గురువారం, జనవరి 06, 2011

దేవాంగుల మణి

దేవాంగుల మణిది నవ్వు ముఖం. ఆ నవ్వు ఎంత బాగుంటుందంటే ఎండాకాలంలో లాకుల మధ్య మొండి మీద పడే వెన్నెల మరకలమీద నడిచినట్టు, వర్షాకాలమప్పుడు పుంతరేవు దగ్గరున్న సత్తిరాజు తాతగారి దూళ్ళపాకలో వెచ్చటి గడ్డిమోపు మీద కూర్చున్నట్టు, శీతాకాలం తెల్లారగట్ట నల్లమిల్లి రాజారెడ్డి గారి పొలాలు దాటి నరాలపాలెం సైడు ఆ చిక్కటి మంచులో తడిసి వెళ్తున్నట్టు... చాలా బాగుంటుంది.

పసలపూడి దేవాంగుల పేటలో పడిపోతున్న పాత డాబాలో ఉండే నూలు పెద్దబ్బాయిగారి సుందరాన్ని పెళ్లి చేసుకుని కాపురానికొచ్చింది మణి. పుట్టింది నూలు వడికే దేవాంగుల ఇంటే అయినా, కండెలూ, డబ్బాలూ చుట్టడం, మగ్గం నెయ్యడం రావు మణికి. ముక్కామల దిగువలో ఉన్న నేదునూరులో ఉండే మణి పుట్టింటి కుటుంబంలో ఎవరూ ఆపని చేయలేదు. ఎందుకంటే వాళ్ళ వృత్తే వేరు.

పెసర పొణుకులూ, మసాలా గారెలూ, నువ్వుపప్పు జీళ్ళు, సీనా ఉండలూ, మడత కాజాలూ, గవ్వలూ, చిలకలూ, పాలకాయలూ ఇలాగ రకరకాల వంటలు జేసి, సంతలో చిన్న నులక మంచం వేసుకుని ఆ మంచం మీద పెద్ద పెద్ద సీవండి పళ్ళాలు పేర్చి వాటిల్లో పెట్టుకుని అమ్ముతారు. పసలపూడి వచ్చిన మణి అదే వ్యాపారం చేయడానికి భర్తనీ, అత్తమామలనీ ఒప్పించింది. ముందు మతిపోయినట్టు విన్న వాళ్ళంతా మణి లాభాలు లెక్కగట్టి చెపుతుంటే "సరే, మనూరి సంతలో తప్ప బయటూరు వెళితే ఒప్పుకోం మరి" అన్నారు.

ఆ మంగళవారం నాడు పసలపూడి కొత్తపేట సంతంతా సందడి సందడిగా ఉంది. ఆవేళ ఎక్కువమంది జనం మణి కొత్తగా పెట్టిన పప్పల మంచం దగ్గర ఆగి వెళ్తున్నారు. కొందరైతే నవ్వుతూ కూర్చున్న మణినీ, ఆ చిన్ని మంచాన్నీ చిత్రంగా చూస్తూ వెళ్తున్నారు. చిన్నవోరి అరుగుమీద మిషను కుట్టే త్యాగరాజుని గిలిగింతలు పెట్టింది మణి నవ్వు. ఆ మత్తులో వెళ్తూ వెళ్తూ కర్రి నాగేంద్ర ప్రసాదుని గుద్దేశాడు. నవ్వుతూ చుసిన మణిని చూసి కరెంటు షాకు కొట్టినట్టు అయిపోయాడు ప్రసాదు.

సంత చేసుకుని వెళ్తున్న పాస్టర్ ఏసుపాదం గారికి మణి నవ్వు తెల్లకాగితంలాగా, ప్రభువు ముఖంలో తప్ప మరెక్కడా కనిపించని నవ్వులాగా అనిపిస్తే, సైకిలు మీద వెళ్తున్న హోటలు గోపాలరావు గారి శ్రీను మణి నవ్వు చూసి టెన్షను పెరిగిపోయి, ఇక సైకిలు తొక్కలేక నడిపించుకుంటూ వెళ్ళిపోయాడు. కృష్ణమూర్తి గారికి మణి నవ్వులో ఆయన రోజూ పూజ చేసుకునే కనక దుర్గ అమ్మవారు మామూలు రూపంలో దర్శనం ఇచ్చినట్టు అనిపించగా, భావరాజు సూర్నారాయణ మేష్టారికి మూడేళ్ళ క్రితం చనిపోయిన తన కూతురు శ్యామల కనిపించింది ఆ నవ్వులో.

ఎరకలోళ్ళ ఇళ్ళకవతలున్న రోగిబీడులో ఉండే ఆదియ్యకి మణి నవ్వుముందు సంబరాలప్పుడు అద్దెకి తెచ్చుకునే పెట్రోమాక్సు లైట్ల వెలుగెందుకూ పనికిరాదు అనిపించేసింది. ఇంక త్యాగరాజు, నాగేంద్రప్రసాదు అయితే మణి నవ్వింది తనని చూసి అంటే తనని చూసి అని మాటా మాటా పెంచేసుకుని, జుట్టూ జుట్టూ పట్టేసుకుని బట్టలు చింపేసుకున్నారు. విడదియ్యడానికి వెళ్ళిన బ్రాహ్మణ రెడ్డి గారి పెద్దాపురం సిల్కు చొక్కా పిట్లుపోయింది.

ఇంతకీ మణి ఎందుకలా నవ్వుతున్నట్టు? "మణికి ఇప్పుడు నవ్వాలి, ఇప్పుడు నవ్వకూడదు అని తెలీదు. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. శత్రువుల్తోనూ, మిత్రులతోనూ అదే నవ్వు. దేవుడితోనూ, దెయ్యంతోనూ అదే నవ్వు. మంచోడితోనూ, బూచోడితోనూ అదే నవ్వు. మణి నవ్వులో ఎలాంటి చెడుద్దేశమూ లేదు. ఆమెది ఒక నవ్వు. అందమైన నవ్వు. పరమపవిత్రమైన ఒకానొక నవ్వు. అంతే.." అంటూ 'దేవాంగుల మణి' కథని ముగిస్తాడు 'మా పసలపూడి కథలు' రచయిత వంశీ. శ్రీకృష్ణ కమిటీ నివేదిక మీద నాయకుల అభిప్రాయాలని టీవీలో చూస్తుంటే ఈ కథ అప్రయత్నంగా గుర్తొచ్చింది నాకు.

6 కామెంట్‌లు:

  1. బాగుందండి. :-) కధ కంటే మీ పోలిక బాగుంది.

    రిప్లయితొలగించండి
  2. పోలికైనా
    వివరణైనా
    మీతరువాతే:)

    రిప్లయితొలగించండి
  3. మురళిగారు ...ఇప్పటివరకు మీరు అందంగా
    కళ్ళకు కట్టినట్లు పరిచయం చేసిన వంశీ గారి పసలపూడి కధలు 'మా 'చానెల్ లో ఇకపై చూడబోతున్నాం!మీరు చెప్పినంత అందంగా చూపిస్తారో లేదో వేచి చూడాలి.

    రిప్లయితొలగించండి
  4. @రాధిక (నాని): ధన్యవాదాలండీ..
    @భావన: :-) అనుకోకుండా ఈ కథ గుర్తొచ్చిందండీ, అంతే.. ధన్యవాదాలు
    @పద్మార్పిత: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  5. @పరిమళం: ఇప్పుడే మొదటి ఎపిసోడ్ చూశానండీ.. మీరూ చూసే ఉంటారు కదూ.. టపా రాస్తున్నారా మరి? ..ధన్యవాదాలు.
    @మనసుపలికే: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి