సోమవారం, మే 30, 2011

రెండు నిర్ణయాలు

ఈమధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రెండు నిర్ణయాలు నన్ను చాలా ఆశ్చర్య పరిచాయి. ప్రభుత్వం నడుస్తున్న (?) తీరుని బట్టి చూస్తే ఈరెండూ అసాధ్యాలుగానే అనిపించడం ఇందుకు కారణం. మొత్తంగా చూసినప్పుడు ఈ రెండూ కూడా అభినందించాల్సిన నిర్ణయాలే. పాలనా పరంగా చూసినా, రాజకీయంగా చూసినా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనదైన 'మార్కు' వేయడానికి ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తోంది.

మొదటి నిర్ణయం అనేక వివాదాలకి కేంద్రబిందువుగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్ పర్సన్ గా ముక్కుసూటి అధికారిణిగా పేరు తెచ్చుకున్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రేచల్ చటర్జీ నియామకం. గడిచిన ఐదారేళ్లలో ఏపీపీఎస్సీని ఎన్ని వివాదాలు చుట్టుముట్టాయన్నది అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్ర స్థాయిలో అత్యున్నత స్థాయి అధికారులని ఎంపిక చేయాల్సిన ఈ కమిషన్, పూర్తిగా రాజకీయ ఒత్తిళ్ళకి లోబడి పనిచేస్తోందనీ, ఒక ప్రాంతానికి, ఒక కులానికి చెందిన అభ్యర్ధులని మాత్రమే ఎంపిక చేస్తోందన్నది ప్రధాన విమర్శ.

ఎంపిక విధానంలో గత చైర్మన్ ప్రవేశ పెట్టిన సంస్కరణలు విమర్శల పాలయ్యాయి. ముఖ్యంగా ఇంటర్వ్యూ విధానం లోప భూయిష్టంగా ఉందన్నది పదుగురాడిన మాట. దీనికి తోడు కొందరు అభ్యర్ధులు సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించి, రాత పరీక్ష, ఇంటర్యూలలో తమకి వచ్చిన మార్కులని తెలుసుకుని, ఇంటర్వ్యూలో తమకి ఉద్దేశ్య పూర్వకంగానే అన్యాయం జరిగిందంటూ కోర్టుకి వెళ్ళారు. నోటిఫికేషన్ మొదలు పరీక్ష నిర్వహణ వరకూ గత చైర్మన్ నిరంకుశంగానే వ్యవహరించారనీ, కమిషన్ సభ్యులని సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకున్నారనీ వార్తలొచ్చాయి.

మూడు దశాబ్దాలకి పైగా ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేసి రిటైరైన రేచల్ చటర్జీ కి ముక్కుసూటిగా పోయే అధికారిణిగా పేరుంది. రాష్ట్రంలో విధ్యుత్ సంస్కరణలు అమలు పరిచిన అనంతరం ఏపీ ట్రాన్స్ కో చైర్మన్ గా నియమితులైన రేచల్ ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళకూ తలొగ్గకుండా పనిచేశారు. ట్రాన్స్ కో ని లాభాల బాటలో నడిపిచి, క్రిసిల్ నుంచి ఉత్తమ రేటింగ్ పొందడంతో పాటు ప్రధాన మంత్రి నుంచి బహుమతి అందుకోవడం పాలనా దక్షురాలిగా రేచల్ ప్రతిభకి తార్కాణం.

అటువంటి ఏపీపీఎస్సీకి ఇటువంటి అధికారిణిని నియమించడం హర్షించాల్సిన విషయం. రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ కి తొలి మహిళా చైర్మన్ రేచల్. ప్రతిష్టాత్మకమైన గ్రూప్ వన్ తో సహా దాదాపు పది వేల పోస్టులకు ఉద్యోగుల ఎంపిక వివిధ దశల్లో ఉన్న ప్రస్తుత తరుణంలో, రేచల్ లాంటి అధికారిణి కమిషన్ పగ్గాలు చేపట్టడం నిరుద్యోగులకు కచ్చితంగా తీపి కబురే. చైర్మన్ ఎంపికని రాజకీయం చేయనందుకు, ఒక సమర్దురాలైన అధికారిణిని నియమించినందుకూ ప్రభుత్వాన్ని అభినందించాలి.

రెండో నిర్ణయం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఎంపిక. ఎందరో రాజకీయ నాయకులూ, వ్యాపారవేత్తలూ ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసే ఎమ్మెల్సీ సీటు ఓ సామాన్య మహిళని వరించింది. తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం లోని మల్లవరం అనే కుగ్రామానికి చెందిన స్వయం శక్తి సంఘం సభ్యురాలు అంగూరి లక్ష్మీ శివకుమారి, కనీసం ఆమె కూడా ఊహించని విధంగా, ఎమ్మెల్సీ గా నామినేట్ కాబడింది. ఎమ్మెల్సీ సీటంటే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో డబ్బు ఖర్చు పెట్టి సంపాదించుకునేదనే మెజారిటీ ప్రజల గట్టి నమ్మకాన్ని ఏ కొంచమైనా సడలింపజేసే నియామకం ఇది.

పేద దళిత కుటుంబానికి చెందిన శివకుమారికి ఉన్న ఆస్థల్లా ఆమె ధైర్యం. ఎంతటివారినైనా నిలువరించి మాట్లాడడం. అదే ఆమెని నాయకుల దృష్టిలో పడేలా చేసింది. ఆరో తరగతితోనే చదువు మానేసి, అత్తవారింటికి పయనమైన శివకుమారి, తర్వాతి కాలంలో ఓ స్వయం శక్తి సంఘం సభ్యురాలై, లోకం పోకడ తెలుసుకుంటూ మహిళా సమాఖ్యలో జిల్లా స్థాయి నాయకురాలిగా ఎదగగలిగింది. పిల్లలు పెద్దయ్యాక పదో తరగతి పాసయ్యింది. స్వయం శక్తి సంఘం తన జీవిత గతిని మార్చేసిందని గర్వంగా చెప్పే శివకుమారికి, గ్రామస్థాయి సమస్యలు కరతలామలకం.

ఈ రెండు నియామకాల ద్వారా ముఖ్యమంత్రి ఎవరెవరికి ఎలాంటి సంకేతాలు పంపాలని అనుకుంటున్నారు? భవిష్యత్ నియామకాల్లోనూ ఆయన ఇదే వైఖరిని అనుసరిస్తారా? ఈ నియామకాల వెనుక ఉద్దేశాలు ఏవైనప్పటికీ, ప్రస్తుతానికి మాత్రం వీటివల్ల సామాన్యులకి ఏదో రూపంలో యెంతో కొంత మేలు జరుగుతుందన్న ఆశ మాత్రం కలుగుతోంది.

13 కామెంట్‌లు:

  1. రేచల్ గారి గురించి నాకు తెలియదు అండి..కానీ ఆ MLC పోస్ట్ ఇవ్వడం మాత్రం నన్ను బాగా ఆచ్చర్యానికి గురిచేసింది.

    మీరన్నట్టు నిజంగానే మంచి పరిణామమే అనిపించింది కానీ ఎక్కడో చిన్న అనుమానం...

    రిప్లయితొలగించండి
  2. రేచల్ చటర్జీ గారిని ఏపీపీఎస్సీకి అధికారిణిని గా నియమించడం నిజం గా హర్షించాల్సిన విషయం ! ఆవిడ ఈ పోస్టులో చేస్తే ఆ పోస్టుకే ఒక ఒక గుర్తింపు ని తీసుకొచ్చారు .

    శివకుమారి గారి గురించి వినడం నేను ఇద మొదటిసారి , చాల ఆనందం గా ఉంది ఆవిడ గురించి తెలుసుకోవటం .

    రిప్లయితొలగించండి
  3. శివకుమారి గారి ఎంపిక ఆహ్వానించదగ్గ పరిణామం. ఎం ఎల్ సి అనేది భాద్యత అని మరచిపోయారు మన నాయకులూ. ఒక్కో ఓటుకి వేలు ఖర్చు చేసేందుకు సిద్ద పడుతున్నారు. టీచర్ ఎం ఎల్ సిలు అయితే మంచి గిఫ్ట్ లు అందించారు. ఈ తరుణంలో ఎస్ సి మహిళ కి ఆ పదవి దక్కడం ఆశ్చర్యం. ఇక రేచెల్ నియామకం వెనుక ఢిల్లీ హస్తం ఉన్నట్లు సమాచారం. కాబట్టి ఆ నియామకం 100 % కరెక్ట్ అని చెప్పలేం.

    రిప్లయితొలగించండి
  4. రేచల్ గారి నియామకం కన్నా శివకుమారి గారి గురించిన వార్త చదివినపుడే ఎక్కువ ఆశ్చర్యమనిపించింది. ఏమైనా రెండూ శుభపరిణామాలే.

    రిప్లయితొలగించండి
  5. @ప్రబంద్ చౌదరి: నిజమేనండీ.. ఎవరూ కూడా మనస్పూర్తిగా నమ్మలేక పోతున్నారు.. ఎక్కడో చిన్న అనుమానం... ధన్యవాదాలు.
    @శ్రావ్య వట్టికూటి: నాక్కూడా రేచల్ మీద కొంచం ఎక్కువ హోప్సే ఉన్నాయండీ.. చూడాలి, ఏం జరుగుతుందో.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. @చక్రవర్తి: ఢిల్లీ హస్తం?? ..కొత్త విషయమండీ.. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలు మీరు చెప్పింది అక్షరాలా నిజం... ధన్యవాదాలు.
    @శిశిర: అవునండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. రేచల్ గారి నియామకం వలన ఎంతో మేలు జరుగుతుందని ఆశించే వారిలో నేను ఒకదాన్ని .

    రిప్లయితొలగించండి
  8. @చిన్ని: భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.. ఏం జరుగుతుందో చూడాలండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. కొంచెం నిజాయతీ కనబరిచినా ఈ పార్టీలన్నీ ఎంతో మంచిని చేయగలవు అనడానికి ఇవి ఉదాహరణలు. నాకు తెలియని విషయాలు చెప్పినందుకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  10. @సందీప్: నిజమేనండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. రేచెల్ గురించి తెలుసు. కాని, ఈ స్వయం సహాయక సంఘం నుంచి మహిళను ఎంపిక చేసి గట్టి సాహసమే చేసింది కిరణ్ ప్రభుత్వం. ప్రజపక్షంగా వ్యవహరిస్తున్నట్టు చూపించుకోవడానికి ఇది బాగా పనికొస్తుంది.

    రిప్లయితొలగించండి
  12. @రంగరాజన్:నిజమేనండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. రేచల్ గారు తన పని స్టార్ట్ చేసినట్టున్నారండి. మొన్నేదో వార్త చదివాను...తను చేస్తున్న పనుల గురించి.
    తను అలానే తన పనులు కొనసాగించాలని....ఆకాంక్ష.

    రిప్లయితొలగించండి