సోమవారం, ఫిబ్రవరి 21, 2022

నెరజాణవులే .. వరవీణవులే ..

చెలి ఒంపులలో హంపి కళ ఊగె ఉయ్యాల
చెలి పయ్యెదలో తుంగ అల పొంగే ఈ వేళ
మరియాదకు విరిపానుపు సవరించవేమి రా...

అరుదుగానే అయినా స్థలకాలాదులతో తీసిన సినిమాలు లేకపోలేవు తెలుగులో. ఇలాంటి సినిమాలకి కావాల్సినవన్నీ సమకూర్చడం ఛాలెంజే, పాటల సాహిత్యంతో సహా. పాట వినగానే కథాకాలం స్ఫురించాలి, పాత్రల ఔచిత్యాలు రేఖామాత్రంగానే అయినా తెలియాలి. కలం జవనాశ్వంలా పరుగులెత్తే వేటూరి లాంటి కవులకి ఇలాంటి పాట రాసే అవకాశం దొరకడమంటే, విందు భోజనానికి పిలుపు రావడమే. 

చిత్రమైన కథాంశంతో వచ్చిన సినిమా 'ఆదిత్య 365' (1991). ఓ సైంటిస్ట్ చాలా ఏళ్ళు పరిశోధనలు చేసి 'టైం మెషిన్' కనిపెట్టి, దానికి ఆదిత్య 369 అని పేరు పెడతాడు. అతని కూతురు హేమ (మోహిని), ఆమె బాయ్ ఫ్రెండ్ కృష్ణ కుమార్ (బాలకృష్ణ), మరికొందరూ ఆ టైం మెషిన్ లోకి అనుకోకుండా ప్రవేశించి అనూహ్యంగా గతంలోకి, అక్కడినుంచి భవిష్యత్తులోకి ప్రయాణం చేసి, వర్తమానంలోకి తిరిగి రావడమే కథ. వాళ్ళు గతం లోకి వెళ్ళింది సాక్షాత్తూ శ్రీకృష్ణదేవరాయల కాలానికి. అక్కడి రాజనర్తకి సింహ నందిని (సిల్క్ స్మిత)  కృష్ణకుమార్ మీద మనసు పడుతుంది. అతన్ని తన మందిరానికి ఆహ్వానిస్తుంది. ఆపై తన కోరికని బయట పెడుతుంది, అదీ పాట రూపంలో.. 

నెరజాణవులే వరవీణవులే 
కిలికించితాలలో... ఆహ్హహహా 
జాణవులే మృదుపాణివిలే
మధు సంతకాలలో... 

'కిలికించితం' అనేది స్త్రీ చేసే ఓ శృంగార చేష్ట. 'మధు సంతకాల'కి ఎన్ని అన్వయాలైనా చెప్పుకోవచ్చు కానీ, దృశ్యంలో సింహనందిని, కృష్ణ కుమార్ కి మధువు అందిస్తుంది. 

కన్నులలో సరసపు వెన్నెలలే
సన్నలలో గుసగుస తెమ్మెరలే
మోవి గనీ, మొగ్గగ నే మోజు పడిన వేళలో

'సన్న' అంటే సైగ. నీ మోవి (పెదవి )ని చూసి మొగ్గలాంటి నేను మోజు పడ్డాను అంటోంది. అతన్ని జాణ అంటూ, తనని మాత్రం మొగ్గగా అభివర్ణించుకుంది రాజ నర్తకి. 

మోమటు దాచి మురిపెము పెంచే లాహిరిలో
మూగవు గానే మురళిని ఊదే వైఖరిలో

ఆమె ఆహ్వానానికి అతడు సంసిద్ధుడు కాదు. అందుకే ముఖం తిప్పుకున్నాడు. అతడలా మొహం తిప్పుకున్నా కూడా ఆమెకి మురిపం పెరుగుతుందట. అతడేమీ మాట్లాడకపోయినా మురళీనాదం వినిపిస్తోందంటోంది. ఇలా మొదలైన చరణంలో ఆ తర్వాత.. 

చెలి ఒంపులలో హంపి కళ ఊగె ఉయ్యాల
చెలి పయ్యెదలో తుంగ అల పొంగే ఈ వేళ
మరియాదకు విరిపానుపు సవరించవేమి రా

రాయలెన్నో నిర్మాణాలు చేసినా, అయన పేరుచెప్పగానే మొదట గుర్తొచ్చేది రాజధానీ నగరం హంపి. ఆ నగరాన్ని ఆనుకుని ప్రవహించే నది తుంగ. 'సవరించవేమి రా' లో విరుపు ఉంది. 'సవరించవేమి?' అన్న ప్రశ్న కావొచ్చు, 'వచ్చి సవరించు' అన్న ఆహ్వానమూ కావచ్చు. 

సింహ నందినిని తిరస్కరించి, ఆమె ఆగ్రహానికి గురవుతాడు కృష్ణకుమార్. అక్కడి నుంచి హేమ మందిరానికి వచ్చేసరికి ఆమె అలకబూనుతుంది. ఇప్పుడు తన సచ్చీలతని, హేమ మీద ప్రేమని నిరూపించుకోవాల్సిన బాధ్యత అతనిది. 

చీకటి కోపం చెలిమికి లాభం కౌగిలిలో
వెన్నెల తాపం వయసుకు ప్రాణం ఈ చలిలో

నిజానికి హేమ, కృష్ణకుమార్ లు రాయలు కాలం వాళ్ళు కాదు కాబట్టి, వీళ్ళ కోసం నాటి భాష వాడాల్సిన అవసరం లేదు. కానీ, భాషని పలచన చేస్తే పాట సాహిత్యంలో సమగ్రత దెబ్బతింటుంది. పైగా, కథ ప్రకారం కృష్ణకుమార్ కి తెలుగంటే బోలెడు అభిమానం కూడా. 

చెలి నా రతిలా హారతిలా నవ్వాలీవేళ
తొలి సొయగమే ఓ సగము ఇవ్వాలీ వేళ
పరువానికి పగవానికి ఒక న్యాయమింక సాగునా

అతను న్యాయమా అని ప్రశ్నించేసరికి ఆమె కరిగింది. పల్లవి అందుకుంది..పాటని పూర్తి చేసింది. వేటూరి రాయగా, ఇళయరాజా స్వరపరచగా, జిక్కి, బాలూ, శైలజ పాడారు ఈ పాటని. సింహ నందిని పాత్రకి జిక్కి చేత పాడించడం భలే ప్రయోగం. ఇక, హేమ పాత్రకి డబ్బింగ్ కూడా శైలజ చేతే చెప్పించారు కాబట్టి, పాట అతికినట్టు సరిపోయింది. బాలకృష్ణగా మారిపోవడం బాలూకి ఏమంత కష్టం? 

చిత్రీకరణలో ముందుగా చెప్పుకోవాల్సింది సిల్క్ స్మిత గురించే. ఈమెలో ఉన్న నటిని, నర్తకిని మన సినిమా పరిశ్రమ సరిగ్గా ఉపయోగించుకోలేదని మళ్ళీ అనిపిస్తుంది, ఈ పాట చూస్తుంటే. అటు నర్తకిని తిరస్కరిస్తూ, ఇటు హేమని బతిమాలుకుంటూ రెండు వేరియేషన్స్ తో కనిపిస్తారు బాలకృష్ణ. జావళీ ఛాయలున్న గీతమే అయినా, సిల్క్ స్మిత లాంటి నటీమణి మీద చిత్రీకరిస్తున్నా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ పాటని ఆహ్లాదంగా చిత్రించారే తప్ప, అసభ్యతకి ఎక్కడా చోటివ్వలేదు. హాస్య పాత్రలు పోషించిన సుత్తివేలు, శ్రీలక్ష్మి కూడా కనిపిస్తారు తెరమీద.

7 కామెంట్‌లు:

  1. మనోహరమైన పాట, అద్భుతమైన చిత్రీకరణ.
    సిల్క్ స్మితాలోని నటనాప్రతిభను సినిమారంగం సరిగ్గా ఉపయోగించుకోలేదని మీరన్న మాట నూరుశాతం నిజం. ఆ రంగంలో ఉన్న లేబెలింగ్ (labelling) (type-casting) అలవాటు వల్ల ఆమె మీద సెక్సీ నటి అనే ముద్ర పడిపోయింది.

    ఏమనుకోకండి గానీ // “ మోవి (ముఖం) “ // అన్నారు పైన … కానీ మోవి అంటే పెదవి అని అర్ఖం అండీ.

    అలాగే // “ వాగ్గేయకారుడు పురందరదాసు కీర్తనల్లో ప్రముఖమైనది 'వరవీణ మృదుపాణి' “ // అన్నారు మీ వ్యాసంలో. కానీ వ్రాసింది అప్పయ్య దీక్షితార్ అని చదివినట్లు గుర్తే? Of course మీరు క్షుణ్ణంగా తెలుసుకునే వ్రాస్తారు … కాబట్టి మరి నేనే పొరబడుతున్నానా 🤔?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాన్నాళ్ల తర్వాత!!

      లేబిలింగ్ - స్మిత మాత్రమే కాదండీ, ఇంకా చాలామందికి అన్యాయం జరిగింది.. ఓ సారి చెల్లి వేషం వేస్తే మళ్ళీ హీరోయిన్ గా అవకాశం రావడం చాలా కష్టం.. 
      మోవి - సరి చేశానండీ, నేనే పరాకు పడ్డాను.. 
      వరవీణ - సంగీతం తెలిసిన ఓ మిత్రుడు నిన్న ప్రస్తావిస్తే నేనూ రాసేశాను.. మీరన్నాక వెతికితే ఇద్దరి పేర్లూ కనిపిస్తున్నాయి.. ప్రస్తుతానికి ఆ భాగం తొలగించాను.. కన్ఫర్మేషన్ కోసం ప్రయత్నిస్తున్నాను.. 

      ధన్యవాదాలండీ.. 

      తొలగించండి
    2. అప్పయ్య దీక్షితార్ దే నండీ.. నాదే పొరపాటు.. ధన్యవాదాలు మీకు..

      తొలగించండి
  2. సంస్కృత తెలుగు పదాల మేలు కలయికగా పాట సాహిత్యం సాగింది. One of the best films in Balakrishna career. Very good movie.

    ముఖ్యంగా ఈ పాట లో SPB గాత్రం చాలా బాగుంది. Perfect rendition.

    రిప్లయితొలగించండి