సోమవారం, జులై 04, 2011

మురళీ వాళ్ళమ్మ

మురళీకి పదమూడేళ్ళ వయసప్పుడు అతని తల్లీ తండ్రీ విడిపోయారు. తండ్రికి మరో స్త్రీతో సంబంధం ఉందన్న విషయం తెలియడంతో ఆత్మాభిమానం గల తల్లి రుక్మిణి రాజీ పడలేకపోయింది. విషయం తెలిసిన మురళీ తండ్రిని అసహ్యించుకున్నాడు. తల్లీ కొడుకూ ఆ ఇంటి నుంచి వచ్చేశారు. రుక్మిణి సంగీత పాఠాలు చెబుతూ, ఆయాగా పని చేస్తూ, కుట్టు పని చేస్తూ తన కాళ్ళ మీద తను నిలబడింది. తండ్రి అందించబోయిన సాయాన్ని తిరస్కరించిన మురళీ, పనిచేస్తూ ప్రైవేటుగా చదువుకుని ఓ కంప్యూటర్ సెంటర్లో ఉద్యోగంలో చేరాడు.

చదువుతో పాటుగా ఇతర ఆసక్తులు మెండు మురళీకి. పుస్తకాలు చదవడం, పాటలు వినడం, సభలు, సమావేశాల్లో పాల్గొనడం... ఓ పక్క ఉద్యోగం చేస్తూనే, ఆసక్తులన్నీ కొనసాగిస్తూ మేనేజ్మెంట్ చదువు పూర్తి చేశాడు. నాలుగైదు కంపెనీలు మారి, ఓ పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు. తను ప్రేమించిన రజనిని సంతకాల పెళ్లి చేసుకున్నాడు. కొడుకు ఆదర్శం, అతను సాధించిన అభివృద్ధి ఎంతగానో నచ్చాయి రుక్మిణికి.

చూస్తుండగానే మురళి జీతం పెరిగింది. పనిగంటలూ పెరిగాయి. అతను పని చేసే కంపెనీకి ఎక్కడెక్కడో బ్రాంచీలు ఉన్నాయి. రైల్లో ఏసీ ప్రయాణం నుంచి చూస్తుండగానే విమాన ప్రయాణానికి ఎదిగాడు మురళి. అతను పని చేసే కంపెనీ అతని ఇంట్లో ఒక ఫోన్ పెట్టించింది. దానితో ఇంట్లో ఉన్న కాసేపూ కూడా ఆఫీసు ఫోన్లతోనే సరిపోతోంది మురళీకి. ఆఫీసులో ఎప్పుడూ యేవో ఫంక్షన్లు, ఏదో వంకన గిఫ్ట్లు, తరచూ ప్రయాణాలు, ప్రమోషన్లు జీతం పెంచడాలు. అందుకు తగ్గట్టుగానే ఎప్పుడూ పని పని పని.

మురళీలో గత ఆసక్తులన్నీ చూస్తుండగానే మాయమైపోయి, ఆఫీసే సర్వస్వం అయిపోయింది. తను బాగానే సంపాదిస్తున్నాడు కాబట్టి రజని ఉద్యోగం చేయనక్కర్లేదన్నపుడు, రుక్మిణి అడ్డుకుంది. అతను ఆ ఆలోచనని మరోసారి బయట పెట్టనివ్వకుండా చేసింది. రానురానూ కొడుకు ఇంట్లోనూ, కోడలితోనూ గడిపే సమయం తగ్గిపోతూ ఉండడం కలవర పరిచింది రుక్మిణిని. "కంపెనీ కోసం అంత సేపు పని చేయడం ఎందుకు? ఎనిమిది గంటలే పనిచెయ్యి. అందుకు ఎంత జీతం వస్తే అంతే తీసుకో," అని రుక్మిణి అన్నప్పుడల్లా, ఓ నాలుగు రోజులు సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వచ్చేస్తాడు మురళి. తర్వాత మళ్ళీ మామూలే. మీటింగనో, ఇంటర్వ్యూలనో, ఏదో ఒక కారణం చెబుతాడు.

తనతో పని చేసే శ్రీలతతో మురళీకి చనువు పెరగడాన్ని గమనిస్తారు రజని, రుక్మిణి. రజని మామూలుగా తీసుకోడానికి ప్రయత్నిస్తుంది కానీ, రుక్మిణి అలా తీసుకోలేక పోతుంది. కొడుకు నాలుగు మాటలు మాట్లాడితే అందులో మూడు శ్రీలత గురించే కావడం, ఆమెతో కలిసి తరచూ టూర్లకి వెళ్ళడం, రజనీని నిర్లక్ష్యం చేస్తూ, శ్రీలతని నెత్తిన పెట్టుకోవడం ఇవన్నీ చూసి చూసి ఒకరోజు మురళీని నిలదీస్తుంది. ఒకప్పుడు అతని తండ్రి ప్రవర్తనకీ, ఇప్పుడు మురళీ ప్రవర్తనకీ పెద్దగా తేడా లేదంటుంది.

తను సర్దుకుపోయేదే అయితే భర్తతోనే సర్దుకుపోయి ఉండుననీ, ఇపుడు అదే తప్పు చేస్తున్న కొడుకు దగ్గర సర్దుకు పోవాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదనీ చెబుతుంది. రజని కూడా మురళి నుంచి వేరే వచ్చేయదలిస్తే ఆమెకి సరైన తోడు దొరికే వరకూ తను ఆసరా ఇవ్వగలనని చెబుతుంది. ఒక వేళ రజని రాకపోయినా తన దారిన తను వెళ్ళిపోడానికి సిద్ధమంటుంది. ...ప్రపంచీకరణ ఫలితంగా మానవ సంబంధాల్లో చాపకింద నీరులా ప్రవేశిస్తున్న మార్పుని కథా వస్తువుగా చేసుకుని రంగనాయకమ్మ రాసిన కథ 'మురళీ వాళ్ళమ్మ.' వెంటాడే పాత్ర రుక్మిణి. 'అమ్మకి ఆదివారం లేదా?" సంకలనంలోనూ, 'తెలుగు కథకి జేజే!' సంకలంలోనూ చదవొచ్చీ కథని.

11 కామెంట్‌లు:

  1. చాలా మంచి కధ మురళి గారు.. రుక్మిణి ఆలోచనావిధానం ..నూటికి నూరు పళ్ళు.. సమర్ధనీయం.కొడుకుని..ఫేవర్ చేయక పోవడం..చాలా మందికి..నచ్చక పోవచ్చు.. కానీ.. తనకి కల్గిన బాధ వేరొకరికి అది తన కోడలికే కల్గినప్పుడు తన కొడుకు కూడా క్షమార్హుడు కాదని చెప్పడం రుక్మిణి పాత్రకే.. చెల్లింది. కొన్ని పాత్రలు..సజీవ రూపాలు...

    రిప్లయితొలగించండి
  2. నేను చదివాను ఈ కథ ! రంగనాయకమ్మ గారి కథల్లో మనుషుల్లో వీళ్ళు మంచి వాళ్ళు , వీళ్ళు చెడ్డవాళ్ళు అన్న గీత భలే గీస్తారు . ఇది నిజ జీవితం లో సాధ్యమయ్యే పనేనా :) ఈ విభజన అనేది పెద్ద ఉటోపియ నాకైతే . కాని వీరి పుస్తకాలు చదవటం ఇష్టం ఎందుకంటే ఎక్కువ కష్టపడకుండా (జానకి విముక్తి కి ఈ విషయం exemption ) లో చదివించే లక్షణం ఉంటుంది . స్వీట్ హోం ఐతే ఎన్ని సార్లు చదివాన్నో లెక్కలేదు :)

    రిప్లయితొలగించండి
  3. మంచి కథను పరిచయం చేసారండి . రుక్మిణి వ్యక్తిత్వం బాగాచెప్పేరు .

    రిప్లయితొలగించండి
  4. Meeru Ranganayakammagaru rasthunna "kallu terichina Seetha" pi mee tapa raste baguntundi anipisthundi :)

    రిప్లయితొలగించండి
  5. @వనజ వనమాలి: సాధారణంగా భర్త తప్పు చేస్తే భరించలేని స్త్రీ కూడా, కొడుకుని క్షమించేస్తూ ఉండడమో, వెనకేసుకు రావడమో జరుగుతుందండీ.. కానీ ఇక్కడ రుక్మిణి అందుకు భిన్నంగా వ్యవహరించింది.. ధన్యవాదాలు.

    @శ్రావ్య వట్టికూటి: మీరన్న గీతని నేనూ గమనించానండీ.. ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి కదా.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. @మాలాకుమార్: ధన్యవాదాలండీ..

    @lostchild: ప్రయత్నిస్తానండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. చాలా ఆసక్తికరమైన కథని పరిచయం చేశారు. నెనర్లు. కొంచెం నోరు చేసుకుంటాను, క్షమించండి.
    ఈ కథ తొలిసారిగా ప్రచురితమైన రోజుల్లో చాలా అభిమానించాను. కానీ కాలం గడిచే కొద్దీ ఆలోచించించే కొద్దీ అసంతృప్తి పెరగడం మొదలైంది.
    1. కొడుకుని తీసుకుని భర్తనించి విడివడిన రుక్మిణి ఏదో జీవితం గడిస్తే చాలు, కొడుక్కి చదువబ్బితే చాలు అన్నట్టు ఎందుకు బతికేసింది? తానే పై చదువులు చదివో, ఇంకేదన్నా ఘనకార్యాలు చేసో తన జీవితాన్ని ఉద్ధరించుకునే ప్రయత్నం ఎందుకు చెయ్యలేదు? కొడుక్కి చదువొస్తే, అటుపై మంచి ఉద్యోగమొస్తే అదే తన మదుపు అనుకున్నదా?
    2. మురళి కార్పొరేట్ జీవితం, తద్వారా వచ్చే గృహసమస్యలు. ఇవి మరీ సినిమా కష్టాల్లా ఉన్నాయి. ఇక్కడ మురళికి ఆపోజిట్‌గా రుక్మిణి వెలిబుచ్చే భావాలు ప్రగతి నిరోధకంగా ఉన్నాయి తప్ప నిజమైన బాధ్యతనీ, ఆత్మతృప్తినీ నేర్పేట్టుగా లేవు.
    3. రజని - ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మేలు.
    నిజమే ఇప్పటి జీవన పరిస్థితులు అలా ఉన్నాయి, కాదనడం లేదు. కానీ ఆ పరిస్థితులనుండి సమస్యని సృష్టించడానికి పనిగట్టుకుని కథ వొండి, పడికట్టు రాళ్ళలాంటి పాత్రల్లో నింపారు.
    ప్రగతి నిరోధకమైన కథ రాసినా పరవాలేదు, కానీ అవగాహనా రాహిత్యంతో - ఇదే ప్రగతి పథం - అని తప్పుడు దిశానిర్దేశం చేసే ఇలాంటి కథల్తో చాలా అపాయమని నా గాఢవిశ్వాసం.

