శుక్రవారం, మార్చి 12, 2010

ఎన్ కౌంటర్

రాజ్యహింస, ప్రతిహింస, విప్లవ సాహిత్యం, కిట్ బ్యాగులు, ఆత్మరక్షణ, ప్లీనరీ, దళాలు, ఇన్ఫార్మర్లు... ఎన్ కౌంటర్ జరిగిన ప్రతిసారీ వినిపించే పదజాలమిది. అధికారంలో ఏ నాయకుడున్నా, నిర్ణయాధికారం ఏ అధికారి చేతిలో ఉన్నా పెద్దగా తేడా లేకుండా క్రమం తప్పకుండా జరుగుతున్నాయి ఈ ఎన్ కౌంటర్లు. తరచుగా మావోయిస్టులూ (గతంలో వీళ్ళనే నక్సలైట్లు అనేవాళ్ళు) అప్పుడప్పుడూ పోలీసులూ ప్రాణాలు కోల్పోతున్నారు ఎన్ కౌంటర్లలో. ప్రాణం ఎవరిదైనా ఒకటే కదా..

ఏ ఉద్యమమైనా అణచివేత నుంచే పుడుతుంది. దోపిడీకి, పీడనకి గురయిన వాళ్ళే పోరు బాట పడతారు. నక్సల్బరీ ఉద్యమమూ ఇందుకు మినహాయింపు కాదు. సమాజంలో ధనిక, బీద తారతమ్యాలు పతాక స్థాయికి చేరినప్పుడు, డబ్బు, అధికారం ఉన్నవాడి చేతిలో అవేమీ లేని వాడు ఓ ఆటబొమ్మగా మారినప్పుడు, ఎర్రబడ్డ కంటికొసల నుంచీ, బిగుసుకున్న పిడికిళ్ల నుంచీ పుట్టిన ఉద్యమమే నక్సల్బరీ. ఉన్నవాడిని కొట్టి, లేనివాడికి పంచడం అన్న రాబిన్ హుడ్ థియరీ ని అమలు పరచడం ద్వారా పీడితుల ఆదరాన్ని పొందగలిగిందీ ఉద్యమం.

ఒక చోటి నుంచి మరో చోటికి త్వరత్వరగా ఉద్యమం విస్తరించడంతో, నక్సలైట్లకి టార్గెట్ గా మారిన వర్గాలలో అభద్రతా భావం పెరిగిపోయింది. పెరుగుతున్న దాడులు, ప్రభుత్వానికి సవాలు విసిరాయి. మొదటి నుంచీ ప్రభుత్వం ఈ సమస్యని కేవలం 'శాంతి భద్రతల సమస్య' గా మాత్రమే చూసింది. అణచివేత చర్యలు మొదలు పెట్టింది. ప్రత్యేక పోలీసు దళాలు, ఇన్ఫార్మర్ల వ్యవస్థ, అడవుల్లో కూంబింగులు..ఆపై ఎన్ కౌంటర్లు. అటు నక్సలైట్లకీ, ఇటు వాళ్ళపై పోరాడుతున్న పోలీసులకీ అడవులే స్థావరాలు అయ్యాయి.

ప్రకృతిలో భాగంగా జీవితం గడుపుతున్న గిరిజనుల జీవితాలు అతలాకుతలం కావడం మొదలయ్యింది. అటు నక్సలైట్లకీ, ఇటు పోలీసులకీ ఇన్ఫార్మర్లు గిరిజనులే అయ్యారు. అడవి ఆనుపానులు బాగా తెలియడం, నమ్మకమైన మనుషులన్న పేరు ఉండడం ఇందుకు కారణాలు అని చెప్పాలి. పోలీసు ఇన్ఫార్మర్లన్న నెపంతో నక్సలైట్లూ, నక్సల్ ఇన్ఫార్మర్లన్న నెపంతో పోలీసులూ వీళ్ళని హింసించిన సంఘటనలూ కోకొల్లలు. మరోపక్క పౌరసమాజం నుంచీ నక్సలైట్లకి మద్దతు రావడం మొదలయ్యింది. మేధావి వర్గం హక్కుల సంఘాలని ఏర్పాటు చేసింది.

అన్ని ఉద్యమాలలో లాగే, నక్సల్బరీ ఉద్యమంలోనూ 'క్రమశిక్షణ' సమస్య తలెత్తింది. సభ్యులు పెరిగే కొద్దీ వారిపై నియంత్రణ తగ్గడం మొదలయ్యింది. ఉద్యమం అసలు ఉద్దేశాలు ప్రశ్నార్ధకంగా మారే పరిస్థితులు తలెత్తాయి. కొన్ని చీలికలూ వచ్చాయి. ప్రభుత్వం ఓ పక్క పోలీసు బలగాలని ఉపయోగిస్తూనే, మరోపక్క నక్సలైట్లని జనజీవన స్రవంతిలోకి ఆహ్వానిస్తూ ప్రకటనలు చేయడం మొదలు పెట్టింది. లొంగిపోయిన నక్సలైట్లకి ఆకర్షణీయమైన నగదు బహుమతులు ప్రకటించింది. కొందరు లొంగి పోయారు, లొంగిపోయిన వారిలో కొందరు పోలీసు ఇన్ఫార్మర్లన్న ముద్ర వేసుకున్నారు.

నక్సలైట్లు మావోయిస్టులుగా మారే సమయంలోనే నక్సల్ సమస్యకి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఎజెండా లో ప్రముఖమైన చోటు లభించింది. ఆ పార్టీ అధికారంలోకి రావడంతో మావోయిస్టులని చర్చలకి ఆహ్వానించింది. చర్చలు విఫలంయ్యాయనే సంకేతాలు జనంలోకి వెళ్ళినప్పటికీ, ప్రభుత్వం మాత్రం తను చర్చలకి సిద్ధమని ప్రకటిస్తూనే ఉంది. మరో పక్క ఎన్ కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ కౌంటర్లని 'రాజ్యహింస' గానూ, మావోయిస్టుల చేతిలో పోలీసులు మరణించినప్పుడు దానిని 'ప్రతిహింస' గానూ చెబుతున్నాయి హక్కుల సంఘాలు.

దశాబ్దాల కాలంలో నక్సలైట్లు, పోలీసులు వందల సంఖ్యలో మరణించారు. మరెందరో గాయ పడ్డారు. సమస్యకి మూలమైన దోపిడీ, అన్యాయం ఇవన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. గిరిజనుల ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, మాన ప్రాణాలనీ ప్రభుత్వం రక్షించ లేక పోతోంది. ప్రభుత్వ పధకాలు అమలుకు నోచుకున్నవి తక్కువే. నిజంగా అమలై ఉంటే ప్రజలే మావోయిస్టులకి స్వచ్చందంగా సహాయ నిరాకరణ చేసి ఉండే వాళ్ళేమో. ఉద్యమం లో చేరి తుపాకీ పట్టిన వాళ్ళనందరినీ బెదిరించి భయ పెట్టడం ద్వారానూ, ఎన్ కౌంటర్ల ద్వారా నిర్మూలించడం ద్వారానూ పరిష్కారం అయ్యే సమస్యే అయితే మావోయిష్టు సమస్య ఎన్నో ఏళ్ళ క్రితమే పరిష్కారం అయి ఉండేది కదా??

13 వ్యాఖ్యలు:

Praveen Sarma చెప్పారు...

1967లో మొదలయిన నక్సల్బరీ ఉద్యమం దేశంలో కార్మిక విప్లవం తెస్తామని ప్రకటించుకుంది. 1970లలో నక్సల్బరీ ఉద్యమం ప్రధానంగా రైతాంగ వర్గాన్ని ఆకర్షించింది కానీ కార్మిక వర్గాన్ని పెద్దగా ప్రభావితం చెయ్యలేదు. ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ ప్రాంతీయ అసమానతల వల్ల నక్సలైట్ ఉద్యమం తెలంగాణాలో ఎక్కువ ప్రభావం చూపగలిగింది. కోస్తా ఆంధ్రలోని వెనుకబడిన ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం జిల్లాలలో కూడా కొంత ప్రభావం చూపింది. నేను కూడా మావో జెడాంగ్ అభిమానినే కానీ CPI(Maoist) యొక్క కార్యాచరణ విధానాలు నాకు నచ్చలేదు. వీళ్ళ కార్యాచరణలో ఎన్ని లోపాలు ఉన్నా ప్రాంతీయ అసమానతలు వీళ్ళ ఉద్యమానికి ఆయువు పట్టు అయ్యాయి.

'Padmarpita' చెప్పారు...

ఈ విషయంలో నేను పూర్తిగా అజ్ఞానినండి!

అబ్రకదబ్ర చెప్పారు...

>> "ప్రభుత్వ పధకాలు అమలుకు నోచుకున్నవి తక్కువే. నిజంగా అమలై ఉంటే ప్రజలే మావోయిస్టులకి స్వచ్చందంగా సహాయ నిరాకరణ చేసి ఉండే వాళ్ళేమో"

దీనికి రెండో కోణమూ ఉంది. మావోయిస్టుల్ని నమ్మితే ప్రజలు వాళ్లని నెత్తిన పెట్టుకుని ఉండేవాళ్లు కదా.

>> "ఉద్యమం లో చేరి తుపాకీ పట్టిన వాళ్ళనందరినీ బెదిరించి భయ పెట్టడం ద్వారానూ, ఎన్ కౌంటర్ల ద్వారా నిర్మూలించడం ద్వారానూ పరిష్కారం అయ్యే సమస్యే అయితే మావోయిష్టు సమస్య ఎన్నో ఏళ్ళ క్రితమే పరిష్కారం అయి ఉండేది కదా??"

దీనికీ రెండో కోణముంది. తుపాకి గొట్టం ద్వారా సమసమాజం వచ్చేట్టైతే ఎప్పుడో వచ్చేసుండేది కదా.

కాలం మారింది. నక్సలైట్ ఉద్యమం మొదలైనప్పుడున్న పరిస్థితులు దేశంలో ఇంకా ఉన్నాయా? అన్యాయాలూ, అవినీతీ, అసమానతలూ పెరిగాయి నిజమే. అభివృద్ధి కూడా పెరిగింది అదే సమయంలో. అడవుల్లో దాక్కుని తుపాకులు పట్టుకుని పోరాటాలు ఎవరికోసం? వాళ్లు చెప్పాలనుకుంది దర్జాగా రాచమార్గంలో ప్రజాస్వామ్యబద్ధంగా చెప్పొచ్చుగా.

Praveen Communications చెప్పారు...

అసమతల అభివృద్ధిని అభివృద్ధి అనలేము. సైంటిస్ట్ లేదా ఇంజినీర్ ఒక వస్తువుని తయారు చేసినప్పుడు ఆ వస్తువు అందరికీ అందుబాటులోకి రావాలని స్టాలిన్ అన్నాడు. ఉత్పత్తి శక్తులు (productive forces) ఇప్పుడు కూడా గొప్ప అభివృద్ధి సాధించలేదు. ఉత్పత్తి శక్తులు నిజంగా అభివృద్ధి సాధించి ఉంటే ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలలో ఇంత మంది ఆహారం, మందులు అందక ఎందుకు చనిపోతున్నారు?

సుబ్రహ్మణ్య ఛైతన్య చెప్పారు...

చాలాకాలంగా ఇది ఆర్థిక సామాజిక సమస్యగానే అనుకునేవాడిని. కానీ ఈమద్యన అది శాంతిభద్రతల సమస్యగానే కనిపిస్తుంది నాకు.

మురళి చెప్పారు...

@ప్రవీణ్ శర్మ: మంచి పాయింట్ చెప్పారు.. నిజమే వెనుకబాటు తనానికీ, మావోయిస్ట్ ఉద్యమానికీ సంబంధం ఉంది.. ధన్యవాదాలండీ..
@పద్మార్పిత: నాది కూడా పేపర్లు చదివిన జ్ఞానం మాత్రమేనండీ :-) ..ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@అబ్రకదబ్ర: నిజమేనండీ ప్రజలు పూర్తిగా నమ్మలేదు.. అలా అని అస్సలు నమ్మకుండానూ లేరు.. ప్రజల నుంచి ఏ మాత్రమూ మద్దతు లేకపోతే ఇన్నాళ్ళ పాటు వాళ్ళ ఉనికి ఉండేదా? అని నా ఆలోచన. కాలం మారినా వాళ్ళ ఆలోచనా ధోరణిలో మార్పు రాలేదన్నది నిజం.. వాళ్ళ ఉద్యమంలో పెడ ధోరణులూ నిజం.. చర్చలు అన్నప్పుడు ఈ సమస్య కొంత వరకైనా పరిష్కారం అవుతుందేమో అన్న ఆశ కలిగింది.. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ హింస ఎన్నాళ్ళు కొనసాగుతుందో :( ..ధన్యవాదాలండీ..
@సుబ్రహ్మణ్య చైతన్య: సమస్య మూలాలు సామాజిక, ఆర్ధిక అంశాలతో ముడి పడి ఉన్నాయండీ.. కానీ పోరాటానికి ఎంచుకున్న మార్గం మెజారిటీ జనామోదాన్ని పొందలేదు.. పైగా అబ్రకదబ్ర గారు చెప్పినట్టు సామాజంలో వచ్చిన మార్పులు.. వెరసి శాంతి భద్రతల సమస్య గా మారింది.. ...ధన్యవాదాలు.

కెక్యూబ్ వర్మ చెప్పారు...

మీ భావాలను బాగా వ్యక్తీకరించారు. అభినందనలు. అసలు ఇది ఎవరి శాంతి భద్రతల సమస్య. ఈ దేశాన్ని అమ్ముకోజుస్తున్న కార్పోరేట్ పరిపాలకుల శాంతి భద్రతల సమస్య మాత్రమె. ప్రజలది కాదు. ఆకలి, వైద్యం, నీరు అందకపోవడం కంటే హింసా రూపాలు ఇంకేమి వుండవు. మంచినీళ్ళు కొనుక్కునే దుర్భాగ్యానికి నెట్టబడినవార౦. సమస్య మూలాలను వదిలేసి ఉపరితలామ్సాలతో ప్రజలను మభ్యపెట్ట జుస్తున్నంతకాలం ప్రజాపోరాటాలు కొనసాగుతూనే వుంటాయి. మీ సహాన్భుతికి ధన్యవాదాలు.

కొండముది సాయికిరణ్ కుమార్ చెప్పారు...

పట్టణాలలో కన్నా, గ్రామీణ ప్రాంతాలలో ఈ నక్సలైట్లను ఇప్పటికీ సమాదరిస్తున్నారు ప్రజలు. నక్సలైట్లు సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారనే ఆక్షేపణలు, అభియోగాలు ఉన్నా, అవి కొంతవరకు నిజమే అయినా, అది అవసరమే అని నా అభిప్రాయం. మన ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి, ప్రభుత్వ యంత్రాంగానికి ఓ చెక్ పాయింట్ లా పనిచేయాల్సిన వ్యవస్థలు ఆ పని చేయనప్పుడు నక్సలైట్ల అవసరం తెలుస్తుంది.

Ruth చెప్పారు...

@ Murali gaaru, sorry for commenting in English !
@ KcubeVarma gaaru, "అసలు ఇది ఎవరి శాంతి భద్రతల సమస్య. ఈ దేశాన్ని అమ్ముకోజుస్తున్న కార్పోరేట్ పరిపాలకుల శాంతి భద్రతల సమస్య మాత్రమె. ప్రజలది కాదు."
so, the conistables killed in that vaagu insident and in numerous coombing operations are of the above mentined కార్పోరేట్ పరిపాలకుల ??? and also the innocent ppl being killed as informers too??? come on... you can't claim that the means justify the ends ! particularly when the means is -- killing innocent people.

పరిమళం చెప్పారు...

నేనూ ఈవిషయంలో పద్మార్పితగారిలాగే ..ఐనా మీ వివరణ ,విశ్లేషణ ...బావుందండీ !

మురళి చెప్పారు...

@కేక్యూబ్ వర్మ: లేదండీ.. ఉద్యమం హింసారూపం తీసుకోవడానికి రెండు పక్షాల బాధ్యతా ఉంది.. ప్రభుత్వం అణచివేత మీద మాత్రమే ఎక్కువగా దృష్టిపెట్టి, ఇతర మార్గాల మీద (అంటే అంతరాలని తగ్గించే దిశలో కృషి చేయడం..) దృష్టి పెట్టలేదు అనిపిస్తుందండీ నాకు.. ధన్యవాదాలు.
@కొండముది సాయికిరణ్ కుమార్: వ్యవస్థలో లోపాల కారణంగానే ఉద్యమం పుట్టిందనడానికి అభ్యంతరం లేదండీ.. పరిష్కారంకోసం తగిన విధంగా కృషి జరగడం లేదు అనిపిస్తోంది, జరుగుతున్నవి చూస్తుంటే.. ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@రూత్: హింస ఏ రకంగానూ సమర్ధనీయం కాదండీ, ఎవరు చేసినప్పటికీ.. ఈ ఉద్యమం మొదలవడానికి అసమానతలు కారణం. ముఖ్యంగా అసమానతలు తగ్గించడం మీద దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం, ఆ దిశగా చాలా తీవ్రంగా కృషి చేయాల్సి ఉంది.. ధన్యవాదాలు.
@పరిమళం: ధన్యవాదాలండీ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి