంతంగా ఆలోచించేటప్పుడు కూడా ఎస్టిమేషన్ లో ఎక్కడో పొరపాటు దొర్లక మానదు. ఫలితం అపార్ధం.

నేను మొదట ప్రస్తావించిన సామెత అపార్ధాలు కలిగించడానికే కాదు, తొలగించడానికీ వర్తిస్తుంది. అపార్ధం పొడసూపినప్పుడు చాలా సార్లు మాట కన్నా మౌనమే సమస్యని పరిష్కరిస్తుంది. మౌనం అవతలి వాళ్లకి ఆలోచించుకునే అవకాశం ఇస్తుంది. నెమ్మదిగా సమస్యనూ పరిష్కరిస్తుంది. ఐతే మౌనం సర్వ రోగ నివారిణి కాదు. పైగా అవతలి వాళ్ళు మౌనాన్ని అపార్ధం చేసుకుంటే సమస్య మరింత జటిలమవుతుంది. మాటలతో సమస్య పరిష్కారం కానప్పుడు మాత్రం మౌనమే ప్రత్యామ్నాయం. దానితో పాటు వేచి చూడగల ఓపిక కూడా అవసరం.

10 కామెంట్‌లు:

  1. మీరు ఛత్రపతి టైపన్న మాట!
    నేను చిన్నప్పణ్ణించీ చాలా వాగుడుకాయని. మౌనంగా ఉండడం నాకసలు చాతకాని పని.
    కానీ మౌనమే మంచిదని ఇప్పుడు అనుభవంలోకి వచ్చి సాధన చేస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  2. "మాటలతో సమస్య పరిష్కారం కానప్పుడు మాత్రం మౌనమే ప్రత్యామ్నాయం. దానితో పాటు వేచి చూడగల ఓపిక కూడా అవసరం. "
    చక్కని ముగింపు ...చక్కనిది బహు చిక్కనిది.

    రిప్లయితొలగించండి
  3. మౌనానికి అంత పవర్ ఉందన్నమాట!!!!

    రిప్లయితొలగించండి
  4. మన తప్పు లేకుండా శిక్ష అనుభవించాల్సి రావడం చాలా బాధ కలిగిస్తుంది.

    రిప్లయితొలగించండి
  5. తప్పును కప్పిపుచ్చుకోవడానికీ , నిజాయితీని నిరూపించుకోవడానికీ కూడా ఒట్టునే ఉపయోగించడం ఒట్టు విలువను తగ్గించిందనుకుంటా...."అపార్ధం "విశ్లేషణ చాలా బావుంది మురళి గారూ ! ఇది అందరికీ ఎదురయ్యేదే . అయితే మీరన్నట్టు మౌనం అన్ని వేళలా పనికిరాదు .మాట్లాడటం వల్ల అపార్ధాలు చాలా వరకు తొలగుతాయ్ .

    రిప్లయితొలగించండి
  6. Kottapaali said
    సంజీవ్ కపూర్ అంటే మురళిగారికెందుకు జెలసీ అని సభాముఖంగా ప్రశ్నిస్తున్నా మధ్యక్షా? (కాస్త గట్టిగా అరిస్తే మురళిగార్నించి మరో రసవత్తరమైన టపా వస్తుందని) :)

    రిప్లయితొలగించండి
  7. వ్యాఖ్య రాసిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  8. ఒట్టు విషయం లో మాత్రం నేను కూడా డిటో ఇంకా అల ఒట్టు అన్నారంటే వాళ్ళు నేను నమ్మని వాళ్ళ లిస్టు లోకి వచేస్తారు :( ...ఇంకా మౌనం అనేది మనకు అస్సలు చాత కానీ పని ....అప్పుడే ఇంకా సస్పెన్స్ గా ఉంటుందండీ బాబోఒ...కానీ పెళ్లి అయ్యాక మా వారిని చూసి ఇవ్వన్ని అర్ధం చేసికోవలసి వచ్చింది ( అంటే మనం అత్తారింట్లో చూసి రమ్మంటే కాల్చి వచ్చే ఘన కార్యం కూడా చేసాం అన్నమాట ..లోక కళ్యాణమే అయిన ఎవరిక్కావాలి అంటారు ...ఖి ఖి )


    మనం మనలా ఉండగలము కాని మారిపోయి చిదానంద స్వరూపం ధరించలేము ...అబ్బో ఆ కష్టం ఏంటి అన్నది
    నాకు తెలుసు గా..మీ పోస్టు నాకు బాగా నచ్చింది, కుంచెం మోటివేట్ చేస్తుంది గా .....

    రిప్లయితొలగించండి