శనివారం, జనవరి 29, 2011

ఎర్నూగు పూలు

మాండలీకపు మట్టివాసనని ఆస్వాదించే తెలుగు పాఠకులకోసం, తరతరాలుగా హోసూరు ప్రాంతంలో స్థిరపడి, తమిళ, కన్నడ భాషా సంస్కృతులతో నిత్యంపోరాడుతూ తెలుగు భాషా సంస్కృతులని నిలబెట్టుకుంటున్న సోదరులు కలంపట్టి అందించిన కథల సంకలనం 'ఎర్నూగు పూలు.' పదకొండు మంది కథకులు అందించిన పందొమ్మిది కథల్లో ప్రధానంగా కనిపించే ఇతివృత్తం బతుకుపోరు.

ఈ సంకలనంలో కథ, కథనాలని మించి ఆకర్షించేది భాషా సౌందర్యం. కన్నడ ప్రభావం ఉన్న, అక్కడక్కడ ఉర్దూ పదాలు, రాయలసీమ యాస వినిపించే తెలుగు భాష ప్రతి కథనీ ఆసాంతమూ చదివిస్తుంది. అర్ధం కాని పదాల అర్ధాల్ని వివరించేందుకు ప్రతి కథ చివరా ఫుట్ నోట్స్ ఉండనే ఉంది. హోసూరు పల్లెల అందాలని, అక్కడి సంస్కృతిని మాత్రమే కాదు, ప్రజల సమస్యలనీ కళ్ళకి కడతాయీ కథలు.

గ్రామఫోన్ రికార్డుల పెట్టెని తలపై పెట్టుకుని ఊరూరూ తిరుగుతూ, జనానికి పాటలు వినిపించి, వాళ్ళిచ్చే డబ్బుతో పొట్ట పోషించుకునే శిన్నమ్మ జీవిత కథే సంకలనంలో మొదటి కథ 'పాటల పెట్టి.' నా.వెం. అశ్వత్ధ రెడ్డి రాసిన ఈ మూడు నాలుగు దశాబ్దాలకి పూర్వంనాటి హోసూరు పల్లెల జీవన విధానాన్ని కళ్ళముందు ఉంచుతుంది. 'పరస పొద్దు' అనే కథ పేరు చూడగానే 'ప్రళయ కావేరి కథలు'లో స.వెం. రమేష్ రాసిన 'ఉత్తరపొద్దు' కథ గుర్తొచ్చింది కానీ, ఏమాత్రం పోలిక లేదు. ఓ పల్లెటూరి పండుగ, విద్యావంతులైన ఆలుమగల్లో ఎలాంటి మార్పు తెచ్చిందన్నది ఇతివృత్తం. ఎన్. వసంత్ రాశారీ కథని.

ఎన్.ఎం. కృష్ణప్ప రాసిన 'కడసీ కోరిక' ఆద్యంతమూ సీరియస్ గా సాగితే, నంద్యాల నారాయణ రెడ్డి రాసిన 'కూరేసి కాశిరెడ్డి' చివరికంటా నవ్వుల్ని పూయిస్తుంది. కారుపల్లి నరసింహమూర్తి కథ 'అవును శిన్నబుడె బాగుండె' నాస్టాల్జియా కాగా, ఎద్దుల సత్యనారాయణ రెడ్డి రాసిన 'మా ఊరు ఎత్తేస్తారా' కథ 'సెజ్' లపై సంధించిన బాణం. ఈయన రెండో కథ 'కడసీ పయనం' ఓ వ్యక్తి అంతిమయాత్రని చిత్రించింది. మూడో కథ 'గెరిగమ్మ తల్లి మెరిగెనె' జంతుబలి నిషేధం నేపధ్యంలో సాగింది.

ఎన్. సురేఖ కథ 'వనజాక్షి ఉర్దూ' ఊహించని విధంగా ముగియగా, నీలావతి రాసిన 'కూరాకవ్వ' సెంటిమెంట్ ప్రధానంగా సాగిన రచన. కెం. మునిరాజు రాసిన మూడు కథల్లోనూ, 'వడ్డికాసుల గౌడు' 'శిన్నతిమ్మడు పెద్దతిమ్మడు' హాస్యరస ప్రధానంగా సాగగా, 'అత్తవాన పొంగిలి' స్థానిక ఆచారాన్ని వర్ణించింది. స.వెం. రమేశ్ రాసిన 'ఆ అడివంచు పల్లె' చదువుతున్నంతసేపూ కళ్యాణ రావు నవల 'అంటరాని వసంతం' గుర్తొస్తూనే ఉంది. టి.ఆర్. శ్రీనివాస ప్రసాద్ కథ 'గూడు శెదిరిన గువ్వ' సైతం సెజ్ ఇతివృత్తంతో సాగేదే. ఈయనవే మరో నాలుగు కథలు వ్యవహారికంలో ఉండి, మాండలీకపు సౌందర్యాన్ని మరింత బాగా అర్ధం చేసుకోడానికి ఉపయోగ పడ్డాయి. ఈ నాలుగూ పూర్తిగా 'ఈనాడు ఆదివారం' మార్కు కథలు.

"మేమూ మీవాళ్ళమే. ఆంధ్ర దేశంగా అవతరించే వేళ తెగిపడి గాయాల పాలై మూలుగుతున్న మీ నెత్తుటి చుట్టరికమే మేము. రాజకీయ చుట్టరికాలను పక్కనబెట్టి, సాంస్కృతిక చుట్టరికాన్ని ముందుకు తీసుకురండి.. అంటూ హోసూరు ప్రాంత వెతలను కతలుగా గుచ్చి మీ ముందుంచుతున్నారు కృష్ణరసం (కృష్ణగిరి రచయితల సంఘం) సభ్యులు కొందరు. చదవండి మరి. చదివి పొరుగుసీమల తెలుగును కూడా ఆస్వాదించండి" అంటూ కృష్ణరసం గౌరవాధ్యక్షుడు ఎస్. ఎం. కృష్ణప్ప ముందుమాట పుస్తకాన్ని చదవాలనే ఉత్సాహాన్ని పెంచుతుంది.

కథకులందరూ 'కృష్ణరసం' సభ్యులే. హోసూరు పల్లెల్లో తెలుగు వ్యాప్తికి కృషి చేస్తున్న వాళ్ళే. అన్ని కథలూ అద్భుతాలు కానప్పటికీ, భాషా సంస్కృతులని చిత్రించిన తీరు, భాషకోసం వారు పడుతున్న తపన ఈ కథల పట్ల ప్రేమని పెంచుతాయి. "ఇతర భాషల ప్రభావాలను పక్కనబెడితే, తెలుగులోని ప్రాచీన లక్షణాలను, సొబగులను వదలక ఇంకా పట్టి కొనసాగుతున్నట్లు ఉంటుంది ఇక్కడి తెలుగు" అన్న కృష్ణప్ప మాటలతో ఏకీభవించకుండా ఉండం, పుస్తకం పూర్తి చేశాక. 'కృష్ణరసం' ప్రచురించిన 'ఎర్నూగు పూలు' కథాసంకలనం అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతోంది. (పేజీలు 132, వెల రూ. 70.)

12 కామెంట్‌లు:

  1. mee meda bale eershya ga vundi murali garu.. books ani chadivesthunnaru..
    nenu jeevithapu paragu pandam lo parugeduthu.. books chadive time leka(andharu cheppe reason idhey lendi).. istam tho konna pusthakalu anni.. "eppudu mamulani chaduvuthavu" ani prasinisthunte emi cheppalo teliyaka, tala vanchuko velthunna..

    ee busy life, books gurinchi meeru icche posts entho nacchuthayi naaku.. keep going :)

    రిప్లయితొలగించండి
  2. అరసాలకీ విరసాలకీ మధ్య కృష్ణరసం బహు పసందుగా ఉంది, మీ సమీక్షలాగే. పిబరే కృష్ణరసం! పుస్తకం తెప్పించుకుంటాను.

    రిప్లయితొలగించండి
  3. మంచి పుస్తకం పరిచయం చేసారు సోమవారం విశాలాంధ్ర మీదకి దాడి చెయ్యాలి
    ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  4. అబ్బా కొత్తపాళీ గారు. నా డైలాగ్ చెప్పేశారు.
    కృష్ణరసం చూడగానే సరిగ్గా అదే అనుకున్నా. కొంచం ఆలస్యం ఐంది కామెంటడం. అంటే .

    "మేమూ మీవాళ్ళమే. ఆంధ్ర దేశంగా అవతరించే వేళ తెగిపడి గాయాల పాలై మూలుగుతున్న మీ నెత్తుటి చుట్టరికమే మేము. రాజకీయ చుట్టరికాలను పక్కనబెట్టి, సాంస్కృతిక చుట్టరికాన్ని ముందుకు తీసుకురండి.. "

    హ్మ్మ్. కొందరు మేము తెలుగోళ్ళం కాదు వదిలేయండి, విదిపోతాం మహాప్రభో అంటుంటే, ఇలాటి మాటలు వింటుంటే ఆశ్చర్యం, ఆనందం కలుగుతుంది.

    రిప్లయితొలగించండి
  5. మరో మంచి పుస్తక పరిచయం....
    @ శశిధర్ గారు...మీకంటే ముందు చాలామంది ఉన్నాం
    మురళి గార్ని చూస్తె నాక్కూడా చాలా సంతోషంతో కూడిన కుళ్ళన్నమాట :) :)

    రిప్లయితొలగించండి
  6. పోయిన వారం తెలుగు వెలుగులో హోసూరు ప్రాంతంలో తెలుగుభాషకోసం సాగుతున్న ఉద్యమం చూశాను. ఇది చదువుతుంటే అదిగుర్తొచ్చింది.
    తెలుగు త్రిలింగదేశంలోకంటే సాంబనాడులోనే బాగాగౌరవం పొందుతుంది.

    రిప్లయితొలగించండి
  7. @రాధిక (నాని): ధన్యవాదాలండీ..
    @శశిధర్ అన్నే: అందరూ ఇచ్చే జవాబే నేనూ ఇస్తున్నానండీ :) టైం మేనేజ్మెంట్ మన చేతిలో పని కదా.. కొంచం ప్రయత్నిస్తే పుస్తకాలు చదివేందుకు సమయం దొరక్కుండా పోదని నా అనుభవం.. ధన్యవాదాలు.
    @కొత్తపాళీ: ఈసరికే మీరు చదివేసి ఉంటారని ఊహించానండీ.. క్రిష్ణరసం వారిదే మరోపుస్తకం మార్కెట్లోకి వచ్చిందని తాజా సమాచారం.. నేనింకా చూడలేదు :( ...ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. @ఆత్రేయ: ఎలా ఉందండీ పుస్తకం? ...ధన్యవాదాలు.
    @వాసు: ముందుమాట చదువుతుంటే అచ్చంగా మీక్కలిగిన భావమే నాదీను.. ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  9. @పరిమళం: ధన్యవాదాలండీ..
    @సుబ్రహ్మణ్య చైతన్య: ఈ పుస్తకం చదివిన వాడిగా మీ వ్యాఖ్యతో ఏకీభవిస్తున్నానండీ.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  10. ప్రళయ కావేరి కదల మీద మీరు సమీక్ష వ్రాసారా మురళీ గారూ? మీ పాత బ్లాగ్స్ చదవక పోవటం వల్ల వేసిన ఈ ప్రశ్నకు నన్ను మన్నించండి

    మీ అభిమాని

    రిప్లయితొలగించండి