ధనుర్మాసపు ఉదయాన మంచుతెర కప్పుకున్న గోదారి కొత్తల్లుడి బెట్టునీ, కొత్త పెళ్ళికూతురి బెరుకునీ ఏకకాలంలో చూపించేస్తోంది. ఆకుపచ్చని కోనసీమలోకి అడుగు పెట్టాలంటే గోదారి దాటాల్సిందే. డిసెంబరు తుఫాను పండుగ కళని పట్టుకుపోయింది. ఎక్కడ చూసినా నవ్వు పులుకుకున్న దిగులు ముఖాలే. ఎగసి పడాల్సిన భోగి మంటలు మొహమాటంగా మండుతున్నాయి. హరిదాసు పాటలు, గంగిరెద్దు ఆటలూ అరుదైన దృశ్యాలు అయిపోయాయి. కాల మహిమ.
సంక్రాతి సంబరాలలో కోనసీమని ప్రత్యేకంగా నిలిపేది కనుమ పండుగనాడు జరిపే ప్రభల తీర్ధం. ఈశ్వర ప్రతిరూపంగా భావించే ప్రభని తుదకంటా చూడాలంటే నా చిన్నప్పుడు మెడ పట్టేసేది. ప్రభలన్నీ అంత ఎత్తుగా ఉండేవి. ఈసారి ప్రభ కట్టడాన్ని దగ్గరుండి చూశాను. కట్టడానికి ఉత్సాహం చూపిన జనమే అంతంత మాత్రం అనుకుంటే, ప్రభ సైజు మీద బోలెడన్ని ఆంక్షలు. మోయడానికి జనం ఎక్కువగా లేరు కాబట్టి, బరువు తక్కువగా ఉండాలనీ, కరెంటు వైర్లు తగిలేస్తాయి కాబట్టి ఎత్తు తగ్గించమనీ..ఇలా..
ఎప్పుడూ కన్నా ఈసారి ఊళ్ళకి వచ్చిన వాళ్ళ సంఖ్య పెరిగినట్టుగా అనిపించింది. పెంకుటిళ్ళ ముందు పార్క్ చేసిన బెంజిలూ, లాంసర్లూ ఈసారి పండుగ స్పెషల్. వచ్చిన వాళ్ళలో ఎక్కువమంది రాష్ట్ర రాజధాని నుంచి అనిపించింది, కొన్ని సంభాషణలు విన్నాక. భూములు, ఇళ్ళ స్థలాల ధరవరల గురించీ, కౌలు రైతులు కొలుస్తున్న ధాన్యాన్ని గురించీ మెజారిటీ సంభాషణలు జరిగాయి. ఈసరికే రాజధానిలో కొన్ని ఆస్తులు సమకూర్చుకున్న వాళ్ళూ, ఇప్పుడిప్పుడే ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తున్న వాళ్ళూ కూడా సొంత ఊళ్లమీద దృష్టి పెడుతున్నారని అర్ధమయ్యింది. ఇప్పుడింక మా పల్లెల్లోనూ రియలెస్టేట్ ఊపందుకుంటుందేమో..
ప్రభ ఊరేగింపు మొదలయ్యింది. డప్పులు దరువేస్తుండగా కొందరు ఉత్సాహవంతులు చిందేస్తున్నారు. ఆదివారం కావడంతో చర్చిలన్నీ రద్దీగా ఉన్నాయి. ప్రభువు పాటలు డప్పుల మోతలతో పోటీ పడుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా, చేతిలో ఫోను, కెమెరా ఉన్న ప్రతి ఒక్కరూ ఊరేగింపుని తదేక దీక్షతో రికార్డు చేసేస్తున్నారు. "మెమరీ ఫుల్లయ్యిందే. నువ్వు కంజూస్.. టూజీబీ తీస్కోవచ్చు కదా..." అంటోందో ఆమ్మాయి.." హైడ్రాబేడ్ రిటర్న్డ్ అనుకుంటా. "లాష్టియర్ షిల్పారామం లో కైట్ ఫెస్టివల్ ఎంతబాగా జరిగిందో తెల్సా..." అంటూ మరో గొంతు.
కాస్త దూరం ఊరేగింపులో నడిచి అలిసిపోయిన వాళ్ళు బడ్డీ కొట్ల దగ్గర సాఫ్ట్ డ్రింకుల తోనూ, వాటర్ బాటిళ్ళతోనూ గొంతులు తడుపుకుంటున్నారు. ఒకళ్ళిద్దరు మాత్రం రోడ్డు పక్కన ఉన్న ఇళ్ళముందు ఆగి, దాహం అడిగి తాగడం కనిపించింది. మళ్ళీ ఏడాదికి వాళ్ళు కూడా నీళ్ళ సీసాలవైపుకే మొగ్గు చూపుతారేమో. "ఇప్పుడే సిగ్నలొచ్చిందిరా.. మా ప్రెభ దార్లో ఉంది. వొచ్చేత్తన్నామెహే..." మరో ఫోన్ సంభాషణ. కరచాలనాలు, కార్డులు మార్చుకోడాలూ జరిగిపోతున్నాయ్ మరోపక్క. "మా అమ్మాయిని ట్రిపుల్ ఐటీ కి ప్రిపేర్ చేస్తున్నాం. మరి మీవాడు?" తరహా సంభాషణలకీ కొదవలేదు.
ప్రభలు ఒక్కొక్కటీ తీర్ధస్థలికి చేరుతున్నాయ్. జనం ఉన్నారు కానీ సందడీ, సంబరం కనిపించడంలేదు. రంగు సోడాలూ, రంగులరాట్నాలూ పిల్లల్ని అబ్బుర పరచడం మానేసి చాలారోజులే అయినట్టుంది. కొట్లు కూడా యేవో మొక్కుబడిగా ఉన్నాయ్. "మాచిన్నప్పుడు ప్రభల తీర్ధం లో మాంచి జీళ్ళు దొరికేవి.. బెల్లపు జీళ్ళు.." లాంటి నిట్టూర్పులు, సెల్ ఫోన్ రింగ్ టోన్లలో కలిసిపోయాయి. బయట ప్రపంచంలో ఇన్ని మార్పులు వచ్చేశాక కూడా ఈ తీర్ధం ఇంకా జరుగుతోన్నందుకు సంతోషపడాలా, లేక రాబోయే రోజులకి ఇది మెమరీ కార్డ్ లో భాగంగా మిగిలిపోతుందేమో అని బెంగ పడాలా అన్నది తేల్చుకోక ముందే తీర్ధం ముగిసిపోయింది.
మీ మాటలతోటే బొమ్మ గీసి చూపించారు. కొంచెం బాధా, కొంచెం ఆనందమూ.
రిప్లయితొలగించండినాకు తెలిసి ప్రభలు ఇలా ఉండవు. ఇప్పుడిట్లా మారిపోయాయా?
మీ ప్రభల తీర్థం వ్యాసం బాగుంది..కళ్లకు కట్టినట్లు చెప్పారు. ఇటువంటి అంశాల్ని మన www.godavariyouth.com లో పంచుకోగలరని ఆశిస్తాం..
రిప్లయితొలగించండినిజమే మురళి గారు అవసరం ఆసరాకోసం రాజధాని రమ్మంటుంటే,కనీసం పండక్కైనా అందర్నీ కల్సి ఆనందాం పంచుకుని,ఊర్లో జరిగే సందడి వగైరా చూద్దామనుకునే వాళ్ళ సెంటిమెంట్ ని సెంటీమీటర్ దూరానికి మీటర్ దూరం కొలత రేటుతో సొమ్ముచేసుకుంటూ వ్యాపారం పేరుతో దోపిడి చేసుకుంటున్నారు రవాణావ్యవ్యస్థ వాళ్ళు.మనసు పీకు చంపుకోలేక వెళ్ళగలిగిన వాళ్ళకి ఈ మాత్రం దృశ్యమేనా ఉంటోంది వెళ్ళలేనివారికోసం ఆ మెమరీ కార్డే ఓ తీపి జ్ఞాపిక మరి.ఇంకొన్నాళ్ళకి ఈ మెమరీ కార్డులో చిత్రాలే చూపిస్తూ మనకి ఒకప్పుడు కోనసీమలో ప్రభల తీర్థాలు జరిగేవట అంటే అవునటా అని బుగ్గలు నొక్కుకోవాలేమో...
రిప్లయితొలగించండి"మాచిన్నప్పుడు ప్రభల తీర్ధం లో మాంచి జీళ్ళు దొరికేవి.. బెల్లపు జీళ్ళు.." భలే గుర్తు చేసారు అమలాపురం ఎవరొచ్చినా ఇప్పటికీ ఇవి తేవాల్సిందే 1-2 కిలోల బూరుగుపల్లి బెల్లం తో పాటు.
మా అమ్మమ్మ గారి ఊర్లో చిన్నప్పుడు పెద్ద పెద్ద ప్రభలు రాత్రంతా రకరకాల ప్రోగ్రాంస్ తో తిరిగేవి. చక్కటి తిరునాల జరిగేది. చాలా సరదాగా ఉండేది. ఇప్పుడు నామ మాత్రమే.
రిప్లయితొలగించండి@శ్రీనివాస్: మార్పు సహజమే కదండీ.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@గోదావరి: ధన్యవాదాలండీ..
@శ్రీనివాస్ పప్పు; మనం కమర్షియల్ యుగంలో ఉన్నామండీ.. పండుగతో సహా ప్రతిదీ కమర్షియలే.. ఎవర్ని తప్పు పట్టగలం? ...ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@జయ: నిజమేనండీ, ఇప్పుడు నామ మాత్రమే.. ధన్యవాదాలు.
ఈసారి పండుగ ఉత్సాహమే కనిపించలేదు మురళిగారు. ఏదో జరుపుకోవాలని జరుపుకున్నట్టుంది. రైతులు బాగా దెబ్బతిని ఉన్నారుగా. తీర్ధం హడావుడి కూడా ఇదివరకంత లేదు. ఏమో, కాలం ముందుకెళ్తున్నకొద్దీ కొన్ని మెమరీ కార్డ్ లో భాగాలుగా మిగిలిపోతాయేమో. :(
రిప్లయితొలగించండి@శిశిర: అక్కడి పండుగని చూశాక నాకూ అలాగే అనిపించిందండీ.. చూడాలి, ఏం జరుగుతుందో... ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి