బుధవారం, మే 11, 2011

ఆనంద్-గోదావరి-హ్యాపీడేస్ (రెండోభాగం)

బీప్ వినగానే మెసేజ్ ఓపెన్ చేసి చూశా.. నా మెసేజ్ కి థాంక్స్ చెబుతూ, "శేఖర్ ఇలాంటి సినిమాలే తీస్తారు.. మీరు ఆదరించాలి.." అన్నారు అమిగోస్ క్రియేషన్స్ వారు, 'ఆనంద్' సినిమాని నిర్మించిన సంస్థ. తర్వాత మరో రెండు సార్లు చూశాను థియేటర్లో. ఫోటోగ్రఫీ సమకూర్చిన విజయ్.సి.కుమార్ నీ, సంగీత దర్శకుడు కే.ఎం. రాధాకృష్ణన్ నీ ఎన్ని సార్లు అభినందించానో లెక్కలేదు, అంతా మనసులోనే. మూడోసారి 'ఆనంద్' చూడడం కోసం థియేటర్ కి వెళ్తే టిక్కట్లు దొరకలేదు. బ్లాక్ లో కొనాల్సి వచ్చింది..

పక్కనే ఓ పెద్ద సినిమా బ్రహ్మాండం బద్దలు కొడుతుండగా, ఓ చిన్న సినిమా ఇలా అందరినీ ఆకట్టుకోవడం.. తెలుగు సినిమాకి మంచి రోజులు వచ్చేశాయేమో అని సందేహం వచ్చేసింది. ఇంటా బయటా 'ఆనంద్' పాటలతో రోజులు గడిచిపోతూ ఉండగా, మాధవన్-కమలినీ ముఖర్జీ జంటగా శేఖర్ రెండో సినిమా ఉండబోతోందంటూ వార్త. వాళ్ళిద్దరి జోడీ ఎలా ఉంటుందోనన్న సందేహంలో ఉండగానే, సినిమా కథ గోదావరి నేపధ్యంలో సాగుతుందన్న కబురు తెలిసింది. చూస్తుండగానే మాధవన్ స్థానంలో సుమంత్ వచ్చేయడం, చిత్రీకరణకి సంబంధించి సలహాల కోసం శేఖర్ వంశీని కలవడం చకచకా జరిగిపోయాయి.

కొంచం సుదీర్ఘంగానే షూటింగ్ జరుపుకుని ఐదేళ్ళ క్రితం 'ఈవేసవి చల్లగా ఉంటుంది' అనే క్యాప్షన్ తో 'గోదావరి' థియేటర్లలోకి వచ్చేసింది. అసలే 'ఆనంద్' దర్శకుడి సినిమా ఆపై పేరూ ఊరూ అంతా గోదావరే.. చూడకపోతే ఎలా? థియేటర్లో ఏసీ బ్రహ్మాండంగా పనిచేయడం వల్ల అనుకుంటా, చూస్తున్నంత సేపూ నిజంగానే చల్లగా ఉంది. రాధాకృష్ణన్ సంగీతంలో పాటలు భలేగా నచ్చేశాయి. ముఖ్యంగా "నీల గగనం.. ఘనవిచలనం.." అనే బిట్ సాంగ్. రామాయణంలో వాల్మీకికి కలిగిన సందేహానికి వేటూరి అక్షర రూపం "ఎడమ చేతను శివుని విల్లుని ఎత్తినా రాముడే.. ఎత్తగలడా సీత జడనూ తాళికట్టే వేళలో.." లైన్స్ ఎంతగా నచ్చాయో చెప్పడానికి అక్షరాలు చాలవు.

'ఆనంద్' లో మరీ 'రా' గా కనిపించిన కమలిని కొంచం షైన్ అయినట్టుగా అనిపించింది. అభినయం కూడా, చాలా చోట్ల అవసరానికన్నా కూసింత ఎక్కువగా చేసినట్టుగా అనిపించింది. అయితే, అవసరమైన చోటకూడా పొదుపుగా అభినయించడం ద్వారా సుమంత్ దానిని బ్యాలన్స్ చేసేశాడు. ఇది ఆత్మాభిమానం ఉన్న సీత (కమలిని), అయోమయంగా కనిపించే రాం(సుమంత్)ల కథ. 'గోదావరి' పేరుతో నడిచే ఓ టూరిజం బోటులో రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్ళే బోట్లో మొదటిసారి ఒకరికొకరు పరిచయమై, ప్రయాణం ముగిసేసరికి ఇద్దరూ వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న కంక్లూజన్ కి రావడమే కథ. సినిమాలో సింహభాగం కథ పడవలోనే నడవడం వల్ల బాపూ 'అందాల రాముడు' గుర్తొచ్చాడు.

'గోదావరి' మీద 'ఆనంద్' ప్రభావం బాగానే కనిపించింది. ముఖ్యంగా రూపకి ఓ ఫ్యామిలీని ఇచ్చి సీతగా మార్చేసినట్టుగా అనిపించింది. నాయిక ఆత్మాభిమానం, ప్రేమించీ ప్రకటించకపోవడం, కొంచం డామినేటింగ్ నేచర్... పనిలో పనిగా హీరో గారి తగుమాత్రం పాసివ్ నేచర్ ఇవన్నీ 'ఆనంద్' నుంచి దిగుమతి చేసుకున్నట్టే అనిపించాయి. హీరో మరదలిగా చేసిన నీతూచంద్ర, బోటు కెప్టెన్ చింతామణి గా తనికెళ్ళ భరణి గుర్తుండిపోయారు. బుడగలు అమ్ముకునే కుర్రాడు, మాట్లాడే కుక్క, అట్లు పోసుకునే ఆవిడ... ఇలా నేపధ్యాన్ని బాగానే సెట్ చేశారు. ఒక్క ఫ్యాక్షన్ దృశ్యం మాత్రం పూర్తిగా అనవసరం మరియు పంటి కింద రాయి అనిపించింది.

వంశీ దగ్గర లోకేషన్ల గురించి తెలుసుకున్న శేఖర్, ఒకప్పటి వంశీ సినిమాల్లో కనిపించిన నేటివిటీని కూడా పట్టుకుని ఉంటే బాగుండేది. ప్రధాన పాత్రలన్నీ హైదరాబాద్ నుంచి వచ్చి బోట్ ఎక్కాయి సరే.. సహాయ పాత్రలకి ఏమొచ్చింది? కొన్ని పాత్రలు మాట్లాడిన గోదారి యాస మరీ అతికినట్టుగా ఉంది. అట్లమ్మి, చిలక జోస్యం అతనూ వీళ్ళంతా లోకలే కదా (కథ ప్రకారం). గోదారి గట్టు మీద నివాసం మీద ఉండే కుక్క చేత మాట్లాడించారు సరే (మన 'వీరబొబ్బిలి' స్ఫూర్తి అనుకుందాం) ..ఆ కుక్క కూడా చక్కటి హైదరాబాద్ యాక్సెంట్ లో మాట్లాడడం విషాదం.

కథనం దగ్గరికి వస్తే, హీరో లక్ష్యాల గురించి కనీసం హీరోకన్నా ఏమన్నా క్లారిటీ ఉందేమో తెలీదు. రొటీన్ గా ఉండడం ఇష్టం ఉండదు సరే.. రాజకీయాల్లోకి రావాలనుకున్నాడు మంచిదే.. అందరికీ సహాయా అవీ చేస్తూ ఉంటాడు ఓకే.. ఏ పార్టీ అతనికి నచ్చకపోయినా, చివరికి వచ్చేసరికి వాళ్ళు పెయిడ్ వర్కర్ గా రమ్మనగానే యెగిరి గంతేయడమే? నాయిక సీతామాలక్ష్మికి అసలే పాత సినిమాల్లో వాణిశ్రీ కి ఉన్నంత ఆత్మాభిమానం.. డబ్బింగ్ చెప్పింది సునీత అవడం వల్ల, ఆ ఆత్మాభిమానం దర్శకుడు చూపించదల్చుకున్న దానికన్నా ఎక్కువగా తెరమీద క(వి)నిపించింది. ఇక క్లైమాక్స్ కోసం 'సీతారామయ్య గారి మనవరాలు' నాటి డైరీ ని వాడుకోవడం కొంచం ఎక్కువగానే నిరాశ పరిచింది.

'ఆనంద్' హిట్ అయ్యేసరికి శేఖర్ కి కమలిని, వాన పాట సెంటిమెంట్ అయినట్టున్నాయి. 'టప్పులూ టిప్పులూ..' అంటూ ఓ వాన పాట ఉంది. సినిమా ప్రారంభంలో వచ్చే, బాలూ చేత పాడించిన, 'ఉప్పొంగెలే గోదావరీ..' పాటా, చిత్రీకరణా కూడా చాలా చాలాబాగున్నాయి. అయితే, మొత్తం మీద చూస్తే గోదావరిని చూపించాల్సినంత అందంగా చూపించలేదన్నది నా ఫిర్యాదు. అంటే, కథానుసారం ఇంకా బాగా చూపించ వచ్చని. అయితే, రెండోసారి కూడా నచ్చిన పాయింట్ క్లీన్ సినిమాని ఇవ్వడం.

సంగీతానికి పెద్దపీట వేయడం.. కమలిని కాస్ట్యూమ్స్, ముఖ్యంగా చీరలు చాలా బాగున్నాయి. కాస్ట్యూమ్ డిజైనర్ పేరు చూశా, అరవింద్ జాషువా..కాటన్స్ బాగా ఇష్టం అనుకుంటా.. మా క్లబ్బే. బహుశా ఈ 'క్లీన్ సినిమా' కాన్సెప్ట్ నచ్చడం వల్ల అనుకుంటా, మిత్రులొకరు 'ఆనంద్' 'గోదావరి' చూసి శేఖర్ ని 'ఈ జెనరేషన్ విశ్వనాధ్' అన్నారు, నా దగ్గర. నేనేమో "తొందర పడొద్దు" అన్నాను.. నేనన్నది నిజమేనని తనూ ఒప్పుకున్నారు. కాకపొతే, కొంత కాలం తర్వాత. ఆ కథా క్రమంబెట్టిదనిన... (ఇంకా ఉంది)

17 కామెంట్‌లు:

  1. మురళి గారు మీరు రాయటం గురించి మళ్ళీ మళ్ళీ అదే ముక్క చెప్పాల్సి వస్తుంది ఆ ముక్క - బాగా రాస్తున్నారు ఈ సిరీస్ !
    శేఖర్ నిజం గానే మంచి దర్శకుడు , అలాగే మంచి క్లీన్ సినిమాలు తీస్తారు కాని నా దగ్గర పెద్ద కంప్లైంట్ ఉంది ఈయన గురించి అది
    1 .సినిమాలో లీనం కాలేము ఎందుకో నాకు తెలియదు
    2 productions values - ఆనంద్ కాకుండా మిగిలిన సినిమాలు బడ్జెట్ ఎక్కువే కాని ఆ richness స్క్రీన్ మీద కనపడదు ఎందుకో తెలియదు . అదే ఇంకా తక్కువ budget తో తీసే నగేష్ కుక్నూర్ ఆయన సినిమాల్లో ఆ రిచ్నెస్స్ కనపడుతుంది . ఈ విషయాలలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే శేఖర్ కమ్ముల నిజం గా మంచి దర్శకుడు అవుతాడు అందులో సందేహమే లేదు !

    రిప్లయితొలగించండి
  2. ప్రతి భాగం మంచి సస్పెన్స్ పెట్టి వదులుతున్నారు.

    లేట్ గా అయినా లేటెస్ట్ గా రాసారు, అది సంతోషం!

    రిప్లయితొలగించండి
  3. murali garu manchi vishleshana
    balu (mail lo meemalini books adigina vadini)

    రిప్లయితొలగించండి
  4. గోదావరి లో ఆ కుక్క గొంతు శేఖర్ గారిది అండి

    రిప్లయితొలగించండి
  5. నా దృష్టిలో శేఖర్ మంచి కథకుడు. మంచి దర్శకుడు మాత్రం కాదు. ఎన్నో మాంచి సన్నివేశాలని రాసుకున్నంత బాగా కూడా తియ్యడు. పర్ఫెక్షన్ అసల ఉండదు. కథల్లో మాత్రం ఒక ఆత్మ ఉంటుంది అది నచ్చుతుంది. డాలర డ్రీమ్స్, ఆనంద్ చూస్తె గుండెల్లో ఎక్కడో గుచ్చు కుంటుంది. సంగీతం తప్ప మిగతా డిపార్ట్ మెంట్స్ అన్నీ ఘోరం (ఆనంద్ సినిమాటోగ్రఫి మినహా). కాస్ట్ (నటులు),మాటలు మరీ ఇబ్బంది పెట్టి మొదట్లో. కానీ ఉదిత్ నారాయణ్ పాటలా దానికి కూడా అలవాటు పడిపోయా.

    మంచి సిరీస్ మొదలెట్టారు. బావుంది.

    రిప్లయితొలగించండి
  6. నాకెందుకో ఆనంద్ కన్నా గోదావరే బాగా నచ్చిందండి. నాకైతే సినిమా చూసాక ఎప్పుడెప్పుడు ఆ బోటు (రాజమండ్రి - భద్రాచలం ట్రిప్) ఎక్కుదామా అనిపించింది. కానీ ఇప్పటికీ ఇంకా కుదర్లేదనుకోండి. మీరెవరన్నా రాజమండ్రి - భద్రాచలం బోటు ట్రిప్ కు వెళ్లుంటే, ట్రిప్ ఎలా ఉందొ చెప్పండి. ఈసారి మా అత్తగారింటికి వెళ్ళినప్పుడు ట్రై చేస్తా. మురళి గారు ఎప్పటిలాగే మీ విశ్లేషణ చాలా బాగుందండి.
    Dear seniors, ఒక చిన్న రిక్వెస్ట్, నేను రీసెంట్ గా ఒక బ్లాగ్ స్టార్ట్ చేశాను, దయచేసి, ఒక సారి నా బ్లాగ్ ని చూసి, మీ కామెంట్స్ చెప్పండి ప్లీజ్. Please..
    http://creative-oracle.blogspot.com/

    రిప్లయితొలగించండి
  7. "ఎడమ చేతను శివుని విల్లుని ఎత్తినా రాముడే.. ఎత్తగలడా సీత జడనూ తాళికట్టే వేళలో.."
    ఈ లైన్స్ ఐడియా శేఖర్ దే-ట
    మీరు ఈ టపాలు రాయటం, శేఖర్ కాన్స్ కి వెళుతూండటం....ముందే తెలిసి రాస్తున్నారా?

    రిప్లయితొలగించండి
  8. మురళి గారూ,
    మీ శైలి ఎంత బావుంటుందంటే ఎదురుగా కూర్చుని మాట్లాడుతున్నట్లుంటుంది.

    నిజమే ఆనంద్ తో పోలిస్తే గోదావరి మూవీ కొంచెం నిరాశ పరచిందనే చెప్పాలి. కమలిని నటనను ఆమె డబ్బింగ్ డామినేట్ చేసేస్తుందనిపిస్తుంది. సునీత గారు గొంతులో అవసరాన్ని మించి భావం పలికిస్తారు అది వినీ వినీ విసుగొస్తుంది.

    డబ్బింగ్ లో మంచి గొంతులంటే సరిత, ఎస్ పీ శైలజ(ఐతే గంభీరమైన డైలాగ్స్ అంత ఎఫ్ఫెక్టివ్ గా అనిపించవు), రోహిణి గార్లు గుర్తొస్తారు నాకు.

    శ్రీరాగ

    రిప్లయితొలగించండి
  9. నాకైతే శేఖర్ గారి సినిమాల్లో అన్నీ బాగానే అనిపిస్తాయి కానీ, చాలా పాత్రల్లో నటీనటులు జీవించలేరు ఎందుకో మరి. కొందరి నటన అసహజంగా అనిపిస్తూ ఉంటుంది..

    రిప్లయితొలగించండి
  10. ఈ రెండు సినిమాలూ కూడా నాకు పోటాపోటీగా నచ్చేసాయి. అంత మంచి సినిమాల గురించి మీరు వివరించిన విధానం ఇంకాఇంకా చదివిస్తోంది. ఈ సినిమాల్లో పాటలూ ఇంకా నచ్చాయి నాకు.
    మీరు ఇప్పుడు హ్యాపీడేస్ సినిమా గురించి చెప్తారేమో అని కొంచెం నాకు అనుమానంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  11. @శ్రావ్య: మీ మొదటి ఫిర్యాదు నాకూ అనుభవమేనండీ.. అయితే ఆనంద్ కి కొంత మినహాయింపు ఇవ్వొచ్చు అంటాన్నేను.. ఇక మీ రెండో పాయింటు తో కూడా ఏకీభవిస్తాను నేను.. ధన్యవాదాలు.
    @శ్రీ: లేట్ అంటారా?:)) ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. @బాలు: ధన్యవాదాలండీ.. అన్నట్టు ప్రస్తుతం ఏ నవల చదువుతున్నారు? :))
    @వినీల: అవునండీ.. కాకపొతే యాసని పట్టించుకోలేదన్నదే నా ఫిర్యాదు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. @బ్లాగ్మిత్రులకి, ఇక్కడ కొన్ని వ్యాఖ్యలు ఉన్నట్టుండి అదృశ్యం అయిపోయాయి.. కొంచం ఎంక్వయిరీ తర్వాత తేలిందేమిటంటే ఈ సమస్య దాదాపు అందరు బ్లాగర్లూ ఎదుర్కొన్నారని.. నేరం నాది కాదు, బ్లాగర్ ది!! సహృదయంతో గమనించగలరు..

    రిప్లయితొలగించండి
  14. నా కామెంట్ ని డిలీట్ చేసినందుకు నేను అలిగానోచ్! ఈరోజు రాత్రి భోజనం తరువాత నుంచి రేపు ఉదయం బ్రేక్ ఫాస్ట్ వరకు నిరాహార దీక్ష తో నా నిరసనను తెలియజేస్తున్నా. ఇంక్విలాబ్ జిందాబాద్.
    సంగతేంటంటే ఒక సాంకేతిక సమస్య వల్ల గూగుల్ వారు తమ బ్లాగర్ సర్వీసుని కొన్ని గంటలు వెన్నక్కి రిస్టోర్ చేసారు, అందుకే కొందరి కామెంట్స్ ఎగిరిపోయాయి. నా బ్లాగ్లో నేను కస్టపడి చేసిన మార్పులన్నీ (updates)పోయాయి ప్చ్.
    Please visit my blog http://creative-oracle.blogspot.com/ and let me know your views through comments.

    రిప్లయితొలగించండి
  15. ఊహూ, నేనొప్పుకోను నా కామెంట్ మీరు పబ్లిష్ చేయలేదు.

    రిప్లయితొలగించండి
  16. మురళి గారు,

    ఇది అన్యాయం. పావుగంట కూర్చుని పే..ద్ద వ్యాఖ్య పెడితే .. అదే డిలీట్ ఐపోయింది.

    బ్లాగ్స్పాట్ (గూగుల్) ని సూ చెయ్యాలి.

    వాసు

    రిప్లయితొలగించండి
  17. @Creative Oracle: ఇంతకీ మీ దీక్ష ఎవరి రాజీనామాని కోరుతోందండీ?? :)) ..ధన్యవాదాలు..
    @జయ: మొన్న వినాయక చవితికి చంద్రుడిని చూసేసినట్టున్నానండీ, ప్చ్ :)) ..ధన్యవాదాలు.
    @వాసు: చెయ్యాల్సిందేనండీ.. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పెద్ద ఎత్తున మార్పులు ఎలా మొదలుపెట్టారో... హు.. ధన్యవాదాలండీ.

    రిప్లయితొలగించండి