శుక్రవారం, మే 01, 2009

వైకుంఠపాళీ

జీవితాన్ని వైకుంఠపాళీ తో పోల్చిన పెద్దాయన ఎవరో తెలియదు కాని, ముందుగా ఆయనకి నా వందనాలు. వైకుంఠపాళీ లో పాము నోట్లో పడతామో, నిచ్చెన మెట్లెక్కుతామో పందాన్ని నేలపై పరిచేంత వరకూ తెలుసుకోలేనట్టే, జీవితంలో ఎదురయ్యే జయాపజాలనూ ముందుగా పసిగట్టలేము. ఆటలో పందెం సరిగా పడక పాము నోట్లో పడ్డప్పుడు చేయగలిగింది ఏమీ లేదు, నిచ్చెన కోసం ఎదురు చూస్తూ ఆట కొనసాగించడం తప్ప.. జీవితం లోనూ అంతే.

చిన్నప్పుడు నేను చాలా ఇష్టంగా ఆడిన ఆటల్లో వైకుంఠపాళీ ఒకటి. ముఖ్యంగా వేసవి మధ్యాహ్నాలు బడికి వెళ్ళక్కర్లేకుండా, ఇంటి నుంచి బయటకి కదలడానికి పెద్దవాళ్ళ అనుమతి లభించని సందర్భాలలో నాకు కాలక్షేపం అందించింది ఈ ఆటే. మద్యాహ్నం నిద్ర అలవాటు లేకపోవడంతో, పావులు కదుపుతూ గడిపేసేవాడిని. మరొకరితో ఆడుతున్నప్పుడు, వాళ్ళ పావులు నిచ్చెనల మీద, నావి పాముల నోట్లోనూ ఉన్నప్పుడు భలే ఉక్రోషంగా ఉండేది మొదట్లో. ఎంత ఆవేశంగా గవ్వలు విసిరినా కావాల్సిన పందెం పడేది కాదు.

కొన్ని క్షణాలలోనే ఆట తారుమారయ్యేది.. పెద్ద పందేలతో పైకెళ్లిన వాళ్ళు ఒక్కసారిగా పెద్దపాము నోట్లో పడి మొదటికి వచ్చేసే వాళ్ళు. కొన్నాళ్ళు ఆడేసరికి ఆట అర్ధం కావడం మొదలుపెట్టింది. ఆడడానికి ఎవరూ లేనప్పుడు నేనే రెండు పావులతో ఆడేవాడిని. తెలియకుండానే గెలుస్తున్న పావు నాది అనిపించేది. బహుశా విజయానికి ఆ ఆకర్షణ ఉందేమో. కొన్నాళ్ళు వైకుంఠపాళీ ఆడడం ఓ వ్యసనమైపోయింది. ఈ ఆటలో గెలుపోటములు మన చేతిలో అస్సలు ఉండవనే విషయం పూర్తిగా అర్ధమైంది.

జీవితంలో మొదటి వైఫల్యం ఎదురైనప్పుడు నాకు వైకుంఠపాళీ లో పెద్దపాము 'అరుకాషురుడు' గుర్తొచ్చాడు. వచ్చి వచ్చి వీడి నోట్లో పడ్డాను కదా అని బాధ పడ్డాను. విజయం కోసం కసిగా ప్రయత్నాలు చేశాను..కానీ వైఫల్యాలే ఎదురయ్యాయి. విజయానికీ, వైఫల్యానికీ ఎంత భేదం ఉందో స్పష్టంగా అర్ధమైంది. విజయం వస్తూ వస్తూ మిత్రులని తీసుకొస్తే, వైఫల్యం మిత్రులు అనుకుంటున్నా వాళ్ళని దూరం చేస్తుందని తెలిసింది. కొన్ని వైఫల్యాల తర్వాత ఒక విజయం దొరికింది. కానీ, నాకది అద్భుతమైన ఆనందాన్ని ఇవ్వలేదు. వైఫల్యం కారణంగా నాకు దూరమైన వాళ్ళు నాకు చేరువయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టినప్పుడు మాత్రం బాగా నవ్వొచ్చింది.

విజయాలనూ, వైఫల్యాలనూ ఒకేలా తీసుకోగలిగే స్థితప్రజ్ఞత రాలేదు కానీ, వైఫల్యాలని తట్టుకోగలిగే స్థైర్యం బాగానే అలవడింది. వైకుంఠపాళీ లో పాములు, నిచ్చెనలు యెంత సహజమో జీవితంలో కూడా అపజయాలు, విజయాలు అంతే సహజమని అనుభవపూర్వకంగా తెలిసింది. పాము నోట్లో పడ్డప్పుడు పందెపు గవ్వలను నేలకి విసిరి కొట్టడం వల్ల ఉపయోగం లేదని, కొంచం ఓపికగా ఆట కొనసాగిస్తే నిచ్చెన తప్పక వస్తుందన్న సత్యం బోధ పడ్డాక జీవితపు వైకుంఠపాళీ కూడా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా పాము నోట్లో పడ్డ ప్రతిసారీ, ఓ నిచ్చెన నా కోసం ఎదురు చూస్తోందన్న భావన నాకు బలాన్ని ఇస్తోంది..

8 కామెంట్‌లు:

  1. జీవితం లొ మనకు ఎదురయ్యే ప్రతి అపజయమూ
    మరొకరికి జయమే కదా ! ఇనా ఆశ పడతాము
    విజయం పట్ల ఆశ,ఆకర్షన ,ఏది జరిగినా
    మన మంచికె అనె సర్దుబాటె ,జీవన వైకుంట పాళీ ..
    మీ ఆట అదేనందీ వైకుంతపాళి ..బావుంది

    రిప్లయితొలగించండి
  2. >>విజయం వస్తూ వస్తూ మిత్రులని తీసుకొస్తే, వైఫల్యం మిత్రులు అనుకుంటున్నా వాళ్ళని దూరం చేస్తుందని తెలిసింది.

    మురళి గారు, నాకు కూడా ఇది అనుభవపూర్వకమే. ఇక్కడ రెండు కేస్ లు వస్తాయి. మొదటిది మనకు వైఫల్యం వచ్చినప్పుడు ఆ సమయంలో మనమే మిత్రులను దూరంగా ఉంచటం( ఆత్మన్యున్యతోనో లేక మరోటో తెలీదు గాని..). రెండోది కొంత మంది మిత్రులే మన వైఫల్యాలు చూసి దూరంగా ఉండటం.

    బావుంది మీ టపా.

    రిప్లయితొలగించండి
  3. ఓహ్ ! వైకుంఠ పాళీ ని జీవితానికి భలే అన్వయించుకున్నారు .....బావుందండీ ! స్థితప్రజ్ఞత రావటానికి మనం వానప్రస్థులమ్ కాదుగా ఇంకా ....వైఫల్యాలని తట్టుకోగలిగే స్థైర్యం ఉంటే చాలండీ ! మీరు చివర్లో చెప్పిన పాము నిచ్చెన థీయరీ నేనుకూడా ఫాలో అవుతానండీ ! నాక్కూడా ఉక్రోషం పాళ్ళు కాస్త ఎక్కువే :) :)

    రిప్లయితొలగించండి
  4. చాలా బాగా చెప్పారు.
    ఈమద్యనే 'అంతా మన మంచికే' అనుకోటం మొదలుపెట్టాను.
    కొంచెం ధైర్యం పెరిగింది.

    రిప్లయితొలగించండి
  5. >>"పాము నోట్లో పడ్డ ప్రతిసారీ, ఓ నిచ్చెన నా కోసం ఎదురు చూస్తోందన్న భావన నాకు బలాన్ని ఇస్తుంది".

    బాగుంది మీ టపా.

    రిప్లయితొలగించండి
  6. "విజయాలనూ, వైఫల్యాలనూ ఒకేలా తీసుకోగలిగే స్థితప్రజ్ఞత రాలేదు కానీ, వైఫల్యాలని తట్టుకోగలిగే స్థైర్యం బాగానే అలవడింది. "

    వైఫల్యాలని తట్టుకోగలిగితే చాలు.. దాదాపు సాధించినట్టే..

    రిప్లయితొలగించండి
  7. జీవిత సత్యాలు తెలిపేందుకే .

    మనం కూడా మన పిల్లలని ఇలాంటి ఆటలు ఆడేందుకు ప్రొత్సహించాలి మరి.

    రిప్లయితొలగించండి
  8. @రిషి: నిజమేనండి.. ధన్యవాదాలు.
    @శేఖర్ పెద్దగోపు: మీరు చెప్పిన మొదటి కేస్ నాకెప్పుడూ జరగలేదు. రెండోది అనుభవమే..అందుకే 'స్నేహితులు అనుకుంటున్నా వాళ్ళు..' అన్నాను. ధన్యవాదాలు.
    @పరిమళం: స్థితప్రజ్ఞత సాధించడం అనుకున్నంత సులువు కాదండి.. ఎంత కాదనుకున్నా రాగద్వేషాలు ఉంటూనే ఉంటాయి. ధన్యవాదాలు.
    @భవాని: నేనూ అదే పధ్ధతి ఫాలో అవుతున్నానండి.. ధన్యవాదాలు.
    @నాగ ప్రసాద్: ధన్యవాదాలు.
    @ఉమాశంకర్: పరిస్తితులు మనకి చాలానే నేర్పిస్తాయండి.. ధన్యవాదాలు.
    @భమిడిపాటి సుర్యలక్ష్మి: నిజమేనండి.. ఇప్పటి పిల్లకి నేర్పాలంటే ఈ ఆతని కూడా కంప్యుటేరైజ్ చేయాలేమో.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి