మంగళవారం, మే 31, 2011

కోమలి గాంధారం

మొన్నీమధ్య పురాణం వారి 'ఇల్లాలి ముచ్చట్లు' గురించి టపా రాస్తుండగా యధాలాపంగా గుర్తొచ్చింది కోమలి. ఓ పుష్కర కాలమ్ క్రితం 'వార్త' దిన పత్రికలో వీక్లీ కాలమ్ గా వచ్చిన 'కోమలి గాంధారం' నాయిక. బహుముఖ ప్రజ్ఞాశాలి సి. మృణాళిని సృష్టించిన కోమలి, 'స్వీట్ హోం' విమలకి కసిన్ కాదుకదా అన్న సందేహం వచ్చింది చాలాసార్లు. అప్పట్లోనే ఓసారి మృణాళిని గారిని కలిసినప్పుడు "మీ కోమలి మీద విమల ప్రభావం కనిపిస్తోందండీ" అంటే, ఆవిడ దానిని కాంప్లిమెంట్ గా తీసుకుని, "ఈతరహా పాత్రల మీద విమల ప్రభావం ఉండకుండా ఉండదు" అన్నారు.

దాదాపు ఏడాది పాటు వారం వారం కాలమ్ గా వచ్చిన గాధలన్నీ తర్వాత సంపుటిగా మార్కెట్లోకి వచ్చాయి. పుస్తకావిష్కరణ గురించి పేపర్లో చూడగానే షాపుకెళ్ళి కాపీ తెచ్చేసుకున్నా. అనగనగా ఓ కోమలి. ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్. ఆవిడకో భర్త, అత్తమామలూ. కొత్తగా పెళ్లై కాపురానికి వచ్చి తనకి ముగ్గేయడం రాదన్న విషయాన్ని అత్తగారికి అర్ధమయ్యేలా చెప్పడం మొదలు, అప్పుడే పుట్టిన తమ పాపాయిని 'పరిపూర్ణ స్త్రీ' గా పెంచాలన్న భర్త కోరిక ఎంత అసమంజసమైనదో అతగాడికి అర్ధమయ్యేలా చేయడం వరకూ కోమలి చేసిన పనులు బోలెడన్ని.

కోమలి సుదీర్ఘమైన లెక్చర్లివ్వదు, మిన్ను విరిగి మీదపడ్డా అస్సలు కంగారు పడదు. కాకపొతే కీలెరిగి వాత పెడుతుంది, తన మాటలతోనూ, చేతలతోనూ. కొత్తగా పెళ్లి కుదిరిన స్నేహితురాలు వత్సల, తన కాబోయే భర్త ప్రేమని తట్టుకోలేక పోతున్నానని మొర పెట్టుకుంటూ కోమలికో ఉత్తరం రాస్తుంది. "ఇంత ఘాటైన ప్రేమకి నివారణోపాయం చాలా సింపుల్. పెళ్లి చేసుకోవడమే" అంటూ ఠక్కున జవాబు రాసేస్తుంది కోమలి.

అసలు ఈ కోమలి గాంధారం లో ముఖ్యమైన పాత్ర కోమలి భర్త. (ఇతగాడికి కనీసం పేరు కూడా ఉండదు, కో.భ. అనే ఉంటుంది పుస్తకమంతా). ఊహించగలిగేట్టే ఇతగాడు 'స్వీట్ హోం' బుచ్చిబాబుకి నకలు. కొంచం ఎక్కువ అమాయకప్పురుషుడు. ఉదాహరణకి ఒకరోజు ఇతగాడికి ఆఫీసులో ఆడవాళ్ళంతా తన వంక ఆరాధనగా చూస్తున్నారన్న అనుమానం వచ్చేస్తుంది. ఇక అద్దం ముందు గడిపే సమయం పెంచేస్తాడు. పాపం, ఈ విషయం భార్యతో చెప్పాలనుకుంటాడు. "ఇవాళ సునంద నన్ను చూసి ఏమందో తెలుసా? నేను వరండాలో నడుస్తుంటే 'రాజు వెడలె రవి తేజములలరగ' అన్నట్టు ఉందట"

దీనికి కోమలి సమాధానం ఏమిటో తెలుసా? "పాపం. ఆ అమ్మాయి ఎప్పుడూ రాజుల్ని చూసుండదు.." కో.భ పరిస్థితి ఏమిటన్నది అర్ధం చేసుకోవడం ఇప్పుడు చాలా ఈజీ. ఒకటని పది పడుతూ ఉంటాడు ఎప్పుడూ. ఈ కాలమ్ పేపర్లో వచ్చే రోజుల్లో మృణాళిని కొలీగ్ ఒకరు 'కో.భ. ఫ్యాన్స్ అసోసియేషన్' పెడతామని బెదిరించారట మరి. అన్నట్టు, కో.భ. దే కాదు కాలేజీలో మగ కొలీగ్స్ దీ అదే తీరు. వాళ్ళు కూడా కోమలి జోలికి వెళ్ళడం, ఊహించని విధంగా దెబ్బ తినేయడం. అక్కడికీ ఆడ లెక్చరర్లని విభజించి పాలిద్దామని ప్లానేశారు కానీ, కోమలి ముందా వాళ్ళ కుప్పిగంతులు?

హాస్యంగా, వ్యంగ్యంగా రాసిన ఈ కాలమ్స్ ని హోమియోపతి మాత్రలతో పోల్చవచ్చు. మేల్ ఇగో ని టార్గెట్ చేస్తూ రాసినవే ఇవన్నీ. చేదు మందుకి వ్యంగ్యం అనే తీపి పూత పూసి హాస్య భరితంగా చెప్పడమే కోమలి విజయ రహస్యం. కోమలి బావగారు మహిళల చేత కంట తడి పెట్టించే సినిమా తీసి అవార్డు అందుకోవాలని కలగంటుంటే "మన దేశంలో ఆడవాళ్ళు ఏడవడానికి సినిమాలు అవసరమా?" అని ఆశ్చర్యంగా అడుగుతుంది కోమలి. సరదా సరదాగా చదివేసినా, పుస్తకం పూర్తి చేసి పక్కన పెట్టక అప్పుడప్పుడూ అయినా గుర్తొచ్చి ఆలోచింపజేసే పుస్తకం ఈ 'కోమలి గాంధారం.' (నాదగ్గర ఉన్నది తొలి ప్రచురణ. 'హాసం' వారి తాజా ప్రచురణ మార్కెట్లో ఉంది.)

సోమవారం, మే 30, 2011

రెండు నిర్ణయాలు

ఈమధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రెండు నిర్ణయాలు నన్ను చాలా ఆశ్చర్య పరిచాయి. ప్రభుత్వం నడుస్తున్న (?) తీరుని బట్టి చూస్తే ఈరెండూ అసాధ్యాలుగానే అనిపించడం ఇందుకు కారణం. మొత్తంగా చూసినప్పుడు ఈ రెండూ కూడా అభినందించాల్సిన నిర్ణయాలే. పాలనా పరంగా చూసినా, రాజకీయంగా చూసినా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనదైన 'మార్కు' వేయడానికి ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తోంది.

మొదటి నిర్ణయం అనేక వివాదాలకి కేంద్రబిందువుగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్ పర్సన్ గా ముక్కుసూటి అధికారిణిగా పేరు తెచ్చుకున్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రేచల్ చటర్జీ నియామకం. గడిచిన ఐదారేళ్లలో ఏపీపీఎస్సీని ఎన్ని వివాదాలు చుట్టుముట్టాయన్నది అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్ర స్థాయిలో అత్యున్నత స్థాయి అధికారులని ఎంపిక చేయాల్సిన ఈ కమిషన్, పూర్తిగా రాజకీయ ఒత్తిళ్ళకి లోబడి పనిచేస్తోందనీ, ఒక ప్రాంతానికి, ఒక కులానికి చెందిన అభ్యర్ధులని మాత్రమే ఎంపిక చేస్తోందన్నది ప్రధాన విమర్శ.

ఎంపిక విధానంలో గత చైర్మన్ ప్రవేశ పెట్టిన సంస్కరణలు విమర్శల పాలయ్యాయి. ముఖ్యంగా ఇంటర్వ్యూ విధానం లోప భూయిష్టంగా ఉందన్నది పదుగురాడిన మాట. దీనికి తోడు కొందరు అభ్యర్ధులు సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించి, రాత పరీక్ష, ఇంటర్యూలలో తమకి వచ్చిన మార్కులని తెలుసుకుని, ఇంటర్వ్యూలో తమకి ఉద్దేశ్య పూర్వకంగానే అన్యాయం జరిగిందంటూ కోర్టుకి వెళ్ళారు. నోటిఫికేషన్ మొదలు పరీక్ష నిర్వహణ వరకూ గత చైర్మన్ నిరంకుశంగానే వ్యవహరించారనీ, కమిషన్ సభ్యులని సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకున్నారనీ వార్తలొచ్చాయి.

మూడు దశాబ్దాలకి పైగా ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేసి రిటైరైన రేచల్ చటర్జీ కి ముక్కుసూటిగా పోయే అధికారిణిగా పేరుంది. రాష్ట్రంలో విధ్యుత్ సంస్కరణలు అమలు పరిచిన అనంతరం ఏపీ ట్రాన్స్ కో చైర్మన్ గా నియమితులైన రేచల్ ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళకూ తలొగ్గకుండా పనిచేశారు. ట్రాన్స్ కో ని లాభాల బాటలో నడిపిచి, క్రిసిల్ నుంచి ఉత్తమ రేటింగ్ పొందడంతో పాటు ప్రధాన మంత్రి నుంచి బహుమతి అందుకోవడం పాలనా దక్షురాలిగా రేచల్ ప్రతిభకి తార్కాణం.

అటువంటి ఏపీపీఎస్సీకి ఇటువంటి అధికారిణిని నియమించడం హర్షించాల్సిన విషయం. రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ కి తొలి మహిళా చైర్మన్ రేచల్. ప్రతిష్టాత్మకమైన గ్రూప్ వన్ తో సహా దాదాపు పది వేల పోస్టులకు ఉద్యోగుల ఎంపిక వివిధ దశల్లో ఉన్న ప్రస్తుత తరుణంలో, రేచల్ లాంటి అధికారిణి కమిషన్ పగ్గాలు చేపట్టడం నిరుద్యోగులకు కచ్చితంగా తీపి కబురే. చైర్మన్ ఎంపికని రాజకీయం చేయనందుకు, ఒక సమర్దురాలైన అధికారిణిని నియమించినందుకూ ప్రభుత్వాన్ని అభినందించాలి.

రెండో నిర్ణయం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఎంపిక. ఎందరో రాజకీయ నాయకులూ, వ్యాపారవేత్తలూ ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసే ఎమ్మెల్సీ సీటు ఓ సామాన్య మహిళని వరించింది. తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం లోని మల్లవరం అనే కుగ్రామానికి చెందిన స్వయం శక్తి సంఘం సభ్యురాలు అంగూరి లక్ష్మీ శివకుమారి, కనీసం ఆమె కూడా ఊహించని విధంగా, ఎమ్మెల్సీ గా నామినేట్ కాబడింది. ఎమ్మెల్సీ సీటంటే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో డబ్బు ఖర్చు పెట్టి సంపాదించుకునేదనే మెజారిటీ ప్రజల గట్టి నమ్మకాన్ని ఏ కొంచమైనా సడలింపజేసే నియామకం ఇది.

పేద దళిత కుటుంబానికి చెందిన శివకుమారికి ఉన్న ఆస్థల్లా ఆమె ధైర్యం. ఎంతటివారినైనా నిలువరించి మాట్లాడడం. అదే ఆమెని నాయకుల దృష్టిలో పడేలా చేసింది. ఆరో తరగతితోనే చదువు మానేసి, అత్తవారింటికి పయనమైన శివకుమారి, తర్వాతి కాలంలో ఓ స్వయం శక్తి సంఘం సభ్యురాలై, లోకం పోకడ తెలుసుకుంటూ మహిళా సమాఖ్యలో జిల్లా స్థాయి నాయకురాలిగా ఎదగగలిగింది. పిల్లలు పెద్దయ్యాక పదో తరగతి పాసయ్యింది. స్వయం శక్తి సంఘం తన జీవిత గతిని మార్చేసిందని గర్వంగా చెప్పే శివకుమారికి, గ్రామస్థాయి సమస్యలు కరతలామలకం.

ఈ రెండు నియామకాల ద్వారా ముఖ్యమంత్రి ఎవరెవరికి ఎలాంటి సంకేతాలు పంపాలని అనుకుంటున్నారు? భవిష్యత్ నియామకాల్లోనూ ఆయన ఇదే వైఖరిని అనుసరిస్తారా? ఈ నియామకాల వెనుక ఉద్దేశాలు ఏవైనప్పటికీ, ప్రస్తుతానికి మాత్రం వీటివల్ల సామాన్యులకి ఏదో రూపంలో యెంతో కొంత మేలు జరుగుతుందన్న ఆశ మాత్రం కలుగుతోంది.

ఆదివారం, మే 29, 2011

ఓ పెళ్ళిభోజనం

అనుకోకుండా ఓ పెళ్లి రిసెప్షన్ కి వెళ్ళాల్సి వచ్చింది. ఇలాంటి వేడుకలు సాధ్యమైనంత వరకూ తప్పించుకుని ధన్యుణ్ణి అవుతూ ఉంటాను. తప్పనిసరి పలకరింపులూ, ప్లాస్టిక్ నవ్వులూ, వీటికి దూరంగా ఉండడంలో ఆనందం అనుభవిస్తే కానీ తెలీదు. వెళ్లి ఇబ్బంది పడడం కన్నా 'బిజీ' అని ఎక్స్ క్యూజెస్ చెప్పేయడం అలవాటైపోయింది. ఇందుకు శిక్షగానా అన్నట్టుగా ఒక్కోసారి నేను తప్పనిసరిగా వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకున్న చోట్లకి అనుకోని అవాంతరాల కారణంగా హాజరు కాలేకపోతున్నాను.

ఊహించినట్టుగానే వేదిక ధగద్ధగాయమానంగా మెరిసిపోతోంది. నిండు వేసవిలో కూడా సూట్లకీ, కోట్లకీ, కంచిలకీ, కాంజీవరాలకీ అస్సలు లోటన్నది కనిపించలేదు. స్త్రీమూర్తులంతా నడిచే నగల దుకాణాలని తలపింపజేయడంతో ఒక్కడినే వెళ్ళినందుకు హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. పొడుగాటి క్యూలో చివర్న నిలబడి ఎలాగోలా వేదికెక్కి, వరుణ్ణి అభినందించి (ఆఫ్కోర్స్, లోపల్లోపల బోల్డంత జాలిపడి) ఫోటోకి ఫోజిచ్చి ఆపై కిందకి దిగితే హోదాల వారీగా చిన్న చిన్న గుంపులు.

ఒక్కో గుంపునీ పరికించి చూస్తుండగానే ఉన్నట్టుండి 'బఫే' కోలాహలం మొదలయ్యింది. ఉన్న జనాన్ని కవర్ చేయాలంటే కనీసం మూడు నాలుగు కౌంటర్లు పెట్టాలి. కానీ అక్కడ ఉన్నది ఓకే ఒక్క కౌంటర్. చూస్తుండగానే కోట్లూ, కాంజీవరాలూ పళ్ళాలతో కౌంటర్ మీదకి దండెత్తాయి. మానవుడు ఎంతటి అత్యాశాజీవో వివరించి చెప్పడానికి ఆ ఒక్క దృశ్యాన్నీ ఉదాహరణగా చూపిస్తే చాలు. ఒక్కో ప్లేట్లోనూ కనీసం రెండు ప్లేట్లు పట్టే ఐటమ్స్ వడ్డించుకుని లాన్లో కూర్చుని తినడం మొదలు పెట్టారు గుంపులు గుంపులుగా. కృత్యదవస్థమీద నాకు సూప్ దొరికింది.

అతిధులంతా భోజనాల దగ్గరే ఉండడంతో వేదిక వెలవెల బోయింది. వధూవరులకి కొంచం తీరిక చిక్కడంతో తీరిగ్గా కబుర్లలో పడ్డారు. వధువు అలంకరించుకున్న హారంలో ఉన్నవి పచ్చలా, కెంపులా అన్న విషయం మీద తీవ్రంగా జరుగుతున్న చర్చ వద్దన్నా వినిపిస్తోంది లేడీస్ వైపునుంచి. కౌంటర్ దగ్గర రద్దీ అస్సలు తగ్గడం లేదు. కేటరింగ్ కుర్రాళ్ళు కూడా చేసేదేమీ లేక జరుగుతున్నది చూస్తూ ఉండిపోయారు. బల ప్రదర్శన కొనసాగుతోంది. ఐఐటీ అడ్మిషన్ల గురించి జరుగుతున్న చర్చలో పాల్గొనే ఆసక్తి లేకపోవడంతో, తిండి విషయాన్ని గురించి కొంచం సీరియస్గా ఆలోచించాను.

విడిగా ఓ టేబుల్ మీద ఫ్రూట్స్, ఐస్ క్రీమ్ పెట్టారు. ఇంకా ఎవరి భోజనమూ పూర్తి కాకపోవడంతో అక్కడ అస్సలు రద్దీ లేదు. ఓ బౌల్ లో పళ్ళ ముక్కలు వేసి తెచ్చుకున్నా. యూఎస్ వీసాల మొదలు అపోలో సర్జరీల వరకూ ఎడతెగకుండా చర్చలు సాగుతున్నాయి. వింతేమిటంటే ఏ ఒక్కరూ మరొకరు చెప్పేది వినరు. ఎవరూ వినడం లేదని తెలిసి కూడా చెప్పేది ఆపరు. మెడికల్ కేర్ అన్నది ప్రెస్టేజ్ ఇష్యూ గా మారి చాలాకాలమే అయ్యింది కానీ, ఇప్పుడు మార్నింగ్ వాక్ కూడా అలాంటి హోదానే సంపాదించుకుందన్నది కొత్తగా తెలిసిన విషయం.

నేను పళ్ళ ముక్కలు పూర్తి చేసి ఐస్ క్రీమ్ వైపు వెళ్లేసరికి, నెమ్మదిగా అక్కడ రద్దీ మొదలైంది. ఐస్ క్రీమ్ చప్పరిస్తూ యదాలాపంగా బిన్ వైపు చూశాను. ఉసూరుమనిపించింది.. బిన్ లో వేసిన ప్రతి ప్లేటూ కనీసం సగం నుంచి మూడొంతులు నిండి ఉంది. ప్రతి బిన్ నూ ఇద్దరేసి కుర్రాళ్ళు కలిసి మోసుకెళ్ళి ఖాళీ చేసుకుని వస్తున్నారు. వచ్చిన వాళ్ళెవరూ తెలియక పడేశారని అనుకోలేం. చాలా వరకూ హై సొసైటీ పీపుల్ మరి. పోనీ రుచిగా లేవా అనుకుందామంటే ప్రతి ఒక్కరూ కౌంటర్ మీదకి మళ్ళీ మళ్ళీ దండెత్తారు.

పారేయడం కూడా ఇప్పుడు ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయి ఉంటుందన్న జ్ఞానోదయం కలిగింది నాకు. బయటికి వస్తుండగా నన్ను ఆహ్వానించిన హోస్టు కనిపించారు, "హౌజ్ ద డినర్" అంటూ. "యా.. ఇట్స్ నైస్," అన్నాన్నేను హ్యాండ్ షేక్ ఇస్తూ.. ఆఫ్కోర్స్, పెదాలని చెవులవరకూ సాగదీసి నవ్వడం మర్చిపోలేదు.

శనివారం, మే 28, 2011

వైశాలి

వారం రోజులు వ్యవధిలో రెండో డబ్బింగ్ సినిమా. ఇది కూడా తమిళం నుంచి తెలుగుకి అనువాదమైనదే. ఇంకా 'రంగం' హ్యాంగోవర్ నుంచి తేరుకోక ముందే, ఈ శుక్రవారం విడుదలైన 'వైశాలి' సినిమా బాగుందనే టాక్ వినిపించింది. తమిళ దర్శకుడు శంకర్, తెలుగు నిర్మాత దిల్ రాజు తో కలిసి నిర్మించిన ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే సమకూర్చడంతో పాటు దర్శకత్వ బాధ్యతని అరివళగన్ నిర్వహించారు. ఇది కూడా పూర్తిగా దర్శకుడి సినిమానే.

నగరం నడిబొడ్డున రెండువందల యాభయ్యారు ఫ్లాట్లున్న ఓ అపార్ట్మెంట్ లో 'ఇ-సిక్స్' ఫ్లాట్ లో నివాసం ఉండే వైశాలి బాలకృష్ణన్ (సింధు మీనన్) అనే గృహిణి అనుమానాస్పద మరణం సినిమాలో ప్రారంభ సన్నివేశం. బాత్ టబ్ లో ఉంటుంది వైశాలి మృతదేహం. ఫ్లాట్ లో ట్యాప్ కట్టకపోవడంతో కిందవరకూ నీళ్ళు వచ్చేయడంతో వాచ్మన్ గమనించి తలుపు కొట్టడంతో మరణవార్త వెలుగులోకి వస్తుంది.

వైశాలి తన జాకెట్లో దాచుకున్న, ప్లాస్టిక్ కవర్ తో చుట్టిన సూసైడ్ నోట్ దొరుకుతుంది పోలీసులకి. తన భర్తకి రాసిన ఆ ఉత్తరంలో తాను తప్పు చేశాననీ, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాననీ, ఇందుకు ఎవరూ బాధ్యులు కారనీ చెబుతుంది వైశాలి. పోలీస్ విచారణలో, చుట్టుపక్కల ఫ్లాట్స్ లో ఉండేవారంతా వైశాలి ప్రవర్తన మంచింది కాదనీ, ఆమెకోసం ఎవరో ఒక వ్యక్తి ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో వచ్చి వెళ్తున్నాడనీ చెబుతారు.

పోలీసులు వైశాలిది ఆత్మహత్యగా నిర్ధారించి కేస్ క్లోజ్ చేయబోతున్న సమయంలో తనకొక్క అవకాశం ఇమ్మంటూ పై అధికారులని అడుగుతాడు అసిస్టెంట్ పోలిస్ కమిషనర్ వాసుదేవన్ అలియాస్ వాసు(ఆది, మన తెలుగు దర్శకుడు రవిరాజా పినిశెట్టి కొడుకు). వైశాలిది ఆత్మహత్య కాదని వాసు నమ్మకం. అంతే కాదు, ఆమె తప్పు చేసే మనిషి కాదని చాలా బలంగా నమ్ముతాడతడు. వైశాలిని గురించి అతనికి అంత నమ్మకం ఎందుకంటే, చదువుకునే రోజుల్లో ఆమెని ప్రేమించి, పెళ్ళికి ఆమె తండ్రి ఒప్పుకోకపోవడంతో వైశాలికి దూరమయ్యాడు వాసు.

ఓ పక్క మర్డర్ మిస్టరీ, మరో పక్క ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే వాసు-వైశాలి ల ప్రేమకథ. రెంటినీ బ్యాలన్స్ చేస్తూ సినిమా మొదటి సగానికి స్క్రీన్ ప్లే రాసుకున్న తీరు ముచ్చటగొలిపింది. చక్కని ఎడిటింగ్, అనవసరంగా పాటలని ఇరికించక పోవడం.. ఇవన్నీ మొదటి సగానికి ప్లస్ పాయింట్లు. వైశాలి చెల్లెలు దివ్యగా శరణ్య మోహన్ కనిపించింది. మొదటిసగంలో ఈమెది అంతగా ప్రాధాన్యత ఉన్న పాత్ర కాదు. అయితే రెండో సగంలో కథ మలుపులకి దివ్య కీలకమయ్యింది.

మొదటి సగాన్ని యెంతో చక్కగా తీసిన దర్శకుడు రెండో సగానికి వచ్చేసరికి తడబడ్డాడు. రెండో సగం కోసం ఎన్నుకున్న పాయింట్ కన్విన్సింగ్ గా లేకపోవడం వల్ల, అప్పటివరకూ ఏక్టివ్ గా సాగిన వాసు పాత్ర పాసివ్ గా మారిపోయింది. సన్నివేశాలు వస్తూ, వెళ్తూ కథని నడిపించేశాయి. ఫలితంగా, సినిమా ప్రేక్షకులు ఊహించగలిగే ముగింపుకి వచ్చి, నిరుత్సాహ పరిచింది. అలాగే మొదటి సగంతో పోల్చినప్పుడు రెండో సగంలో సాగతీత కనిపించింది. కొంత ఎడిట్ చేయొచ్చు.

నటన గురించి చెప్పాల్సి వస్తే మొదట చెప్పాల్సింది వైశాలిగా చేసిన సింధు మీనన్ గురించే. కాలేజీ విద్యార్ధిని గా ఒప్పకపోయినా (వయసు దాచే ప్రయత్నం ఫలించలేదు), గృహిణి గా ఆమె ఆహార్యం చాలా బాగుంది. అలాగే నటన కూడా. వాసుగా చేసిన ఆదితో, బాలకృష్ణన్ గా చేసిన నందా పోటీ పడ్డాడు నటనలో. ఆది కొన్ని యాంగిల్స్ లో మంచు విష్ణుని గుర్తు చేశాడు. శరణ్య మోహన్ రెండో సగంలో తన పాత్రకి న్యాయం చేసింది. కాకపొతే కథ, కథనాల విషయంలోనే దర్శకుడు తీసుకోవల్సినంత జాగ్రత్త తీసుకోలేదనిపించింది.

ఇరవై రెండేళ్ళ క్రితం ఇదే పేరుతో వచ్చిన సినిమాలో (అది కూడా డబ్బింగ్ సినిమానే) 'ప్రేమ జీవన రాగం..' అనే పాట యెంతో బాగుంటుంది. ఈ సినిమాలో అలా గుర్తు పెట్టుకునే పాట లేదు. కాకపొతే నేపధ్య సంగీతం (తమన్) బాగుంది. వైశాలి మరణం తర్వాత, ఆ అపార్ట్మెంట్ లో అదే తరహా మరణాలు వరుసగా సంభవించడం తో వాసు ఏదో చేస్తాడని ఎదురు చూసిన ప్రేక్షకులు, అతనేం చేస్తున్నాడో తెలియని అయోమయానికి గురయ్యారు రెండో సగంలో. సస్పెన్స్ లని ముడి వేయడంలో చూపిన శ్రద్ధ వాటిని విప్పడంలో కూడా చూపి, లాజిక్ కి అందే విధంగా కథ రాసుకుని ఉంటే ఖచ్చితంగా చాలా మంచి సినిమా అయి ఉండేది. సస్పెన్స్, థ్రిల్లర్ లని ఇష్టపడే వాళ్ళు చూడొచ్చు ఈ 'వైశాలి' ని.

శుక్రవారం, మే 27, 2011

ఎసరూ-అత్తిసరూ

అనగనగా ఎనభై ఏళ్ళు దాటిన ఓ పర్వత వర్ధనమ్మ. గోదారి గట్టునానుకున్న వీధిలో ఉన్న ఓ పెంకుటింట్లో ఆవిడ నివాసం. తనకంటూ మిగిలింది ఒక్కడే, మనవడు భాస్కరం, ఓ చిరుద్యోగి. అతగాడికి కమలనిచ్చి పెళ్లి చేసి బాధ్యత తీర్చేసుకుంది వర్ధనమ్మ గారు. మనసు కష్టపడినప్పుడల్లా రేవుకేసి వెళ్లి గోదావరిని చూస్తూ కూర్చోవడం అలవాటు ఆవిడకి. చల్లని గోదావరి ఇట్టే ఆమె మనస్సును కుదుటబరుస్తుంది. భరించలేని కష్టాలని ఎదుర్కొనే శక్తి ఆమెకు ఆరు పుష్కరాలుగా ఆ గోదావరి ఇచ్చింది.

గోదావరికి వరదొస్తే చాలు వర్ధనమ్మకి కాళ్ళు నిలబడవు. వరదలో కొట్టుకువచ్చే కంప, కలపనీ ఈది పట్టుకోడానికి కూలీల్ని పురమాయించి ఏడాదికి సరిపడే వంట చెరకు చేరేసుకుంటుంది. పొద్దున్నే ఓ కుంచెడు బియ్యం వార్చి పాత చింతకాయో, మాగాయి పచ్చడో వేసి కూలీలకి పెట్టడం, వాళ్ళు ఈది పట్టిన దుంగల్ని గట్టుకు చేరేయడం,
వాటిని నరికించి పెరట్లోకి సమర్ధించడం వరద రోజుల్లో ఆవిడ వ్యాపకం. కిరాయి ఎంత యిస్తే అంత సరిపెట్టుకోవడం కూలీలకు రివాజు. "నాకసలు డబ్బే వద్దు. సందేల మరోసారి వేడిగా పట్టెడన్నంపెడితే చాలు" అనే వాళ్ళలో సత్తిగాడొకడు.

నాలుగు రోజులుగా పట్టిన ముసురు ఆవేళే తెర తీసింది. పూర్తిగా తెల్లారక ముందే "వర్ధనమ్మ గోరూ.. వర్ధనమ్మగోరూ" అని కేకలేసుకుంటూ వచ్చేశాడు సత్తిగాడు. "అదేంటి మామ్మగోరూ ఇంకా తొంగున్నారు. లెగండి. గోదారి పొంగేసినాది. వడి మాంచి పోటుగా ఉంది" అంటూ వర్ధనమ్మతో పాటు, పడుచు జంటనూ నిద్ర లేపేశాడు. అప్పటికే జాలరిపేట జనమంతా తెప్పలుచ్చుకుని ఏట్లోకి దూకేశారు. ఆరు నేరేడు దుంగల్ని, మూడు మద్ది దూలాల్ని అంకాలమ్మ రేవుకి చేరేశారు. ఇది సత్తిగాడు చెప్పిన సమాచారం.

సూర్య భగవానుడు కనిపించని కారణంగా నాలుగురోజులుగా ఉపవాసం ఉన్న వర్ధనమ్మ, పెరడంతా శుభ్రం చేసి నీళ్ళ పొయ్యిమీద కుంచం గిన్నెతో ఎసరు పడేసింది. కూని రాగాలు తీస్తూ మానెడు బియ్యం ఎసట్లో పోసి దేవేస్తోంది. "నాలుగు రోజుల ఉపవాసం బాపతు తిండి ఇప్పుడొక్కసారే లాగించేస్తుంది కామోసు ఈవిడ," అని కమల బుగ్గలు నొక్కుకోగా, "పాపం, నాలుగురోజులుగా పస్తుంది. ఆకలి వెయ్యదూ మరి" అని జాలిపడతాడు భాస్కరం. అయితే, వార్చిన మరుక్షణం సెగలు కక్కుతున్న అన్నాన్ని మాగాయితో సహా సత్తిగాడి విస్తట్లో వడ్డించేసింది వర్ధనమ్మ.

పాతికేళ్ళ సత్తిగాడు తినగలిగినంతా వడ్డించడమే కాదు, వార్చిన గంజిలో ఉప్పుకల్లేసి తాగడానికి ఇచ్చింది కూడా. విస్తరి దగ్గర కబుర్లలో తనకి తనవాళ్లెవరూ లేరనీ, పిడకలమ్ముకునే పైడమ్మ తనని ఉంచుకుందనీ బామ్మగారికి చెబుతాడు సత్తిగాడు. భోజనం ముగించి రేవుకి బయలుదేరతాడు, ఎప్పటిలాగా చింత, తుమ్మ కాకుండా టేకు, ఏగిస వర్ధనమ్మగారి పొయ్యిలో ఈ ఏడు మండాలంటూ. "అడ్డగాడిదలందరికీ సంతర్పణ ఏమిటం"టూ బామ్మని కేకలేస్తాడు భాస్కరం. "ఇలా అన్నం అమ్మి పుల్లలు కొనడం మా ఇంటా వంటా లేద"ని దెప్పి పొడుస్తుంది కమల.

ఎసట్లో తనకో గిద్దెడు బియ్యం పడేసుకోడానికి కూడా ఓపిక లేకపోయిన వర్ధనమ్మ, అలసిపోయి తులసికోటకి జేరబడుతుంది. పెరట్లోనుంచి వచ్చిన పైడమ్మ తెచ్చిన కబురు కారణంగా ఆమెలో చిన్నగా అనుమానం మొదలై, భయంగా మారి, ఏదో కీడు శంకించి ఆందోళనలోకి దిగింది. నాలుగు రోజులుగా లంఖణాలతో మంచానికంటుకు పోయిన సత్తిగాడు నిన్న రాత్రే కాస్త జ్వరం తగ్గి మనిషయ్యాడన్నదే ఆ కబురు. అప్పటికే నీరసించిన వర్ధనమ్మ గోదారి గట్టుకి బయలుదేరి "సత్తిగా" అంటూ గొంతు చించి అరుచుకుంటూ వెతకడం మొదలు పెట్టింది.

సత్తిగాడికి ఏమయ్యింది? వర్ధనమ్మ కథ ఏ కంచికి చేరింది? ఆవిడ చేతి భోజనానికి ఉన్న మహత్తు, విలువ ఏమిటి? భాస్కరం-కమల దానిని అర్ధం చేసుకోగలిగారా? ఇత్యాది ప్రశ్నలకి హృద్యమైన జవాబులిస్తూ ముప్ఫై ఏళ్ళ క్రితం తను రాసిన 'ఎసరూ-అత్తిసరూ' కథని ముగించారు బి.వి.ఎస్. రామారావు. గోదావరి నేపధ్యగా ఈయన రాసిన పదమూడు కథల సంకలనం 'గోదావరి కథలు' సంపుటంలో రెండో కథ ఇది. అన్నట్టు 'పుష్కరాలరేవులో పుల్లట్లు' కథ కూడా ఈ సంకలనం లోనిదే.

గురువారం, మే 26, 2011

(ఉ)గ్రామ సింహాలు

రోజులెలా మారిపోయాయో.. సింహానికి భయపడని మగధీరులు సైతం గ్రామసింహం పేరు చెప్పగానే ఉలిక్కి పడుతున్నారు. ఉగ్ర రూపం దాల్చిన గ్రామసింహాలు అంతగా భయపెట్టేస్తున్నాయి అందరినీ. పిల్లలాడే దొంగాటలో దాగి ఉండి వెనుక నుంచి 'భౌ' అంటూ ఉరికే ఆటని నిషేధించాల్సిన రోజులు వచ్చేసినట్టే ఉన్నాయి. ఇప్పుడలా ఎవరితోనన్నా సరదాకి భౌ అన్నా, అవతలి వాళ్ళు స్పృహ తప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

జంతు రక్షణ సంస్థల కార్యకలాపాలు విస్తరించిన ఫలితంగా, వీధికుక్కల సంఖ్య బాగా విస్తరించింది. ఇప్పుడిప్పుడు ఎందెందు చూసిన అందందే తోకూపుకుంటూ శునకాలు చేసే సందడి కనిపిస్తోంది. మునిసిపాలిటీ కుక్కలబళ్ళు దాదాపు అదృశ్యం అయిపోగా, కుక్కల్ని నేర్పుగా పట్టుకుని బండిలో వేసి పొట్టపోసుకునే వాళ్ళు ఇతరత్రా వృత్తులకి మళ్ళిపోయారు. ఫలితంగా కుక్కలన్నింటికీ ఓ రోజొచ్చింది.

కుక్కల్ని చంపొద్దని ఉద్యమాలు చేసిన సంస్థలు, ప్రత్యామ్నాయం ఏమిటన్నది చెప్పలేదు. ఎవరూ చెప్పనప్పుడు ఎందుకు పట్టించుకోవడం అనుకున్నారో లేక సమస్య వచ్చినప్పుడు చూసుకుందాం అనుకున్నారో కానీ ఏలిన వారుసైతం ఎప్పటిలాగే దూరదృష్టి చూపలేదు. బట్టకట్టక పోయినప్పటికీ బతికి ఊపిరి పీల్చుకున్న కుక్కలన్నీ తోచీతోచకా రోడ్లమీద తిరుగుతూ పిక్క కనిపించిందే తడవుగా చటుక్కున కొరికి పారేస్తున్నాయి.

కుక్కకాటు వల్ల సంక్రమించే రేబిస్ వ్యాధి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా యాభై ఐదువేల మంది కన్నుమూస్తున్నారట.. వీళ్ళలో అక్షరాలా ఇరవై రెండువేల మంది భారత దేశంలో తనువు చాలిస్తున్నారట. ఇవి అధికారిక గణాంకాలు. వాస్తవ సంఖ్యలు ఇంతకన్నా కొంచం ఎక్కువ ఉండొచ్చేమో కానీ, తక్కువ మాత్రం ఉండవు. ఈ లెక్క ప్రకారం ప్రతి పది నిమిషాలకీ ఓ రేబిస్ మరణం సంభవిస్తోంది. నాటుగా చెప్పాలంటే జనం కుక్కచావు చస్తున్నారు.


ఓ పక్క శునకాలు వీధుల్లో వీర విహారం చేస్తుండగా మరో పక్క మన ఆస్పత్రుల్లో యాంటీ-రేబిస్ వ్యాక్సీన్స్ అందుబాటులో లేవు. సకాలంలో వ్యాక్సిన్ అందని కారణంగా ప్రాణాలు పోయిన వైనం ప్రముఖంగా వార్తల్లోకి వచ్చాక ప్రభుత్వంలో చలనం మొదలయ్యింది. మొత్తానికి వ్యాక్సీన్లయితే అందుబాటులోకి వస్తున్నాయి కానీ, కుక్కకాటు బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మనుషులే కాదు, మూగజీవాలూ ఈ కాటుకు బలవుతున్నాయి.

జీవకారుణ్యం చూపి శునకాలని చంపకుండా ఆపుతున్నారు సరే. మరి వాటిని ఇలా జనం మీదకి వదిలేయడమేనా? కుక్కలన్నింటికీ యాంటి-రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో, శునకాలకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అనే ప్రతిపాదన ఒకటి ఆ మధ్యన వినిపించింది. దానికి కూడా యేవో అడ్డంకులు వచ్చాయి. ఏదో ఒకటి చేసి ప్రజల ప్రాణాలని గ్రామ సింహాల బారినుంచి కాపాడాల్సిన బాధ్యత మాత్రం ఏలినవారి మీద ఉంది. ఎందుకంటే ఇదేమీ చిన్నాచితకా సమస్య కాదు.

ఒకవేళ మన సర్కారు స్పందించే లోగానే మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరైనా కుక్కకాటు బారిన పడితే? ముందుగా గాయమైన ప్రదేశాన్ని ట్యాప్ కింద ఉంచి, నీళ్ళు ధారగా పడేలా ట్యాప్ తిప్పి గాయాన్ని బాగా కడగాలి. మామూలు నీళ్ళతోనూ, సబ్బుతోనూ మళ్ళీ మళ్ళీ కడిగాక, యాంటీ-సెప్టిక్ క్రీమ్ లేదా లోషన్ పూసి, కట్టు కట్టకుండా వదిలేయాలి. వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.

ఇదివరకటిలాగా ఇప్పుడు బొడ్డు చుట్టూ పద్నాలుగు ఇంజక్షన్ల బాధ లేదు, మూడు నెలల వ్యవధిలో ఆరు ఇంజెక్షన్ల కోర్సు తీసుకోవడం ద్వారా రాబిస్ బారిన పడకుండా బయట పడొచ్చు. పన్నెండు వారాల వయసు దాటిన పెంపుడు కుక్కకి ఏడాదికోసారి యాంటి-రేబిస్ వ్యాక్సిన్ వేయించడం మరిచిపోకూడదు. మన కుక్కే కదా అని ఊరుకోవడం అస్సలు మంచిది కాదు. ఏమో, మనం ముద్దు చేసినప్పుడు దానికి సరదాగా కరవాలనిపిస్తే.....

బుధవారం, మే 25, 2011

కొంచం..కొంచం...

మనక్కావాల్సింది ఏదైనా సమృద్ధిగా దొరకడం బాగుంటుందా? లేక కొంచం కొంచంగా దొరకడమే మంచిదా? 'సమృద్ధిగా' ఆప్షన్ కి వందశాతం వోట్లు పోలై ఉంటాయి. కానైతే అలా కావల్సినంతా దొరికేయడం అన్నది ఏ రకంగా చూసినా అంత సమర్ధనీయం కాదనిపిస్తూ ఉంటుంది నాకు. కావాల్సింది సాధించేశాం.. తర్వాత? అదే, పూర్తిగా దొరకని పక్షంలో, మన కృషి కొనసాగుతూనే ఉంటుంది కదా. పైగా, మనకి కావాల్సిన దానిమీద ఆసక్తి అంతకంతకూ పెరుగుతూ ఉంటుంది కూడా.

ఆర్ధిక శాస్త్రంలో డిమాండ్ అండ్ సప్లై సూత్రం మొదలుకొని, గబుక్కుని పేరు జ్ఞాపకానికి రాని అదేదో మామిడిపళ్ళ సిద్ధాంతం వరకూ, ఏవీ కూడా సమృద్ధిగా దొరకడాన్ని సమర్ధించడం లేదు. సప్లై పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. అంటే ఏమిటన్న మాటా, ఆసక్తి తగ్గిపోతుంది. అలాగే మొదటి మావిడి పండు తిన్నప్పుడు కలిగిన తృప్తి కన్నా, రెండో మామిడి పండు తిన్నప్పటి తృప్తి, దానికన్నా మూడో మామిడిపండు తిన్నప్పుడు కలిగే తృప్తి తగ్గుతూ వస్తుంది. ఇది క్రమ క్షీణోపాంత సిద్ధాంతం అనుకుంటా.

మన శతక కారులు కూడా కొంచముండడాన్నే సమర్ధించారు. సందేహమైతే 'గంగిగోవు పాలు గరిటెడైనను చాలు..' ఇంకా '....కొంచముండుటెల్ల కొదవ కాదు' తదితర పద్యాలని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి, మనక్కావాల్సింది పూర్తిగా దొరకలేదన్న చింత వలదు. అలాగని ఈ కొంచాన్ని తక్కువ చేసి చూడడం కూడా అస్సలు సరైన పని కాదు. 'సూక్ష్మం లో మోక్షం' లాంటి వాడుకలు ఊరికే పుట్టలేదన్నది ఇక్కడ గమనించాల్సిన విషయం.

అసలైతే 'నిదానమే ప్రధానము' లాంటి సూక్తులన్నీ ఈ కొంచాన్ని సమర్ధించేవే. పరిగెత్తి పాలు తాగడం కన్నా, నిలబడి నీళ్ళు తాగడం ఉత్తమం అన్నది ఎంత గొప్ప వాడుక అసలు? అలాగే 'అన్నప్రాశన నాడే ఆవకాయ తినిపించడం' అన్నది కూడా. ముందుగా తినడం నేర్పి, ఆ తర్వాత రుచులు మప్పి, ఆపై నెమ్మదిగా ఆవకాయ అలవాటు చేయాలే తప్ప, మొదలే ఆవకాయతో మొదలు పెట్టకూడదన్న మాట. అన్నట్టు 'రుచిగలదని మిక్కిలి తినరాదు' సూక్తి కూడా కొంచాన్నే సపోర్ట్ చేస్తోంది.

ఈ కొంచం విలువే వేరు.. వర్షాకాలంలో రోజూ వానోస్తుంది, పట్టించుకుంటామా? అదే మండు వేసవిలో నాలుగు చినుకులు రాలితే 'మహా ప్రసాదం' అనుకోమూ? అలాగే, ఇప్పుడు ఎండలని విసుక్కున్నా, రేప్పొద్దున్న చలికాలం వచ్చేస్తే ఎండ కోసం ఎదురు చూడమూ? కొంచాన్ని గురించి నాలుగు మంచి మాటలు చెప్పిన పెద్దోళ్ళే 'అతి సర్వత్ర వర్జయేత్' అన్నారు సంస్కృతంలో. దీని భావమేమి తిరుమలేశా అంటే, అతి ఎప్పుడూ కూడా పనికి రాదు అని. మాట వెండి అయితే మౌనం బంగారం అన్న వాడుకని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.

కొంచమే దొరకడం అన్నది మనకి అవసరాలని కుదించుకోవడం నేర్పుతుంది. అంటే చాప ఉన్నంత మేరకే కాళ్ళు జాపుకోవడం అన్నమాట. పైగా, కావాల్సింది సాధించుకోవాలన్న తపనని పెంచుతుంది. ఎవరో వడ్డించిన భోజనం పళ్లాన్ని మన చేతికి ఇవ్వడానికీ, మనమే ఒక్కటీ వడ్డించుకోడానికీ ఒకటే భేదం ఉంది.. అది 'తృప్తి.' మాటలకందనిదీ, అనుభవానికి మాత్రమే వచ్చేదీ. కాబట్టి కొంచం లోని ఆనందాన్ని కొంచం కొంచంగా ఆస్వాదిద్దాం.

మంగళవారం, మే 24, 2011

ఇంగ్లిష్ సుజాతగారి కబుర్లు

ఇంగ్లిష్ సుజాత గారికి చాలా విషయాలు తెలుసు. కానీ అలా తెలుసన్న విషయం బహుశా ఆవిడ ఒప్పుకోరు. ఈ ఒప్పుకోకపోవడంతో మనకేమీ పేచీ లేదనుకోండి. తనకి తెలిసిన విషయాలని ఆవిడ అప్పుడప్పుడూ, కొంచం పొదుపుగా, పంచుకుంటూ ఉంటారు. వినేసి గంభీరంగా తలాడించొచ్చు లేదా మనం ఏమనుకుంటున్నామో నిరభ్యంతరంగా మరియు గాట్టిగా చెప్పేయొచ్చు. ఆవిడ ఏమీ అనుకోరు. మీకిప్పుడు ఇంగ్లిష్ సుజాతగారిని కలవాలని ఉంది కదా.. ఈ బుల్లెమ్మని చూసి దిష్టి కొట్టకుండా, హలో చెప్పండి. వీళ్ళమ్మ గారే మన ఇంగ్లిష్ సుజాత గారు.

'కొన్ని పరిచయాలు చాలా చిత్రంగా మొదలవుతాయి' అని నేనే అప్పుడెప్పుడో బ్లాగు గుద్ది చెప్పాను గుర్తుందా? ఇంగ్లిష్ సుజాతగారితో నా పరిచయం కూడా అంతే. అప్పట్లో అంటే దాదాపు ఓ మూడేళ్ళ క్రితానికి కుంచం అటూ ఇటూగా, బ్లాగులు కొత్తగా పరిచయమై దొరికిన బ్లాగు దొరికినట్టుగా చదివేస్తూ ఉండగా అనుకోకుండా జరిగింది పరిచయం. అప్పట్లో (ఆమాటకొస్తే ఇప్పటికీ) సుజాత పేరుతో ఇద్దరు బ్లాగర్లు ఫేమస్. ఈవిడ తన పేరుని ఇంగ్లిష్ లో రాసుకుంటారు. అందుకని నేను గుర్తు కోసం 'ఇంగ్లిష్ సుజాతగారు' అనుకోవడం మొదలు పెట్టాను.

ఊరూరికే అలా అలా ఆవిడ కబుర్లు వింటూ వింటూ (అంటే టపాలు చదువుతూ చదువుతూ అన్నమాట) ఇక్కడ ఒక్కసారి ఆగిపోయాను. 'గాడ్...' మొదటి సారి నాకు మాటల్లేవు. మళ్ళీ మళ్ళీ చదివాను. ఆవిడకి చెప్పనంటే ఓ నిజం చెబుతాను. ఈ వీరగాధ సిరీస్ ని మార్క్ చేసి పెట్టుకుని, అప్పుడప్పుడూ నేను 'డౌన్' అని ఫీలైనప్పుడల్లా నిశ్శబ్దంగా వెళ్లి మరోసారి చదివేసి వచ్చేస్తూ ఉంటాను. చెప్పొద్దని ఎందుకన్నానంటే, ఆ టపాల ఉద్దేశ్యం 'అలాంటి' సమస్య ఉన్నవారికి ఉపయోగపడడం మాత్రమే అని ఆవిడ గట్టిగా చెప్పేశారు మరి.

నాకు కొందరు మంత్రులు, నాయకులూ అంటే భలే చిరాకు. హాశ్చర్యంగా, మన ఇంగ్లిష్ సుజాతగారికి కూడా అంతే. మచ్చుకి కావాలంటే, ఆవిడకి జైరాం రమేశ్ అంటే అషియం. ఇదొక్కటేనా? పుస్తకాలు, సినిమాలు, జాతీయ, అంతర్జాతీయ విషయాలు... ఇలా చాలా బోల్డన్ని విషయాల్లో ఈవిడ అభిప్రాయాలు నా అబ్బిప్పిరాయాలకి దగ్గరగా అనిపిస్తాయి. అందుకని నేనీవిడ కబుర్లని వీలైనంత వరకూ మిస్సవ్వను. మీడియా, వార్తల వ్యాపారం గురించైతే ఈవిడ చెప్పిన వాటికి నేను డిట్టో కొట్టేస్తే చాలన్నమాట.

సుజాత గారి కబుర్లు వింటూ వింటూ ఉండగా నాకు వాళ్ళింటికి టీకి వెళ్ళాలన్న కోరిక మొలకెత్తింది. అసలు ఎన్నిరకాల టీలు? జన్మ ధన్యమన్న మాట కదా? మెట్రో మాన్ ని పరిచయం చేసినా, టీవీ భక్తి గురించి సెటైర్లు వేసినా, బాసు లీలల్ని వర్ణించినా, మానవ మనస్తత్వాలని ముసుగు తీసి చూపించినా ఆ కబుర్లు అలా అలా వింటూ ఉండిపోవాలని అనిపిస్తుంది. బోల్డన్ని సీరియస్ విషయాలు చెప్పేసి, వాటిని 'సిల్లీ కబుర్లు' అని అనగలగడాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలి.

నాలుగేళ్ల క్రితం తనకిష్టమైన ఇండియన్ ఆర్మీ కమర్షియల్ గురించి చెబుతూ కబుర్లకి శ్రీకారం చుట్టిన ఇంగ్లిష్ సుజాతగారు తొలి సంవత్సరం నూట పందొమ్మిది టపాలు రికార్డు చేశారు. రెండో సంవత్సరానికి ఆ సంఖ్య ముప్ఫై ఐదుకి పడిపోగా, మూడో సంవత్సరంలో ముప్ఫై రెండు దాటనంది. అయితే, ఈ విషయాలేవీ అస్సలు ప్రస్తావించకుండా చాలా గడుసుగా 'నో కామెంట్ల బ్లాగర్ల సంఘం' మొదలుపెట్టి దానిని సైలెంట్ గా సూపర్ హిట్ చేసేశారు. కబుర్లు మాత్రమేనా? పుటోలు, పోయెట్రీ, వీడియోలు, పాటలు.. అబ్బో.. చాలా విషయాలే ఉన్నాయ్. తన గురించి Confused, irritating and impulsive అని మూడు ముక్కల్లో తేల్చేశారు.. ఏమంటాం?

గడ్డిపూలని మర్చిపోకుండా అప్పుడప్పుడూ నీళ్ళు చిలకరిస్తూ ఉండడంతో పాటు, తన కబుర్లలో తనకి నచ్చిన వాటిని గుది గుచ్చి అందించారు కూడా. రెగ్యులర్గా కబుర్లు చెప్పరేం? అని గట్టిగా నిలదీద్దామంటే, మనకా అవకాశం ఇవ్వకుండా ఆదివారం కూడా తనెంత బిజీనో ముందే చెప్పి మన నోటికి తాళం వేసేశారు. ఈమధ్యనే సూపర్ ఉమన్ సిండ్రోం నుంచి బయట పడ్డ ఇంగ్లిష్ సుజాతగారు, ఏదోలా కొంచం చెయ్యి ఖాళీ చేసుకుని అడపాదడపా అయినా కాసిన్ని కబుర్లు చెబితే వినాలన్నది నా కోరిక.. మీరేమంటారు?

సోమవారం, మే 23, 2011

ఇల్లాలి ముచ్చట్లు

పుస్తకాల షాపుకి వెళ్ళినప్పుడు కంటికెదురుగా మనకి నచ్చిన పుస్తకం కనిపిస్తే వెంటనే కొనేయాలనీ, "చాలా కొన్నాం కదా.. మళ్ళీసారి చూద్దాం" అని అస్సలు అనుకోకూడదనీ కొన్ని అనుభవాల తర్వాత తెలుసుకున్నాను. ఆ కొన్నింటిలో ఒకానొక అనుభవాన్ని ప్రసాదించిన పుస్తకం పురాణం సీత రాసిన 'ఇల్లాలి ముచ్చట్లు.' ఈపేరు తలచుకోగానే కుంపటి దగ్గర కూర్చున్న స్త్రీమూర్తి బొమ్మ, బాపూ గీసింది, గుర్తుకొచ్చేస్తుంది. 'ఆంధ్రజ్యోతి' లో ప్రతివారం అదే బొమ్మ, ముచ్చట్లు మాత్రం ఓ వారానికీ మరో వారానికీ అస్సలు సంబంధం లేని విధంగా సాగాయి.

నిజానికి ఈ పుస్తకం ఆసాంతమూ ఓసారి చదివేసి, ఆ తర్వాత పక్కన పెట్టేసేది కాదు. ఫస్ట్ రీడింగ్ కాగానే, కొంచం అందుబాటులో పెట్టుకుని అప్పుడప్పుడూ చేతిలోకి తీసుకుని కనీసం కాసిన్ని పేజీలైనా తిప్పాల్సిన పుస్తకాల జాబితాలోది. పంతొమ్మిది వందల అరవైలో మొదలై తర్వాత మూడు దశాబ్దాల పాటు వారం వారం నిర్విరామంగా ప్రచురితమైన 'ఇల్లాలి ముచ్చట్లు' కాలమ్ నుంచి ఎంపిక చేసిన నూటయాభై తొమ్మిది ముచ్చట్లను సంకలించి మార్కెట్లో పెట్టారు నవోదయ బుక్ హౌస్, కాచిగూడ, హైదరాబాద్ వారు.

అసలు ఇల్లాలు అనగానే వెంటనే స్ఫురణకి వచ్చేవి వంటా వార్పూ, ఇరుగమ్మలు, పొరుగమ్మలతో ముచ్చట్లతో కాలక్షేపం చేసే స్త్రీజనం. కానైతే మన సీత వీళ్ళ కన్నా భిన్నమని బాపు చెప్పకనే చెప్పేశారు. అవడానికి కుంపటి దగ్గరే కూచుంటుంది కానీ, మొత్తం భూగోళాన్నే బాండీలో వేగించి తీయగల సమర్దురాలీవిడ. ఆవకాయ నుంచి అంతరిక్షం వరకూ, చీర సారెల నుంచి చదరంగం వరకూ సీతకి తెలియని విషయం లేదు. పైగా, దేనిగురించైనా సాధికారికంగా మాట్లాడగల తెలివితేటలూ, తను చెప్పదలచుకున్న విషయాన్ని అందరిచేతా ఒప్పించగల నైపుణ్యం ఈవిడ సొంతం.

గోదారి జిల్లా పల్లెటూళ్ళో బాల్యాన్ని గడిపి, బావని కొంగుకి ముడేసుకుని, అతనితో పాటు కాపురానికి ఎన్నో మహానగరాలు తిరిగి తిరిగి బెజవాడ వచ్చి స్థిరపడ్డ సీతమ్మ ముచ్చట్లలో ప్రధానంగా కనిపించేవి రెండే రెండు -- కష్టం, సుఖం. మరి ఇవే కదా జీవితం. ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఊరికే కూర్చుని బాధపడిపోకుండా, ఓసారలా జ్ఞాపకాల్లోకి వెళ్లి సంతోషంగా గడిపిన రోజుల్ని గుర్తు చేసుకుని రీచార్జ్ అయ్యే టెక్నిక్ కొందరు ఇల్లాల్లకి తెలియక పోవచ్చేమో కానీ, పురాణం సీతకి మహబాగా తెలుసు.

అలా గుర్తు చేసుకున్నవే తన చిన్న నాటి ఆటలూ, వయసొచ్చాక బావని గురించిన ఆలోచనలూ, అతగాడి కోసం చూసిన ఎదురు చూపులూ అన్నీను. ఇంగ్లీషు పెద్దగా రాదంటూనే, పెద్ద పెద్ద రచయితల్ని, కవుల్నీ ఉటంకించేస్తూ కబుర్లు చెప్పేస్తుంది. కృష్ణశాస్త్రి అన్నా, సైగల్ అన్నా సీతకి ఎంత ఇష్టమో చెప్పలేం. ఆచారాల్లో కొన్నింటిని ఉతికి ఆరేసేటప్పుడు, జనం అవలక్షణాలని చీల్చి చెండాడేటప్పుడూ అపర కాళికే అవుతుందీ సుకుమారి. 'కన్నె మనసులు' గురించి ఎంత సుకుమారంగా చెబుతుందో, 'గేదె మనసులు' గురించి అంత వ్యంగ్యంగానూ చెప్పగలదు.

అసలు అవతలివాడు ఎంతటి వాడన్నది లెక్కచేయకుండా సెటైర్లు వేయడంలో సీతకి సీతే సాటి. ఈవిషయంలో దేవుడైనా, పతిదేవుడైనా సీతకి సమానమే. అంతలోనే 'పెళ్ళాన్ని విమర్శించకు' అంటూ మగ మహారాజులకి పాఠం చెప్పేయగలదు. విషయం ఏదన్నా కానీ, దానిక్కొంచం వగరూ, పొగరూ జోడించి చదివిన వాళ్లకి మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేలా రాసవతల పారేసిందంతే. కాకపొతే చదివేటప్పుడు అక్కడక్కడా ఆ అక్షరాల వెనుక 'మగ' హృదయం కనిపిస్తే అదే చదివేవాళ్ళ తప్పు కాదు.

ఎందుకటే, ఈ ముచ్చట్లని రాసింది ప్రసిద్ధ పత్రికా సంపాదకుడు, రచయిత పురాణం సుబ్రహ్మణ్య శర్మ. తన భార్య సీత పేరిట నడిపారీ కాలమ్ ని. నిజానికి ఓ పురుషుడు ముప్ఫయ్యేళ్ళ పాటు నడిపిన కాలమ్ లో ఎక్కడో తప్ప రాసింది స్త్రీ కాదేమో అనే సందేహానికి తావులేని విధంగా రాయడం అంటే అంత ఆషామాషీ విషయమేమీ కాదు. ఇందుకని చెప్పి రచయితని అభినందించి తీరాలి. ఆఫ్కోర్స్, పురాణం సీత ఫ్యాన్ క్లబ్ చాలా పెద్దది. నార్ల వెంకటేశ్వర రావు, కొడవటిగంటి కుటుంబరావు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి, నండూరి రామ్మోహన రావు వంటి వారంతా మొదటి వరసలో ఉన్నారు. వారి వెనుక మనమూ చేరి తీరతాం, నిస్సందేహంగా.. (పేజీలు 402, వెల రూ.150, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

ఆదివారం, మే 22, 2011

మల్లెపూలు-మామిడిపళ్ళు

నాకు అస్సలు నచ్చని కాలం ఎండాకాలం. ఇప్పుడనే కాదు, చిన్నప్పటినుంచీ అంతే.. వర్షాకాలమైతే చక్కగా వర్షం వస్తుంది.. యెంతో బాగుంటుంది. ఇంక చలి కాలమైతే చెప్పక్కర్లేదు. వెచ్చగా రగ్గు కప్పుకుని పడుకోడం.. బోల్డన్ని టీలూ కాఫీలూ తాగుతూ రోజులు గడిపేయడం.. అసలా చలి రోజులే వేరు. ఇంక ఈ వేసవి కాలం వచ్చిందంటే ఒకటే వేడి, ఉక్క, చెమట, వడదెబ్బ... అబ్బబ్బ అన్ని అవలక్షణాలూ ఈకాలానికే.

చిన్నప్పటి బడి సెలవుల ఆనందాన్ని మినహాయిస్తే, ఇప్పటికీ కేవలం రెండంటే రెండే కారణాల వల్ల వేసవిని క్షమించేస్తాను నేను. నేనంటే నేననే కాదు, చాలామంది కూడా ఇందుకే క్షమించేస్తారని నా అబ్బిప్పిరాయం. ఆ రెంటిలో మొదటిది మల్లెపూలు కాగా రెండోది మామిడిపళ్ళు. అసలు మల్లెపూలు అని పలకడంతోటే మనసు 'మనసున మల్లెల మాలలూగెనే' అని పాడేసుకుంటోంది.. ఇంకోపక్క 'మల్లెలు పూసే..వెన్నెల కాసే..' పాట నేనున్నానంటోంది.

నా చిన్నతనంలో మా వీధిలో ఓ మల్లె చెట్టు ఉండేది.. 'మల్లంటు' అనేవాళ్ళం. ఉగాది పండుగ వెళ్ళడంతోనే మల్లంటు ఆకులన్నీ దూసేసి, రోజూ సాయంత్రాలు బోల్డు బోల్డు నీళ్ళు పోసేస్తే చక్కగా కొత్త చిగుళ్ళు వచ్చేసి, మొగ్గ తొడిగేసేది. అసలు మల్లెమొగ్గలు కోయడం ఓ కళ. చెట్టు చుట్టూ ఓ నాలుగైదు సార్లు తిరిగి, పెద్ద మొగ్గల్ని కళ్ళతో గుర్తు పట్టి, ఆ తర్వాత నూతి దగ్గరకి వెళ్లి చేతులు బాగా కడుక్కొచ్చి, అప్పుడు ఒక్కో మొగ్గనీ కోసి గిన్నెలో వెయ్యాలి.

ఒక్కోసారి మా మల్లంటు ఎన్ని మొగ్గలేసేదంటే, చూడ్డానికి మల్లె చెట్టుకి తెల్ల చీర కట్టినట్టు ఉండేది. అన్నట్టు మా ఊరి రికార్డింగు డేన్సులో వన్స్ మోరేసిన "ఇదిగో తెల్ల చీర..ఇవిగో మల్లెపూలు" పాటకి విజిలేయడం నేనున్నానంటూ జ్ఞాపకానికి వచ్చేసింది. అసలు యవ్వనానికీ మల్లెపూలకీ అవినాభావ సంబంధం. ఆడ-మగ అన్న భేదం లేకుండా యవ్వనంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇష్టపడే పువ్వు మల్లెపువ్వేనని నా మరో అబ్బిప్పిరాయం. కేవలం మల్లెల కోసమన్నా వేసవిలోనే పెళ్లి చేసుకోవాలని తీర్మానించేసుకున్నరోజులున్నాయి మరి.

పైకంత అందంగా కనిపించే మల్లెపూలు ఎంత మోసకారులో పెళ్ళైన ఏ మగవాడినడిగినా చెబుతాడు. జాయి జాయిగా జరిగిపోయే జీవితంలోకి ఒక్కసారిగా బాధ్యతలు వచ్చి పడిపోవడం వెనుక జరిగే కుట్రలో మల్లెల పాత్ర తక్కువదేమిటి? ఇంక చేసేదేముంది.. మల్లెల్ని తిట్టడానికి మనసు రాదు. "మగాడన్నాక..." అనుకుని నిట్టూర్చేయడమే. అదర్ వైజ్, 'మల్లియలారా.. మాలికలారా..' అని మూగగా పాడుకునే అవకాశం కూడా ఉంది.

మామిడిపళ్ళ విషయానికి వస్తే చిన్నప్పుడు వీటిమీద నాకు ప్రత్యేకమైన ఇష్టం ఏమీ ఉండేది కాదు. వేసవి వస్తే చాలు ఇంట్లో ఏ మూల చూసినా ఇవే కనిపించేవి. అదీకాక, "అమ్మా... ఆకలి" అనడం పాపం, అమ్మ వెంటనే ఓ పండు చేతిలో పడేసేది, ఉదారంగా. ఇంటి పక్కన కలక్టర్ మావిడి చెట్టు ఉండేది.. కావలసినన్ని కాయలు, తిన్నన్ని పళ్ళు. అందుకేనేమో, చిన్నపిల్లలు చేసే మామిడికాయల దొంగతనాలు వింతగా అనిపించేవి నాకు. మామిడి పళ్ళ తాలూకు రకరకాల రుచులని గ్రహించడానికి కుంచం పెద్దయ్యేవరకూ ఆగాల్సి వచ్చింది. రసాలా? బంగినపల్లా? ఏదిష్టం? అనే ప్రశ్నకి ఇప్పటికీ నాదగ్గర జవాబు లేదు. దేనికదే సాటి మరి.

అసలయితే, కొత్తావకాయ అన్నంతో బంగినపల్లి ముక్కలు మాంచి కాంబినేషన్. అలాగే గేదె పెరుగు, మాగాయ, రసం పండు కూడా. మనింట్లో మనం స్వేచ్చగా తినడానికి రసానికి మించిన పండు లేదు. అదే ఎక్కడైనా షోగ్గా తినాలంటే మాత్రం బంగినపల్లికీ జై అనాల్సిందే. మార్కెట్ కి వెళ్ళామంటే మనం ఎప్పుడూ వినని కొత్త పేర్లు పెట్టిన పళ్ళు మనకి అమ్మేస్తారు. బంగినపల్లిలో పద్నాలుగు రకాలు, తోతాపురి లో ఏడెనిమిది రకాలు...ఒకటా, రెండా.. మామిడిపళ్ళు-సినిమా పాటలు అనగానే మొదట గుర్తొచ్చేది అన్నగారు దుమ్మురేపిన "మావిళ్ళ తోపుకాడ పండిస్తే.."

నా అదృష్టం ఏమిటో కానీ, ప్రతి సంవత్సరం అస్సలు ఊహించని వారినుంచి మామిడిపళ్ళు కానుకగా అందుకుంటూ ఉంటాను. వీటిలో ఎక్కువగా సొంత తోటల్లో పండించినవే. ఇక, కొనడం అంటే ఎప్పుడూ లాటరీనే. ఎంత జాగ్రత్తగా ఎంచినా మన కళ్ళు మనల్ని మోసం చేసేస్తూ ఉంటాయి. భోజనాల దగ్గర నిట్టూర్పులు వినాల్సి ఉంటుంది. అయినప్పటికీ మళ్ళీ మామిడిపళ్ళు చూస్తే మనసాగదు. అందుచేత, మల్లెపూలు, మామిడిపళ్ళు ఉన్న కారణంగానే వేసవిని భరిస్తున్నామన్న మాట.

శనివారం, మే 21, 2011

రంగం

చాలా రోజుల తర్వాత ఓ తెలుగు సినిమాని ఊపిరి బిగపట్టి చూశాను. సినిమాలో ఎంతగా లీనమైనా ఎమోషన్స్ కి లోనుకాని నేను చాలా సార్లు బిగించిన పిడికిలితో హ్యాండ్ రెస్ట్ ని మోదాను. సినిమా పూర్తవ్వగానే నా నోటివెంట అప్రయత్నంగా వచ్చిన మాట 'ఎక్స్ ట్రార్డినరీ.' సినిమా పేరు 'రంగం.' తమిళం నుంచి తెలుగుకి అనువాదమై గతవారం థియేటర్లలో రిలీజయ్యింది. ఓ మిత్రుడు తప్పక చూడమని చెప్పడంతో చూశానీ సినిమాని. ముందుగా తనకి ధన్యవాదాలు.

మీడియా-యువత-రాజకీయాలు ...తెలుగు సినిమాలకి సంబంధించి ఇవింకా డ్రై సబ్జెక్టులే. సమకాలీన సంఘటనల ఆధారంగా, ఈ మూడింటినీ నేపధ్యంగా తీసుకుని చక్కని చిక్కని కథని రాసుకుని దానిని ఏమాత్రం బిగి సడలని విధంగా తెరకెక్కించాడు దర్శకుడు కే.వి. ఆనంద్. ఇది యువ ఫోటో జర్నలిస్ట్ అశ్వద్ధామ (జీవా), రాజకీయాల్లో ప్రవేశించాలనుకునే గ్రాడ్యుయేట్ వసంత్ (అజ్మల్ అమీర్) ల కథ. నగరంలోని ఓ బ్యాంకుని దోచుకుని వెళ్తున్న ముఠాని అనుకోకుండా గమనించిన అశ్వద్ధామ వాళ్ళని అత్యంత సాహసోపేతంగా తన కెమెరాలో బంధించడం ద్వారా పోలీసులకి పట్టివ్వడం సినిమాలో ప్రారంభ సన్నివేశం.

ఈ ఫోటోల కారణంగా అశ్వత్ కే కాక, అతను పని చేసే 'నేటి వార్త' పత్రిక కి కూడా మంచి పేరొస్తుంది. దోపిడీకి పాల్పడ్డది టెర్రరిస్టులని తెలుస్తుంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో, "నేరస్తులు ఎంతటి వాళ్లైనా పట్టుకుని కఠినంగా శిక్షిస్తా"మని ప్రకటిస్తాడు ముఖ్యమంత్రి (ప్రకాష్ రాజ్). మరోపక్క, ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష నేత కొండల్రాయుడు (కోట శ్రీనివాస రావు) జ్యోతిష్యుల సలహా మేరకు గ్రహ బలం కోసం ఓ పదమూడేళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడన్న 'ఎక్స్ క్లూజివ్' స్టోరీ పట్టుకొస్తుంది ఆ పత్రిక జర్నలిస్టు రేణు (కార్తీక నాయర్/అలనాటి రాధ కూతురు).

సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా జనంలో పేరు తెచ్చుకుని ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో ఉంటాడు వసంత్. రాజకీయాల్లోనుంచి అవినీతిని పారద్రోలాలని, సామాజిక న్యాయం కోసం పనిచేయాలన్నది అతని లక్ష్యం. అతను చేసే పనులకి విస్తృతమైన కవరేజీ ఇవ్వడం ద్వారా అతని ఇమేజ్ పెరగడానికి పరోక్షంగా సహకరిస్తూ ఉంటుంది 'నేటి వార్త.' ఇటు ముఖ్య మంత్రికీ, అటు ప్రతిపక్ష నేతకీ వ్యతిరేకంగా ఆ పత్రికలో వచ్చే కథనాలు వసంత్ పట్ల జనాభిమానం పెరగడానికి దోహదం చేస్తూ ఉంటాయి.

అశ్వత్-రేణు-సరస్ ('నేటి వార్త' లో పనిచేసే మరో జర్నలిస్ట్) ల మధ్య ముక్కోణపు ప్రేమ కథ, సినిమా మరీ సీరియస్గా సాగకుండా ఉండడానికి సహకరించడంతో పాటు, కథలో ఓ కీలకమైన మలుపుకీ కారణం అయ్యింది. పత్రికా కార్యాలయం రోజువారీ వ్యవహారాలని హాస్య భరితంగా చూపించడం ద్వారా, హాస్యాన్ని కథలో జత చేశాడు దర్శకుడు. 'నేటి వార్త' పత్రిక కార్యాలయం మీద ప్రతిపక్ష నేత దాడి వంటివి గతంలో తమిళనాట జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలని గుర్తు చేస్తాయి.

వసంత్ క్రమేపీ బలం పుంజుకోవడం అటు ముఖ్యమంత్రికీ, ఇటు ప్రతిపక్ష నేతకీ కన్నెర్ర అవుతుంది. ఇక్కడి నుంచి ఎత్తులూ, పై ఎత్తులూ. ఎన్నికలు పూర్తవ్వడంతో సినిమా పూర్తవుతుందన్న ఊహకి విరుద్ధంగా, అప్పుడే కథ మరో కీలకమైన మలుపు తిరిగింది. చకచకా ముందుకి సాగింది. అస్సలు ఊహించని ముగింపుకి వచ్చింది. మీడియా-యువత-రాజకీయాలు అన్న పాయింట్ ని కథకి సంబంధించిన ఏ కీలక మలుపులోనూ మర్చిపోలేదు కథకుడూ, దర్శకుడూ అయిన ఆనంద్. పూర్వాశ్రమం లో జర్నలిస్ట్ గా పనిచేయడం ఆనంద్ కి బాగా కలిసొచ్చింది, కథని రాసుకోవడంలోనూ, తెరకెక్కించడం లోనూ. మీడియా రంగం పట్ల కొంత సానుకూల దృక్పధం కనిపించింది.

కథనంలో బిగి వల్ల పాటలు పంటికింద రాళ్ళలా అనిపించాయి. పైగా, హ్యారిస్ జైరాజ్ సంగీతంలో ఒక్క పాటా గుర్తు పెట్టుకునేలా లేదు. చిత్రీకరణ మాత్రం బాగుంది. నటన విషయానికి వస్తే జీవా, అజ్మల్ అమీర్ ఇద్దరూ పోటీ పడి నటించారు. కొన్ని ఫ్రేముల్లో అమీర్ మన తెలుగు నటుడు సాయి కిరణ్ ని గుర్తు చేశాడు. కార్తీక కి ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరికింది. బాగానే చేసింది. అలాగే సరస్ గా చేసిన పియా కూడా. ప్రకాష్ రాజ్, కోట ల నటన గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది? బాధించిన మరో అంశం నేటివిటీ. తమిళం తో తీసి, తెలుగులోకి డబ్ చేయడం వల్ల వచ్చిన సమస్య ఇది. ఏది ఏమైనప్పటికీ ఇది దర్శకుడి సినిమా. 'గమ్యం' 'బాణం' 'ప్రస్థానం' వరుసలో మరో సినిమా. వైవిద్యభరితమైన సినిమాని ఇష్టపడే వారంతా తప్పక చూడాల్సిన సినిమా.

శుక్రవారం, మే 20, 2011

తెగిన పేగు

"ఏళ్ళూ పూళ్ళూ గడిచిపోయినా భాష, దేశం కూడా మారిపోయినా మాతృభూమి మీద మమకారం మాత్రం తగ్గిపోదు. ఒక మాటలో చెపితే మట్టితో అనుబంధం రక్త సంబంధం లాంటిది. మట్టికీ మనిషికీ మధ్య ఉండే సెంటిమెంటుకి సంబంధించిన కథలెన్నో వచ్చాయి. వాటిలో విశిష్టమైనదీ కథ. ఎన్నుకున్న బేక్ డ్రాప్ విభిన్నమైంది. ఇది హృదయాన్ని ద్రవింపజేసే అభాగ్య కథ అయినా కథగా భాగ్యవంతమైందే" ...పిశుపాటి ఉమామహేశం కథ 'తెగిన పేగు' కి వంశీ రాసుకున్న ఫుట్ నోట్స్ ఇది.

ఆంధ్ర దేశంలో మధ్యతరగతి ఉద్యోగి సుబ్బారావు. అతని తల్లి డెబ్భై ఐదేళ్ళ వితంతువు నాగలక్ష్మి. ఆవిడ స్వస్థలం కేరళ లోని పాల్ఘాట్ దగ్గరలోని ఓ పల్లెటూరు. ఆమెకి ఐదేళ్ళ వయసప్పుడు సుబ్బారావు తండ్రి -- ఆంధ్ర దేశంలో కన్యాశుల్కాలు విపరీతంగా పెరిగి పెళ్ళికూతుళ్ళు దొరకని కారణంగా -- చాలామంది ఆంధ్ర బ్రాహ్మణ యువకుల్లాగే పాల్ఘాట్ వెళ్లి ఆమెని కొనుక్కుని తెచ్చుకుని పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ అక్కణ్ణుంచి వచ్చి ఆమెని చూసిన వాళ్ళూ లేరు, ఇక్కణ్ణుంచి తీస్కెళ్ళి చూపించిన వారూ లేరు. ఒక్క తాళితో పుట్టింటి బంధం తెగిపోవడం ఎంత అమానుషం!

సంసారపు మాయలో పడి తన జన్మ వృత్తాంతాన్నే మరిచిపోయే స్థితికి వచ్చిన నాగలక్ష్మికి, కొడుకు దక్షిణ దేశ యాత్ర కడుతుండగా ఎన్నాళ్ళుగానో నిద్రాణమైన కోరిక మళ్ళీ మేలుకొంది. "ఆహా.. నీకేమీ ఇబ్బంది లేకపోతేనే.." అని మొహమాటంగా అడిగింది కొడుకుని, 'తన' ఊరికి ఒక్కసారి తీసుకెళ్ళమని. నిజానికావిడకి తన ఊరిపేరు కూడా గుర్తు లేదు. యాత్రల తిరుగుప్రయాణంలో పాల్ఘాట్ లో దిగిన సుబ్బారావు కుటుంబం, ఆ ఊరు కనుగొనే ప్రయత్నాల్లో పడుతుంది. రైల్వే వారి సహాయంతో చుట్టుపక్కల ఊళ్ళ జాబితా సంపాదించిన సుబ్బారావు ఒక్కోపేరూ చదువుతూ ఉండగా 'వేజ్నప్పోడి' అన్న పేరు వింటూనే "ఆ! అదే" అంటుందావిడ ఆనందంగా.

ఐదు మైళ్ళ దూరంలో ఉన్న ఆ ఊరు చేరి, భాష సమస్య ఎదుర్కొని, ఇంగ్లీష్ తెలిసిన ఓ రిటైర్డ్ స్కూల్ మాస్టర్ సాయంతో 'అమ్మ పుట్టిల్లు' వెతికే పనిలో పడతాడు సుబ్బారావు. ఎంత ప్రయత్నించినా తన ఇంటి ఆనవాళ్ళు ఏవీ గుర్తుకు రావు నాగలక్ష్మికి. అతికష్టం మీద "మీ ఇంటి పక్క గుళ్ళోనే నిన్ను మొదటిసారి చూశాను, నాగమల్లి పూలేరుతుండగా" అంటూ భర్త చెప్పిన మాట నాగలక్ష్మికి జ్ఞప్తికి రాగా, ఆ ఆధారంతో ఇంటి వేట మొదలవుతుంది. రెండు మూడు గుళ్ళు వెదికేక నాలుగో గుడి చూస్తుండగానే ఆవిడకి లీలగా ఏదో పునర్జన్మ స్మృతిలా గుర్తుకొస్తుంది. గుడికి ఎడంపక్క ఇల్లు.. కానీ పెంకుటిల్లని గుర్తు. అదిప్పుడు డాబా అయింది.

లోపల మండువాలో ఓ ముసలాయన వాలుకుర్చీలో పడుకొని రేడియో వింటున్నాడు. నాగలక్ష్మికో తమ్ముడుండాలి. బహుశా ఈయనేనేమో.. పోలికలు.. ఆవిడలో ఏదో నమ్మకం క్రమంగా బలపడసాగింది. ఆ యింటి వాతావరణం చూస్తుంటే అప్రయత్నంగా ఆవిడ నోటంట 'అప్పు' అన్న మాటొచ్చింది. "అవును నేనే, ఇంట్లో అందరూ 'అప్పు' అనే అంటారు. అప్పుకుట్టి.." అన్నాడాయన మలయాళంలో. మాస్టారు ట్రాన్స్లేట్ చేసేరు. అప్పుకి కూడా తన చిన్నతనంలో ఒక అక్కగార్ని ఎవరికో అమ్మేసేరని వాళ్ళూ వీళ్ళూ చెప్పిన ముచ్చట గుర్తుకొచ్చింది. ఆమెలో పోలికలు కూడా లీలగా అగుపడ్డాయి.

ఏవేవో జ్ఞాపకాలు అల్లుకోగా పిచ్చెత్తినట్టు తడబడే అడుగులతో ఇల్లంతా కలియ తిరుగుతుంది నాగలక్ష్మి. వంటింటిని గుర్తు పడుతుంది. దొడ్లో బాదం చెట్టునూ, పున్నాగ చెట్టునూ గూర్చి అడుగుతుంది. అవెప్పుడో చచ్చిపోయాయి. ఇంకా ఏవేవో అడుగుతుంది. కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. అమ్మా, నాన్నా, నలుగురక్కలూ, ఇద్దరన్నలూ కాలం చేసినట్టు తెలిసి ఏడుపొచ్చేస్తుంది ఆమెకి. ఏడుస్తూనే ఇల్లంతా కలియ తిరుగుతుంది. పుట్టిన చోటే గిట్టే భాగ్యానికి నోచుకోక, పరాయి పంచన బతుకు వెళ్ళదీయాల్సిన తన దుస్థితికి కుమిలి కుమిలి ఏడుస్తుంది.

ఊళ్లోకల్లా దీర్ఘాయుష్కుడైన తొంభయ్యేళ్ళ వృద్దుడికి కబురు పెట్టి రప్పిస్తారు మేష్టారు. నాగలక్ష్మిని గుర్తు పడతాడాయన. అప్పుతో ఆమె చేయి కలుపుతాడు. అంతవరకూ కేరళ దేశంలోని పరాయి మగవాడుగా కనబడ్డ ఆయన ఆమెకీ, తెలుగుదేశం నుంచి వచ్చిన పండు ముసలామెగా ఆమె ఆయనకీ కనబడి దూరంగా ఉండిపోయిన వారల్లా ఆక్షణంలో నిజంగా అక్కాతమ్ముళ్ళమనే భావన పొంగి పొరలింది ఇద్దరిలోనూ. రక్తస్పర్శ మహిమ!! చూసే అందరికీ వింతగానే ఉంది ఈ అపూర్వ సంగమం. ఇక భవిష్యత్ కార్యక్రమం ఏమిటి? దేవుణ్ణి నాగలక్ష్మి కోరుకున్న ఓకే ఒక్క కోరిక ఏమిటి?? .....'వంశీకి నచ్చిన కథలు' సంపుటిలో ఉందీ కథ.

శనివారం, మే 14, 2011

ఆనంద్-గోదావరి-హ్యాపీడేస్ (చివరి భాగం)

నిర్మాణ వ్యయం ఊహించిన దానికన్నా పెరగడం వల్ల అనుకుంటా, 'గోదావరి' కి ఆశించిన స్థాయిలో లాభాలు రాలేదన్నారు. మొత్తం మీద లోకేషన్స్, సంగీతం నిలబెట్టాయీ సినిమాని. ఇంతలో 'ఆనంద్' డిస్క్ మార్కెట్లోకి వచ్చేయడంతో అప్పుడప్పుడూ 'ఆనంద్' చూస్తూ రోజూ 'గోదావరి' పాటలు వింటూ ఉండగా వచ్చిన ప్రకటన 'కొత్తవాళ్ళతో శేఖర్ తదుపరి చిత్రం' అని. తనే నిర్మాత అనీ, కార్పొరేట్ కంపెనీల భాగస్వామ్యం ఉంటుందనీ వార్తలు వచ్చాయి.

చూస్తుండగానే టాలెంట్ హంట్ హంగామా మొదలయ్యింది. 'ఆనంద్' తో పోల్చినప్పుడు 'గోదావరి' కి బాగా పబ్లిసిటీ ఇచ్చారు. అయితే ఈ కొత్త సినిమా ఇంకా నిర్మాణం మొదలుకాకుండానే 'గోదావరి'ని మించి భారీ స్థాయిలో ప్రచారం మొదలుపెట్టేశారు. కాలేజీ నేపధ్యంగా సినిమా..టైటిల్ 'హ్యాపీడేస్.' తెలుగులో అందుకు సమానార్ధకం దొరకలేదని శేఖర్ వివరణ. ఎందుకో తెలియకుండానే చిన్నగా అసంతృప్తి మొదలయ్యింది.

ఆడియో విడుదలై 'అరెరే..అరెరే..' పాట పెద్ద హిట్టయ్యింది. అప్పుడు గమనించాను. గత రెండు సినిమాలకీ పాటలు రాసిన వేటూరి స్థానంలో కొత్త గేయ రచయితలు. బహుశా సినిమాని యూత్ఫుల్ గా తీర్చిదిద్దడంలో భాగమేమో. అప్పటికే దర్శకుడిగా శేఖర్ కమ్ముల సంపాదించుకున్న ఇమేజ్, భారీ ప్రచారం మరియు హిట్ ఆడియో.. వెరసి బ్రహ్మాండమైన ఓపెనింగ్స్. మరీ మొదటి రోజు కాదు కానీ, మొదటివారంలో చూశా ఈ సినిమాని.

తెరమీద సినిమా మొదలయ్యింది.. కానీ నేనెందుకో కనెక్ట్ కాలేక పోతున్నాను. ఒక ప్రేక్షకుడిగా నాకు సంబంధించి ఇది సినిమా రాంగ్ ట్రాక్ లో వెళ్తోంది అనడానికి సంకేతం. ఎందుకో తెలియదు కానీ అంతకు కొద్ది కాలం ముందే చదివిన చేతన్ భగత్ నవల 'ఫైవ్ పాయింట్ సంవన్' గుర్తొచ్చింది. అంతే, అది మొదలు తెర మీద కనిపిస్తున్న ప్రతి సన్నివేశానికీ పోలికలున్న సన్నివేశం నవలలో ఉన్నది గుర్తు రావడం మొదలు పెట్టింది. శేఖర్ మీద గౌరవం కొద్దిగా తగ్గింది. ఇంటర్వల్ లో లేచి వెళ్ళిపోదామా అనుకుని, ఆ ప్రయత్నం విరమించుకున్నాను.

'హ్యాపీడేస్' ఇంజనీరింగ్ కాలేజీలో కొత్తగా చేరిన నలుగురు అబ్బాయిలు, అమ్మాయిల కథ. వీళ్ళకి ప్రపంచంలో ప్రేమ వంటి వస్తువు మరొకటి లేదు. అబ్బాయిలకి ప్రేమించడానికి ఆడ మనిషి దొరికితే చాలు.. ఆమె లెక్చరర్ అయినా, సీనియర్ అయినా అభ్యంతరాలు ఏవీ లేవు. క్యాంపస్ లో ర్యాగింగ్ ని ప్రోత్సహించే రీతిలో సన్నివేశాలు. ఈ పిల్లలకి ఇళ్ళలో పెద్దవాళ్ళ పట్ల భయం ఉన్నట్టే కనిపిస్తుంది కానీ, అంతలోనే బోలెడు స్వేచ్చా ఉంటుంది. లెక్చరర్ ఎవరూ కూడా లేకపోయినా, ఈ నాలుగు జంటలూ వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలకి విహార యాత్ర వెళ్ళడానికి ఇళ్ళలో అనుమతించేస్తారు.

అప్పటివరకూ అల్లరి చిల్లరగా తిరిగినా పరిక్షలనేసరికి శ్రద్ధగా చదివేస్తారు. పరిక్షలు రాయబోతూ తడి కళ్ళతో ఫేర్వెల్.. అవ్వగానే అందరికీ కేంపస్ ఉద్యోగాలు. ఇంతేనా కాలేజీ జీవితమంటే? ఇది సినిమానా? ఓ కాలేజీ క్యాంపస్ లో కెమెరా బిగించి, కొన్నాళ్ళ తర్వాత కొంచం ఎడిటింగ్ చేసి కొన్ని పాటలూ, మరికొన్ని నాటకీయ దృశ్యాలూ చేరిస్తే సినిమా అయిపోయినట్టేనా? ప్రారంభంలో కొంచం అమాయకంగా కనిపించే ఓ బీద అబ్బాయిని చూపిస్తారు. అతను ఎందుకంటే, సీనియర్ స్టూడెంట్ ఒకడు హీరో ని రాగింగ్ చేస్తూ హీరోయిన్ "నా చెల్లెలు" అని ఇంపోజిషన్ రాయమంటే, హీరో బదులు ఈ బీద అబ్బాయి రాస్తాడు, హీరో పాత్రౌచిత్యం దెబ్బ తినకుండా!

దర్శకుడిగా శేఖర్లో లోపాలు అలాగే ఉండిపోయాయి. కథ రాసుకోవడం దగ్గరినుంచి, చిత్రీకరణ వరకూ యెంతో కొంత అస్పష్టత, క్లారిటీ లేకపోవడం. సంభాషణలు చాలా కృతకంగా ఉండడం. కనీసం వేరే వాళ్ళచేత రాయించుకునే ప్రయత్నమైనా ఉండదు. కాంబినేషన్ సన్నివేశాల్లో కనిపించే నటీ నటులందరి నటనా బ్యాలన్స్ అవ్వదు. ఎవరో ఒకరు మిగిలిన వాళ్ళని డామినేట్ చేసేస్తూ ఉంటారు. మొదటి రెండు సినిమాలకీ 'ట్రెడిషనల్' టచ్ ఇచ్చిన శేఖర్, మూడో సినిమాకి వచ్చేసరికి పూర్తి 'మోడర్న్' లుక్ ఇవ్వడానికి శతవిధాలా ప్రయత్నించారు. సంగీతం నుంచి సన్నివేశాల వరకూ ప్రతి చోటా ఇది కనిపిస్తుంది.

నిజం చెప్పాలంటే 'హ్యాపీడేస్' కేవలం స్పాన్సర్ల కోసం తీసిన సినిమాలా అనిపించింది. 'ఆనంద్' కి 'మంచి కాఫీ లాంటి సినిమా' అని క్యాప్షన్ ఇచ్చి స్పాన్సర్లని ఆకట్టుకున్న శేఖర్, 'హ్యాపీడేస్' ని కేవలం వారి వారి బ్రాండ్లని ప్రమోట్ చేయడం కోసమే తీసిన భావన కలిగింది. నాకు నచ్చలేదని సినిమా విజయం ఆగిపోలేదు. నిజానికి 'ఆనంద్' 'గోదావరి' లని మించి ఆర్ధిక విజయం సాధించింది. శేఖర్ తన లోటుపాట్లని సరిదిద్దుకుంటాడన్నఆశ సన్నగిల్లింది నాలో. అందుకే తన తర్వాతి సినిమా 'లీడర్' మీద పెద్దగా ఆశలు పెట్టుకోలేదు.

'లీడర్' విడుదలయ్యింది.. చూడాలనిపించలేదు.. చూసిన మిత్రులు -- గతంలో శేఖర్ని విశ్వనాధ్ తో పోల్చిన వారు - చూసి బాగాలేదని చెప్పారు. కాబట్టి చూడనందుకు నో రిగ్రెట్స్. మార్కెటింగ్ ని కాకుండా, కథ కథనాలని నమ్ముకుని శేఖర్ సినిమా తీస్తే బాగుండును. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న చాలా మంది దర్శకులకన్నా కథని కొంచం వైవిధ్యంగా రాసుకోవడంలోనూ, సున్నితమైన భావోద్వేగాలను తెరకెక్కించడం లోనూ శేఖర్ కి ఎక్కువ మార్కులే ఇవ్వొచ్చు. తన ప్లస్ పాయింట్లని ఉపయోగించుకుంటూ మైనస్లని అధిగమించే దిశగా శేఖర్ నుంచి ఓ సినిమా వస్తుందని ఎదురుచూస్తున్నాను. ప్రస్తుతానికి మాత్రం తన సినిమాలలో 'ఆనంద్' కి మొదటి స్థానం 'గోదావరి' కి రెండో స్థానం.. అంతే..

బుధవారం, మే 11, 2011

ఆనంద్-గోదావరి-హ్యాపీడేస్ (రెండోభాగం)

బీప్ వినగానే మెసేజ్ ఓపెన్ చేసి చూశా.. నా మెసేజ్ కి థాంక్స్ చెబుతూ, "శేఖర్ ఇలాంటి సినిమాలే తీస్తారు.. మీరు ఆదరించాలి.." అన్నారు అమిగోస్ క్రియేషన్స్ వారు, 'ఆనంద్' సినిమాని నిర్మించిన సంస్థ. తర్వాత మరో రెండు సార్లు చూశాను థియేటర్లో. ఫోటోగ్రఫీ సమకూర్చిన విజయ్.సి.కుమార్ నీ, సంగీత దర్శకుడు కే.ఎం. రాధాకృష్ణన్ నీ ఎన్ని సార్లు అభినందించానో లెక్కలేదు, అంతా మనసులోనే. మూడోసారి 'ఆనంద్' చూడడం కోసం థియేటర్ కి వెళ్తే టిక్కట్లు దొరకలేదు. బ్లాక్ లో కొనాల్సి వచ్చింది..

పక్కనే ఓ పెద్ద సినిమా బ్రహ్మాండం బద్దలు కొడుతుండగా, ఓ చిన్న సినిమా ఇలా అందరినీ ఆకట్టుకోవడం.. తెలుగు సినిమాకి మంచి రోజులు వచ్చేశాయేమో అని సందేహం వచ్చేసింది. ఇంటా బయటా 'ఆనంద్' పాటలతో రోజులు గడిచిపోతూ ఉండగా, మాధవన్-కమలినీ ముఖర్జీ జంటగా శేఖర్ రెండో సినిమా ఉండబోతోందంటూ వార్త. వాళ్ళిద్దరి జోడీ ఎలా ఉంటుందోనన్న సందేహంలో ఉండగానే, సినిమా కథ గోదావరి నేపధ్యంలో సాగుతుందన్న కబురు తెలిసింది. చూస్తుండగానే మాధవన్ స్థానంలో సుమంత్ వచ్చేయడం, చిత్రీకరణకి సంబంధించి సలహాల కోసం శేఖర్ వంశీని కలవడం చకచకా జరిగిపోయాయి.

కొంచం సుదీర్ఘంగానే షూటింగ్ జరుపుకుని ఐదేళ్ళ క్రితం 'ఈవేసవి చల్లగా ఉంటుంది' అనే క్యాప్షన్ తో 'గోదావరి' థియేటర్లలోకి వచ్చేసింది. అసలే 'ఆనంద్' దర్శకుడి సినిమా ఆపై పేరూ ఊరూ అంతా గోదావరే.. చూడకపోతే ఎలా? థియేటర్లో ఏసీ బ్రహ్మాండంగా పనిచేయడం వల్ల అనుకుంటా, చూస్తున్నంత సేపూ నిజంగానే చల్లగా ఉంది. రాధాకృష్ణన్ సంగీతంలో పాటలు భలేగా నచ్చేశాయి. ముఖ్యంగా "నీల గగనం.. ఘనవిచలనం.." అనే బిట్ సాంగ్. రామాయణంలో వాల్మీకికి కలిగిన సందేహానికి వేటూరి అక్షర రూపం "ఎడమ చేతను శివుని విల్లుని ఎత్తినా రాముడే.. ఎత్తగలడా సీత జడనూ తాళికట్టే వేళలో.." లైన్స్ ఎంతగా నచ్చాయో చెప్పడానికి అక్షరాలు చాలవు.

'ఆనంద్' లో మరీ 'రా' గా కనిపించిన కమలిని కొంచం షైన్ అయినట్టుగా అనిపించింది. అభినయం కూడా, చాలా చోట్ల అవసరానికన్నా కూసింత ఎక్కువగా చేసినట్టుగా అనిపించింది. అయితే, అవసరమైన చోటకూడా పొదుపుగా అభినయించడం ద్వారా సుమంత్ దానిని బ్యాలన్స్ చేసేశాడు. ఇది ఆత్మాభిమానం ఉన్న సీత (కమలిని), అయోమయంగా కనిపించే రాం(సుమంత్)ల కథ. 'గోదావరి' పేరుతో నడిచే ఓ టూరిజం బోటులో రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్ళే బోట్లో మొదటిసారి ఒకరికొకరు పరిచయమై, ప్రయాణం ముగిసేసరికి ఇద్దరూ వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న కంక్లూజన్ కి రావడమే కథ. సినిమాలో సింహభాగం కథ పడవలోనే నడవడం వల్ల బాపూ 'అందాల రాముడు' గుర్తొచ్చాడు.

'గోదావరి' మీద 'ఆనంద్' ప్రభావం బాగానే కనిపించింది. ముఖ్యంగా రూపకి ఓ ఫ్యామిలీని ఇచ్చి సీతగా మార్చేసినట్టుగా అనిపించింది. నాయిక ఆత్మాభిమానం, ప్రేమించీ ప్రకటించకపోవడం, కొంచం డామినేటింగ్ నేచర్... పనిలో పనిగా హీరో గారి తగుమాత్రం పాసివ్ నేచర్ ఇవన్నీ 'ఆనంద్' నుంచి దిగుమతి చేసుకున్నట్టే అనిపించాయి. హీరో మరదలిగా చేసిన నీతూచంద్ర, బోటు కెప్టెన్ చింతామణి గా తనికెళ్ళ భరణి గుర్తుండిపోయారు. బుడగలు అమ్ముకునే కుర్రాడు, మాట్లాడే కుక్క, అట్లు పోసుకునే ఆవిడ... ఇలా నేపధ్యాన్ని బాగానే సెట్ చేశారు. ఒక్క ఫ్యాక్షన్ దృశ్యం మాత్రం పూర్తిగా అనవసరం మరియు పంటి కింద రాయి అనిపించింది.

వంశీ దగ్గర లోకేషన్ల గురించి తెలుసుకున్న శేఖర్, ఒకప్పటి వంశీ సినిమాల్లో కనిపించిన నేటివిటీని కూడా పట్టుకుని ఉంటే బాగుండేది. ప్రధాన పాత్రలన్నీ హైదరాబాద్ నుంచి వచ్చి బోట్ ఎక్కాయి సరే.. సహాయ పాత్రలకి ఏమొచ్చింది? కొన్ని పాత్రలు మాట్లాడిన గోదారి యాస మరీ అతికినట్టుగా ఉంది. అట్లమ్మి, చిలక జోస్యం అతనూ వీళ్ళంతా లోకలే కదా (కథ ప్రకారం). గోదారి గట్టు మీద నివాసం మీద ఉండే కుక్క చేత మాట్లాడించారు సరే (మన 'వీరబొబ్బిలి' స్ఫూర్తి అనుకుందాం) ..ఆ కుక్క కూడా చక్కటి హైదరాబాద్ యాక్సెంట్ లో మాట్లాడడం విషాదం.

కథనం దగ్గరికి వస్తే, హీరో లక్ష్యాల గురించి కనీసం హీరోకన్నా ఏమన్నా క్లారిటీ ఉందేమో తెలీదు. రొటీన్ గా ఉండడం ఇష్టం ఉండదు సరే.. రాజకీయాల్లోకి రావాలనుకున్నాడు మంచిదే.. అందరికీ సహాయా అవీ చేస్తూ ఉంటాడు ఓకే.. ఏ పార్టీ అతనికి నచ్చకపోయినా, చివరికి వచ్చేసరికి వాళ్ళు పెయిడ్ వర్కర్ గా రమ్మనగానే యెగిరి గంతేయడమే? నాయిక సీతామాలక్ష్మికి అసలే పాత సినిమాల్లో వాణిశ్రీ కి ఉన్నంత ఆత్మాభిమానం.. డబ్బింగ్ చెప్పింది సునీత అవడం వల్ల, ఆ ఆత్మాభిమానం దర్శకుడు చూపించదల్చుకున్న దానికన్నా ఎక్కువగా తెరమీద క(వి)నిపించింది. ఇక క్లైమాక్స్ కోసం 'సీతారామయ్య గారి మనవరాలు' నాటి డైరీ ని వాడుకోవడం కొంచం ఎక్కువగానే నిరాశ పరిచింది.

'ఆనంద్' హిట్ అయ్యేసరికి శేఖర్ కి కమలిని, వాన పాట సెంటిమెంట్ అయినట్టున్నాయి. 'టప్పులూ టిప్పులూ..' అంటూ ఓ వాన పాట ఉంది. సినిమా ప్రారంభంలో వచ్చే, బాలూ చేత పాడించిన, 'ఉప్పొంగెలే గోదావరీ..' పాటా, చిత్రీకరణా కూడా చాలా చాలాబాగున్నాయి. అయితే, మొత్తం మీద చూస్తే గోదావరిని చూపించాల్సినంత అందంగా చూపించలేదన్నది నా ఫిర్యాదు. అంటే, కథానుసారం ఇంకా బాగా చూపించ వచ్చని. అయితే, రెండోసారి కూడా నచ్చిన పాయింట్ క్లీన్ సినిమాని ఇవ్వడం.

సంగీతానికి పెద్దపీట వేయడం.. కమలిని కాస్ట్యూమ్స్, ముఖ్యంగా చీరలు చాలా బాగున్నాయి. కాస్ట్యూమ్ డిజైనర్ పేరు చూశా, అరవింద్ జాషువా..కాటన్స్ బాగా ఇష్టం అనుకుంటా.. మా క్లబ్బే. బహుశా ఈ 'క్లీన్ సినిమా' కాన్సెప్ట్ నచ్చడం వల్ల అనుకుంటా, మిత్రులొకరు 'ఆనంద్' 'గోదావరి' చూసి శేఖర్ ని 'ఈ జెనరేషన్ విశ్వనాధ్' అన్నారు, నా దగ్గర. నేనేమో "తొందర పడొద్దు" అన్నాను.. నేనన్నది నిజమేనని తనూ ఒప్పుకున్నారు. కాకపొతే, కొంత కాలం తర్వాత. ఆ కథా క్రమంబెట్టిదనిన... (ఇంకా ఉంది)

సోమవారం, మే 09, 2011

ఆనంద్-గోదావరి-హ్యాపీడేస్

ఏడేళ్ళ క్రితం.. అప్పుడే మొదలైన శీతాకాలపు సాయంకాలం కాలక్షేపంగా నడుస్తూ ఉండగా ఓ వాల్ పోస్టర్ ఆకర్షించింది నన్ను. 'ఆనంద్' అని సినిమా పేరు, మంచి కాఫీ లాంటి సినిమా అని క్యాప్షన్. గ్రామఫోన్ వింటూ పొగలొస్తున్న కాఫీ కప్పు పట్టుకున్న అమ్మాయి. ఎవరో కొత్త మొహం. పోస్టర్ కి ఓ చివర 'బ్రూ' వారి ప్రకటన. చూడగానే పోస్టర్ నచ్చేసింది. పైగా, సినిమా టైటిల్ కి పెట్టిన క్యాప్షన్ ఆధారంగా, స్పాన్సర్లని సంపాదించడం అన్న కాన్సెప్ట్ ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను.

మర్నాడు థియేటర్లో జనం పెద్దగా లేరు. పక్కనే ఉన్న హాల్లో చిరంజీవి సినిమా 'శంకర్ దాదా ఎంబీబీఎస్' విజయవంతంగా ప్రదర్శింప బడుతోంది. ప్రారంభ సన్నివేశంలో చిన్న జెర్క్. సంభాషణలు పలికే తీరు మరీ కృతకంగా ఉంది. 'అందరూ కొత్త వాళ్ళు కదా' అని సరిపెట్టుకున్నాను. టైటిల్స్ అయిపోవడం, వెంటనే వచ్చే హీరోయిన్ ఇంట్లో సంగీతం క్లాస్ దృశ్యం. కళ్ళప్పగించేశాను. మొదటగా ఆకట్టుకున్నది ఫోటోగ్రఫి. తర్వాత నేపధ్య సంగీతం. ఆ తర్వాత దృశ్యం. ఇట్టే సినిమాలో లీనమైపోయాను. సంభాషణల తీరు అలాగే ఉంది.

చిన్నప్పుడే తల్లి తండ్రుల్నీ, అన్ననీ కోల్పోయిన అనాధ అమ్మాయి రూప (కమలినీ ముఖర్జీ) కి పెళ్లి నిశ్చయం అవుతుంది. వరుడు ఆమె ప్రేమించిన వాడే. గొప్పింటి వాడు. అతని తల్లి పెట్టే కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకుంటుంది రూప. పెళ్ళయ్యాక ఆమె ఉద్యోగం చేయకూడదు, చీరలు మాత్రమే ధరించాలి, బాగా వంట చేయడం నేర్చుకోవాలి.. ఆ కండిషన్స్ ఆమెని కొద్దిగానూ, ఆమె స్నేహితులని కొంచం ఎక్కువగానూ ఇబ్బంది పెడతాయి. పెళ్లి పనులు జరుగుతూ ఉండగానే హీరో ఆనంద్ (రాజా) పరిచయం.

పెద్ద మిలియనీర్, ఫారిన్ లో చదువుకుంటున్నాడు. అతనికి పెళ్లి చేయాలని తల్లి ప్రయత్నం. హీరో చిరంజీవి కూతురి క్లాస్మేట్ వెంకటలక్ష్మిని పెళ్లిచూపులు చూసొచ్చాడు. ఫోటోగ్రఫీ, నేపధ్య సంగీతం ప్రతి సీన్లోనూ నచ్చేస్తున్నాయి. ఆనంద్-రూప ఎదురుపడే సందర్భంలో పాట మొదలైంది.. "యెదలో గానం.." నేపధ్యగీతం.. (ఇప్పటికీ నా ఫేవరేట్). రూప పెళ్ళికి ఆనంద్ తన తండ్రిని, కజిన్ నీ తీసుకుని వచ్చాడు. రూపకి వాళ్ళమ్మ చీర కట్టుకుని పెళ్లి పీటల మీద కూర్చోవాలని కోరిక. కాబోయే అత్తగారికి అది ఎంత మాత్రమూ ఇష్టం లేదు. చాలా ఆసక్తికరమైన సన్నివేశం. వెనకాల సీట్లో వాళ్ళు గట్టిగా మాట్లాడుకుంటుంటే 'ఎక్స్ క్యూజ్మీ' అని విసుగ్గా అరిచాను.

రూప పెళ్లి వద్దనుకుంది.. లోకం దృష్టిలో కేవలం చీర కోసం పెళ్లి వద్దనుకుంది. వామనుడు త్రివిక్రముడైనట్టుగా రూప మీద ఇష్టం క్షణ క్షణానికీ పెరిగిపోతోంది నాకు. సినిమా చూస్తున్న నాకే కాదు, సినిమాలో రూప నిర్ణయాన్ని కళ్ళారా చూసిన ఆనంద్ కి కూడా రూప నచ్చేసింది. అందుకే, ఫారిన్ ప్రయాణం వద్దనుకుని, రూప పక్కింట్లో ఓ పోర్షన్ లో అద్దెకి దిగాడు. తన పరపతి ఉపయోగించి రూప కంపెనీలోనే ఉద్యోగం సంపాదించాడు. ఇక ఇప్పుడు రూప తనని ప్రేమించేలా చేసుకోవడం ఆనంద్ వంతు.


రూపకి తనవారెవరూ లేరు. ఇటు ఆనంద్ ఇంట్లో చెప్పకుండా రూప ఇంట్లో దిగాడు. అయితే ఏం? చాలామంది స్నేహితులు ఉన్నారు వాళ్లకి. చిన్న పిల్లలు మొదలు బామ్మ వరకూ, ఆటో అబ్బాయి మొదలు పెట్ డాగ్స్ వరకూ.. పెళ్ళైతే వద్దని చెప్పేసింది కానీ, తర్వాత తన నిర్ణయం సరైనదేనా అని సందేహం రూపకి. తనని ఒంటరి దానిని చేసిన తన వాళ్ళని తల్చుకుని బాధ పడుతుంది. స్నేహితులే ఆమెకి అన్నీ అవుతారు. మామూలు మనిషిని చేసే ప్రయత్నం చేస్తారు. ఆనంద్ కి రూప మీద ఉన్న ఇష్టం కూడా తెలుసు వాళ్లకి. కానీ రూపని ఒప్పించే బాధ్యత తీసుకునే సాహసం చేయరు.

మరోపక్క రూప వద్దనుకున్న పెళ్ళికొడుకు ఆమెని ఎలా అయినా ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. సరిగ్గా ఇప్పుడే పరవాన్నంలో పంటికింద రాయిలా అనిపించే సన్నివేశం.. అతను రూపని బలాత్కరించ బోతుంటే ఆనంద్ వచ్చి ఆమెని రష్ కించడం.. సినిమా మొదలయ్యాక మొదటిసారి దర్శకుడి మీద కోపం వచ్చిన సన్నివేశం. ఇప్పటివరకూ వైవిధ్యభరితంగా తీసి, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఆ రొటీన్ సన్నివేశాన్ని ఇరికించి హీరో గొప్పదనాన్ని ఇనుమడింప చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?

కొన్ని సన్నివేశాల అనంతరం రూప ఆనంద్ ప్రేమని అర్ధం చేసుకుంది. కానీ వ్యక్తపరచలేదు. ఇద్దరిమధ్యా ఇగో క్లాష్. ఆనంద్ సహనం నశించింది. ఎవరికీ చెప్పకుండా తన ఇంటికి వెళ్ళిపోయాడు. మాటల కన్నా మౌనం, కలయిక కన్నా ఎడబాటూ బలంగా పనిచేసే సందర్భం. ఇద్దరూ ఒకరినొకరు అర్ధం చేసుకున్నారు. అందరికీ ఆనందం. నిజంగానే మంచి కాఫీ తాగిన అనుభూతి. "ఇలాంటి సినిమా వచ్చి ఎన్నాళ్ళయ్యింది?" అన్న ప్రశ్న. ఫోన్ తీసి మిత్రులందరికీ సందేశాలు, సినిమా తప్పకుండా చూడమనీ, సినిమాలో తాజాదనం నచ్చి తీరుతుందనీ.

ఓ మిత్రుడికి పోస్టు చేసిన ఉత్తరంలో (ఉత్తరాలు పోస్టు చేసిన చివరి రోజులవి) హీరోయిన్ గురించి రాసిన వాక్యం "హీరోయిన్ కమలిని అందానికన్నా, అభినయానికే ఎక్కువ మార్కులు పడతాయి..." ఎందుకంటే, మొదటిసారి 'ఆనంద్' చూసినప్పుడు నాకు కమలిని అందగత్తె అనిపించలేదు. హీరో కన్నా పెద్దదానిలా అనిపించింది. "కొంచం స్లిమ్ అయితే చాలా బాగుండును" అనుకున్నాను. సహాయ నటుల్లో నాకు బాగా నచ్చింది రూప (తప్పిపోయిన) అత్తగారిగా చేసినావిడ. తర్వాత ఆవిడనోసారి కలిశాను కూడా. చాలా సౌమ్యురాలు అనిపించింది.

పాటలు, ఫైట్లు, కామెడీ ఇలా అన్నీ ప్యాకేజీలు చేసి, కాలిక్యులేషన్లు చేసీ కాకుండా కథకి తగ్గట్టు సన్నివేశాలు రాసుకోవడం, కొత్తవాళ్ళతో సినిమా కదా అని జనాకర్షణ కోసం 'ప్రత్యేక' గీతాలూ, స్కిన్ షోలూ ఇరికించక పోవడం, అన్నింటికీ మించి సినిమాని ఆరోగ్యకరంగా తీయడం నాకు నచ్చిన అంశాలు. చిన్న చిన్న లోపాలున్నా, తర్వాతి సినిమాకి దర్శకుడు వాటిని సరిచేసుకుంటాడులే అనుకున్నాను. మర్నాడు పేపర్ తిరగేస్తుంటే 'ఆనంద్' ప్రకటన చిన్నదీ, అందులో ఒక మొబైల్ నెంబరూ కనిపించాయి. "మంచి సినిమా తీసినందుకు అభినందనలు. దర్శకుడు శేఖర్ కమ్ముల నుంచి ఇలాంటి ఆరోగ్యకరమైన సినిమాలని ఆశిస్తున్నాం" అంటూ ఓ మెసేజ్ పంపాను. ఊహించని విధంగా, పావుగంట తర్వాత రిప్లై వచ్చింది. (ఇంకా ఉంది)

శనివారం, మే 07, 2011

ఎ'వరి'కోసం?

"వ్యవసాయం దండుగ" అంటూ అల్లప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పిన మాట నిజమే అనిపిస్తోంది. లేకపొతే, అంచనాలకి మించి దిగుబడులు సాధించినా పంటకి వస్తున్న ధర కనీసం పెట్టుబడులకి తగ్గట్టుగా లేకపోవడం అన్నది ఎందుకు జరుగుతుంది? బస్తా ధాన్యం అమ్మకానికి పెడితే వచ్చే ధర ఒక రోజు ఇద్దరు కూలీలకి చెల్లించాల్సిన కూలీ మొత్తం కన్నా తక్కువగా ఉన్నప్పుడు వ్యవసాయం పండుగ ఎలా అవుతుంది?

గడిచిన ఖరీఫ్ సీజన్ లో పంట చేతికి వచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలు రైతులకి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. అందుకు ఊరటగానా అన్నట్టు ప్రస్తుత రబీ సీజన్ ధాన్యం దిగుబడి అంచనా మన రాష్ట్రంలో అక్షరాలా వంద లక్షల టన్నులు. ప్రస్తుత పంట తో పాటుగా, గడిచిన పంటకోసం చేసిన అప్పులు తీర్చుకుని కొద్దో గొప్పో మిగుల్చుకోడానికి గొప్ప అవకాశం. ప్రకృతితో ఆడిన జూదంలో ఎక్కువసార్లు ఓడిపోయే రైతు ఈసారి గెలిచాడు. కానీ ఏం లాభం, ప్రభుత్వం చేతిలో ఓడిపోతున్నాడు.

బస్తా ధాన్యానికి ఏడొందల రూపాయలకి మించి ధర పలకడం లేదిప్పుడు. పంటకోత, నూర్పిళ్ళ కోసం కూలీలకి చెల్లించిన రోజుకూలీ తల ఒక్కింటికీ మూడు వందల యాభై రూపాయలు. కూలీ ఒక్కటేనా? ఎరువులూ, పురుగు మందులూ అన్నింటి ధరలూ పైపైకే ప్రయాణం చేస్తున్నాయి. నష్టపోయిన పంటకి గాను ప్రభుత్వం నుంచి పరిహారం వస్తుందో, రాదో తెలియని పరిస్థితి. అటు ప్రభుత్వంలో వారిని మచ్చిక చేసుకునే తెలివితేటలు కానీ, ఇటు కళ్ళంలో పంటని తగలబెట్టే తెగింపు కానీ లేకపోవడం వల్ల మంచి రోజుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు మన రైతు.

ధర ఎందుకు రావడం లేదు? ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే ధాన్యం నిల్వలు పేరుకుపోయి ఉన్నాయి. నలభైలక్షల టన్నుల ధాన్యం గోదాముల్లో మగ్గుతోంది. పక్క రాష్ట్రాలకి గానీ, విదేశాలకి గానీ ధాన్యం ఎగుమతి చేయడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఆదేశాలు అమల్లో ఉన్న కారణంగా మన ధాన్యం మన గోదాముల్లోనే మగ్గుతోంది. ఇప్పుడు కొత్తగా వస్తున్న పంటని ఎక్కడ నిల్వ చేయాలన్నది మొదటి సమస్య. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేసి కేంద్రంతో మాట్లాడి రైల్వే వేగన్లకి అనుమతి తీసుకుని ఉంటే వాటిలో నిల్వ చేసుకునే అవకాశం ఉండేది. కానీ, కనుచూపు మేరలో వేగన్లు వచ్చే సూచనలేవీ కనిపించడం లేదు.

ఇప్పుడు రైతుల పరిస్థితి ఏమిటంటే, చేతినిండా పంట ఉంది. ఈ పంటని మంచి ధరకి అమ్మితే చేసిన అప్పులు తీర్చుకుని, కొత్త పంటకి పెట్టుబడులు సిద్ధం చేసుకోవచ్చు. కానీ, ఉన్న పంటని ప్రభుత్వం కొనదు, మరొకరికి అమ్మనీయదు. ఈనేపధ్యంలోనే ప్రణాళికా సంఘం దేశంలోని రైతుల స్థితిగతుల మీద నివేదిక విడుదల చేసింది. దేశం మొత్తం మీద ఉన్న రైతుల్లో 48.5 శాతం మంది అప్పుల్లో ఉన్నారు. రాష్ట్రాలకి వస్తే ఆంధ్ర ప్రదేశ్ అగ్ర స్థానంలో ఉంది. ఈ నివేదిక ప్రకారం మన రైతుల్లో అక్షరాలా ఎనభైరెండు శాతం మంది ఋణవలయంలో విలవిలలాడుతున్నారు.

ఇక ప్రభుత్వం నుంచి వ్యవసాయ రంగానికి అందుతున్న సబ్సిడీల పరిస్థితి దినదిన గండంగానే ఉంది. ఏ సబ్సిడీని ఎప్పుడు ఎత్తేస్తారో తెలియని అయోమయం కొనసాగుతోంది. పంటల బీమా అతికొద్ది మందికి మాత్రమే అందుబాటులో ఉంది. వ్యవసాయానికి సంబంధించి చాలా సమస్యలు కౌలురైతుల సమస్యతో ముడిపడి ఉన్నాయి. కౌలురైతుల హక్కుల విషయంలో ప్రభుత్వం ఎటూ చెప్పడం లేదు. ఇదే అనిశ్చితి కొనసాగితే మాత్రం వ్యవసాయం భవిష్యత్తు ప్రశ్నార్ధకం కావడం ఖాయంగా కనిపిస్తోంది.

గురువారం, మే 05, 2011

పరికిణీ!!

పదకొండేళ్ళ క్రితం..డిసెంబర్ పదో తారీఖు..ఆదివారం ఉదయం వేళ.. పేపర్ చూస్తుండగా ఎంగేజ్మెంట్స్ కాలమ్ లో 'తనికెళ్ళ భరణి కవితా సంపుటి 'పరికిణీ' ఆవిష్కరణ, రవీంద్ర భారతి, ఉదయం 11 గంటలకి' ఆకర్షించింది నన్ను. అంతకు కొన్ని నెలల ముందే 'స్వాతి' వారపత్రికలో 'కన్య-కుమారి' కవితలో ప్రారంభ వాక్యాలు "ఎక్కడ భజంత్రీలు మోగినా గుండెలో ముగ్గేసినట్టుంటుంది... ఎసట్లో పోసే బియ్యం తలంబ్రాలు అవుతాయ్..." లైన్లూ, ఆ కవితకి బాపూ గీసిన బొమ్మా అప్రయత్నంగా కళ్ళముందు మెదిలాయి.

కిక్కిరిసిన రవీంద్రభారతి ఆడిటోరియంలో, వేదిక మీద సినీ, సాహితీ ప్రముఖులు. నేను వెళ్లేసరికి సి. మృణాళిని, సంపుటిలో కవితలని స్త్రీవాద దృక్కోణం నుంచి పరిచయం చేస్తున్నారు. వేదిక మీద ఓ చివరి కుర్చీలో తెల్లని కుర్తా పైజమా ధరించి, తల వంచుకుని కూర్చుని మృణాళిని ఉపన్యాసాన్ని శ్రద్ధగా వింటున్నారు భరణి. 'స్వాతి' లో కవిత చూసేంత వరకూ భరణి లో ఓ కవి ఉన్నాడన్న సంగతి నాకు తెలియదు. నాటక రచయిత అని తెలుసు, పత్రికల్లో అప్పుడొకటీ, అప్పుడొకటీగా వ్యాసాలు చదివి ఉన్నాను.

సీటు వెతుక్కునే హడావిడిలో మృణాళిని ప్రసంగాన్ని శ్రద్ధగా వినలేకపోయాను. హాల్లో కొంచం చివరగా ఓ వరుసలో ఖాళీ సీటు కనిపించింది. ముఖ్య అతిధి బ్రహ్మానందం ప్రసంగం. జనం కేరింతలు. 'లంగా..లుంగీ...' అంటూ తన ఉపన్యాసంతో నవ్వించే ప్రయత్నం చేశాడు. కొంచం అసహనంగా కదులుతూ ఉండగానే భరణి తుదిపలుకులతో సభ ముగిసింది. కవితా సంపుటి ప్రత్యేక స్టాల్లో అందుబాటులో ఉందన్న ప్రకటన. వెల ఇరవై రూపాయలు. బయటికి వెళ్ళబోతూ యధాలాపంగా వెనక్కి చూశాను, టీవీలో రోజూ చూసే ఝాన్సీ-జోగినాయుడు. "ఈవిడ పుస్తకాలు కూడా చదువుతుందా?" సందేహం నాకు.


కౌంటర్ దగ్గర పెద్దగా రద్దీ లేకపోవడంతో సులభంగానే పుస్తకం దొరికింది. జనం వెళ్ళే హడావిడిలో ఉన్నారు. గోడకి ఆనుకుని పుస్తకం తెరిచాను. నేరుగా తొలి కవిత 'మధ్యతరగతి నటరాజు' లోకి వెళ్ళిపోయాను. "చుట్టూ సమస్యల జ్వాలా మాలా తోరణం! ఓ చేతిలో భగభగ మండే పుత్రాగ్ని! మరో చేతిలో చెంగుచెంగుమనే ఆశల జింక... మెళ్ళో బుసలు కొట్టే కుబుసం వదిలిన కూతురు!" ..అక్షరాల వెంట కళ్ళు పరుగులు పెట్టాయి. కవిత చివర ఫుట్ నోట్స్ లో "మా నాన్న రైల్వే లో గుమస్తా... ఏడుగురం కొడుకులం..అంటే అనగా అనగా ఓ రాజు.. ఆ రాజుకి ఏడుగురు.. అంచేత మానాన్న 'మధ్యతరగతి నటరాజు" నాకూ నాన్న గుర్తొచ్చారు.

యధాలాపంగా కళ్ళెత్తి చూస్తే, అతిధులెవర్నో గేటు వరకూ సాగనంపి, ఒంటరిగానూ హడావిడిగానూ లోపలికి వస్తున్న భరణి. గబుక్కున ఎదురెళ్ళి, పుస్తకం చేతిలో పెట్టాను "ఆటోగ్రాఫ్" అంటూ. తన లాల్చీ జేబు తడుముకున్నారు, పెన్ దొరకలేదు. నా జేబులో పెన్ తీసిచ్చాను.. తను ఆటోగ్రాఫ్ ఇస్తుండగానే ఎవరో పిలిచారు "భరణీ..." అంటూ. పుస్తకం నా చేతిలో పెట్టి తను హడావిడిగా కదలగానే నేను పిలిచా "భరణి గారూ, నా పెన్" అంటూ. తిరిగిచ్చేశారు. ఇంటికి తిరిగి వచ్చేలోగా పుస్తకంలోని పాతిక కవితలనీ రెండేసి సార్లు చదివేశాను, భరణి ఫుట్ నోట్స్ తో సహా..

రంభా ఊర్వశుల చేత ఆవకాయ పెట్టిస్తూ 'ఖారం ఖారం కల'గన్నా 'కుక్కలా బతకడం కుక్కలా చావడం రెండూ దిక్కుమాలిన సంగతులేనా?' అని ప్రశ్నిస్తూ చిన్నప్పటి కుక్కపిల్ల టామీని 'విశ్వాశ్వం' లో తలచుకున్నా, 'కళ్ళిచ్చిన వాడు వొట్టి చూపే ఇస్తే ఆ దేవుణ్ణి నేను శపించేవాణ్ణి! వాడు మంచాడు అందుకే.. కన్నీరిచ్చాడు!!' అంటూ కన్నీటి 'బిందు స్వరూపిణి!' ని జ్ఞాపకం చేసుకున్నా ప్రతి కవితలోనూ అండర్ కరెంట్ గా కనిపించేది ఒకటి ఉంటుంది, అది కరుణరసం. ఇంకా సందేహమా? అయితే 'మంచులో తడిసిన నందివర్ధనం పువ్వు లాంటి బామ్మ! సూర్యుడి కన్నా ముందే లేచి సరిగ్గా తోడుకొని తన జీవితం లాంటి పెరుగుని చిలికీ వెన్నలాంటిదేదో తీసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది' అన్న కవిత చదవాల్సిందే.

నిజానికి ఈ చిరు సంకలనంలో ఏ కొన్ని కవితల్ని మాత్రమే ప్రస్తావించినా మిగిలిన వాటికి అన్యాయం చేసినట్టు అవుతుంది. అన్నింటినీ ప్రస్తావించినా అసమగ్రంగానే ఉంటుంది. మొత్తం పుస్తకాన్ని యధాతధంగా టైపు చేసేస్తే అది భరణి కి చేసే తీరని ద్రోహమవుతుంది. అందుకే, సూటిగా, సరళంగా, స్పష్టంగా సాగే... మధ్యతరగతి జీవితం మీద నేరుగా సంధించిన నవరసాల సమ్మిళితమైన ఈ కవితల్ని 'పరికిణీ!!' సంకలనంలో మాత్రమే చదువుకోవాలి. (ఉదయం పుస్తకాల షాపుకి వెళ్ళినప్పుడు డిస్ప్లే లో ఉన్న కొత్త ప్రింట్ చూడగానే అలా అలా జ్ఞాపకాల్లోకి వెళ్లి, నా సంకలనాన్ని వెతికి పట్టుకుని మళ్ళీ ఓసారి చదువుకున్నాక ఇంకా ఏదో చేయాలని అనిపించి, ఇదిగో, ఇలా...)

మంగళవారం, మే 03, 2011

ఆరోగ్యశ్రీ

నాలుగేళ్ల క్రితం అట్టహాసంగా మొదలై, దాదాపు ఏడాది క్రితం వరకూ ఓ వెలుగు వెలిగి ప్రస్తుతంలో మిణుకు మిణుకుమంటున్న ఆరోగ్య బీమా పధకం రాజీవ్ ఆరోగ్యశ్రీ. 'మహానేత' కలల ప్రాజెక్టుల్లో ఒకటైన ఈ భారీ పధకం వల్ల సామాన్య ప్రజలకన్నా, కార్పొరేట్ ఆసుపత్రులు, బీమా సంస్థలే ఎక్కువగా లాభ పడుతున్నాయని కిట్టని వాళ్ళతో పాటు 'ఆరెండు' పత్రికలు అనేకసార్లు కోడై కూశాయి. ఇప్పుడూ అడపాదడపా కూస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మాత్రమే ప్రత్యేకమైన ఈ పథకం కింద, తెలుపు రంగు రేషన్ కార్డులు ఉన్నవారందిరికీ ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయబడ్డాయి. ఆరోగ్యశ్రీ కార్డు అందని పక్షంలో, తెల్ల రేషన్ కార్డునే ఆరోగ్యశ్రీ కార్డుగా పరిగణించాల్సిందిగా సంబంధిత ఆస్పత్రులకి ఉత్తర్వులు ఉన్నాయి. ప్రభుత్వం ఎంపిక చేసిన ఆస్పత్రులలో, ఎంపిక చేసిన అనారోగ్యాలకిగాను, కార్డుదారులకి వారి కుటుంబ సభ్యులకి కార్పొరేట్ ఆస్పత్రులలో ఉచిత వైద్యం లభిస్తుంది.

గడిచిన నాలుగేళ్ళలోనూ కార్పొరేట్ ఆస్పత్రి రిసెప్షన్లో డాక్టర్ నుంచి పిలుపుకోసం ఎదురు చూస్తున్నప్పుడు అనేకమార్లు ఎదురుపడ్డ దృశ్యం ఒకటే. ఆరోగ్యశ్రీ కార్డుతో వచ్చిన రోగులు, బంధువులు, ప్రత్యేక కౌంటర్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ నర్సు వారి రిపోర్టులు పరిశీలించి, వారి అనారోగ్యం ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాదని చెప్పడం. కనీసం పది సార్లకి తక్కువకాకుండా నాకెదురైన అనుభవం ఇది. ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స చేయడం ఎందుకు సాధ్యపడదో రోగులకి వివరించడానికి ఆస్పత్రి సిబ్బంది బాగానే కష్టపడేవాళ్ళు.

ఇప్పుడు స్వానుభవం. తెలిసిన వారొకరు ఆరోగ్యశ్రీ లబ్దిదారులు. వాళ్ళింట్లో పెద్దావిడకి అనారోగ్యం. రెండురకాల శస్త్ర చికిత్సలు అవసరం అని తేలింది. అదృష్టవశాత్తూ రెండు శస్త్ర చికిత్సలూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తున్నాయి. కానీ, ఏ ఆస్పత్రిలోనూ ఈ రెండు శస్త్ర చికిత్సల కాంబినేషన్ అందుబాటులో లేదు. కాంబినేషన్ అందుబాటులో ఉన్న హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ సౌకర్యం లేదు. రెండుసార్లు ఆపరేషన్ టేబిల్ మీద ఆ పెద్దావిడని పడుకోబెట్టడం, ఆవిడ ఆరోగ్యరీత్యా మంచిది కాదని డాక్టర్ల సూచన. ఇప్పుడు వాళ్ళేం చేయాలి?

పేదలకి కార్పొరేట్ వైద్యం అందడాన్ని ఎవరూ వ్యతిరేకించరు. ఎందుకంటే విద్య, ఆరోగ్యం ఈ రెండూ అందరికీ అందుబాటులో ఉండి తీరాలి. కానైతే, ఈ అందించే క్రమంలో ప్రైవేటు భాగస్వామ్యం విపరీతంగా పెరిగిపోవడం ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది? మనకి ఎన్నో ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నాయి. కానీ, ఏ ఒక్క దాంట్లోనూ పూర్తి స్థాయి సౌకర్యాలు లేవు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న నిపుణులైన వైద్యులని వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చేమో బహుశా. నిజానికి ఈ కారణాల వల్లే ఆరోగ్యశ్రీ లో ప్రభుత్వ భాగస్వామ్యం అన్న వాదన వినిపించింది అప్పట్లో.

ఆరోగ్యశ్రీ కోసం వెచ్చించిన మొత్తాన్ని, ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగు పరచడానికి ఉపయోగించి ఉంటే, కనీసం కొన్ని ధర్మాసుపత్రులైనా సర్వ సౌకర్యాలూ ఉన్న వైద్యశాలలుగా మారి ఉండేవి కదా? వెచ్చించిన సొమ్ముకు గాను, ప్రభుత్వానికి వైద్యపరికరాల రూపంలో స్థిరమైన ఆస్తులు మిగిలి ఉండేవి కూడా. ప్రభుత్వాసుపత్రుల్లో ఎలాగూ వైద్యం ఉచితమే కాబట్టి, లేనిదల్లా సౌకర్యాలే కాబట్టి, ప్రజలకి అన్ని అనారోగ్యాలకీ చికిత్స చేయించుకునే వీలుండేది. అప్పుడు 'ఆరోగ్యశ్రీ క్లైముల కోసం అవసరం లేకపోయినా ఆపరేషన్లు' లాంటి విమర్శలకి అవకాశం ఉండేది కాదు.

విద్య, వైద్యాలని పూర్తిగా ప్రైవేటు పరం చేయాలన్నది ప్రపంచబ్యాంకు నిబంధనల్లో ఒకటి అని వామపక్షీయులు చాలారోజులుగా చెబుతున్నారు. ఉన్నత విద్య దాదాపుగా ప్రైవేటు యాజమాన్యాల అధీనంలోకి వెళ్ళిపోయిన ప్రస్తుత తరుణంలో, ఆరోగ్యశ్రీ లాంటి పధకాలు, వాటి అమలు తీరు గమనిస్తున్నప్పుడు నిజంగానే ప్రపంచబ్యాంకు అటువంటి షరతు ఏదన్నా పెట్టిందేమో అన్న సందేహం కలుగక మానదు. ఎటూ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పధకాల 'సమీక్ష' ఒకటి జరగబోతోంది కాబట్టి, ఈ ఆరోగ్యశ్రీ ఏ రూపు దాలుస్తుందన్నది వేచి చూడాలి.

సోమవారం, మే 02, 2011

రాఘవులుగారి కొండమ్మ

కొందరు వ్యక్తులనీ, కొన్ని సంఘటనల్నీ ఓపట్టాన అర్ధం చేసుకోలేం. ముఖ్యంగా వాళ్ళు మనకి ప్రత్యక్షంగా తెలియనప్పుడూ, ఆ సంఘటనలు మన కళ్ళ ముందర జరగనప్పుడూ ఈ సమస్య కొంచం ఎక్కువ. రాఘవులుగారి కొండమ్మ గురించి మొదటిసారి విన్నప్పుడు నాకు ఏదో నవలలాగో, సినిమా కథలాగో అనిపించింది. కానీ కొండమ్మ గురించి నాకు తెలిసింది అమ్మ ద్వారా కావడం వల్ల కొంత సమయం తీసుకుని "ఇది నిజంగా జరిగింది" అన్న కంక్లూజన్ కి రాగలిగాను.

అమ్మకప్పుడు పదేళ్ళ వయసు. ఓరోజు మధ్యాహ్నం అమ్మమ్మ వంట పూర్తి చేసి, తోటకి వెళ్లి అరిటాకులు కోసుకొచ్చే పని అమ్మకి అప్పగించింది. వీళ్ళ తోటలో అమ్మకి అందే ఎత్తులో అరిటాకులు లేకపోవడంతో, సరిహద్దులో ఉన్న పక్క తోటమీద దృష్టి పెట్టింది అమ్మ. చుట్టూ అప్పుడే చిగుళ్ళు తొడుగుతున్న అరిటి మొక్కలు, వాటి మధ్యలో కొత్తగా కట్టిన ఓ చిన్న పెంకుటిల్లు. జాగ్రత్తగా కంచె దాటి, లేత అరిటాకులు కోసుకుంటున్న అమ్మని గట్టిగా కేకలేసింది ఓ కొత్త ఆడమనిషి.

తెల్లగా, సన్నగా, పొడుగ్గా ఉన్న ఆవిడకి పెద్ద కళ్ళూ, బారెడు జెడా ప్రత్యేక ఆకర్షణలు. అప్పటివరకూ ఊళ్ళో ఎవరిచేతా పల్లెత్తు మాట అనిపించుకొని అమ్మకి అవమానం. "సాయంత్రం మా అమ్మని తీసుకొస్తాను. మాట్లాడు" అని చెప్పి, కోసుకున్న అరిటాకులతో ఇంటికి వచ్చేసింది. లేత అరిటాకులని చూసి, జరిగింది తెలుసుకున్న అమ్మమ్మ, అమ్మనే కోప్పడింది, అలా చిన్న మొక్కల ఆకులు కోయకూడదని. ఆవిడే సాయంత్రం తోటకి వెళ్లి ఆ కొత్త మనిషికి సర్ది చెప్పింది కూడా. ఆ కొత్తావిడ గురించి ఊరంతా కొంచం వింతగా చెప్పుకోవడంతో పాటు, ఎవరూ ఆవిడతో మాట్లాడేవాళ్ళు కాదు.

అమ్మకి అప్పటికే పరిచయం అయిపోయింది కదా. నెమ్మదిగా స్నేహం కుదిరింది. ఆమె పేరు కొండమ్మ. తర్వాత ఎప్పుడూ అమ్మని కేకలేయక పోగా, తోటకి వెళ్ళినప్పుడల్లా చాలా ప్రేమగా మాట్లాడేది. అది కూడా, 'రాఘవులు గారు' ఇంట్లో లేని సమయంలో. అదే 'స్వామి' ఇంట్లో ఉన్నా ఆవిడ పెద్దగా పట్టించుకునేది కాదు. ఇంట్లో ఎవరూ లేనట్టుగానే వ్యవహరించేది. చుట్టుపక్కల వాళ్లకి అమ్మ, కొండమ్మల స్నేహం చేయడం నచ్చలేదు. "పరువు తక్కువ" అని అమ్మమ్మకి ఫిర్యాదు చేశారు కూడా.

కొండమ్మ గురించి అమ్మకి పూర్తిగా తెలియడానికి మరో నాలుగైదేళ్ళు పట్టింది. అదికూడా ఊళ్లోవాళ్ళ ద్వారా. రాఘవులు గారు ఊళ్ళో పెద్దమనిషి. తాతగారిని 'గురువుగారూ' అని గౌరవించే శిష్యులలో ఒకడు. ఆయనకి భార్య పిల్లలు ఉన్నారు. ఓసారి ఏదో పనిమీద పొరుగూరు వెళ్ళిన రాఘవులు గారికి కొండమ్మ తారసపడింది. ఇద్దరిదీ ఒకే కులం, ఆమెకి పెళ్ళికాలేదు. పరిచయం పెంచుకుని, రెండో పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదన పెట్టాడు రాఘవులు గారు. ఇందుకు కొండమ్మ ఒప్పుకోలేదు. రాఘవులు పట్టుపడితే అతని కూడా రావడానికి కొన్ని షరతులు పెట్టింది.

కొండమ్మ షరతుల్లో మొదటిది ఆవిడకి ఒక ఇల్లు, కొంత భూమి ఏర్పాటు చేయాలి. రెండు, ఓ కుర్రాడిని చూసి పెళ్లి చేయాలి. మూడు, జీవితాంతమూ ఆవిడ బాగోగులు చూసుకోవాలి. మొదటి, మూడో షరతులు రాఘవులుగారికి అసాధ్యాలేవీ కాదు. కొండమ్మ మీద తనకున్న ఆకర్షణ/ప్రేమ ఎంతటిది అంటే వినడానికే అసాధ్యంగా అనిపించే రెండో షరతుని కూడా సుసాధ్యం చేసేశాడు, కులమింటి కుర్రాడు స్వామిని వెతికి తేవడం ద్వారా. తనకంటూ ఎవరూ లేని స్వామిని కొండమ్మతో పెళ్ళికి రాఘవులుగారు ఎలా ఒప్పించారన్నది ఓ అంతు చిక్కని రహస్యం.

తోటలో కట్టించిన కొత్త ఇంట్లో కొండమ్మ-స్వామిల కాపురం మొదలయ్యింది. రాఘవులుగారు వస్తూ పోతూ ఉండేవారు. కాలక్షేపానికి అరిటి తోట పెంచడం కొండమ్మ కల్పించుకున్న వ్యాపకం. స్వామి వృత్తి పెంకుటిళ్ళు నేయడం. అదే కొనసాగించాడు. కాలక్రమంలో కొండమ్మగారికి ఇద్దరు ఆడపిల్లలు కలిగారు, రాఘవులు గారి ఆధ్వర్యంలో వాళ్ళ పెళ్ళిళ్ళు ఘనంగా జరిగాయి. కొంత కాలానికి కొండమ్మకి అనారోగ్యం. రాఘవులు గారి సమక్షంలో రాఘవులుగారి కొండమ్మ గానే వెళ్లిపోయిందావిడ. "కొండమ్మ, రాఘవులు, స్వామి...వీళ్ళు ముగ్గురూ నాకు అర్ధం అవ్వలేదు. ఇంక ఎప్పటికీ అర్ధం అవ్వరేమో..." ఇది అమ్మ చాలాసార్లు అన్నమాట.