శనివారం, ఆగస్టు 06, 2011

నాయికలు-సంయుక్త

సంయుక్త బాగా కలిగిన కుటుంబంలో పుట్టింది. కష్టమంటే ఏమిటో తెలీదు. సౌందర్య, సంగీతల తర్వాత పుట్టిన సంయుక్త అంటే తండ్రి భారద్వాజకి ప్రత్యేకమైన అభిమానం. తల్లి భానుమతికి మాత్రం సంయుక్త కన్నా మిగిలిన ఇద్దరు పిల్లలంటేనే ప్రేమ ఎక్కువ. కారణం, సంయుక్తది అంతా తండ్రి పధ్ధతి. అనవసర ఆడంబరాలకీ, ఆర్భాటాలకీ వ్యతిరేకం. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడమే మొదటి నుంచీ అలవాటు. తమదైన ప్రపంచాన్ని నిర్మించుకుని అందులో తామే రాణులుగా బతుకుతున్న తల్లికీ, అక్కలకీ సంయుక్త వైఖరి ఏమాత్రమూ కొరుకుడు పడదు.

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. కష్టమంటే ఏమిటో తెలియని సంయుక్తని ఒక్కసారిగా కష్టాలు చుట్టుముట్టాయి. తండ్రికి చేదోడు వాదోడుగా ఉండి బిజినెస్ వ్యవహారాల లెక్కలు చూస్తున్న సంయుక్త వ్యాపారం నష్టాల్లో పడ్డ సంగతిని ముందుగానే పసిగడుతుంది. ఖర్చు తగ్గించుకోమని సలహా ఇచ్చి తల్లికీ, అక్కలకీ మరింతగా శతృవు అవుతుంది. నష్టాలూ అప్పులూ పెరిగి ఇల్లు వేలం వేసే పరిస్థితి వచ్చినప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోలేదు సంయుక్త. కానీ, రెండు రోజుల్లో ఇల్లు వేలం వేస్తారన్న నోటీసు అందుకున్న తండ్రి ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆమె స్థాణువే అయ్యింది.

అంతకు మించి, అప్పటివరకూ తనని ప్రేమిస్తున్నానంటూ వెంటపడి, పెళ్లికి తన అంగీకారం కోసం చుట్టూ తిరిగిన వాడు ఒక్కసారిగా దూరమైపోయినప్పుడు ప్రపంచం అంటే ఏమిటో అర్ధం కావడం మొదలుపెడుతుంది ఆమెకి. అప్పటివరకూ తమ చుట్టూ తిరిగి పనులు చేయించుకున్న వాళ్ళూ, తమచేత డబ్బు ఖర్చు పెట్టించిన వాళ్ళూ ఒక్కసారిగా ముఖం చాటేస్తున్నా వాస్తవాలు తెలుసుకోలేరు ఆమె తల్లీ, అక్కలూ. ఆ కష్ట సమయంలో వాళ్ళని ఆదుకున్నది సంయుక్త మేనత్త విమలమ్మ, ఆమె కొడుకు వసంత్.

వీళ్ళని ఇంట్లో పెట్టుకుని వాళ్ళింట్లో వాళ్ళే పరాయి వాళ్ళుగా బతుకుతున్న విమలమ్మ, వసంత్ అంటే చిన్నచూపే భానుమతికీ, సౌందర్యకీ, సంగీతకీ. ఒక్క సంయుక్తకి మాత్రమే వాళ్ళు చేసిన సాయం ఎంత గొప్పదో అర్ధమవుతుంది. అంతకు మించి, చాలీ చాలని సంపాదనతో ఇబ్బంది పడుతున్న వసంత్ కి తనవంతుగా సాయపడడానికి నడుం బిగిస్తుంది. తల్లిని ఎదిరించి ఉద్యోగంలో చేరుతుంది సంయుక్త. ఒక తరహా జీవితానికి అలవాటు పడిపోయిన తల్లిని మార్చడం కష్టమని అర్ధం చేసుకుని, కనీసం అక్కలనైనా బయటి ప్రపంచంలోకి తీసుకురాడానికి ప్రయత్నం చేస్తుంది సంయుక్త.

డబ్బుమీద విపరీతమైన మోజు చూపించే సౌందర్య తన తండ్రి వయసున్న సహదేవవర్మని డబ్బుకోసం పెళ్లి చేసుకున్నప్పుడూ, మంచి గాయని అయిన సంగీతని ఆర్కెస్ట్రా నిర్వహించే చక్రపాణి ప్రేమలోకి దింపి రహస్యంగా పెళ్ళాడినప్పుడూ కూడా సంయుక్త కేవలం మౌన ప్రేక్షకురాలు మాత్రమే. కేవలం ఐశ్వర్యం, ఆడంబరాలు మాత్రమే జీవితం కాదన్న సత్యాన్ని తెలుసుకున్న సంయుక్త, తన జీవితాన్ని తనకి నచ్చినట్టుగా మలచుకునే ప్రయత్నాలలో పడుతుంది. డబ్బులేని తనం ఆమెని బాధించదు. అంతకు మించి ఎవరి మీదా ఆధారపడకుండా బతకడం ఆనందాన్ని ఇస్తుంది. కేవలం కష్టాన్ని మాత్రమే నమ్ముకునేలా చేసిన ఆనందం అది.

వసంత్ తనకి తగినవాడని నిర్ణయించుకున్న సంయుక్త అతన్ని పెళ్లి చేసుకుంటుంది, తన తల్లిని ఒప్పించి. వైవాహిక జీవితంలో తృప్తి ఉన్నా, ప్రశాంతత దొరకదు ఆమెకి. అక్కలిద్దరి వైవాహిక జీవితాల్లో వచ్చిన ఇబ్బందులు ఆమె జీవితం మీద ప్రభావాన్ని చూపించడం మొదలెడతాయి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మానసిక స్థైర్యాన్ని కోల్పోని సంయుక్త, ధైర్యంగానే వాటిని ఎదుర్కొంటుంది. తండ్రి నేర్పిన విలువలనీ, కష్టపడే తత్వాన్నీ అక్షరాలా అమలు చేస్తుంది. జీవితంలో వచ్చే సమస్యలు తాత్కాలికమేననీ, డబ్బు మాత్రమే అన్ని సమస్యలనీ పరిష్కరించలేదనీ అర్ధం చేసుకున్న సంయుక్త, తన చుట్టూ ఉన్న వల్ల జీవితాల్లోనూ సౌరభాన్ని నింపడం ద్వారా అక్కలిద్దరికీ ఆదర్శంగా నిలబడుతుంది.

దాదాపు పదిహేనేళ్ళ క్రితం 'ఇండియాటుడే' పక్ష పత్రికలో సీరియల్గా వచ్చిన యద్దనపూడి సులోచనారాణి నవల 'జీవన సౌరభం' లో నాయిక సంయుక్త. యద్దనపూడి సృష్టించిన మెజారిటీ నాయికలకి నేలమీద నడిచే అలవాటు ఉండదు. వాళ్లకి భిన్నంగా అనిపించింది సంయుక్త. కేవలం ఈ పాత్ర కోసమే ఆ సీరియల్ క్రమం తప్పకుండా చదివాను అప్పట్లో. "చిన్ని నవ్వులో ఎన్ని ఆశలు.." టైటిల్ సాంగ్ తో ఈటీవీలో డైలీ సీరియల్గా ప్రసారమయినప్పుడు, అప్పటివరకూ బాలనటిగా సినిమాల్లో చేసిన సునయన టీవీ నాయికగా ప్రమోటయ్యింది, సంయుక్త పాత్రని ధరించి. 'జీవన సౌరభం' నవలని ఎమెస్కో ప్రచురించింది. పేజీలు 200, వెల రూ. 60. అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతోంది.

6 కామెంట్‌లు:

  1. మొన్నీ మధ్య.. చదివాను ఈ పుస్తకం. నాకు రెండు మూడు విషయాలు చిరాగ్గా అనిపించాయి.

    ౧. సౌందర్య - అందమైన పిల్ల, సంగీత - పాటలు అద్భుతం గా పాడుతుంది , సంయుక్త - మంచి తెలివి తో జీవితం మలచుకుంతుంది. తల్లి దండ్రులకి పేర్లు పెట్టె ముందే తెలుసు లా ఉంది. అబ్సర్డ్

    ౨. సంయుక్త - అబ్బా మరీ అన్నీ మంచి గుణాలే.. మరీ వేలెత్తి చూపించ లేకుండా.. Ms Perfect!
    ఏది ఏమైనా.. ఆపకుండా చదవచ్చు (ఒకసారి)

    రిప్లయితొలగించండి
  2. జీవనసౌరభం నవల నేను కూడా చదివానండీ...
    మంచి నాయికను పరిచయం చేశారు..

    రిప్లయితొలగించండి
  3. చిన్నప్పుడు ఇండియా టుడేలో ఏం ఉన్నా చదివేసేదాన్ని. అలా చదివిందే ఈ నవల కూడా. ఒక్కవారం మిస్సయితే మీ టపాల వేగాన్ని అందుకోవడం కష్టమే. :)

    రిప్లయితొలగించండి
  4. పాపం సంయుక్త. ఇలాంటి అంతులేని కథలు ఏనాటికీ మారవని, చర్విత చర్వణమే అనిపిస్తోంది, ఈ కథ వింటూఉంటే.
    Happy Friendship Day 'పిల్లన గ్రోవి' garu.

    రిప్లయితొలగించండి
  5. @కృష్ణ ప్రియ: యద్దనపూడి సులోచనా రాణి నవల 'ప్రేమ' తర్వాత వెంటనే చదివిన సీరియల్ అవ్వడం వల్ల బాగా నచ్చేసిందండీ అప్పట్లో.. ఇకపోతే అలా పాత్రోచితంగా పేర్లు పెట్టే అలవాటు యద్దనపూడి నవలలు చాలా వాటిలో గమనించవచ్చు మీరు. ఈ రీడబిలిటీ యద్దనపూడి మెజారిటీ నవలలకున్న అసెట్.. ధన్యవాదాలండీ..
    @రాజి: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  6. @శిశిర: ఏదో లెండి, ఈమధ్య అలా కుదురుతోంది :)) ..ధన్యవాదాలు.
    @జయ: పేరు బాగుందండోయ్.. కంప్యూటర్ లో రాయడం కూడా కష్టమేనా 'మురళి' అని!! నవల చదివినప్పుడు సంయుక్త మీద జాలి కలగదండీ, నిజానికి చాలా స్పూర్తివంటంగా మలిచారు ఆ పాత్రని.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి