శనివారం, మే 14, 2011

ఆనంద్-గోదావరి-హ్యాపీడేస్ (చివరి భాగం)

నిర్మాణ వ్యయం ఊహించిన దానికన్నా పెరగడం వల్ల అనుకుంటా, 'గోదావరి' కి ఆశించిన స్థాయిలో లాభాలు రాలేదన్నారు. మొత్తం మీద లోకేషన్స్, సంగీతం నిలబెట్టాయీ సినిమాని. ఇంతలో 'ఆనంద్' డిస్క్ మార్కెట్లోకి వచ్చేయడంతో అప్పుడప్పుడూ 'ఆనంద్' చూస్తూ రోజూ 'గోదావరి' పాటలు వింటూ ఉండగా వచ్చిన ప్రకటన 'కొత్తవాళ్ళతో శేఖర్ తదుపరి చిత్రం' అని. తనే నిర్మాత అనీ, కార్పొరేట్ కంపెనీల భాగస్వామ్యం ఉంటుందనీ వార్తలు వచ్చాయి.

చూస్తుండగానే టాలెంట్ హంట్ హంగామా మొదలయ్యింది. 'ఆనంద్' తో పోల్చినప్పుడు 'గోదావరి' కి బాగా పబ్లిసిటీ ఇచ్చారు. అయితే ఈ కొత్త సినిమా ఇంకా నిర్మాణం మొదలుకాకుండానే 'గోదావరి'ని మించి భారీ స్థాయిలో ప్రచారం మొదలుపెట్టేశారు. కాలేజీ నేపధ్యంగా సినిమా..టైటిల్ 'హ్యాపీడేస్.' తెలుగులో అందుకు సమానార్ధకం దొరకలేదని శేఖర్ వివరణ. ఎందుకో తెలియకుండానే చిన్నగా అసంతృప్తి మొదలయ్యింది.

ఆడియో విడుదలై 'అరెరే..అరెరే..' పాట పెద్ద హిట్టయ్యింది. అప్పుడు గమనించాను. గత రెండు సినిమాలకీ పాటలు రాసిన వేటూరి స్థానంలో కొత్త గేయ రచయితలు. బహుశా సినిమాని యూత్ఫుల్ గా తీర్చిదిద్దడంలో భాగమేమో. అప్పటికే దర్శకుడిగా శేఖర్ కమ్ముల సంపాదించుకున్న ఇమేజ్, భారీ ప్రచారం మరియు హిట్ ఆడియో.. వెరసి బ్రహ్మాండమైన ఓపెనింగ్స్. మరీ మొదటి రోజు కాదు కానీ, మొదటివారంలో చూశా ఈ సినిమాని.

తెరమీద సినిమా మొదలయ్యింది.. కానీ నేనెందుకో కనెక్ట్ కాలేక పోతున్నాను. ఒక ప్రేక్షకుడిగా నాకు సంబంధించి ఇది సినిమా రాంగ్ ట్రాక్ లో వెళ్తోంది అనడానికి సంకేతం. ఎందుకో తెలియదు కానీ అంతకు కొద్ది కాలం ముందే చదివిన చేతన్ భగత్ నవల 'ఫైవ్ పాయింట్ సంవన్' గుర్తొచ్చింది. అంతే, అది మొదలు తెర మీద కనిపిస్తున్న ప్రతి సన్నివేశానికీ పోలికలున్న సన్నివేశం నవలలో ఉన్నది గుర్తు రావడం మొదలు పెట్టింది. శేఖర్ మీద గౌరవం కొద్దిగా తగ్గింది. ఇంటర్వల్ లో లేచి వెళ్ళిపోదామా అనుకుని, ఆ ప్రయత్నం విరమించుకున్నాను.

'హ్యాపీడేస్' ఇంజనీరింగ్ కాలేజీలో కొత్తగా చేరిన నలుగురు అబ్బాయిలు, అమ్మాయిల కథ. వీళ్ళకి ప్రపంచంలో ప్రేమ వంటి వస్తువు మరొకటి లేదు. అబ్బాయిలకి ప్రేమించడానికి ఆడ మనిషి దొరికితే చాలు.. ఆమె లెక్చరర్ అయినా, సీనియర్ అయినా అభ్యంతరాలు ఏవీ లేవు. క్యాంపస్ లో ర్యాగింగ్ ని ప్రోత్సహించే రీతిలో సన్నివేశాలు. ఈ పిల్లలకి ఇళ్ళలో పెద్దవాళ్ళ పట్ల భయం ఉన్నట్టే కనిపిస్తుంది కానీ, అంతలోనే బోలెడు స్వేచ్చా ఉంటుంది. లెక్చరర్ ఎవరూ కూడా లేకపోయినా, ఈ నాలుగు జంటలూ వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలకి విహార యాత్ర వెళ్ళడానికి ఇళ్ళలో అనుమతించేస్తారు.

అప్పటివరకూ అల్లరి చిల్లరగా తిరిగినా పరిక్షలనేసరికి శ్రద్ధగా చదివేస్తారు. పరిక్షలు రాయబోతూ తడి కళ్ళతో ఫేర్వెల్.. అవ్వగానే అందరికీ కేంపస్ ఉద్యోగాలు. ఇంతేనా కాలేజీ జీవితమంటే? ఇది సినిమానా? ఓ కాలేజీ క్యాంపస్ లో కెమెరా బిగించి, కొన్నాళ్ళ తర్వాత కొంచం ఎడిటింగ్ చేసి కొన్ని పాటలూ, మరికొన్ని నాటకీయ దృశ్యాలూ చేరిస్తే సినిమా అయిపోయినట్టేనా? ప్రారంభంలో కొంచం అమాయకంగా కనిపించే ఓ బీద అబ్బాయిని చూపిస్తారు. అతను ఎందుకంటే, సీనియర్ స్టూడెంట్ ఒకడు హీరో ని రాగింగ్ చేస్తూ హీరోయిన్ "నా చెల్లెలు" అని ఇంపోజిషన్ రాయమంటే, హీరో బదులు ఈ బీద అబ్బాయి రాస్తాడు, హీరో పాత్రౌచిత్యం దెబ్బ తినకుండా!

దర్శకుడిగా శేఖర్లో లోపాలు అలాగే ఉండిపోయాయి. కథ రాసుకోవడం దగ్గరినుంచి, చిత్రీకరణ వరకూ యెంతో కొంత అస్పష్టత, క్లారిటీ లేకపోవడం. సంభాషణలు చాలా కృతకంగా ఉండడం. కనీసం వేరే వాళ్ళచేత రాయించుకునే ప్రయత్నమైనా ఉండదు. కాంబినేషన్ సన్నివేశాల్లో కనిపించే నటీ నటులందరి నటనా బ్యాలన్స్ అవ్వదు. ఎవరో ఒకరు మిగిలిన వాళ్ళని డామినేట్ చేసేస్తూ ఉంటారు. మొదటి రెండు సినిమాలకీ 'ట్రెడిషనల్' టచ్ ఇచ్చిన శేఖర్, మూడో సినిమాకి వచ్చేసరికి పూర్తి 'మోడర్న్' లుక్ ఇవ్వడానికి శతవిధాలా ప్రయత్నించారు. సంగీతం నుంచి సన్నివేశాల వరకూ ప్రతి చోటా ఇది కనిపిస్తుంది.

నిజం చెప్పాలంటే 'హ్యాపీడేస్' కేవలం స్పాన్సర్ల కోసం తీసిన సినిమాలా అనిపించింది. 'ఆనంద్' కి 'మంచి కాఫీ లాంటి సినిమా' అని క్యాప్షన్ ఇచ్చి స్పాన్సర్లని ఆకట్టుకున్న శేఖర్, 'హ్యాపీడేస్' ని కేవలం వారి వారి బ్రాండ్లని ప్రమోట్ చేయడం కోసమే తీసిన భావన కలిగింది. నాకు నచ్చలేదని సినిమా విజయం ఆగిపోలేదు. నిజానికి 'ఆనంద్' 'గోదావరి' లని మించి ఆర్ధిక విజయం సాధించింది. శేఖర్ తన లోటుపాట్లని సరిదిద్దుకుంటాడన్నఆశ సన్నగిల్లింది నాలో. అందుకే తన తర్వాతి సినిమా 'లీడర్' మీద పెద్దగా ఆశలు పెట్టుకోలేదు.

'లీడర్' విడుదలయ్యింది.. చూడాలనిపించలేదు.. చూసిన మిత్రులు -- గతంలో శేఖర్ని విశ్వనాధ్ తో పోల్చిన వారు - చూసి బాగాలేదని చెప్పారు. కాబట్టి చూడనందుకు నో రిగ్రెట్స్. మార్కెటింగ్ ని కాకుండా, కథ కథనాలని నమ్ముకుని శేఖర్ సినిమా తీస్తే బాగుండును. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న చాలా మంది దర్శకులకన్నా కథని కొంచం వైవిధ్యంగా రాసుకోవడంలోనూ, సున్నితమైన భావోద్వేగాలను తెరకెక్కించడం లోనూ శేఖర్ కి ఎక్కువ మార్కులే ఇవ్వొచ్చు. తన ప్లస్ పాయింట్లని ఉపయోగించుకుంటూ మైనస్లని అధిగమించే దిశగా శేఖర్ నుంచి ఓ సినిమా వస్తుందని ఎదురుచూస్తున్నాను. ప్రస్తుతానికి మాత్రం తన సినిమాలలో 'ఆనంద్' కి మొదటి స్థానం 'గోదావరి' కి రెండో స్థానం.. అంతే..

21 వ్యాఖ్యలు:

 1. Murali garu, thank u somuch for appreciating my work in Godavari. My wife's a great fan of ur blog. you made good observaions about"sekhar's films. I want to give my perspective too( being a part of sekhar kammula's team from such a long time). Hopefully I can anwser some of the questions u posed. Once again, you are good at what u r doing& I'm sure many already told u this. thank u verymuch!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఎప్పట్లాగే రివ్యూ బాగుంది. కానీ నాకెందుకో హ్యాపీ డేస్ అన్ని లోపాలున్నా నచ్చింది. మీరు లీడర్ సినిమా చూసి దాని మీద కూడా రివ్యూ రాస్తే చూడాలనుంది (సారీ చదవాలనుంది) దయచేసి లీడర్ చూడండి నాకెందుకో ఈ సినిమా శేఖర్ సినిమాల్లో కల్లా డిఫరెంట్ గా అనిపించింది. ఒక సారి నా బ్లాగ్ చూసి కామెంటితే సంతోషిస్తాను. http://creative-oracle.blogspot.com

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మురళి గారు, మీ గొలుసు టపా బాగుంది. ఐతే మీ ఈ క్రింది వ్యాఖ్య(ల)కు ఉదాహరణలు ఇస్తే అందరికి ఉపయోగంగా వుండేది.
  "దర్శకుడిగా శేఖర్లో లోపాలు అలాగే ఉండిపోయాయి. కథ రాసుకోవడం దగ్గరినుంచి, చిత్రీకరణ వరకూ యెంతో కొంత అస్పష్టత, క్లారిటీ లేకపోవడం. సంభాషణలు చాలా కృతకంగా ఉండడం. కనీసం వేరే వాళ్ళచేత రాయించుకునే ప్రయత్నమైనా ఉండదు. కాంబినేషన్ సన్నివేశాల్లో కనిపించే నటీ నటులందరి నటనా బ్యాలన్స్ అవ్వదు. "

  ఆనంద్ publicity interviewలో శేఖర్ మాట్లాడుతూ ఈ సినిమా చూసిన వాళ్ళు ఆనంద్ లాంటి అన్న, లేదా కొడుకు లేదా ప్రియుడు కావాలనుకుంటారు అని అన్నారు. ఐతే నాకు, నాకు తెలిసిన వారికి ఆ ఆలోచనే కలుగలేదు. పైగా ఆనంద్ కన్నా రూప పాత్రకు ఎక్కువ ప్రాముఖ్యం వున్నట్టు అనిపించింది.

  ఆనంద్ సిన్మాలో రూపకు music lessons చెప్పేంత talent వున్నట్టు ఎక్కడా convincingగా చూపలేదు. పైగా రూపను కావాలని music teacherని చేసినట్టు అనిపిస్తుంది.

  మీరన్నట్టు శేఖర్ మాటల రచయతగా ఇబ్బంది పడ్తున్నట్టు అనిపిస్తుంది. గోదావరిలో పడవలో తనని చంపడానికి వస్తున్నారని తప్పించుకుంటూ తన కూతురు నిండు గర్భిణి అని చెప్పడానికి ఏదో confusing dialogue వున్నట్టు గుర్తు.

  ఐతే లీడర్ సినిమాతో శేఖర్ రచయతగా మెరుగు ఐనట్టు అనిపిస్తుంది. ముసలాయన (చంపబడ్డ అమ్మాయి తాలూకు), రానా మాట్లాడే సన్నివేశం ఒక మంచి ఉదాహరణ. “నిజాయితిగా వుండటం త్యాగం అనుకుంటారు” లాంటి dialogues చాలా వున్నాయి. లీడర్ సినిమా పైన నేను వ్రాసుకున్న notes ఇక్కడ చూడొచ్చు:

  http://chittaruvu.wordpress.com/2010/02/22/shekhar-leader/

  ప్రత్యుత్తరంతొలగించు
 4. I dont think shekar kammula is really a director of substance. పాత కాలం DD సీరియల్స్ లా ఉంటాయి తన సినిమాలు. నాకు హ్యాపీడేస్ సినిమా పరమ చెత్తగా అనిపించింది. దాని కన్నా జీ తెలుగు లో అదే పేరు తో వచ్చే సీరియల్ ఎన్నో రెట్లు నయం. అతని లో ఉన్న మరో లోపం కామెడీ టేస్ట్ దాదాపు శూన్యం.

  ఇంక ప్రేమ కథలు తీసుకునే కమ్ముల, లీడర్ లాంటి సబ్జెక్ట్ తీసుకుని సాహసమే చేసాడు. But it became a failure attempt. అందులో సుబ్బరాజు పాత్ర చెప్పినట్లు ఎంత సేపు లక్ష కోట్లు తప్పితే వేరే యావ లేదు. పోని దాన్ని వెలికి తీసే దాన్లొ కూడా స్పష్టత లేదు. Enough.. I dont want to talk much on a junk movie.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. I dont think shekar kammula is really a director of substance. పాత కాలం DD సీరియల్స్ లా ఉంటాయి తన సినిమాలు. నాకు హ్యాపీడేస్ సినిమా పరమ చెత్తగా అనిపించింది. దాని కన్నా జీ తెలుగు లో అదే పేరు తో వచ్చే సీరియల్ ఎన్నో రెట్లు నయం. అతని లో ఉన్న మరో లోపం కామెడీ టేస్ట్ దాదాపు శూన్యం.

  ఇంక ప్రేమ కథలు తీసుకునే కమ్ముల, లీడర్ లాంటి సబ్జెక్ట్ తీసుకుని సాహసమే చేసాడు. But it became a failure attempt. అందులో సుబ్బరాజు పాత్ర చెప్పినట్లు ఎంత సేపు లక్ష కోట్లు తప్పితే వేరే యావ లేదు. పోని దాన్ని వెలికి తీసే దాన్లొ కూడా స్పష్టత లేదు. Enough.. I dont want to talk much on a junk movie.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. హ్యాపీడేస్ సినిమా నాకెందుకో ముందునుంచే చూడాలనిపించలేదు. ఆనంద్, గోదావరి రెండూ కూడా పోటాపోటీగానే నచ్చాయి. లీడర్ కూడా చూసాను. కాని కొన్ని అనుమానాలు మిగిలిపోయాయి. మీ ఈ 'కంపారిటివ్ స్టడీ' చాలా బాగుంది. మీరు ఒక్కసారి శేఖర్ కమ్ముల గారిని కలవవచ్చుకదా. జోక్ కాదు. నిజంగానే చెప్తున్నాను. మనం మంచి సినిమాలు చూడొచ్చు అని నా ఆశన్నమాట.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. నావఱకూ నాకు నచ్చిన క్రమం... గోదావరి > ఆనంద్ > లీడర్ > హ్యాపీడేస్. లీడర్ కొంచెం కథాపరంగా కూడా భిన్నమైనదండీ, ఒకసారి చూడొచ్చు.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. మూడు సినిమాల గురించీ ఒకేసారి రాయడాం బాగుందండి. నాకు గోదావరి బాగా నచ్చుతుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. @Kiran Reddy: Thank you rich fellow.. In fact, I tried to watch the movie on tv. But somehow, I could not make it...
  @Aravind Joshua: What a pleasant surprise!! First of all, please convey my sincere thanks your wife. Secondly, I hope your perspective will help us (me and others who loved the initial works of Sekhar) know the ground realities behind the recent ventures. Please come out with the answers ASAP. Thanks a lot for your feedback.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. @Ruth: ఓహ్.. ఎట్టకేలకి సిరీస్ పూర్తీ చేసినందుకు చప్పట్లన్న మాట!! :)) సీరియస్లీ, అర్ధమయ్యిందండీ.. ధన్యవాదాలు.
  @Creative Oracle: ఒకటి రెండు ప్రయత్నాలు చేశానండీ, టీవీలోనన్నా చూద్దామని.. ఎందుకో కనెక్ట్ కాలేకపోయాను.. ప్రయత్నిస్తాను.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. @విజయవర్ధన్: నా టపాల ఉద్దేశ్యం కేవలం శేఖర్ సినిమాల్లో లోపాలని ఎత్తి చూపడం మాత్రమే కాదండీ.. మీరు చెప్పిన పాయింట్స్ కి వస్తే, దర్శకత్వంలో క్లారిటీ లేక పోవడాన్ని గురించి ప్రస్తావించాను నేను (ఆనంద్ లో రేప్ సీన్, గోదావరి లో ఫ్యాక్షన్ సీన్ మరియు హ్యాపీ డేస్ లో బీద అబ్బాయి పాత్ర). నటీనటుల నటన తెర మీద కనిపించేదే.. ఉదాహరణకి, గోదావరి లో నీతూచంద్ర పెళ్ళికి సంబంధించిన సన్నివేశాల్లో, వాళ్ళ ఇంట్లో వాళ్ళ హావభావాలు గమనించండి.. మీరు గమనించిన అంశాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఇక, 'లీడర్' విషయానికి వస్తే, టీవీలో కూడా చూడలేక పోయానండీ.. కానీ ఇక్కడ మీ వ్యాఖ్య, మీ నోట్స్ ఇంకా కొందరు మిత్రుల వ్యాఖ్యలు చూశాక ఎలాగైనా ఆ సినిమా పూర్తిగా చూడాలని అనుకుంటున్నాను.. థాంక్ యు..

  ప్రత్యుత్తరంతొలగించు
 12. @విజయ్: కామెడీ విషయానికి వస్తే, ప్రత్యేకంగా ట్రాక్ పెట్టకుండా ప్రధాన కథ నుంచే హాస్య సన్నివేశాలని రాసుకోవడం మెచ్చుకోవాల్సిందేనండీ.. ముఖ్యంగా 'ఆనంద్' లో సమత ఆమె అన్నల మధ్య వచ్చే సన్నివేశాలు నాకు బాగా నచ్చుతాయి.. ధన్యవాదాలు.
  @సత్య: ధన్యవాదాలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 13. @జయ: మీ సూచన బాగుందండీ.. 'లీడర్' ఫలితం తర్వాతన్నా శేఖర్ ఆలోచనల్లో కొంచం మార్పు వచ్చి ఉంటుందన్నది నా ఆశ.. అది ఏ మేరకి అన్నది రాబోయే సినిమా చెబుతుంది.. చూద్దామండీ.. ధన్యవాదాలు.
  @రాఘవ: మీ జాబితాలో కూడా ఆనంద్, గోదావరి సినిమాలో అటూ ఇటూ గా టాప్ టూ లో ఉన్నాయి!! 'లీడర్' చూడ్డానికి ప్రయత్నిస్తానండీ.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. @శిశిర: మూడింటిలోనూ కామన్ గా గమనించిన కొన్ని విషయాల గురించి వివరంగా రాయడానికి ఇలా అయితే బాగుంటుందనిపించిందండీ.. ఎంతైనా 'మన' గోదావరి కదా!! ...ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. ఈ సబ్జక్టు మీద మీ వరసటపాలు బాగున్నాయి. లీడర్‌లో విరగ్గొట్టి చూసుకుంటే కొన్ని మంచి అంశాలు లేకపోలేదు గానీ సినిమా మొత్తంగా అతకలేదు. హేపీడేస్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. మురళి గారు... మీ సమీక్షలు, తులనాత్మక విమర్శలు బాగున్నాయి. ఆనంద్ లో - రూప పెళ్లి సన్నివేశంలో బామ్మ సంభాషణలు, వాచికం కృతకంగా అనిపిస్తాయి. గోదావరి లో హీరో పాత్ర గందరగోళంగా వుంటుంది. పోలిటిక్స్ గురించి శేఖర్ కి స్పష్టత లేదనే విషయం తెలుస్తుంది. శేఖర్ సినిమాల్లో మ్యూజిక్ బాగుంటుంది. అంతే. చాలా సన్నివేశాలు సాగ తీతలా ఉంటాయి. ఆనంద్ తరవాత ఒక వర్గం ప్రేక్షకులు శేఖర్ సినిమా బాగోలేదు అంటే అభిరుచి లేని వాడిగా చూశారు. ఒక టైములో విశ్వనాధ్ సినిమాల్ని ఆ మాదిరీ చూశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 17. @కొత్తపాళీ: ధన్యవాదాలండీ..
  @చక్రవర్తి: ఆనంద్ లో కేవలం రూప పెళ్లి అనే కాదండీ, చాలా చాలా సన్నివేశాల్లో సంభాషణలు కృతకంగా ఉంటాయి.. కానీ, వచ్చే సినిమాల్లో ఇంప్రూవ్ కావొచ్చన్న ఆశ ఉండేది అప్పట్లో.. రాను రాను అది సన్నగిల్లుతోంది.. విశ్వనాధ్ విషయంలోనూ నేను ఏకీభవిస్తా.. తను తీసిన ప్రతి సినిమాని కళాఖండం అనలేం.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 18. ఆనంద్ చూశాక నేను రాసిన టపా:
  http://groups.yahoo.com/group/racchabanda/message/10779

  గోదావరి చూశాక
  http://groups.yahoo.com/group/racchabanda/message/15902

  లీడర్ చూశాక:
  http://groups.yahoo.com/group/racchabanda/message/21804

  ప్రత్యుత్తరంతొలగించు
 19. @చౌదరి: మీరు కూడా 'లీడర్' చూడాల్సిందే అంటారు అయితే!! ..ధన్యవాదాలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు