మంగళవారం, ఆగస్టు 30, 2011

కుసుమాలు తాకగనే...

వర్షం భలే బాగుంటుంది. ఈ వాక్యం రాస్తుంటే నాకు తెలియకుండానే నవ్వొచ్చేసింది. అవును, 'కాఫీ రుచిగా ఉంటుంది' 'జయప్రద అందంగా ఉంటుంది' లాంటి సార్వజనీన సత్యాలని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పడం అంటే నవ్వురాకుండా ఎలా ఉంటుంది? వర్షం అంటే పగ పట్టినట్టుగా కుంభవృష్టిగా కురిసేది కాదు, చక్కగా చిన్నగా సన్నగా కురుస్తూ, ఆగుతూ, మళ్ళీ కురుస్తూ అలా కురిసీ కురవనట్టుగా కురిసేదన్నమాట.

పెద్ద వానైతే అస్సలు బయటికి కదలకుండా కిటికీ పక్కన కూర్చుని చూడాలనిపిస్తుంది. అదే చిరుజల్లైతే ఏదో వంకన తడిసి తీరాలనిపిస్తుంది.. చల్లటి నీటిఆవిరిలా అనిపించే చినుకులు తాకీ తాకనట్టుగా తాకుతూ ఉంటే పారిజాతం చెట్టు ప్రేమగా తన పూలని జారవిడుస్తున్న అనుభూతి. పూల పరిమళానికి మల్లేనే ఈ చినుకులకీ ఇదీ అని వర్ణించలేని పరిమళం.. అనుభూతికే తప్ప అక్షరాలకి అందదు.

అసలీ చిరుజల్లు 'నేనొస్తున్నా'నంటూ పంపే సంకేతం కూడా ఎంత సున్నితంగా ఉంటుందో. జడివానైతే లుంగలు చుట్టుకుపోయే సుడిగాలితో కబురెడుతుంది కదా.. ఈ చిన్నవాన తనకన్నా ముందుగా పిల్ల తెమ్మెరలని పంపుతుంది. పల్చటి మేఘాల్ని పనికట్టుకుని మరీ తీసుకొచ్చే ఈ తెమ్మెరలు, మనకన్నా ముందుగా మట్టికి అందిస్తాయి వాన పంపే కబురుని. మరుక్షణంలో మట్టి, గాలితో కలిసొచ్చి మనల్సి పలకరిస్తుంది.

ఏ దేశంలో తయారైన ఏ సుగంధమూ కూడా, ఆక్షణంలో మట్టి విరజిమ్మే సువాసన అంతటి ఆహ్లాదకరమైన పరిమళాన్ని అందించలేదని నాకో గట్టి నమ్మకం. అసలా గాలిని గుండెలనిండా పీల్చుకుని కనీసం కొన్నాళ్ళ పాటు నిరాహారంగా బతికేయెచ్చేమో అనిపిస్తూ ఉంటుంది. మేఘాలన్నీ మందగమనంతో సాగి, మొహమాటంగా ఓ చోటికి చేరాక మొదట ఓ పెద్ద చినుకు.. తర్వాత రెండో మూడో చిన్న చినుకులు.. ఆ తర్వాత అన్నీ కంటికి కనిపించని బుల్లి బుల్లి తుంపరలు.

ఓ విశాలమైన పచ్చికబయలు.. కనుచూపు మేరంతా పచ్చని పచ్చిక.. ఆ పచ్చదనానికి అంచుగానా అన్నట్టుగా దూరంగా ముదురాకుపచ్చ రంగులో కనిపించే చెట్లు.. ఆకాశంలో చిన్న చిన్న గుంపులుగా నింపాదిగా ప్రయాణం చేసే మేఘాలు. అప్పుడు ప్రారంభమైన బుల్లి బుల్లి తుంపరలు.. ఎవరూ లేని ఏకాంతంలో ఆ చిరుజల్లులని ఆస్వాదిస్తూ మనం...జల్లు పడుతూనే ఉంటుంది.. తాకి వెళ్తూనే ఉంటుంది.. కానీ పూర్తిగా తడపదు.. వర్షానికి సంబంధించి ఒకానొక అందమైన ఊహ ఇది.

తను పలకరించినప్పుడు, వర్షపు చినుకులు తడుపుతున్నట్టుగా కాక, పూలేవో తాకి వెళ్తున్నట్టుగా అనిపించడం చిరుజల్లు ప్రత్యేకత. చిరుచలిలో పలకరించే చినుకు వెచ్చగా అనిపిస్తుందదేమిటో.. ఇలాంటి జల్లులు పడేటప్పుడే ఏ క్షణంలో అయినా ఇంద్రధనుస్సు సాక్షాత్కరించేసే వీలుంది. చిరు చినుకుల పరవశంలో పడి పట్టించుకోకపోతే, ఓ అపురూపమైన ఆనందాన్ని అందుకోలేకపోయినట్టే.. శ్రావణం సెలవు తీసుకున్నాక వచ్చే వర్షాల్లో చిరుజల్లులు అరుదే అయినా, ఎదురు చూసే వాళ్ళని నిరాశ పరచవవి...

14 కామెంట్‌లు:

  1. 'కాఫీ రుచిగా ఉంటుంది','జయప్రద అందంగా ఉంటుంది' లాంటి సార్వజనీన సత్యాలని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పడం అంటే నవ్వురాకుండా ఎలా ఉంటుంది?

    భలే భలే.

    పెద్ద వానైతే అస్సలు బయటికి కదలకుండా కిటికీ పక్కన కూర్చుని చూడాలనిపిస్తుంది.

    మరే అదో చక్కటి అనుభూతి.

    వర్షం గురించి ఆ అనుభూతుల గురించి మరీ ఇంతలా రాసేస్తుంటే ఎలా చెప్పండి,హౌ?

    రిప్లయితొలగించండి
  2. హ్మ్మ్..అక్షరాలకి అందని అనుభూతి ఇది. మీ వాక్యమే మళ్ళీ మీకు అప్పచెప్పాల్సి వస్తోంది. పారిజాతాల జల్లు కురిసినట్టుంది.

    రిప్లయితొలగించండి
  3. ఆహా! ఎంత అందంగా రాసారండీ....నాకు వర్షం ఏరూపంలో ఉన్నా ఇష్టమే...మరీ రాళ్ళలా పెద్దపెద్దచినుకులతో చెంపమీద కొటేది కాకపోతే ;)

    వర్షం గురంచి మీ అందమైన ఊహ భలే ఉంది :) నాకెందుకో వర్షం కురుస్తుంటే...టీవిలకి,లప్టాపులకి అతుక్కునేవారిని చూస్తే జాలేస్తుంది...ఇంత అందాన్ని,అందమైన అనుభూతిని మిస్ అయిపోతున్నారని :)

    రిప్లయితొలగించండి
  4. <>
    మురళి గారూ, మీ నమ్మకం గట్టిదే. ఇక్కడ అంటే అమెరికాలో వాన పడినప్పుడల్లా, భూమి లోకి మొత్తం వంగిపోయి, ముక్కు ఎంత ఎగబీల్చి చూసినా, ఎక్కడా ఆ మట్టి వాసన తగలందే. ఆ పరిమళాలు గుర్తుకు తెచ్చుకొని ఒక్కసారి నిరాశగా ఊపిరే వదిలితే, అప్పుడు మళ్లీ జ్ఞాపకాల భోషానాల్లోంచే ఆ వాసన బయటికి చుట్టుముట్టి, తనువంతా నింపి, పులకరింప చేసి, దిగులు ఇంకొంచెం పెంచి ... ఎందుకులెండి ఇంకా చెప్పుకోవటం.
    అసలు చినుకు చినుకు మొదలై, చిన్న చిన్న జల్లులుగా మారి చెట్ల మీద, పెరట్లో మొక్కల మీద, కురిసే వాన చూస్తూ కిటికీలో ముడుచుకు కూర్చోవడం ఒక చైల్డ్ హుడ్ లక్జరీ.

    రిప్లయితొలగించండి
  5. manchi baavana. baagundi.

    >>ఓ ....పచ్చికబయలు.. కనుచూపు మేరంతా పచ్చని పచ్చిక.. ఆ పచ్చదనానికి అంచుగానా అన్నట్టుగా దూరంగా ముదురాకుపచ్చ రంగులో కనిపించే చెట్లు.. ఆకాశంలో చిన్న చిన్న గుంపులుగా నింపాదిగా ప్రయాణం చేసే మేఘాలు. అప్పుడు ప్రారంభమైన బుల్లి బుల్లి తుంపరలు..ఆకుపచ్చగా గేటుపై ఓ 10 అడుగుల వైశాల్యంలో విస్తరించి ఆకు కనపడకుండా రెండున్నర అంగుళాల సన్న మల్లెమొగ్గలు ఎవరూ లేని ఏకాంతంలో ఆ చిరుజల్లులని ఆస్వాదిస్తూ మనం...జల్లు పడుతూనే ఉంటుంది.. తాకి వెళ్తూనే ఉంటుంది.. కానీ పూర్తిగా తడపదు..>>

    madhyaloe konni addon lu unnaayi chooDanDi. idi naaku anubhavamae!!

    రిప్లయితొలగించండి
  6. ...................
    ఉరుము లురిమెడు గర్జనమ్ముల
    మెఱుపు తీవల మేలవింపుము
    మురిసి యాడెడు వాన చినుకుల
    సరస గానము లాలకింపుము

    (శ్రీ అబ్బూరి రామకృష్ణా రావు)

    ఆలకించాము ఆలకించాము మీ టపాలో.

    రిప్లయితొలగించండి
  7. మన సంస్కృతి వర్షాధారితమని నా నమ్మకం. "వానల్లు కురవాలి వాన దేవుడా" అంటుందే తప్ప "రెయిన్ రెయిన్ గో ఎవే" అన్నది తెలుగు నుడిలో ఒదగదు. పిల్లలు ఆ రైం చెప్తూంటే మనస్సు చివుక్కుమంటుంది. కావాలంటే చూడండి మన సినిమాల్లో కూడా హీరో హీరోయిన్లు వానంటే ఇష్టపడతారు.
    నా మటుకు నాకు వాన పడ్తూంటే "రిం ఝిం గిరె సావన్" పాట మనస్సులో మొదలై పెదవిపై ఆడుతుంది.

    రిప్లయితొలగించండి
  8. బాగా రాసారండి, వర్షాన్ని ఆస్వాదించడం మంచి అనుభూతి.

    రిప్లయితొలగించండి
  9. nijamye andam gurinchi kallaku kaadu manasuku telusu prathyekamgaa cheppanakkaraledani enta chakkagaa chepparo!? nachindi mee maata. inkaa eemadhya kaalamlo kurisina intha chakkani vaana nenoo intha varaku chudaledu. ante inta andam naa kallabadi ennellayindo.

    రిప్లయితొలగించండి
  10. @శ్రీనివాస్ పప్పు: రాయొద్దంటే ఎలా చెప్పండి? :-) :-) ...ధన్యవాదాలు.
    @కొత్తావకాయ: మీ వ్యాఖ్య కూడా..... ...ధన్యవాదాలండీ..
    @ఇందు: నిజమేనండీ.. కానీ ఎల్లప్పుడూ వర్షం చూస్తూ ఉండడమే సాధ్య పడదు కూడా కదండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. @పద్మవల్లి: అయితే ఆ సువాసన మాకుమాత్రమే పరిమితం అన్నమాట!! ఇంతకీ లగ్జరీ అనే అంటారా మీరు? ..ధన్యవాదాలు.
    @సునీత: అబ్బా.. మల్లెమొగ్గల మీదనుంచి జారే వాన చినుకులు.. చదువుతుంటేనే అధ్బుతంగా ఉంది!! షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలండీ..
    @బులుసు సుబ్రహ్మణ్యం: భలేగా గుర్తు చేశారండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. @పక్కింటబ్బాయి: నిజం కదండీ.. రైన్ రైన్.. విషయంలో నాదీ అదే ఫిర్యాదు.. ఇప్పుడింక 'గొంగళిలో తింటూ...' చందంగా ఉంటుంది, ఏమన్నా అంటే! ..ధన్యవాదాలు.
    @శ్రీ: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  13. @స్ఫూర్తి: త్వరలోనే మీ కళ్ళబడాలని కోరుకుంటున్నానండీ.. ధన్యవాదాలు.

    @అనఘ: ఒక ఫోటోని గూగులమ్మ ఇచ్చిందండీ.. మరో ఫోటోని మిత్రులు పంపారు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి