అనగనగా ఎనభై ఏళ్ళు దాటిన ఓ పర్వత వర్ధనమ్మ. గోదారి గట్టునానుకున్న వీధిలో ఉన్న ఓ పెంకుటింట్లో ఆవిడ నివాసం. తనకంటూ మిగిలింది ఒక్కడే, మనవడు భాస్కరం, ఓ చిరుద్యోగి. అతగాడికి కమలనిచ్చి పెళ్లి చేసి బాధ్యత తీర్చేసుకుంది వర్ధనమ్మ గారు. మనసు కష్టపడినప్పుడల్లా రేవుకేసి వెళ్లి గోదావరిని చూస్తూ కూర్చోవడం అలవాటు ఆవిడకి. చల్లని గోదావరి ఇట్టే ఆమె మనస్సును కుదుటబరుస్తుంది. భరించలేని కష్టాలని ఎదుర్కొనే శక్తి ఆమెకు ఆరు పుష్కరాలుగా ఆ గోదావరి ఇచ్చింది.
గోదావరికి వరదొస్తే చాలు వర్ధనమ్మకి కాళ్ళు నిలబడవు. వరదలో కొట్టుకువచ్చే కంప, కలపనీ ఈది పట్టుకోడానికి కూలీల్ని పురమాయించి ఏడాదికి సరిపడే వంట చెరకు చేరేసుకుంటుంది. పొద్దున్నే ఓ కుంచెడు బియ్యం వార్చి పాత చింతకాయో, మాగాయి పచ్చడో వేసి కూలీలకి పెట్టడం, వాళ్ళు ఈది పట్టిన దుంగల్ని గట్టుకు చేరేయడం,
వాటిని నరికించి పెరట్లోకి సమర్ధించడం వరద రోజుల్లో ఆవిడ వ్యాపకం. కిరాయి ఎంత యిస్తే అంత సరిపెట్టుకోవడం కూలీలకు రివాజు. "నాకసలు డబ్బే వద్దు. సందేల మరోసారి వేడిగా పట్టెడన్నంపెడితే చాలు" అనే వాళ్ళలో సత్తిగాడొకడు.
నాలుగు రోజులుగా పట్టిన ముసురు ఆవేళే తెర తీసింది. పూర్తిగా తెల్లారక ముందే "వర్ధనమ్మ గోరూ.. వర్ధనమ్మగోరూ" అని కేకలేసుకుంటూ వచ్చేశాడు సత్తిగాడు. "అదేంటి మామ్మగోరూ ఇంకా తొంగున్నారు. లెగండి. గోదారి పొంగేసినాది. వడి మాంచి పోటుగా ఉంది" అంటూ వర్ధనమ్మతో పాటు, పడుచు జంటనూ నిద్ర లేపేశాడు. అప్పటికే జాలరిపేట జనమంతా తెప్పలుచ్చుకుని ఏట్లోకి దూకేశారు. ఆరు నేరేడు దుంగల్ని, మూడు మద్ది దూలాల్ని అంకాలమ్మ రేవుకి చేరేశారు. ఇది సత్తిగాడు చెప్పిన సమాచారం.
సూర్య భగవానుడు కనిపించని కారణంగా నాలుగురోజులుగా ఉపవాసం ఉన్న వర్ధనమ్మ, పెరడంతా శుభ్రం చేసి నీళ్ళ పొయ్యిమీద కుంచం గిన్నెతో ఎసరు పడేసింది. కూని రాగాలు తీస్తూ మానెడు బియ్యం ఎసట్లో పోసి దేవేస్తోంది. "నాలుగు రోజుల ఉపవాసం బాపతు తిండి ఇప్పుడొక్కసారే లాగించేస్తుంది కామోసు ఈవిడ," అని కమల బుగ్గలు నొక్కుకోగా, "పాపం, నాలుగురోజులుగా పస్తుంది. ఆకలి వెయ్యదూ మరి" అని జాలిపడతాడు భాస్కరం. అయితే, వార్చిన మరుక్షణం సెగలు కక్కుతున్న అన్నాన్ని మాగాయితో సహా సత్తిగాడి విస్తట్లో వడ్డించేసింది వర్ధనమ్మ.
పాతికేళ్ళ సత్తిగాడు తినగలిగినంతా వడ్డించడమే కాదు, వార్చిన గంజిలో ఉప్పుకల్లేసి తాగడానికి ఇచ్చింది కూడా. విస్తరి దగ్గర కబుర్లలో తనకి తనవాళ్లెవరూ లేరనీ, పిడకలమ్ముకునే పైడమ్మ తనని ఉంచుకుందనీ బామ్మగారికి చెబుతాడు సత్తిగాడు. భోజనం ముగించి రేవుకి బయలుదేరతాడు, ఎప్పటిలాగా చింత, తుమ్మ కాకుండా టేకు, ఏగిస వర్ధనమ్మగారి పొయ్యిలో ఈ ఏడు మండాలంటూ. "అడ్డగాడిదలందరికీ సంతర్పణ ఏమిటం"టూ బామ్మని కేకలేస్తాడు భాస్కరం. "ఇలా అన్నం అమ్మి పుల్లలు కొనడం మా ఇంటా వంటా లేద"ని దెప్పి పొడుస్తుంది కమల.
ఎసట్లో తనకో గిద్దెడు బియ్యం పడేసుకోడానికి కూడా ఓపిక లేకపోయిన వర్ధనమ్మ, అలసిపోయి తులసికోటకి జేరబడుతుంది. పెరట్లోనుంచి వచ్చిన పైడమ్మ తెచ్చిన కబురు కారణంగా ఆమెలో చిన్నగా అనుమానం మొదలై, భయంగా మారి, ఏదో కీడు శంకించి ఆందోళనలోకి దిగింది. నాలుగు రోజులుగా లంఖణాలతో మంచానికంటుకు పోయిన సత్తిగాడు నిన్న రాత్రే కాస్త జ్వరం తగ్గి మనిషయ్యాడన్నదే ఆ కబురు. అప్పటికే నీరసించిన వర్ధనమ్మ గోదారి గట్టుకి బయలుదేరి "సత్తిగా" అంటూ గొంతు చించి అరుచుకుంటూ వెతకడం మొదలు పెట్టింది.
సత్తిగాడికి ఏమయ్యింది? వర్ధనమ్మ కథ ఏ కంచికి చేరింది? ఆవిడ చేతి భోజనానికి ఉన్న మహత్తు, విలువ ఏమిటి? భాస్కరం-కమల దానిని అర్ధం చేసుకోగలిగారా? ఇత్యాది ప్రశ్నలకి హృద్యమైన జవాబులిస్తూ ముప్ఫై ఏళ్ళ క్రితం తను రాసిన 'ఎసరూ-అత్తిసరూ' కథని ముగించారు బి.వి.ఎస్. రామారావు. గోదావరి నేపధ్యగా ఈయన రాసిన పదమూడు కథల సంకలనం 'గోదావరి కథలు' సంపుటంలో రెండో కథ ఇది. అన్నట్టు 'పుష్కరాలరేవులో పుల్లట్లు' కథ కూడా ఈ సంకలనం లోనిదే.
ఈ కధ నాకు బాగా గుర్తు. ఎప్పుడో చాలా రోజుల కిందట చదివాను.రక రకాల జీవనశైలులు తడిమి చెప్పే కధల్లో ఇదీ ఒకటి. మంచి కధ పరిచయం చేసారు.అసలు ఆ అత్తెసరు అన్న మాట మొదటగా ఈ కధ ద్వారానే తెలిసింది నాకు.
రిప్లయితొలగించండిమిగతా భాగం వెండితెర మీద చూడండి అన్నట్టుగా
రిప్లయితొలగించండిసత్తిగాడికి ఏమయ్యింది? వర్ధనమ్మ కథ ఏ కంచికి చేరింది? ఆవిడ చేతి భోజనానికి ఉన్న మహత్తు, విలువ ఏమిటి? భాస్కరం-కమల దానిని అర్ధం చేసుకోగలిగారా?అంటూ భలే ఆపుతారండీ ఉత్కంఠలో
పుస్తక పఠనాసక్తిని పెంచే వాళ్లకి ఓ అవార్డుంటే మీకే ఇవ్వొచ్చు
-సూరంపూడి పవన్ సంతోష్
మురళి గారు ఒక నాలుగురోజుల క్రితమే అనుకోకుండా ఈ పుస్తకం నా చేతిలోకొచ్చింది. వచ్చిన వెంటనే చదివింది పుష్కరాల రేవులో పుల్లట్ల కథ మీరు పరిచయం చేసిన టపా గుర్తుండే చదివాను.. ఇది రెండో కధే అవ్వడంతో ఇదికూడా వెంటనే చదివేశాను. ఈ రోజు మీరు రాసిన పరిచయం చదవుతుంటే ఇది నేను చదివిన కథేనా అనిపించింది. అంతబాగా పరిచయం చేసారు :-)
రిప్లయితొలగించండి@సునీత: నేను మాత్రం అత్తెసరు బామ్మ నోటెంట విన్నానండీ.. రాత్రి వంటకి "అత్తెసరు పడేయమ్మా" అనేది అమ్మతో. అంటే వార్చక్కర్లేకుండా, అన్నం వండేయడం అన్నమాట!! ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@పక్కింటబ్బాయి (ఇల్లుమారాడు): మరి ముగింపు చెప్పకూడదంటే ఇలాంటివి తప్పవండీ.. మంచి కథలు, దొరికితే మిస్సవకండి.. ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: ఒక్క క్షణం కన్ఫ్యూజ్ అయ్యానండీ.. హమ్మయ్య! కాంప్లి మెంటే :)) కథ చదివేశాక, టపా రాసేటప్పుడు సన్నివేశాలని నాకు నచ్చిన ఆర్డర్లో రాస్తానండీ.. అందువల్ల మీకు అలా అనిపించి ఉండొచ్చు.. ధన్యవాదాలు.
గోదావరి కధలు నేనూ చదివానండీ..మంచి పుస్తకం..మంచి పరిచయం.
రిప్లయితొలగించండి@ప్రణీత స్వాతి: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండినిన్నే ఈ కథ విన్నాను అనగా అనగా అనే ఒక తెలుగు కార్యక్రమం లో టోరి (తెలుగు రేడియో ) లో . ముగింపు గుండెల్ని పిండేసింది .
రిప్లయితొలగించండిరచయిత పేరు సరిగా వినలేదు .. అనుకోకుండా ఇక్కడ కనపడింది ..థాంక్స్