శనివారం, మే 28, 2011

వైశాలి

వారం రోజులు వ్యవధిలో రెండో డబ్బింగ్ సినిమా. ఇది కూడా తమిళం నుంచి తెలుగుకి అనువాదమైనదే. ఇంకా 'రంగం' హ్యాంగోవర్ నుంచి తేరుకోక ముందే, ఈ శుక్రవారం విడుదలైన 'వైశాలి' సినిమా బాగుందనే టాక్ వినిపించింది. తమిళ దర్శకుడు శంకర్, తెలుగు నిర్మాత దిల్ రాజు తో కలిసి నిర్మించిన ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే సమకూర్చడంతో పాటు దర్శకత్వ బాధ్యతని అరివళగన్ నిర్వహించారు. ఇది కూడా పూర్తిగా దర్శకుడి సినిమానే.

నగరం నడిబొడ్డున రెండువందల యాభయ్యారు ఫ్లాట్లున్న ఓ అపార్ట్మెంట్ లో 'ఇ-సిక్స్' ఫ్లాట్ లో నివాసం ఉండే వైశాలి బాలకృష్ణన్ (సింధు మీనన్) అనే గృహిణి అనుమానాస్పద మరణం సినిమాలో ప్రారంభ సన్నివేశం. బాత్ టబ్ లో ఉంటుంది వైశాలి మృతదేహం. ఫ్లాట్ లో ట్యాప్ కట్టకపోవడంతో కిందవరకూ నీళ్ళు వచ్చేయడంతో వాచ్మన్ గమనించి తలుపు కొట్టడంతో మరణవార్త వెలుగులోకి వస్తుంది.

వైశాలి తన జాకెట్లో దాచుకున్న, ప్లాస్టిక్ కవర్ తో చుట్టిన సూసైడ్ నోట్ దొరుకుతుంది పోలీసులకి. తన భర్తకి రాసిన ఆ ఉత్తరంలో తాను తప్పు చేశాననీ, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాననీ, ఇందుకు ఎవరూ బాధ్యులు కారనీ చెబుతుంది వైశాలి. పోలీస్ విచారణలో, చుట్టుపక్కల ఫ్లాట్స్ లో ఉండేవారంతా వైశాలి ప్రవర్తన మంచింది కాదనీ, ఆమెకోసం ఎవరో ఒక వ్యక్తి ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో వచ్చి వెళ్తున్నాడనీ చెబుతారు.

పోలీసులు వైశాలిది ఆత్మహత్యగా నిర్ధారించి కేస్ క్లోజ్ చేయబోతున్న సమయంలో తనకొక్క అవకాశం ఇమ్మంటూ పై అధికారులని అడుగుతాడు అసిస్టెంట్ పోలిస్ కమిషనర్ వాసుదేవన్ అలియాస్ వాసు(ఆది, మన తెలుగు దర్శకుడు రవిరాజా పినిశెట్టి కొడుకు). వైశాలిది ఆత్మహత్య కాదని వాసు నమ్మకం. అంతే కాదు, ఆమె తప్పు చేసే మనిషి కాదని చాలా బలంగా నమ్ముతాడతడు. వైశాలిని గురించి అతనికి అంత నమ్మకం ఎందుకంటే, చదువుకునే రోజుల్లో ఆమెని ప్రేమించి, పెళ్ళికి ఆమె తండ్రి ఒప్పుకోకపోవడంతో వైశాలికి దూరమయ్యాడు వాసు.

ఓ పక్క మర్డర్ మిస్టరీ, మరో పక్క ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే వాసు-వైశాలి ల ప్రేమకథ. రెంటినీ బ్యాలన్స్ చేస్తూ సినిమా మొదటి సగానికి స్క్రీన్ ప్లే రాసుకున్న తీరు ముచ్చటగొలిపింది. చక్కని ఎడిటింగ్, అనవసరంగా పాటలని ఇరికించక పోవడం.. ఇవన్నీ మొదటి సగానికి ప్లస్ పాయింట్లు. వైశాలి చెల్లెలు దివ్యగా శరణ్య మోహన్ కనిపించింది. మొదటిసగంలో ఈమెది అంతగా ప్రాధాన్యత ఉన్న పాత్ర కాదు. అయితే రెండో సగంలో కథ మలుపులకి దివ్య కీలకమయ్యింది.

మొదటి సగాన్ని యెంతో చక్కగా తీసిన దర్శకుడు రెండో సగానికి వచ్చేసరికి తడబడ్డాడు. రెండో సగం కోసం ఎన్నుకున్న పాయింట్ కన్విన్సింగ్ గా లేకపోవడం వల్ల, అప్పటివరకూ ఏక్టివ్ గా సాగిన వాసు పాత్ర పాసివ్ గా మారిపోయింది. సన్నివేశాలు వస్తూ, వెళ్తూ కథని నడిపించేశాయి. ఫలితంగా, సినిమా ప్రేక్షకులు ఊహించగలిగే ముగింపుకి వచ్చి, నిరుత్సాహ పరిచింది. అలాగే మొదటి సగంతో పోల్చినప్పుడు రెండో సగంలో సాగతీత కనిపించింది. కొంత ఎడిట్ చేయొచ్చు.

నటన గురించి చెప్పాల్సి వస్తే మొదట చెప్పాల్సింది వైశాలిగా చేసిన సింధు మీనన్ గురించే. కాలేజీ విద్యార్ధిని గా ఒప్పకపోయినా (వయసు దాచే ప్రయత్నం ఫలించలేదు), గృహిణి గా ఆమె ఆహార్యం చాలా బాగుంది. అలాగే నటన కూడా. వాసుగా చేసిన ఆదితో, బాలకృష్ణన్ గా చేసిన నందా పోటీ పడ్డాడు నటనలో. ఆది కొన్ని యాంగిల్స్ లో మంచు విష్ణుని గుర్తు చేశాడు. శరణ్య మోహన్ రెండో సగంలో తన పాత్రకి న్యాయం చేసింది. కాకపొతే కథ, కథనాల విషయంలోనే దర్శకుడు తీసుకోవల్సినంత జాగ్రత్త తీసుకోలేదనిపించింది.

ఇరవై రెండేళ్ళ క్రితం ఇదే పేరుతో వచ్చిన సినిమాలో (అది కూడా డబ్బింగ్ సినిమానే) 'ప్రేమ జీవన రాగం..' అనే పాట యెంతో బాగుంటుంది. ఈ సినిమాలో అలా గుర్తు పెట్టుకునే పాట లేదు. కాకపొతే నేపధ్య సంగీతం (తమన్) బాగుంది. వైశాలి మరణం తర్వాత, ఆ అపార్ట్మెంట్ లో అదే తరహా మరణాలు వరుసగా సంభవించడం తో వాసు ఏదో చేస్తాడని ఎదురు చూసిన ప్రేక్షకులు, అతనేం చేస్తున్నాడో తెలియని అయోమయానికి గురయ్యారు రెండో సగంలో. సస్పెన్స్ లని ముడి వేయడంలో చూపిన శ్రద్ధ వాటిని విప్పడంలో కూడా చూపి, లాజిక్ కి అందే విధంగా కథ రాసుకుని ఉంటే ఖచ్చితంగా చాలా మంచి సినిమా అయి ఉండేది. సస్పెన్స్, థ్రిల్లర్ లని ఇష్టపడే వాళ్ళు చూడొచ్చు ఈ 'వైశాలి' ని.

8 వ్యాఖ్యలు:

 1. e cinema tamil lo eram ane peru tho vidudhalayii almost 2 years avvabothundhi...

  any how nice movie to watch...

  ప్రత్యుత్తరంతొలగించు
 2. nenu e movie tamil lo nee chusa eeram ani maa friends lo okadiki tamil vachi naa taste telisi recommend chesthe , 2 years back cinema ani gurthu but nice one

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఈ సినిమాలో హీరోవిను దయ్యమై విలన్లను చంపుతుందన్న పాయింటు కాస్త ఎబ్బెట్టుగా ఉంది. కాలేజీ ప్రేమ, అపార్ట్ మెంట్ జీవితాలు బానే తీసిన దర్శకుడు, ఆ తర్వాత కథ చెడగొట్టినట్టు అనిపిస్తుంది.

  నవతరంగంలో దీని మాతృక "ఈరం" మీద రెండు సమీక్షలొచ్చాయి. చూడండి. చిన్నసైజు వ్యాఖ్యలపోరాటమూ అప్పట్లో ఒక ముచ్చట. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఆది కొన్ని యాంగిల్స్ లో మంచు విష్ణుని గుర్తు చేశాడు.....:) :)

  ప్రత్యుత్తరంతొలగించు
 5. వైశాలి మరణం తర్వాత, ఆ అపార్ట్మెంట్ లో అదే తరహా మరణాలు వరుసగా సంభవించడం తో వాసు ఏదో చేస్తాడని ఎదురు చూసిన ప్రేక్షకులు, అతనేం చేస్తున్నాడో తెలియని అయోమయానికి గురయ్యారు రెండో సగంలో.

  avunu murali garu ,nenu ayte ee hero entra babu inka emi cheyadu,andaru varasa betti chastunte.kanisam chavadaniki karanam manisha ,inka edyna na anedi intermission varaku reveal cheyaka poyesariki naku kopam vachindi.

  kani aa chinna papa dayyam mask vesukoni valla nanna ni bayapette scene lo ,vadi sangati emo gani ,nenu matram theatre lo ne gattiga arichesanu bayapadi. :(

  Kani naku matram recent ga vachina telugu movies kante better anipinchindi.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. @నేనింతే: అవునండీ.. ధన్యవాదాలు.
  @బాలు: తమిళ్ లో పెద్ద హిట్ అని విన్నానండీ.. ధన్యవాదాలు.
  @రవి: చూశానండీ :)) ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. @రాజేంద్రకుమార్ దేవరపల్లి: మీ నవ్వు వెనుక ఏదో గూడార్ధం గోచరిస్తోంది.. తెలుసుకునే ప్రయత్నాలు చేస్తాను :)) ..ధన్యవాదాలు.

  @శ్రావ్య: నిజమేనండీ.. తెలుగు స్ట్రైట్ సినిమాలు ఈమాత్రమూ లేవు మరి.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. ఈ సినిమా కూడా పోయిన వారం చూశాను. మొదటి సగం వాటర్ ఎఫెక్ట్స్ & గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే బాగున్నాయ్ కానీ మీరన్నట్లు రెండో సగం తేలిపోయింది అనిపించిందండీ...
  శ్రావ్య గారు :) మీరు చెప్పిన సీన్ లో అరక్షణం నేనూ ఉలిక్కిపడ్డాను కానీ తర్వాత చాలా సేపు నవ్వుకున్నానండీ..

  ప్రత్యుత్తరంతొలగించు