గురువారం, సెప్టెంబర్ 15, 2011

మల్లాది 'పరంజ్యోతి'

ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి ని గురించి చెప్పడానికి కొత్తగా ఏముంది? మధ్యతరగతి జీవితాలని మల్లాదంత అందంగా చిత్రించిన కమర్షియల్ రచయిత మరొకరు లేరనడం అతిశయోక్తి అనిపించదు నాకు. మల్లాది నవలల్లో 'అందమైన జీవితం' 'మందాకిని' లాంటి కొన్ని నవలలు ఇప్పటికీ నా ఆల్ టైం ఫేవరెట్స్ జాబితాలో ఉన్నాయి. 'తేనెటీగ' 'కల్నల్ ఏకలింగం ఎడ్వంచర్స్' లాంటి శృంగార రస ప్రధానమైన నవలలు రాసిన మల్లాది ఈమధ్యన తన బాణీని పూర్తిగా మార్చుకుని ఆధ్యాత్మిక రచనలు చేస్తున్నారు!

గత కొంతకాలంగా కమర్షియల్ నవలలు చదవడం తగ్గించిన నాకు చాలా మంది మిత్రులు చదవమని సూచించిన నవల మల్లాది రాసిన 'పరంజ్యోతి.' ఈమధ్యనే చదివాను. ముఖచిత్రం చూడగానే ఆమధ్యనెప్పుడో చదివిన రాబిన్ శర్మ ఆంగ్ల రచన 'ది మాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెర్రారీ' జ్ఞాపకం వచ్చింది. కానీ, రెంటికీ ఉన్న పోలిక రేఖామాత్రం. మల్లాది నవలల్లో ఆకట్టుకునేది ఆసాంతమూ విడిచిపెట్టకుండా చదివించే శైలి, ప్రతి చిన్న విషయాన్నీ పాఠకులందరికీ అర్ధమయ్యేలా ఓపికగా వివరించే విధానం. 'పరంజ్యోతి' లోనూ అదే శైలి కొనసాగించారు.

ఒకే శరీరంతో రెండు జన్మల జీవితాన్ని గడిపిన పరంజ్యోతి కథ ఇది. కథాకాలం ఇప్పటికి దాదాపు నూట పాతిక సంవత్సరాల క్రితం. కథాస్థలం గోదారి ఒడ్డున ఉన్న నెమలికొండ సంస్థానం (ఎంత అందమైన పేరు!). సంస్థానాదీశుడు కనుమూరి భూపతిరాజు మూడో కొడుకు రామరాజు కి జీవితం ఉన్నది అన్నీ అనుభవించడానికే అని ఓ బలమైన నమ్మకం. "మరణం అంటే నాకు భయం లేదు. ఎందుకంటే నేను జీవించి ఉన్నంతకాలం మరణం నా సమీపంలోకి రాలేదు. అది వచ్చినప్పుడు నేనుండను. ఇంక చావంటే నాకు భయం దేనికి?" ఆంటాడు.

పుడుతూనే తల్లిని పోగొట్టుకున్న రామరాజుకి ఆ సంస్థానంలో అక్షరాలా ఆడింది ఆట. తండ్రి, ఇద్దరు అన్నలు, అక్క కుముదినీ దేవి, అమ్మమ్మ జానకీబాయి ఎవరూ కూడా అతనికి ఎలాంటి అడ్డూ చెప్పరు. మద్యమూ, మగువా యవ్వనారంభంలోనే పరిచయమై విడదీయలేని వ్యసనాలవుతాయి. అహల్యతో వివాహమైనా, భార్యతో అతడు గడిపింది బహు కొద్ది కాలం. ఆ సాంగత్య ఫలితంగా ఓ కొడుక్కి జన్మనిస్తుంది అహల్య. పరస్త్రీలలో,మరీ ముఖ్యంగా గణికల్లో కనిపించే సౌందర్యం తన ఇల్లాలిలో కనిపించదు రామరాజుకి.

సుఖవ్యాధులతో మంచం పట్టిన రామరాజు మీద అహల్య ఎంతటి అసహ్యాన్ని పెంచుకుంటుందంటే, తన అన్న సాయంతో భర్తకి ఇచ్చే ఔషధాలలో విషం కలిపి తినిపించేస్తుంది. ఆస్థాన వైద్యుడితోపాటు, బ్రిటిష్ ప్రభుత్వపు డాక్టరూ రామరాజు మరణాన్ని ధృవపరిచాక గోదావరి తీరాన అంత్యక్రియలకి ఏర్పాట్లు జరుగుతాయి. చితికి పెట్టిన నిప్పు కాలడం మొదలవ్వగానే, ఉన్నట్టుండి వర్షం వచ్చి, గోదారి పొంగి రామరాజు దేహం నదిలో కొట్టుకుపోతుంది. పాపికొండల సమీపంలోని గుర్రం కొండలో ధ్యానం చేసుకునే సన్యాసి సహజానంద స్వామి, రామరాజుకి కాయకల్ప చికిత్స చేసి కోలుకునేలా చేస్తాడు. గతాన్ని పూర్తిగా మర్చిపోయిన అతనికి 'పరంజ్యోతి' పేరుతో కొత్త జీవితాన్ని ఇస్తాడు.

సహజానందతో పన్నెండేళ్ళ ఆధ్యాత్మిక సాహచర్యం తర్వాత పరంజ్యోతికి అనూహ్యంగా తన గత జీవితం గుర్తొచ్చి నెమలికొండకి ప్రయాణం అవ్వడం, అహల్య అతన్ని రామరాజు కాదనడం, కోర్టు కేసు... ఇలా ఎన్నెన్నో ఉత్కంఠభరితమైన మలుపులతో ముగింపుని చేరుతుంది. రక్తినీ, భక్తినీ, ఆధ్యాత్మిక విషయాలనీ రాచిళ్ళ రాజకీయాలనీ సమపాళ్ళలో రంగరించి రాసిన ఈ నవలలో, 'నర్మదా పరిక్రమ' లాంటి అతి కొద్ది మంది మాత్రమే తెలిసిన ఎన్నో విషయాలని ఎంతో విశదంగా రాశారు మల్లాది. సన్యాసుల జీవితం, వారు చేసే పనులన్నింటి వెనుకా ఉండే పరమార్ధాన్ని కథ పరిధి మించని విధంగా వివరించారు. ఎంతో క్లిష్టంగా అనిపించే వేదాంత విషయాలని సైతం అందరికీ తెలిసిన ఉదాహరణలతో సులభంగా చెప్పడం ఈ నవల ప్రత్యేకత.

అయితే ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో దూరం ప్రయాణించిన పరంజ్యోతి, తన గతం గుర్తు రాగానే "నన్ను చంపాలని ప్రయత్నించిన వారికి నేను శిక్ష పడేలా చేయాలి" అని ఐహికంగా మాట్లాడడం ఏమిటో అర్ధం కాలేదు. సహజానంద సహవాసంలో సంపాదించిన జ్ఞానం ద్వారా అతడు అప్పటికే వారిని క్షమించగలిగేంత ఎత్తుకన్నా ఎదిగి ఉండాలి, లేదా తన మీద జరిగిన హత్యా యత్నం అన్నది తన చర్యలకి ప్రతిచర్యగా జరిగిందని అయినా అర్ధం చేసుకుని ఉండాలి. ఓ చిన్నపాటి జెర్క్ తో మొదలయ్యే కథనం అనూహ్యంగా వేగం పుంజుకుని ఆ సాంతమూ విడిచిపెట్టకుండా చదివిస్తుంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి ఉన్నవారికి బాగా నచ్చే నవల ఇది. (లిపి పబ్లికేషన్స్ ప్రచురణ, పేజీలు 260, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

16 వ్యాఖ్యలు:

కొత్తావకాయ చెప్పారు...

మిమ్మల్ని మించిన సమీక్షకుడిని చూడలేదు. నవల చదివి మీ సమీక్ష చదివితే మరో సారి నవల చదవనిదే మనసూరుకోదు. మీ దృక్కోణంలోంచి చూడాలి అనిపించడం, అనిపించేలా చేయడం మీ ప్రత్యేకత. అభినందనలు.

మాలా కుమార్ చెప్పారు...

ఈ నవల నేనూ చదివానండి . మల్లాది మిగితా నవలల కన్నా ఇది కొంచం భిన్నం గా వుంటుంది . సమీక్ష బాగుంది .

snigdha చెప్పారు...

ఇందు గారి బ్లాగ్ లో ఈ నవల గురించి చదివినప్పటినుంచి అనుకుంటున్నాను వెంటనే నవల తెచ్చుకుని చదువుదామని..కానీ బెంగళూరు తెలుగు నవలలు ఎక్కడ దొరుకుతుందో తెలియటం లేదు..మీ సమీక్ష చదివాక ఎప్పుడెప్పుడు చదువుదామా అని ఉంది...

snigdha చెప్పారు...

గురువు గారు, సూపరు....నా బ్లాగు పైన శీత కన్ను వేసారేమిటి??

Padmavalli చెప్పారు...

ఈ నవల నేను చదవలేదు. మల్లాది పుస్తకాలు ఆమాట కొస్తే కాలక్షేపం పుస్తకాల మీద విరక్తి కలిగి చాలా యేళ్ళయ్యింది. ఇప్పుడు ఇది చదివాకా ఈ పుస్తకం చదవాలని ఉంది. ఇక, మీ సమీక్షలు /పరిచయాల విషయానికొస్తే, కొత్తావకాయ గారి మాటే నాదీను.

శశి కళ చెప్పారు...

నిజమె...ఆన్నెళ్ళు తపసు చెసి ఇంకా కక్ష తీర్చుకోవటం
యెమిటి?అయినా మల్లాది గారు వ్రాసారు అంటె యెదొ
ఆలొచిన్చె ఉంటారు.

Chowdary చెప్పారు...

ఈ పుస్తకం నేను చదవలేదు కానీ మీ పరిచయం చదువుతుంటే మూడు విషయాలు గుర్తుకు వచ్చాయి: భోవాల్ సన్యాసి కేసు, రత్నదీపం అనే నవల, రాజా రమేష్ అనే సినిమా.

బెంగాల్‌లో భవల్ (దీన్ని తెలుగు పుస్తకాలలో భోవాల్ అనేవారని గుర్తు; బహుశా బెంగాలీలో భ భొ అవటం వల్ల కాబోలు) సంస్థానం రాజుగారు సుఖవ్యాధులతో పాతికేళ్ళ వయస్సులో డార్జిలింగ్‌లో మరణించగా, అక్కడే అంత్యక్రియలు చేశారు. పదిపన్నెండేండ్ల తర్వాత ఆ ఊరికి వచ్చిన ఒక సన్యాసిని ఊరి వాళ్ళు తమ రాజుగా గుర్తు పట్టారు. కొంతమంది కుటుంబసభ్యులు, ఊరి ప్రజల సహాయంతో నేనే రాజుని అని ఆయన వాజ్యం వేశాడు. కానేకాదని రాజుగారి భార్య, బ్రిటిష్ ప్రభుత్వమూ వాదించాయి. తాను చితిపై ఉండగా వచ్చిన వరదల్లో తాను కొట్టుకుపోయానని, ఒక సన్యాసి తనను రక్షించాడని, అతని వద్దే తాను ఇన్నాళ్ళు ఉన్నాను అని సన్యాసి కథనం. 16 ఏళ్ళ పాటు జరిగిన కేసు, కొన్ని వందల సాక్షుల్ని విచారించాక, 1946లో ప్రీవీకౌన్సిల్ సన్యాసి తరపున తీర్పు ఇవ్వటంతో ముగిసింది. కొసమెరుపేమిటంటే తీర్పు వచ్చిన రోజునే సన్యాసికి పక్షవాతం వచ్చి రెండు రోజుల తర్వాత మరణించాడు.

ఈ కేసు గురించి తెలియకముందు యువ పత్రికలో రత్నదీపం (అని గుర్తు) అనే బెంగాలీ నవల అనువాదం ఇదే ఇతివృత్తంతో చదివాను. ఈ కేసు గురించి ఫారెన్సిక్ మెడిసిన్ కోర్సులో చదువుతున్న రోజుల్లో రాజా రమేష్ అనే తెలుగు చిత్రం (ఏదో బెంగాలీ చిత్రం మీద ఆధారపడింది; అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, జగ్గయ్య) ఇదే ఇతివృత్తంతో వచ్చింది.

వికీపీడియాలో వెదికితే http://en.wikipedia.org/wiki/Bhawal_case కనిపించింది. ఈ కేసు మీద 2002, 2003లలో రెండు కొత్త పుస్తకాలు ఆంగ్లంలో వచ్చాయని తెలిసింది. -- జంపాల చౌదరి

రాజేంద్ర కుమార్ దేవరపల్లి చెప్పారు...

మీరు ఇక్కద ఇచ్చిన కథాపరిచయం చూస్తుంటే గతంలో వచ్చిన `రాజా రమేష్ ' అనే సినిమా కథ(అసలు బెంగాలీ మూలం -సన్యాసి రాజా-సినిమా,నవల) నుంచి కథాభాగం కొంతవరకూ ఉదారంగా ఎత్తుకొచ్చినట్లుంది.`

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

మీరు చివరి పేరాలో అడిగిన సందేహమే నాకు కూడా వచ్చింది. నవల పూర్తిచేశాక నాకు నేను ఇచ్చుకున్న సమాధానమ్ ఇది. పరంజ్యోతి ఆత్మ ప్రక్షాళన అయి సాధువైంది కానీ శరీరం, రక్తం ఇంకా క్షత్రియునివే అందుకే క్షాత్ర ధర్మం సాధు ధర్మాల మధ్య అతను ఊగిసలాడాడు. గతం గుర్తొచ్చిన వెంటనే వారిపై పగతీర్చుకోవాలని అతనికి అనిపించింది. శిష్యులు అతనిని మీరెందుకు ఆపడంలేదు అని అడిగినపుడు పరంజ్యోతి గురువు గారు స్పష్టంగా చెప్తారు కదా అతని ప్రారబ్ధ కర్మ అతనిని ఆ వైపు ప్రేరేపిస్తుంది అతనా కర్మ ఫలాన్ని అనుభవించాక అతని ప్రారబ్దకర్మ ప్రకారం మనలని కలవాలని ఉన్నా లేక దానిని అధిగమించి స్వచ్ఛంద కర్మ ద్వారా కానీ తిరిగి మనతో కలవవచ్చు అని. పరంజ్యోతి తన సాధన ద్వారా పాపఫలాన్ని నివృత్తిచేసుకున్నాడు కానీ కర్మఫలాన్ని కాదు.

గుర్తొచ్చిన వెంటనే వారిపై పగ తీర్చుకోవాలనిపించినా పుష్కర కాలంలో అతను సంపాదించిన ఙ్ఞానం అతనిని ఏదో ఒక చర్యకు పాల్పడకుండా భగవంతుడు తనను పరికరంగా వాడుకుని వారిని ఏదైనా శిక్షించాలని ఉంటే ఉపయోగపడాలని మాత్రమే నిమిత్తమాత్రంగా ప్రేక్షకుడిలా జరిగే సంఘటనలు చూస్తూ సంస్థానం దగ్గరలోని ఆలయంలో ఉన్నాడు తప్ప కోటలోకి తానుగా అడుగుపెట్టలేదు. అలాగే ఇది తన సాధన వలన తనకి అబ్బిన శక్తులను గుర్తించడానికి గురువు సూచించిన ఒక మార్గంగా కూడా అనుకోవచ్చు. ఇంకా ఆలోచిస్తే అతనిలో విషయవాంఛలు పూర్తిగా అదుపులోకి వచ్చాయోలేదో పరీక్షించడానికి గురువు/దైవం పెట్టిన పరీక్షగా కూడా అనుకోవచ్చు. పరంజ్యోతి గురువుగారు కూడా తన పూర్వజన్మలో తను సాధించినవన్నీ మరచి ఈజన్మలో తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికే క్షుద్రవిద్యవైపు ఆకర్షితుడవడం ఎందుకో నాకు గుర్తొస్తుంది. ఎంతటి సాధకులైన ప్రారభ్ద కర్మననుసరించి నడచుకోక తప్పదేమో.

నాకు ఈ నవల ఎంతగా నచ్చిందో, నన్నెంత ఆలోచింపచేసిందో ఇంత పెద్ద కామెంట్ రాశాక విడిగా చెప్పాల్సిన పనిలేదేమో కదా :-)

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

చౌదరి గారు, ఈ నవల చివర మల్లాది గారు కూడా ఈ భావల్ సన్యాసి కేసు విషయమై ప్రస్తావించారండీ... ఆ కేసు వివరాలు ప్రజామాత పత్రికలో సీరియల్ గా వచ్చేవని ఆ కేసు నేపధ్యంగా ఆధ్యాత్మిక విషాయలను కలిపి ఈ నవల రాశానని చెప్పారు అందులో..

మురళి చెప్పారు...

@కొత్తావకాయ: నా అర్హతకి మించిన ప్రశంశ కొత్తావకాయ గారూ.. అభిమానానికి ధన్యుడిని..

@మాలాకుమార్: ధన్యవాదాలండీ..

@స్నిగ్ధ: పుస్తక ప్రదర్శనలో దొరకచ్చండీ.. వర్డ్ ప్రెస్ బ్లాగుల్లో కామెంటడం బాగా కష్టమయ్యిందండీ ఆ మధ్యన. అప్పటినుంచీ చదివినా మౌనంగా వచ్చేస్తున్నా.. మరోసారి ప్రయత్నించాలి.. ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@పద్మవల్లి: మీరూనా!!..ధన్యుడినండీ.. ఒక్క మాటలో చెప్పాలంటే కమర్షియల్ ఫార్మాట్ లో రాసిన ఆధ్యాత్మిక నవలండీ ఇది.. ధన్యవాదాలు.

@శశి కళ: నిజమండీ.. కారణం ఉండే ఉంటుంది.. వేణూ శ్రీకాంత్ గారు వివరంగా చెప్పారు కదా.. ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@జంపాల చౌదరి: భావల్ సన్యాసి కేసు గురించీ, అప్పట్లో 'ప్రజామాత' పత్రికలో వచ్చిన కథనాల గురించీ పుస్తకం చివర్లో ప్రస్తావించారండీ మల్లాది.. కానైతే ఆ ఆంగ్ల పుస్తకాల ప్రస్తావన లేదు :)) ..ధన్యవాదాలు.

@రాజేంద్ర కుమార్ దేవరపల్లి: అరె.. నేను 'రాజా రమేష్' చూడలేదండీ.. లేకుంటే చదివేటప్పుడే గుర్తొచ్చేది.. భావల్ సన్యాసి కేసు గురించి మల్లాది ప్రస్తావించారు.. ధన్యవాదాలండీ..

@వేణూ శ్రీకాంత్: నేను సందేహ పడి ఊరుకున్నాను, మీరు సమాధానాన్ని పరిశోధించారు!! గ్రేట్ అండీ.. నిజమే మీరు చెప్పిన విధంగా జరిగి ఉండొచ్చు.. ఎందుకో తెలీదు కానీ, మీకీ వ్యాఖ్య రాస్తుంటే ఏర్పోర్ట్ లో మీకు సెండాఫ్ ఇస్తున్నట్టుగా ఉంది.. వీలైనప్పుడల్లా పలకరించే ప్రయత్నం చేయండి.. ..ధన్యవాదాలు.

snigdha చెప్పారు...

మురళి గారు,మీరు నా బ్లాగ్ ని చూస్తున్నాను అని చెప్పడమే నాకు చాలా సంతోషం...
థాంకూ సో మచ్....

Chowdary చెప్పారు...

ఆ పత్రిక పేరు ప్రజామాత కాదు, ప్రజామత అనుకుంటానండీ. నా చిన్నతనంలో, బ్రాడ్‌షీట్ ఫార్మాట్‌లో వచ్చేది ఆ పత్రిక - వారపత్రిక అని గుర్తు. ఆ పత్రిక బెంగుళూరునుంచి వచ్చేది అని లేశామాత్రపు గుర్తు. ఆ పత్రిక ఆఖరుపేజీల్లో ఉండే మహామాంత్రికుడు మాండ్రేక్ అనే బొమ్మల సీరియల్ (Mandrake the Magicianకు అనువాదం)మాత్రం బాగా గుర్తుంది. - జంపాల చౌదరి

మురళి చెప్పారు...

@స్నిగ్ధ: భలేవారే.. సిస్టం సమస్య సాల్వు అయ్యే ప్రయత్నాలు chestaanandee..

@జంపాల చౌదరి: అచ్చుతప్పు అయి ఉండవచ్చండీ అయితే..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి