సోమవారం, మే 23, 2011

ఇల్లాలి ముచ్చట్లు

పుస్తకాల షాపుకి వెళ్ళినప్పుడు కంటికెదురుగా మనకి నచ్చిన పుస్తకం కనిపిస్తే వెంటనే కొనేయాలనీ, "చాలా కొన్నాం కదా.. మళ్ళీసారి చూద్దాం" అని అస్సలు అనుకోకూడదనీ కొన్ని అనుభవాల తర్వాత తెలుసుకున్నాను. ఆ కొన్నింటిలో ఒకానొక అనుభవాన్ని ప్రసాదించిన పుస్తకం పురాణం సీత రాసిన 'ఇల్లాలి ముచ్చట్లు.' ఈపేరు తలచుకోగానే కుంపటి దగ్గర కూర్చున్న స్త్రీమూర్తి బొమ్మ, బాపూ గీసింది, గుర్తుకొచ్చేస్తుంది. 'ఆంధ్రజ్యోతి' లో ప్రతివారం అదే బొమ్మ, ముచ్చట్లు మాత్రం ఓ వారానికీ మరో వారానికీ అస్సలు సంబంధం లేని విధంగా సాగాయి.

నిజానికి ఈ పుస్తకం ఆసాంతమూ ఓసారి చదివేసి, ఆ తర్వాత పక్కన పెట్టేసేది కాదు. ఫస్ట్ రీడింగ్ కాగానే, కొంచం అందుబాటులో పెట్టుకుని అప్పుడప్పుడూ చేతిలోకి తీసుకుని కనీసం కాసిన్ని పేజీలైనా తిప్పాల్సిన పుస్తకాల జాబితాలోది. పంతొమ్మిది వందల అరవైలో మొదలై తర్వాత మూడు దశాబ్దాల పాటు వారం వారం నిర్విరామంగా ప్రచురితమైన 'ఇల్లాలి ముచ్చట్లు' కాలమ్ నుంచి ఎంపిక చేసిన నూటయాభై తొమ్మిది ముచ్చట్లను సంకలించి మార్కెట్లో పెట్టారు నవోదయ బుక్ హౌస్, కాచిగూడ, హైదరాబాద్ వారు.

అసలు ఇల్లాలు అనగానే వెంటనే స్ఫురణకి వచ్చేవి వంటా వార్పూ, ఇరుగమ్మలు, పొరుగమ్మలతో ముచ్చట్లతో కాలక్షేపం చేసే స్త్రీజనం. కానైతే మన సీత వీళ్ళ కన్నా భిన్నమని బాపు చెప్పకనే చెప్పేశారు. అవడానికి కుంపటి దగ్గరే కూచుంటుంది కానీ, మొత్తం భూగోళాన్నే బాండీలో వేగించి తీయగల సమర్దురాలీవిడ. ఆవకాయ నుంచి అంతరిక్షం వరకూ, చీర సారెల నుంచి చదరంగం వరకూ సీతకి తెలియని విషయం లేదు. పైగా, దేనిగురించైనా సాధికారికంగా మాట్లాడగల తెలివితేటలూ, తను చెప్పదలచుకున్న విషయాన్ని అందరిచేతా ఒప్పించగల నైపుణ్యం ఈవిడ సొంతం.

గోదారి జిల్లా పల్లెటూళ్ళో బాల్యాన్ని గడిపి, బావని కొంగుకి ముడేసుకుని, అతనితో పాటు కాపురానికి ఎన్నో మహానగరాలు తిరిగి తిరిగి బెజవాడ వచ్చి స్థిరపడ్డ సీతమ్మ ముచ్చట్లలో ప్రధానంగా కనిపించేవి రెండే రెండు -- కష్టం, సుఖం. మరి ఇవే కదా జీవితం. ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఊరికే కూర్చుని బాధపడిపోకుండా, ఓసారలా జ్ఞాపకాల్లోకి వెళ్లి సంతోషంగా గడిపిన రోజుల్ని గుర్తు చేసుకుని రీచార్జ్ అయ్యే టెక్నిక్ కొందరు ఇల్లాల్లకి తెలియక పోవచ్చేమో కానీ, పురాణం సీతకి మహబాగా తెలుసు.

అలా గుర్తు చేసుకున్నవే తన చిన్న నాటి ఆటలూ, వయసొచ్చాక బావని గురించిన ఆలోచనలూ, అతగాడి కోసం చూసిన ఎదురు చూపులూ అన్నీను. ఇంగ్లీషు పెద్దగా రాదంటూనే, పెద్ద పెద్ద రచయితల్ని, కవుల్నీ ఉటంకించేస్తూ కబుర్లు చెప్పేస్తుంది. కృష్ణశాస్త్రి అన్నా, సైగల్ అన్నా సీతకి ఎంత ఇష్టమో చెప్పలేం. ఆచారాల్లో కొన్నింటిని ఉతికి ఆరేసేటప్పుడు, జనం అవలక్షణాలని చీల్చి చెండాడేటప్పుడూ అపర కాళికే అవుతుందీ సుకుమారి. 'కన్నె మనసులు' గురించి ఎంత సుకుమారంగా చెబుతుందో, 'గేదె మనసులు' గురించి అంత వ్యంగ్యంగానూ చెప్పగలదు.

అసలు అవతలివాడు ఎంతటి వాడన్నది లెక్కచేయకుండా సెటైర్లు వేయడంలో సీతకి సీతే సాటి. ఈవిషయంలో దేవుడైనా, పతిదేవుడైనా సీతకి సమానమే. అంతలోనే 'పెళ్ళాన్ని విమర్శించకు' అంటూ మగ మహారాజులకి పాఠం చెప్పేయగలదు. విషయం ఏదన్నా కానీ, దానిక్కొంచం వగరూ, పొగరూ జోడించి చదివిన వాళ్లకి మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేలా రాసవతల పారేసిందంతే. కాకపొతే చదివేటప్పుడు అక్కడక్కడా ఆ అక్షరాల వెనుక 'మగ' హృదయం కనిపిస్తే అదే చదివేవాళ్ళ తప్పు కాదు.

ఎందుకటే, ఈ ముచ్చట్లని రాసింది ప్రసిద్ధ పత్రికా సంపాదకుడు, రచయిత పురాణం సుబ్రహ్మణ్య శర్మ. తన భార్య సీత పేరిట నడిపారీ కాలమ్ ని. నిజానికి ఓ పురుషుడు ముప్ఫయ్యేళ్ళ పాటు నడిపిన కాలమ్ లో ఎక్కడో తప్ప రాసింది స్త్రీ కాదేమో అనే సందేహానికి తావులేని విధంగా రాయడం అంటే అంత ఆషామాషీ విషయమేమీ కాదు. ఇందుకని చెప్పి రచయితని అభినందించి తీరాలి. ఆఫ్కోర్స్, పురాణం సీత ఫ్యాన్ క్లబ్ చాలా పెద్దది. నార్ల వెంకటేశ్వర రావు, కొడవటిగంటి కుటుంబరావు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి, నండూరి రామ్మోహన రావు వంటి వారంతా మొదటి వరసలో ఉన్నారు. వారి వెనుక మనమూ చేరి తీరతాం, నిస్సందేహంగా.. (పేజీలు 402, వెల రూ.150, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

4 కామెంట్‌లు:

 1. ఎప్పటిలాగే మళ్ళీ మంచి పుస్తకాన్ని మరోసారి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఈ శీర్షిక ఆంధ్రజ్యోతిలో మొదలైన సంవత్సరం 1960 కాదండీ...1967. ఈ పుస్తకాన్నిగురించి -
  మన దేశంలో నూటికి తొంభై తొమ్మిది మంది ఇల్లాళ్ళకి జీవితం ముచ్చట అనే ప్రసక్తి లేకుండా పువ్వుల తోటలో నిప్పుల మంటలా ఉంటుందికదా! అటువటప్పుడు 'ఇల్లాలి ముచ్చట్లు" అర్ధం ఉందా అనిపించింది నాకు. చదివేక మాత్రం, 'ముచ్చట' వేరు 'ముచ్చట్లు' వేరు అని తెలుసుకున్నాను. తీన్ తారుగా చిక్కులు చిక్కులుగా బాధలు బాధలుగా ఉన్న, ఈ జీవితం ఎందుకు ఇలా ఉంది అని తెలుసుకొందికి, ఈ వ్యాసాల్లో, ఈ ఇల్లాలు కొంత పయత్నించినట్టుగా నాకు తోస్తొంది.
  మొదటి ప్రచురణలో వచ్చిన పుస్తకం అట్టమీద ఇలా అన్నారు రావిశాస్త్రి.
  ఇల్లాలిముచ్చట్లు సీత గా సమాజాన్ని వ్యాఖ్యానించినది పురాణం వారని ఇప్పుడు మనందరికీ తెలుసనుకోండి. కానీ ఎంత చక్కగా వ్యంగ్యంగా మాట్లాడినా, వాతలు పెట్టినా ఆ సీతకి ప్రాణం పోసిన వాడు ఒక మగవాడు కదా. ఇన్నేళ్ళయినా తెలుగు సాహిత్యంలో సీత అంత ఘాటుగా సమకాలిన సమాజాన్ని అన్ని రంగాలను విశ్లేషించే ప్రతిభ కలిగిన స్త్రీ మూర్తి రచయిత్రిగా ఇంకా అవతరించలేదే అని కొంచెం దిగులేస్తుంది నాకు.
  అన్నట్టు ఈ ఇల్లాలిముచ్చట్లు పేరు పెట్టుకొని నా బ్లాగుకు కొందరిని రప్పించుకోగలుగుతునన్నాను. నా రచనలు చదివించుకోగలుగుతున్నందుకు... ఆ పేరును అరువిచ్చినందుకు (ఇంకా ఆయనకు తెలీదనుకో)పురాణం వారికి మరోసారి ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 2. నేను పుస్తకాలు నావంటూ కలక్ట్ చేయటం మొదలు పెట్టింది ఈ పుస్తకం తోనే నా చిన్నప్పుడు. మీరు పెట్టిన పుస్తకం పాత అట్ట కదూ.. కొత్తది కూడా అదేనా? నా దగ్గర పుస్తకం చివికి చిరిగి పోవటానికి సిద్దం గా వుంది. చింత చిగురు పప్పు బ్రిలియంట్ గా వండ గల సీత గారి గురించి ఎన్ని సార్లు ఎంత చెప్పుకున్నా తక్కువే. :-)

  రిప్లయితొలగించండి
 3. ఈ బుక్ మాత్రం చూసానండి. కాకపోతే కొంచెం కొంచెం మాత్రమే చదివాను:) కాని, నాకు గుర్తున్నంతమటుకూ చాలా బాగుంది. నిజమే దాని అట్ట బ్లూ కలర్ లో వేరే బొమ్మతో ఉంది.

  రిప్లయితొలగించండి
 4. @సుధ: ప్రచురణకర్తలు చాలా గడుసుగా 'అరవైలలో మొదలై.. ' అని రాసేశారండీ.. మీ వ్యాఖ్య చూసి ఎంక్వైరీలు మొదలు పెడితే, అరవై ఏడు కన్నా ముందే అన్నారు ఒకరిద్దరు మిత్రులు.. అయినా ప్రయత్నిస్తాను.. ఇక రచయిత్రి విషయంలో మీరన్నది నిజం.. అన్నట్టు సి. మృణాళిని 'కోమలి గాంధారం' చదివారా? మీకు నచ్చే అవకాశం ఉంది.. ...ధన్యవాదాలు.
  @భావన; ఇది పాత పుస్తకం అండీ.. నా పుస్తకం ఫోటో తీసే వీలు లేక, నెట్ లో ఉన్న ఫోటో వాడాను.. నా పుస్తకం మాత్రం నవనవలాడుతూ ఉందండీ :)) ..ధన్యవాదాలు.
  @జయ: అవునండీ.. ఇది పాత ప్రింట్.. బుక్ మొత్తం చదవండి.. అసలు మొదలు పెడితే విడిచి పెట్టరు మీరు.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి