గురువారం, మే 05, 2011

పరికిణీ!!

పదకొండేళ్ళ క్రితం..డిసెంబర్ పదో తారీఖు..ఆదివారం ఉదయం వేళ.. పేపర్ చూస్తుండగా ఎంగేజ్మెంట్స్ కాలమ్ లో 'తనికెళ్ళ భరణి కవితా సంపుటి 'పరికిణీ' ఆవిష్కరణ, రవీంద్ర భారతి, ఉదయం 11 గంటలకి' ఆకర్షించింది నన్ను. అంతకు కొన్ని నెలల ముందే 'స్వాతి' వారపత్రికలో 'కన్య-కుమారి' కవితలో ప్రారంభ వాక్యాలు "ఎక్కడ భజంత్రీలు మోగినా గుండెలో ముగ్గేసినట్టుంటుంది... ఎసట్లో పోసే బియ్యం తలంబ్రాలు అవుతాయ్..." లైన్లూ, ఆ కవితకి బాపూ గీసిన బొమ్మా అప్రయత్నంగా కళ్ళముందు మెదిలాయి.

కిక్కిరిసిన రవీంద్రభారతి ఆడిటోరియంలో, వేదిక మీద సినీ, సాహితీ ప్రముఖులు. నేను వెళ్లేసరికి సి. మృణాళిని, సంపుటిలో కవితలని స్త్రీవాద దృక్కోణం నుంచి పరిచయం చేస్తున్నారు. వేదిక మీద ఓ చివరి కుర్చీలో తెల్లని కుర్తా పైజమా ధరించి, తల వంచుకుని కూర్చుని మృణాళిని ఉపన్యాసాన్ని శ్రద్ధగా వింటున్నారు భరణి. 'స్వాతి' లో కవిత చూసేంత వరకూ భరణి లో ఓ కవి ఉన్నాడన్న సంగతి నాకు తెలియదు. నాటక రచయిత అని తెలుసు, పత్రికల్లో అప్పుడొకటీ, అప్పుడొకటీగా వ్యాసాలు చదివి ఉన్నాను.

సీటు వెతుక్కునే హడావిడిలో మృణాళిని ప్రసంగాన్ని శ్రద్ధగా వినలేకపోయాను. హాల్లో కొంచం చివరగా ఓ వరుసలో ఖాళీ సీటు కనిపించింది. ముఖ్య అతిధి బ్రహ్మానందం ప్రసంగం. జనం కేరింతలు. 'లంగా..లుంగీ...' అంటూ తన ఉపన్యాసంతో నవ్వించే ప్రయత్నం చేశాడు. కొంచం అసహనంగా కదులుతూ ఉండగానే భరణి తుదిపలుకులతో సభ ముగిసింది. కవితా సంపుటి ప్రత్యేక స్టాల్లో అందుబాటులో ఉందన్న ప్రకటన. వెల ఇరవై రూపాయలు. బయటికి వెళ్ళబోతూ యధాలాపంగా వెనక్కి చూశాను, టీవీలో రోజూ చూసే ఝాన్సీ-జోగినాయుడు. "ఈవిడ పుస్తకాలు కూడా చదువుతుందా?" సందేహం నాకు.


కౌంటర్ దగ్గర పెద్దగా రద్దీ లేకపోవడంతో సులభంగానే పుస్తకం దొరికింది. జనం వెళ్ళే హడావిడిలో ఉన్నారు. గోడకి ఆనుకుని పుస్తకం తెరిచాను. నేరుగా తొలి కవిత 'మధ్యతరగతి నటరాజు' లోకి వెళ్ళిపోయాను. "చుట్టూ సమస్యల జ్వాలా మాలా తోరణం! ఓ చేతిలో భగభగ మండే పుత్రాగ్ని! మరో చేతిలో చెంగుచెంగుమనే ఆశల జింక... మెళ్ళో బుసలు కొట్టే కుబుసం వదిలిన కూతురు!" ..అక్షరాల వెంట కళ్ళు పరుగులు పెట్టాయి. కవిత చివర ఫుట్ నోట్స్ లో "మా నాన్న రైల్వే లో గుమస్తా... ఏడుగురం కొడుకులం..అంటే అనగా అనగా ఓ రాజు.. ఆ రాజుకి ఏడుగురు.. అంచేత మానాన్న 'మధ్యతరగతి నటరాజు" నాకూ నాన్న గుర్తొచ్చారు.

యధాలాపంగా కళ్ళెత్తి చూస్తే, అతిధులెవర్నో గేటు వరకూ సాగనంపి, ఒంటరిగానూ హడావిడిగానూ లోపలికి వస్తున్న భరణి. గబుక్కున ఎదురెళ్ళి, పుస్తకం చేతిలో పెట్టాను "ఆటోగ్రాఫ్" అంటూ. తన లాల్చీ జేబు తడుముకున్నారు, పెన్ దొరకలేదు. నా జేబులో పెన్ తీసిచ్చాను.. తను ఆటోగ్రాఫ్ ఇస్తుండగానే ఎవరో పిలిచారు "భరణీ..." అంటూ. పుస్తకం నా చేతిలో పెట్టి తను హడావిడిగా కదలగానే నేను పిలిచా "భరణి గారూ, నా పెన్" అంటూ. తిరిగిచ్చేశారు. ఇంటికి తిరిగి వచ్చేలోగా పుస్తకంలోని పాతిక కవితలనీ రెండేసి సార్లు చదివేశాను, భరణి ఫుట్ నోట్స్ తో సహా..

రంభా ఊర్వశుల చేత ఆవకాయ పెట్టిస్తూ 'ఖారం ఖారం కల'గన్నా 'కుక్కలా బతకడం కుక్కలా చావడం రెండూ దిక్కుమాలిన సంగతులేనా?' అని ప్రశ్నిస్తూ చిన్నప్పటి కుక్కపిల్ల టామీని 'విశ్వాశ్వం' లో తలచుకున్నా, 'కళ్ళిచ్చిన వాడు వొట్టి చూపే ఇస్తే ఆ దేవుణ్ణి నేను శపించేవాణ్ణి! వాడు మంచాడు అందుకే.. కన్నీరిచ్చాడు!!' అంటూ కన్నీటి 'బిందు స్వరూపిణి!' ని జ్ఞాపకం చేసుకున్నా ప్రతి కవితలోనూ అండర్ కరెంట్ గా కనిపించేది ఒకటి ఉంటుంది, అది కరుణరసం. ఇంకా సందేహమా? అయితే 'మంచులో తడిసిన నందివర్ధనం పువ్వు లాంటి బామ్మ! సూర్యుడి కన్నా ముందే లేచి సరిగ్గా తోడుకొని తన జీవితం లాంటి పెరుగుని చిలికీ వెన్నలాంటిదేదో తీసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది' అన్న కవిత చదవాల్సిందే.

నిజానికి ఈ చిరు సంకలనంలో ఏ కొన్ని కవితల్ని మాత్రమే ప్రస్తావించినా మిగిలిన వాటికి అన్యాయం చేసినట్టు అవుతుంది. అన్నింటినీ ప్రస్తావించినా అసమగ్రంగానే ఉంటుంది. మొత్తం పుస్తకాన్ని యధాతధంగా టైపు చేసేస్తే అది భరణి కి చేసే తీరని ద్రోహమవుతుంది. అందుకే, సూటిగా, సరళంగా, స్పష్టంగా సాగే... మధ్యతరగతి జీవితం మీద నేరుగా సంధించిన నవరసాల సమ్మిళితమైన ఈ కవితల్ని 'పరికిణీ!!' సంకలనంలో మాత్రమే చదువుకోవాలి. (ఉదయం పుస్తకాల షాపుకి వెళ్ళినప్పుడు డిస్ప్లే లో ఉన్న కొత్త ప్రింట్ చూడగానే అలా అలా జ్ఞాపకాల్లోకి వెళ్లి, నా సంకలనాన్ని వెతికి పట్టుకుని మళ్ళీ ఓసారి చదువుకున్నాక ఇంకా ఏదో చేయాలని అనిపించి, ఇదిగో, ఇలా...)

9 వ్యాఖ్యలు:

 1. చదివినప్పుడే అక్షరాలు మన కళ్ళని చెమర్చేలాచేస్తాయి. ఆయన గాత్రంలో వింటే మన కళ్ళు వర్షిస్తాయి. ఒక డిసెంబరు 31 రాత్రి ఆ అదృష్టం మాకు దక్కింది. తెలుగు బ్లాగర్లని ఇంటికి రమ్మని ఆయన ఆహ్వానించారు. సమయాభావం వలన విషయం ఎవరికీ చేర్చలేకపోయాం. నేను, సతీష్ యనమండ్ర వెళ్ళాం. జీవితంలోని మరిచిపోలేని నూతన సంవత్సరం అది మాకు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఆయనతో మాట్లాడినవాళ్ళకు తెలుస్తుంది భరణి ఎంతటి స్నేహశీలో.ఒకరోజు కొన్ని గంటలు ఒకకార్యక్రమంలో,ఆయనతో గడిపాను.వీడియో కూడా తీసాను.కారణాంతరాలవల్ల సైటులో కానీ మరెక్కడా కానీ లోడ్ చెయ్యలేకపోయాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మీ పుస్తక పరిచయం బావుందండీ. తప్పకుండా కొని చదవాలి. భరణి గారి రచనా, నటనా అన్నీ సహజంగా చాలా అందంగా ఉంటాయి. ప్రస్తుతం స్వాతిలో వస్తున్న నక్షత్ర దర్శనం అద్భుతంగా ఉంది. పదాలూ, ప్రాసలూ ఆయన కలం నుంచీ అలవోకగా జారిపోతాయి. ముఖ్యంగా భానుమతి గారి మీద రాసిన కవిత, ఆవిడ అత్తగారి కథల్లా బహు చమత్కారంగా ఉంది.

  ఒకసారి కాకినాడ నుంచీ వస్తుంతే గౌతమి లో ఆయన కుటుంబంతో వస్తూ కలిసారు. స్టేషన్ లో హడావుడిగా రైలు ఎక్కుతూ ప్లాట్ఫాం మీద ఆయన్ని చూసిన నేను వీడ్కోలు చెప్పటానికి వచ్చిన బంధుమిత్రులూ, నాతో ఉన్న మావారు, పిల్లల్ని వదిలేసి ఆయనతో మాట్లాడాను. ఒకటే కంపార్ట్మెంట్కావడంతో మళ్ళీ తర్వాత వెళ్ళి అందరం కాసేపు కలిసి వచ్చాం. అప్పుడు ఆయన నాకు ఆట కదరా శివా, ఎందరో మహానుభావులు పుస్తకాలు సంతకం చేసి ఇచ్చారు. అలాంటి గొప్ప వ్యక్తి ని కలవటం నిజంగా నాకు ఒక మంచి ఙ్నాపకం.

  శ్రీరాగ

  ప్రత్యుత్తరంతొలగించు
 4. @MURALI: మీ అదృష్టాన్ని ఊహించే ప్రయత్నం చేస్తున్నానండీ.. ధన్యవాదాలు.
  @రాజేంద్రకుమార్ దేవరపల్లి: నాకూ తెలిసిందండీ.. ఈ పుస్తకం ఫంక్షన్ తర్వాత కొన్నాళ్ళకి అనుకోకుండా కలవడం, ఆయన నాకో సర్ప్రైజ్ ఇవ్వడమూ జరిగింది.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. @శ్రీరాగ: చాలా బాగుందండీ.. నిజమే, తను చాలా నిరాడంబరంగా మాట్లాడతారు.. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడం ఆంటే అదేనేమో.. ధన్యవాదాలు.
  @oremuna: ధన్యవాదాలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 6. @చంటి: నిజమేనండీ.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. nenu e pustkani konali anukutunanu ,nenu chennai lo vunanu ikada adina book shop lo dorukutunda...?

  online lo order ivagalana...?naku hard copy kavali.

  Madhu

  ప్రత్యుత్తరంతొలగించు