    రిప్లయితొలగించండి
  8. మురళీ వాళ్ళమ్మ నాకు ఎంతో నచ్చిన కథ. ఒక తప్పును భర్త చేసినా, కొడుకు చేసినా నిలదీయడం, తనతో ఉండడానికి ఇష్టపడకుండా ఆ జీవితం నుంచి బైటికి వచ్చేయడం, కోడలు కూడా బైటికి రావాలను కుంటే తాను అండగా ఉంటానని చెప్పటం. ఆ డైలాగులను చదువుతుంటే ఎంతో ఆవేశానికి, ఉద్వేగానికి లోనవుతాం.

    రిప్లయితొలగించండి
  9. హ్మ్ ఇది కేవలమ్ ఓ కల్పిత కథ ఇందులో ఫలానా రుక్మిణమ్మ గారు ఇలా ఉన్నారు అనుకున్నంత వరకూ బాగానే ఉంటుంది కానీ... వాస్తవికత గురించి ఆలోచిస్తే జరగదేమో అనిపిస్తుంటుందండీ.. ఈవిడ పుస్తకాలు ఇంతవరకూ ఏవీ చదవలేదు నేను ఆ మధ్యెప్పుడో కృష్ణవేణి కొన్నాను కాని ఇంకా తెరవలేదు.. ఒకసారి చదివి చూడాలి.

    రిప్లయితొలగించండి
  10. @కొత్తపాళీ: ముందుగా మీ అభిప్రాయాన్ని వివరంగా పంచుకున్నందుకు ధన్యవాదాలు. నాకీ కథలో నచ్చినవి ముగింపు, మరియు తను నమ్మిన విషయాల పట్ల రచయిత్రి కమిట్మెంట్. మీరన్న మొదటి పాయింట్ విషయానికి వస్తే, భర్తతో విడిపోయే నాటికి రుక్మిణికి అస్సలు ఏమీ తెలీదు, కొంచం సంగీతం తప్ప. తర్వాత ఆవిడ కుట్టుపని నేర్చుకుని దానిని జీవనాధారంగా చేసుకుంది. ఆవిడ వరకూ అది ఒక అచీవ్మెంట్. రెండు: కార్పోరేట్ జీవితం సినిమా కష్టాల విషయంలో మీతో వంద శాతం ఏకీభవిస్తాను. ఇక్కడ నేను రచయిత్రి కమిట్మెంట్ ని చూశాను. ఆవిడకి కార్పోరేట్ సంస్కృతీ నచ్చదు కాబట్టి జరిగే ప్రతి పరిణామంలోనూ చెడుని మాత్రమే చిత్రించినట్టుగా అనిపించింది. ఇక రుక్మిణి భావాలు గమనిస్తే, ఆవిడ పూర్తిగా తన రోజుల్లోనే ఉండిపోయినట్టుగా అనిపిస్తుంది. "నువ్వీ కంప్యూటర్ కంపెనీ ఉద్యోగం మానేసి ఏ బట్టల మిల్లులోనన్నా పని వెతుక్కో"మంటుంది కొడుకుని. అనివార్యంగా వచ్చి పడ్డ మార్పుని ఆవిడ ఒడిసి పట్టుకోలేక పోయింది. 'ఇదే ప్రగతిపధం' అనుకునే కన్నా, 'ప్రగతిపధం' పట్ల రచయిత్రి దృష్టికోణం అనుకోవడం సబబేమోనండీ.. మురళి సినిమా కష్టాలని పక్కన పెట్టి చూసినా, మరో స్త్రీతో అతని సంబంధం విషయంలో రుక్మిణి స్పందన భిన్నంగా ఉండి నాకీ కథ నచ్చడానికి కారణమయ్యింది. మీ వ్యాఖ్య ద్వారా ఒక మంచి చర్చ జరుగుతుందని ఆశిస్తున్నాను.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. @Gowri Kirubanandan: నాక్కూడా నచ్చిన పాయింట్ అదేనండీ.. ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: జరిగే అవకాశాలు తక్కువేనండీ.. కానీ ఇది కథ కదా! ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి