శుక్రవారం, మే 20, 2011

తెగిన పేగు

"ఏళ్ళూ పూళ్ళూ గడిచిపోయినా భాష, దేశం కూడా మారిపోయినా మాతృభూమి మీద మమకారం మాత్రం తగ్గిపోదు. ఒక మాటలో చెపితే మట్టితో అనుబంధం రక్త సంబంధం లాంటిది. మట్టికీ మనిషికీ మధ్య ఉండే సెంటిమెంటుకి సంబంధించిన కథలెన్నో వచ్చాయి. వాటిలో విశిష్టమైనదీ కథ. ఎన్నుకున్న బేక్ డ్రాప్ విభిన్నమైంది. ఇది హృదయాన్ని ద్రవింపజేసే అభాగ్య కథ అయినా కథగా భాగ్యవంతమైందే" ...పిశుపాటి ఉమామహేశం కథ 'తెగిన పేగు' కి వంశీ రాసుకున్న ఫుట్ నోట్స్ ఇది.

ఆంధ్ర దేశంలో మధ్యతరగతి ఉద్యోగి సుబ్బారావు. అతని తల్లి డెబ్భై ఐదేళ్ళ వితంతువు నాగలక్ష్మి. ఆవిడ స్వస్థలం కేరళ లోని పాల్ఘాట్ దగ్గరలోని ఓ పల్లెటూరు. ఆమెకి ఐదేళ్ళ వయసప్పుడు సుబ్బారావు తండ్రి -- ఆంధ్ర దేశంలో కన్యాశుల్కాలు విపరీతంగా పెరిగి పెళ్ళికూతుళ్ళు దొరకని కారణంగా -- చాలామంది ఆంధ్ర బ్రాహ్మణ యువకుల్లాగే పాల్ఘాట్ వెళ్లి ఆమెని కొనుక్కుని తెచ్చుకుని పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ అక్కణ్ణుంచి వచ్చి ఆమెని చూసిన వాళ్ళూ లేరు, ఇక్కణ్ణుంచి తీస్కెళ్ళి చూపించిన వారూ లేరు. ఒక్క తాళితో పుట్టింటి బంధం తెగిపోవడం ఎంత అమానుషం!

సంసారపు మాయలో పడి తన జన్మ వృత్తాంతాన్నే మరిచిపోయే స్థితికి వచ్చిన నాగలక్ష్మికి, కొడుకు దక్షిణ దేశ యాత్ర కడుతుండగా ఎన్నాళ్ళుగానో నిద్రాణమైన కోరిక మళ్ళీ మేలుకొంది. "ఆహా.. నీకేమీ ఇబ్బంది లేకపోతేనే.." అని మొహమాటంగా అడిగింది కొడుకుని, 'తన' ఊరికి ఒక్కసారి తీసుకెళ్ళమని. నిజానికావిడకి తన ఊరిపేరు కూడా గుర్తు లేదు. యాత్రల తిరుగుప్రయాణంలో పాల్ఘాట్ లో దిగిన సుబ్బారావు కుటుంబం, ఆ ఊరు కనుగొనే ప్రయత్నాల్లో పడుతుంది. రైల్వే వారి సహాయంతో చుట్టుపక్కల ఊళ్ళ జాబితా సంపాదించిన సుబ్బారావు ఒక్కోపేరూ చదువుతూ ఉండగా 'వేజ్నప్పోడి' అన్న పేరు వింటూనే "ఆ! అదే" అంటుందావిడ ఆనందంగా.

ఐదు మైళ్ళ దూరంలో ఉన్న ఆ ఊరు చేరి, భాష సమస్య ఎదుర్కొని, ఇంగ్లీష్ తెలిసిన ఓ రిటైర్డ్ స్కూల్ మాస్టర్ సాయంతో 'అమ్మ పుట్టిల్లు' వెతికే పనిలో పడతాడు సుబ్బారావు. ఎంత ప్రయత్నించినా తన ఇంటి ఆనవాళ్ళు ఏవీ గుర్తుకు రావు నాగలక్ష్మికి. అతికష్టం మీద "మీ ఇంటి పక్క గుళ్ళోనే నిన్ను మొదటిసారి చూశాను, నాగమల్లి పూలేరుతుండగా" అంటూ భర్త చెప్పిన మాట నాగలక్ష్మికి జ్ఞప్తికి రాగా, ఆ ఆధారంతో ఇంటి వేట మొదలవుతుంది. రెండు మూడు గుళ్ళు వెదికేక నాలుగో గుడి చూస్తుండగానే ఆవిడకి లీలగా ఏదో పునర్జన్మ స్మృతిలా గుర్తుకొస్తుంది. గుడికి ఎడంపక్క ఇల్లు.. కానీ పెంకుటిల్లని గుర్తు. అదిప్పుడు డాబా అయింది.

లోపల మండువాలో ఓ ముసలాయన వాలుకుర్చీలో పడుకొని రేడియో వింటున్నాడు. నాగలక్ష్మికో తమ్ముడుండాలి. బహుశా ఈయనేనేమో.. పోలికలు.. ఆవిడలో ఏదో నమ్మకం క్రమంగా బలపడసాగింది. ఆ యింటి వాతావరణం చూస్తుంటే అప్రయత్నంగా ఆవిడ నోటంట 'అప్పు' అన్న మాటొచ్చింది. "అవును నేనే, ఇంట్లో అందరూ 'అప్పు' అనే అంటారు. అప్పుకుట్టి.." అన్నాడాయన మలయాళంలో. మాస్టారు ట్రాన్స్లేట్ చేసేరు. అప్పుకి కూడా తన చిన్నతనంలో ఒక అక్కగార్ని ఎవరికో అమ్మేసేరని వాళ్ళూ వీళ్ళూ చెప్పిన ముచ్చట గుర్తుకొచ్చింది. ఆమెలో పోలికలు కూడా లీలగా అగుపడ్డాయి.

ఏవేవో జ్ఞాపకాలు అల్లుకోగా పిచ్చెత్తినట్టు తడబడే అడుగులతో ఇల్లంతా కలియ తిరుగుతుంది నాగలక్ష్మి. వంటింటిని గుర్తు పడుతుంది. దొడ్లో బాదం చెట్టునూ, పున్నాగ చెట్టునూ గూర్చి అడుగుతుంది. అవెప్పుడో చచ్చిపోయాయి. ఇంకా ఏవేవో అడుగుతుంది. కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. అమ్మా, నాన్నా, నలుగురక్కలూ, ఇద్దరన్నలూ కాలం చేసినట్టు తెలిసి ఏడుపొచ్చేస్తుంది ఆమెకి. ఏడుస్తూనే ఇల్లంతా కలియ తిరుగుతుంది. పుట్టిన చోటే గిట్టే భాగ్యానికి నోచుకోక, పరాయి పంచన బతుకు వెళ్ళదీయాల్సిన తన దుస్థితికి కుమిలి కుమిలి ఏడుస్తుంది.

ఊళ్లోకల్లా దీర్ఘాయుష్కుడైన తొంభయ్యేళ్ళ వృద్దుడికి కబురు పెట్టి రప్పిస్తారు మేష్టారు. నాగలక్ష్మిని గుర్తు పడతాడాయన. అప్పుతో ఆమె చేయి కలుపుతాడు. అంతవరకూ కేరళ దేశంలోని పరాయి మగవాడుగా కనబడ్డ ఆయన ఆమెకీ, తెలుగుదేశం నుంచి వచ్చిన పండు ముసలామెగా ఆమె ఆయనకీ కనబడి దూరంగా ఉండిపోయిన వారల్లా ఆక్షణంలో నిజంగా అక్కాతమ్ముళ్ళమనే భావన పొంగి పొరలింది ఇద్దరిలోనూ. రక్తస్పర్శ మహిమ!! చూసే అందరికీ వింతగానే ఉంది ఈ అపూర్వ సంగమం. ఇక భవిష్యత్ కార్యక్రమం ఏమిటి? దేవుణ్ణి నాగలక్ష్మి కోరుకున్న ఓకే ఒక్క కోరిక ఏమిటి?? .....'వంశీకి నచ్చిన కథలు' సంపుటిలో ఉందీ కథ.

7 వ్యాఖ్యలు:

 1. చాలా బాగుందండి. మీ పరిచయం కూడా చాలా బాగుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. చాలా బాగుంది మురళి గారు కధ.
  నిజంగా పుట్టిన ఇల్లు,ఊరు మనిషి ఎప్పటికీ మర్చిపోలేని మధురానుభూతులు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మనసు ద్రవించిందండి .
  మా వూరి లో ఇలా పాల్ ఘాట్ నుంచి వచ్చిన మామ్మలు ఇద్దరు ఇంకా వున్నారండి . వారికీ ఇలాగే వాళ్ళ వాళ్ళ గురించి ఏమీతెలీదు . వాళ్ళను ఎప్పుడు చూసినా జాలి వేస్తుంది .

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఈ మధ్యనే పాలఘాట్ ఊరి దగ్గరినుంచి రావటం జరిగింది. అక్కడ జరిగే ఈలాటి విషయాలే మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఆ ఊరు కూడా మామూలుగానే ఉంది. ఇప్పుడు ఇదే విషయం మీరూ రాసారు. కొంచెం ఊహించగలను, కాని ప్లీజ్....నాగలక్ష్మి, దేవుడ్ని కోరుకున్న కోరిక ఏమిటో చెప్పరా...ఆ బుక్ ఎప్పుడు చదువుతానో చెప్పలేనుకదా...

  ప్రత్యుత్తరంతొలగించు
 5. Amazing. I didn't even knew that Andhra Brahmins used to marry Palghat women. I too have the same request as of Jayagaru.


  http://creative-oracle.blogspot.com/

  ప్రత్యుత్తరంతొలగించు
 6. @మురళి: ధన్యవాదాలండీ..
  @రాజి: ధన్యవాదాలండీ..
  @మాలాకుమార్: నిజమేనండీ.. చాలా దారుణం కదా.. ...ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. @జయ: సంగతి తెలిసీ మీరు ముగింపు అడగడం భావ్యమా చెప్పండి? అయినా ఈ బుక్ మీదగ్గర ఉందని చెప్పినట్టు జ్ఞాపకం? ..ధన్యవాదాలు.
  @Creative Oracle: ముగింపు మీరు చదివితేనే బాగుంటుందండీ .. చాలా చక్కని కథ.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు