కేంద్రంలో అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు అవుతూ ఉండగా,
ఐదు రాష్ట్రాల శాసన సభలకి జరిగిన ఎన్నికల్లో ఏనుగు కుంభస్థలంగా చెప్పబడే
రాష్ట్రంతో పాటు మరో రాష్ట్రంలో భారీ మెజారిటీని సాధించి, మరో రెండు
రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ పోటీ ఇవ్వడం అన్నది అధికారంలో ఉన్న పార్టీకి
ఘనంగా చెప్పుకోదగ్గ విషయమే. ఏ ప్రభుత్వానికైనా ఐదేళ్ల పదవీ కాలంలో మొదటి
సంవత్సరం హనీమూన్ పీరియడ్. ఆ యేటి తప్పొప్పులు పెద్దగా లెక్కలోకి రావు.
అటుపై మరో ఏణ్ణర్ధం గడిచేసరికి ప్రజలకి మోజు తీరి, చిన్నగా వ్యతిరేకేకత
ఆరంభమవుతుంది. రాజకీయ విశ్లేషకులు దీనినే 'యాంటీ ఇంక్యుమ్బెన్సీ' అని
చెబుతూ ఉంటారు. ఇది మెజారిటీ పార్టీల విషయం.
కానీ, భారతీయ
జనతా పార్టీ విషయం వేరు. స్వతంత్ర వీరుల వారసుల పార్టీగా రాజకీయ యవనికపై
ఆవిష్కృతమైన కాంగ్రెస్ తర్వాత, అతిపెద్ద జాతీయ పార్టీగా అవతరించిన బీజేపీ కి
2014 పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజారిటీ వచ్చినా, మొదటి ఏడాదిలోనే
అసహనపు సెగ తగిలింది. దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వం నుంచి అవార్డులు
అందుకున్న మేధావులు సైతం, బీజేపీ తీరు నచ్చక ఆ అవార్డులని తిరిగి
ఇచ్చేయడంతో మొదలుపెడితే అసహనాల పరంపర కొనసాగుతూనే వస్తోంది. భారీ మెజారిటీ
ఇచ్చిన మత్తులో అధికారంలోకి వచ్చిన వాళ్ళు చేసిన పొరపాట్లు కొన్నైతే, ఓ
వర్గం మీడియా చేసిన అతి తాలూకు ఫలితం మరికొంత.. మొత్తంమీద చూసినప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేక పవనాలు వీస్తున్నాయేమో అన్న నమ్మకం సాధారణ ప్రజల్లో కలుగుతున్న సమయంలో ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ప్రకటన వచ్చింది. ఇదే సమయంలో కేంద్రం ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు, తదనంతర గందరగోళాల నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లోనూ బీజేపీ నామరూపాలు లేకుండా పోవడం ఖాయం అన్న ప్రచారం ఊపందుకుంది. 'రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశప్రజల తీర్పుకి నమూనా' గా చెప్పబడే ఉత్తరప్రదేశ్ శాసన సభని కైవసం చేసుకోవడంతో పాటు, ఉత్తరాఖండ్ లోనూ బీజేపీ జెండా ఎగరేసింది. వరుస పరాజయాలతో కునారిల్లిన కాంగ్రెస్ కి పంజాబ్ శాసనసభ ఊరటనిచ్చింది. ఇక, గోవా, మణిపూర్ లలో కూడా కాంగ్రెస్ ఆధిక్యం కనబడుతున్నా 'ఇతరుల' సంఖ్య కూడా చెప్పుకోదగ్గదిగా ఉండడం వల్ల రాజకీయం మలుపులు తిరిగే అవకాశం ఉంది.
సగం పదవీ కాలం
పూర్తయ్యాక 'రిఫరెండం' లాంటి ఎన్నికలని ఎదుర్కోవాల్సి రావడం ఏపార్టీకైనా
ఇబ్బందికరమే. కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు స్థానిక
సంస్థలకి ఎన్నికలు జరపకుండా ఏదో ఒక సాకుతో వాయిదా వేస్తూ పోవడానికి కారణం
కూడా ఈ 'రిఫరెండం' భయమే. ఎన్నికల్లో ఓడితే జనం అధికార పార్టీని
వ్యతిరేకిస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంటుంది. మరి, గెలిస్తే? ఇప్పటికే
పార్లమెంట్ లో మరో పార్టీ సాయం అవసరం లేని పూర్తి మెజారిటీ అనుభవిస్తున్న
బీజేపీ, ఉత్తర ప్రదేశ్ ని, ఉత్తరాఖండ్ శాసనసభల విజయాలతో రానున్న రెండేళ్లలో
ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది? అప్పుడప్పుడూ ప్రభుత్వం మీద అసంతృప్తిని
ప్రకటిస్తున్న ఆరెస్సెస్, సంఘ్ పరివార్ లాంటి సంస్థలు ఈ విజయాన్ని ఏవిధంగా
స్వీకరిస్తాయి? బీజేపీలో వ్యక్తిపూజ (మోడీ) పరాకాష్టకి చేరుకోనుందా?
ఎన్నికల ఫలితాలు దేశప్రజల ముందు ఉంచిన ప్రశ్నలివి. ఈ ప్రశ్నలకి జవాబులే,
బీజేపీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయనడంలో సందేహం లేదు.
ఏది ఏమైనా చదువుకున్నవాళ్లు, చదువుకోకపోయినా అంతో ఇంతో లోకజ్ఞానం వున్నవాళ్లు - ఓటు విలువ గ్రహించి - వ్యక్తిపూజలు మాని మంచి నాయకులను ఎన్నుకునే రోజులు వస్తే బావుండును - ఇండియాలోనే కాదు ఇంకెక్కడైనా సరే.
రిప్లయితొలగించండి@లలిత టీఎస్: కొంచం ఆలస్యంగా అయినా ఆరోజొస్తుందని నమ్మకం ఉందండీ.. ధన్యవాదాలు
రిప్లయితొలగించండి