ఆదివారం, మే 24, 2009

నాయికలు-(మల్లాది)మందాకిని

"భర్త అరచేతిలో ఇసుక లాంటి వాడు. అతన్ని బంధించి ఉంచాలని గుప్పెట మూస్తే, వేళ్ళ సందుల నుంచి జారిపోతాడు.." తనకి పెళ్లి చేసి, అత్తవారింటికి పంపుతూ తల్లిదండ్రులు చెప్పిన ఈ మాటని అనుక్షణం గుర్తుంచుకుంది మందాకిని. వ్యసన పరుడైన తన భర్త భానుమూర్తిని తన ఓర్పుతో, నేర్పుతో మంచి మనిషిని చేసింది. ఇష్టపూర్వకంగానే అతను తన వ్యసనాలను ఒక్కొక్కటిగా వదిలిపెట్టే పరిస్థితులని సృష్టించింది. పెళ్లి పీటల మీద తనని చూసి జాలిపడ్డ వారందరి అభినందనలూ అందుకుంది.

మల్లాది వెంకట కృష్ణమూర్తి నవల 'మందాకిని' లో కథానాయిక ఓ మధ్యతరగతి పురోహితుడి ముగ్గురు కూతుళ్ళలో రెండో అమ్మాయి. చదువుకున్న తను, తన చెల్లెలు ఉద్యోగం చేయడం తండ్రికి ఇష్టం లేకపొతే ఆయన్ని ఎదిరించి బయటికి వెళ్ళలేదు. ఇంట్లో ఉంటూనే సంపాదించే మార్గాలు అన్వేషించింది..ఆర్ధికంగా తండ్రికి కొంత వెసులుబాటు కలిగించింది. ఇంట్లో ఎవరికీ ఏ చిన్న కష్టం వచ్చినా చెప్పుకోడానికి మొదట గుర్తొచ్చేది మందాకినే. పెళ్ళయ్యి, ఒక పిల్లకి తల్లయిన అక్క వసంతలక్ష్మి కూడా ఇందుకు మినహాయింపు కాదు.

వసంతలక్ష్మి భర్త భానుమూర్తి వ్యసనపరుడు. అతనికి లేని దురలవాటు లేదు. అటు అతన్ని భరించలేక, ఇటు తండ్రికి భారం కాలేక ఆత్మహత్య చేసుకుంటుంది వసంతలక్ష్మి. మరోపక్క, ఓ ప్రేమ వ్యవహారంలో పీకలోతు కూరుకుపోయిన మందాకిని చెల్లెలు వెంటనే పెళ్లి చేసుకోక తప్పని పరిస్థితి కల్పిస్తుంది. తల్లితండ్రులని బలవంతంగా ఒప్పించి భానుమూర్తి రెండో భార్యగా ఆ ఇంట అడుగుపెడుతుంది మందాకిని. సమస్యలవలయంలోకి అడుగుపెట్టడానికి మానసికంగా సిద్ధపడ్డా, ఆ సమస్యల తీవ్రత తాను ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉండడం భయపెడుతుంది మందాకినిని.

ప్రతి సమస్యకీ ఓ పరిష్కారం ఉంటుందన్న సానుకూల దృక్పధాన్ని అలవర్చుకున్న మందాకిని తన భర్త వ్యసనాలు, అతను వాటికి అలవాటు పడడానికి గల కారణాలను అన్వేషిస్తుంది. నాటకాలు, తాగుడు, పేకాట, సిగరెట్లు, స్త్రీ వ్యసనం ఉన్న భానుమూర్తి కి అందరిచేత గొప్పవాడు అనిపించుకోవాలన్న కోరిక ఉందని గ్రహిస్తుంది. అతని చేత పేకాట మాన్పించడానికి భానుమూర్తికి చదరంగం అలవాటు చేస్తుంది. ఒక సంవత్సరం పాటు ప్రతి రోజు కనీసం అరగంట సేపు తనతో చదరంగం ఆడాలనీ, ఈ యేడాది కాలం లో మరెవరితోనూ చదరంగం ఆడకూడదనీ షరతు విధిస్తుంది.

స్త్రీ వ్యసనాన్ని మాన్పించడానికి తన తండ్రికి తెలిసిన ఒక డాక్టరుసహాయం తీసుకుంటుంది. నాటకాలలో నటించే బదులు, భానుమూర్తే నాటకం రాస్తే ఆ నాటకం ఎక్కడ ప్రదర్శించినా రచయితగా అతనికి పేరొస్తుందని చెప్పి ఒప్పిస్తుంది. భానుమూర్తిలో ఉన్న మంచిగుణాలను గ్రహించి, వాటిని మెచ్చుకుంటూనే తన ప్రేమతో అతను మిగిలిన వ్యసనాలకి దూరం జరిగేలా చేస్తుంది. ఓర్పుతో, నేర్పుతో, సరైన దిశగా కృషి చేస్తే పరిష్కరించుకోలేని సమస్య లేదని నిరూపిస్తుంది మందాకిని.

ఈ 'మల్లాది' మార్కు నవలలో మందాకిని జీవితంతో పాటు, నాటక రంగంలో తెర వెనుక రాజకీయాలు, నాటక రచనలో తీసుకోవలసిన జాగ్రత్తలు, సొంత వైద్యాల వల్ల  జరిగే ప్రమాదాలు, వంటింటి చిట్కాలు..ఇలా ఎన్నో అంశాల ప్రస్తావన ఉంటుంది. సంకల్ప బలం ఉన్నప్పటికీ, తన మార్గంలోకి ముళ్ళు అడ్డొచ్చిన ప్రతిసారి మందాకిని బాధ పడడం, లక్ష్యాన్ని సాధించలేనేమో అని భయపడదాన్ని వివరించడం ద్వారా ఆ పాత్రని ఎలాంటి ప్రత్యేక లక్షణాలు లేని ఓ మామూలు అమ్మాయిగా చిత్రీకరించారు. ఆశావహ దృక్పథంతో సాగే ఈ నవల పాజిటివ్ గానే ముగుస్తుంది. 'మందాకిని'నవల ప్రింట్ ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో లేదు. త్వరలోనే వస్తుందని తెలిసింది..

12 కామెంట్‌లు:

  1. నేను చదివి చాలా సంవత్సరాలు అయింది. సమీక్ష విషయంలో మీ అభిప్రాయమే అపుడూ, ఇపుడూ నాది చాలావరకు .
    >> లక్ష్యాన్ని సాధించలేనేమో అని భయపడదాన్ని వివరించడం ద్వారా ఆ పాత్రని ఎలాంటి ప్రత్యెక లక్షణాలు లేని ఓ మామూలు అమ్మాయిగా చిత్రీకరించారు
    ఆ వయసులో అది నచ్చలేదు. సంకల్పం చాలు అనుకునేదాన్ని. ఇపుడు అనుభవం గడించాక అవి మన అధీనంలో లేని మనసు పోకడలు అంతిమ ఫలం ఏదైనా అలా ఆలోచనల్లో, ఆవేదనలో మునిగితేలటం సహజం అని అనుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  2. "భర్త అరచేతిలో ఇసుక లాంటివాడు " అనిన మల్లాది గారి సూత్రాన్ని బాగా ఒంటపట్టించుకున్నానండి ....ఇది నేను ఎప్పటికి మరచిపోలేను ....తు.చ. తప్పకుండా పాటిస్తున్నాను ..మల్లాది గారికి బ్లాగ్ ముకంగా ధన్యవాదాలు ....మీ టపా ద్వారా నన్ను ఎక్కడికో తీస్కేల్లిపోయారు . మంచి టపా

    రిప్లయితొలగించండి
  3. మల్లాది, యండమూరిలు తెలుగు సమాజానికి మేలు చేసిందిక్కడే. సామాన్యమైన మధ్యతరగతి మనుషుల్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందించేలా ఉంటాయి వాళ్ల రచనలు. పల్ప్ అని తీసిపారేసేవారుండొచ్చుగాక, తెలుగునాట కొందరికి చదవడంలోని మజాని పరిచయం చేసి, మరికొందరిని సీరియస్ రీడింగ్ వైపు మళ్లించిన ఘనత మాత్రం వీరిద్దరిదే. మీ పరిచయం బావుంది.

    రిప్లయితొలగించండి
  4. 1985 లోనో, 86 లోనో, ఈ నవల చదివాను. అప్పటి నుండి, ఇప్పటి వరకు, తెలుగు నవలలలో, నీకు అత్యంత నచ్చినది ఏమిటి అంటే, "మందాకిని" అనే చెబ్తాను. ర్యాగింగ్ జరిగేటప్పుడు , నాకు నచ్చిన నవలగా చెప్పినప్పుడు సీనియర్లు బాగా ఆట పట్టించారు, (అప్పట్లో, అనందోబ్రహ్మ అనిచెప్పటం ఓ fashion, ఇప్పుడు బ్లాగ్లోకం లో హిందూ మతాన్ని ఆడి పోసుకోవటం లాగ అన్నమాట ;-)

    ఇనాళ్ల తర్వాత మళ్లీ ఈ నవల గురుంచి చదవటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇప్పుడు వయసు పెరిగాక ఎందుకు నాకు ఆ నవల అంతగా నచ్చిందో అలోచిస్తుంటే, నా నిజజీవితం లో , ఆ కథానాయికి వంటి సామాన్యమయిన ఆడవాళ్లు, ఎందుకు పనికిరాని జులాయి మొగుళ్లను ప్రయోజుకులుగా మార్చటం చూడటం వలననేమో అనిపిస్తుంది.

    క్రితం సారి, ఇండియా వెళ్లినప్పుడు, నా తమ్ముడు వరస అయ్యే వాడిని, ఇలానే మార్చిన, అయిదవ తరగతి కూడా చదవని, వాని భ్యారని చూసి ఎంత ముచ్చట వేసిందో. వాడు ఎంత వెధవ అయినా, వాడి కూతురు మీద చాలా ప్రేమ. ఆ ప్రేమ నే, ఆయుధం గా తీసుకొని, వాని భర్య కొంచం కొంచం గా మా వాడిని మార్చిన తీరు, విన్నప్పుడు ఈ నవలే గుర్తుకు వచ్చింది. ఆ అమ్మాయితో, " అమ్మా మా వాడిని మార్చిన ఘనత మాత్రం నీదే" అన్నప్పుడు , ఆ అమ్మాయి, ఆత్మస్థైర్యం తో నవ్వుతూ, ఈ మాట మాత్రం మీ తమ్ముడు దగ్గర అనకండి అని అనప్పుడు ఈ నవలలోని నాయికే గుర్తుకు వచ్చింది అంటే నమ్మండి.

    మంచి సమీక్ష వ్రాసారు.

    రిప్లయితొలగించండి
  5. ఓర్పూ ..సహనం ..సాహసం ..అందం ...అణకువ ...తెలివి ....కలిస్తే మందాకిని ....ఆమె యండమూరిగారిదైనా, మల్లాదిగారిదైనా సరే ....మీ పరిచయమూ ఆమెకు తగ్గట్టే ఉంది .చాలారోజుల కాదు కాదు సంవత్సరాల క్రితం చదివినా ఆ నవలలోని మీరు రాసిన మొదటి వాక్యాలు అలాగే గుర్తుండిపోయాయి .

    రిప్లయితొలగించండి
  6. @ఉష: ధన్యవాదాలు
    @చిన్ని: గ్రేట్! అన్నట్టు మీరు మల్లాది గారి అభిమాని అనుకుంటా.. ఒకసారి మీ బ్లాగు లో ఆయన్ని కలవడాన్ని గురించి చదివాను.. ధన్యవాదాలు.
    @అరుణ పప్పు: నిజమేనండి.. చదివే అలవాటు విషయంలో యద్దనపూడి తర్వాతి తరం వాళ్లకి పుస్తకాలని అలవాటు చేసింది వీళ్ళిద్దరే.. ధన్యవాదాలు.
    @కృష్ణ: నాకు తెలిసిన వాళ్ళు కొందరు కూడా ఉన్నారండి..వాళ్ళనే చూడకుంటే బహుశా నేను కూడా ఈ నవల 'సినిమాటిక్' గా ఉంది అనుకునే వాడిని.. వీళ్ళ ప్రత్యేకత ఏమిటంటే తామేదో సాధించాం అన్నట్టు కాకుండా, ఇవన్నీ ప్రతి కాపురం లోనూ ఉండేవే అని సింపుల్ గా తేల్చేస్తారు.. ధన్యవాదాలు.
    @శిరీష: శుభం.. మొదలు పెట్టండి మరి.. ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయకూడదు.. ధన్యవాదాలు.
    @పరిమళం: ఇద్దరు మందాకినులూ నాకు ఇష్టమైన వాళ్ళే.. చాలామంది "భర్తను గుప్పెట్లో పెట్టుకున్నాం'' అనే భ్రమ లో ఉంటారు.. బహుశా వాళ్ళ కోసం ఆ మొదటి వాక్యం రాశారేమో మల్లాది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. నాకు యండమూరి నవల్లోని ఈ మాటలు గుర్తొస్తున్నాయి..
    "స్త్రీని భూదేవితో పోల్చింది పిల్లల్ని కన్నందుకూ, అత్తమామలను ఆదరంగా చూసుకున్నందుకూ కాదంట.. సిగరెట్ తాగే మొగుడిని ముద్దు పెట్టుకోగలిగే సహనం తెచ్చుకున్నందుకంట! తాగి వచ్చినప్పుడు భరించిడం నేర్చుకున్నందుకంట!!"

    ఊసుపోక మొదలుపెట్టిన అలవాటు వదలకుండా పట్టిఉంచినప్పుడు, తను దాని కంట్రోల్ లో ఉన్నాను అనే చిన్న సెల్ఫ్ రియలైజేషన్ కలిగితే చాలు.. మారాలి/మానాలి అన్న ఆలోచన మిణుకుమిణుకు మంటూనైనా మనసులో ఎక్కడో ఉంటుంది.. అలాంటి భర్తలకి మందాకిని లాంటి భార్యలు తోడైతే చాలు! నన్నడిగితే మందాకిని సాధించిన విజయంలో కొంత క్రెడిట్ భానుమూర్తికి దక్కుతుంది.. అఫ్కోర్స్, ఆ విజమేదో తనని ఉద్దరించడం అయినా! అసలెలాంటి రియలైజేషన్ లేనివాళ్ళని మార్చడానికి వందమంది మందాకినిలు వచ్చినా సరిపోరు!

    రిప్లయితొలగించండి
  8. @నిషిగంధ: నిజమేనండి..భానుమూర్తి కి ఆ క్రెడిట్ లో భాగం ఇవ్వాల్సిందే.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వసంతలక్ష్మి సాధించలేక పోయిన పనిని మందాకిని సాధించింది.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  9. మంచి పరిచయం...
    చదివి చాలా సంవత్సారాలయినా, ఇంకా గుర్తున్నాయి ఆ పాత్రలు.. అయితే మొదట చదివినప్పుడు నాకు అంత నచ్చలేదు.. ఏదో నవల కాబట్టి, అన్ని సమస్యల నుండి బయటపడగలిగింది అనిపించింది, కానీ తరువాత తరువాత కొంతమందిని చూసిన తరువాత ఓకే అనిపించింది.. :)

    రిప్లయితొలగించండి
  10. మొదటి పేజి నించి ఆఖరు పేజి వరకూ ఎక్కడా బ్రేకకుండా చదివేశానండి. ఇంటర్మీడియట్ లో వుండగా ఒకసారి చదివినట్టు గుర్తు. చాలా బాగుంది. మంచి పుస్తకం చదివించినందుకు ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి