సరస్వతమ్మకి ఊపిరి సలపకుండా ఉంది. లేత కొబ్బరి చెక్కలు
కోరి, రోటి పచ్చడి రుబ్బి పెరుగులో కలిపింది. అప్పటికే చిన్న జాడీలో
అల్లప్పచ్చడి సిద్ధం చేసింది. ఓ పొయ్యి మీదకి ఇడ్లీ పాత్ర ఎక్కించి, రెండో
పొయ్యి మీద మినపరొట్టి కాలుస్తోంది. పళ్ళాలు, మంచినీళ్ళ చెంబులు సిద్ధం
చేసింది.
కనుచీకటి పడుతూ ఉండగా వచ్చారు కృష్ణవేణి, రమాదేవీ. వాళ్ళ వెనుకే
వచ్చిన పంతులు గారు, "అవ్వలేదా ఇంకా?" అని అడిగారు సరస్వతమ్మని.
"అయిపోవొచ్చింది.. వచ్చే వచ్చే" అందావిడ, జాడీ లోంచి తీసిన మాగాయలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలూ, పెరుగూ కలుపుతూ.
"....అందాల నటి కృష్ణవేణి రోజా, సరోజ గా ద్విపాత్రాభినయం చేసే
అద్భుత నాటకం 'పగబట్టిన త్రాచు' మరికొద్ది సేపట్లో..." పక్కూరికి వెళ్ళిన
ఒంటెద్దు బండిలో మైకు నుంచి అలలుఅలలుగా వినిపిస్తున్నాయి మాటలు.
ఒక్కో పళ్ళెం లోనూ నాలుగేసి ఇడ్డెన్లు, సగం రొట్టి ముక్క పెట్టి, కాచిన నెయ్యి అభికరించి, పచ్చళ్ళు వేసి ఆడవాళ్లిద్దరికీ చెరో పళ్ళెం అందించింది సరస్వతమ్మ.
ఒక్కో పళ్ళెం లోనూ నాలుగేసి ఇడ్డెన్లు, సగం రొట్టి ముక్క పెట్టి, కాచిన నెయ్యి అభికరించి, పచ్చళ్ళు వేసి ఆడవాళ్లిద్దరికీ చెరో పళ్ళెం అందించింది సరస్వతమ్మ.
"మీరూ తినేద్దురుగాని" అని పంతులుగారితో అంటూ
ఉండగానే "ఇప్పుడు కాదు.." అంటూ హడావిడిగా బయటికి వెళ్ళిపోయారాయన.
"అయ్ బాబోయ్.. వొద్దే ఎట్టేసేరు ఇన్ని
తిన్లేనమ్మగారూ.. కూంత తీసేద్దురూ," బతిమాలింది రమాదేవి.
"తినకపోతే
ఎలాగమ్మా.. మీ ఇంటికి వెళ్ళేదాకా మళ్ళీ ఏమీ దొరకవు మీకు.." వాళ్ళతో
మాట్లాడుతూనే టీకి నీళ్ళు పెట్టింది. మౌనంగా తింటోంది కృష్ణవేణి. ఇడ్డెన్లు
పట్టుకొచ్చిన సరస్వతమ్మ ఇద్దరి పళ్ళాల్లోనూ చేరి రెండూ వడ్డించ బోయింది.
వద్దుగాక వద్దన్నారిద్దరూ. వాళ్ళు టీ తాగుతూ ఉండగానే పంతులుగారు హడావిడిగా లోపలికొచ్చారు.
"సత్యం కంగారు పడుతున్నాడమ్మా మేకప్పులకి టైము సరిపోదని.. గుర్తుంది కదమ్మా కృష్ణవేణీ.. ముందు సరోజ వేషం నీది.. క్లబ్ డేన్స్ అయ్యాక రోజా వేషం .. జాగ్రత్తగా చెయ్యండి" అన్నారు.
"సత్యం కంగారు పడుతున్నాడమ్మా మేకప్పులకి టైము సరిపోదని.. గుర్తుంది కదమ్మా కృష్ణవేణీ.. ముందు సరోజ వేషం నీది.. క్లబ్ డేన్స్ అయ్యాక రోజా వేషం .. జాగ్రత్తగా చెయ్యండి" అన్నారు.
ఇద్దరూ మేకప్పులకి బయల్దేరబోతుంటే "ఒక్క
నిమిషం ఆగండమ్మా" అంది సరస్వతమ్మ. జాకెట్ ముక్కలు, కుంకుమ భరిణెతో వచ్చి
రమాదేవికి బొట్టు పెట్టి జాకెట్ ముక్క చేతిలో పెట్టింది. ఆ పళాన వంగి ఆవిడ
కాళ్ళకి దండం పెట్టేసింది రమాదేవి "మీయాసీరోదాలు కావాలమ్మగారూ" అంటూ.
"బొట్టుంచుతాను రామ్మా కృష్ణవేణీ" అంటూ పిలిచి రెండో జాకెట్ ముక్క ఆమె
చేతిలో పెట్టింది. ఏమీ మాట్లాడలేదు కృష్ణవేణి. "వెళ్ళొస్తావండీ" అని చెప్పి
బయల్దేరారు ఇద్దరూ.
"మీరు సూత్తారు కదమ్మా నాటకం" అడిగింది రమాదేవి.
నవ్వుతూ తలూపుతూ "జాగర్తమ్మా" అంది సరస్వతమ్మ.
స్టేజీని ఆనుకుని ఉన్న ప్రహారీ గోడ వెనుక కొత్తగా కట్టిన
కొబ్బరాకుల దడిలో మేకప్పులు మొదలు పెట్టాడు సత్యం. జాలీ ఫేస్ పౌడరులో
కొబ్బరినూనె కలిపి తయారు చేసిన పేస్టుని ఒక్కొక్కరి ముఖాలకీ పూసి, అది
ఆరుతూ ఉండగానే ముందుగా సిద్ధం పెట్టుకున్న పచ్చికొబ్బరి పుల్లని కాటుక భరిణెలో ముంచి ఆడవాళ్ళిద్దరికీ
కాటుక, కనుబొమలు, మగవాళ్ళకి మీసకట్లు దిద్దాడు.
ఇసకేస్తే రాలనంతగా పోగుపడ్డారు జనం.
ఆవరణంతా ఒకటే గోలగోలగా ఉంది. స్టేజీకి తెరలు కట్టి సిద్ధం చేశారు. రమాదేవి వాళ్ళ
మాయ లైటింగ్ ఏర్పాట్లు చేసేశాడు. హార్మోనిస్టు, పక్క వాద్యాలని సిద్ధం
చేసుకుని స్టేజికి ఒక పక్కగా మైకులు అమర్చుకుని కూర్చున్నాడు. పంతులు గారు
అందరి దగ్గరికీ హడావిడిగా తిరుగుతూ జాగ్రత్తలు చెబుతున్నారు.
సన్నగా మంచు
పడుతోంది. పందిరి దగ్గర బజ్జీల కొట్టు పెట్టేసిన ప్రసాదం అప్పుడే మిరపకాయ బజ్జీలు, శనగ
వడలు వేడివేడిగా వేసి అమ్మడం మొదలు పెట్టేశాడు.
ఘోషా పాటించే ఇళ్ళలో ఆడవాళ్ళందరూ ఓ పక్కగా కూర్చున్నారు.
సరస్వతమ్మ ఉంది వాళ్ళలో. సినిమా పాటలు మోగిస్తున్న మైకు ఆపేసి, నాటకం
మొదలవ్వ బోతోందన్న ప్రకటన చేయించేశారు పంతులుగారు. ఆవరణంతా నిశ్శబ్దం అలముకుంది.
ముదురు నీలం రంగు తెరవెనుక నటీనటులందరూ వరసగా నిలబడి ముందుగా వినాయక
ప్రార్ధన, ఆ వెనుకే 'వందే వందే కళామతల్లీ... ' పాడారు.
తను పరీక్ష పాసయ్యాననంటూ కృష్ణవేణి నారాయణరావుకి సంబరంగా చెప్పడం మొదటి సన్నివేశం. నారాయణరావు
స్నేహితులు అతన్ని చేతులూపి ప్రోత్సహించారు. కృష్ణవేణిని చూసి కుర్రాళ్ళు
ఈలలేశారు.
ప్రామ్ప్టింగ్ కి ఒక్కరు సరిపోక తెరకి రెండు వైపులా ఇద్దరిని
ఏర్పాటు చేయాల్సి వచ్చింది పంతులుగారు. నారాయణరావుకీ కృష్ణవేణికీ డ్యూయట్
మొదలవ్వగానే రంగు కాగితాలు, పూలు, చిల్లర డబ్బులు స్టేజి మీదకి ఎగరేశారు
కుర్రాళ్ళు.
విలన్ వేషం వేసిన సత్యమూర్తి డెన్ కనిపించగానే క్లబ్ డేన్స్
వస్తుందని ఊహించేశారు కొందరు. "క్లబ్ డేన్స్ .. క్లబ్ డేన్స్" అంటూ కేకలు
మొదలు పెట్టారు. వాళ్ళ అంచనా తప్పు కాలేదు.
ఒక్కసారిగా లైట్లు ఆరి వెలిగేసరికి రమాదేవి ప్రత్యక్షం అయ్యింది
స్టేజీ మీద. చిన్న నిక్కరు, నడుము వరకూ రాని బనియన్ వేసుకుంది. కాళ్ళకి
సాక్సులు, బూట్లు, విరబోసుకున్న జుట్టు, తలమీద టోపీ. ఆమె డేన్స్ చేస్తూ
ఉంటే రంగు రంగుల లైట్లని ఆమె మీదకి ఫోకస్ చేస్తున్నాడు మాయ.
పాట అవుతూనే రెండు
గుప్పిళ్ళ నిండా రంగు కాగితాలు గాల్లో ఎగరేసి తెరవెనక్కి మాయమైపోయింది
రమాదేవి. ''వన్స్ మోర్' లని పట్టించుకోకుండా నాటకంలో తర్వాతి సీన్
మొదలైపోయింది.
పొరుగూళ్ల నుంచొచ్చిన కొందరు తిరుగుముఖం పట్టారు. చీర చుట్టుకుని వచ్చి ఆడవాళ్ళకి కొంచం దూరంగా కూర్చుని నాటకం
చూస్తోంది రమాదేవి.
"స్టేజీ ఎక్కి గెంతులెయ్టానికి లేని సిగ్గు ఉప్పుడెందుకో.. ఆ కురస గుడ్డలతోనే కూకోవొచ్చు గదా.. సీర సుట్టుకోటం దేనికంటా?"
సరస్వతమ్మ దగ్గర నిష్టూరపడింది ఒకావిడ.
"స్టేజీ మీద డేన్స్ చెయ్యడం ఆమె
వృత్తి.. స్టేజీ దిగిపోయాక మనలాంటి ఆడదే కదమ్మా" సరస్వతమ్మ మాటలు అక్కడ
ఎవరికీ రుచించలేదు.
రంగశాయి, కృష్ణవేణి పోటీ పడి నటించేస్తున్నారు
స్టేజీమీద. కృష్ణవేణి కి ప్రామ్ప్టింగ్ బాగా కావాల్సి వస్తోంది.
నారాయణరావుతో చీరల్లో కనిపించిన కృష్ణవేణి ఇప్పుడు రెండు జెడలు, లంగా
వోణీల్లో ఉంది.
విజిల్స్ మోతలో సగం డైలాగులు వినిపించడం లేదు ఎవరికీ. అయినా
నాటకం రక్తి కట్టింది అనిపించడానికి అవేవీ అడ్డంకి కాలేదు.
నాటకం అవుతూనే
ఉత్సాహవంతులు కొందరు కృష్ణవేణికీ, రమాదేవికీ నగదు బహుమతులు చదివించారు.
పొరుగూరి నుంచి వచ్చిన ఓ వృద్ధ కళాకారుడు వాళ్ళిద్దరినీ భుజం తట్టి
ప్రోత్సహించాడు.
జనం ఇంటి ముఖం పడుతూ ఉండగానే నటీనటులందరూ మేకప్పులు
కడుక్కునే పనిలో పడ్డారు. బట్టలు మార్చుకుని, బయల్దేరడానికి సిద్ధ పడుతున్న
కృష్ణవేణికి రంగశాయి ఒక్కడూ కూర్చుని బీడీ కాల్చుకుంటూ కనిపించాడు.
"మాయక్కోలింటికి రామిండ్రీ
ఎల్తన్నాను.. అక్కకి బాలేదంట.. రొండు మూన్నెల్లు అక్కడే ఉండాల్సొత్తాదేమో.. అదుండేది మెరకీదిలో.." అంటూ గుర్తులు చెప్పింది.
అన్యమనస్కంగా తలూపాడు రంగశాయి.
వెనక్కి వెనక్కి చూస్తూ ఇంటిముఖం పట్టింది కృష్ణవేణి.
(ఇంకా ఉంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి