శనివారం, మార్చి 06, 2010

పాటల తోట

జనసామాన్యంలో పాటలు పాడలేని వాళ్ళు ఉండొచ్చేమో కానీ, ఇష్టపడని వాళ్ళు ఉండరు. నేనూ సదరు జన సామాన్యంలో భాగమే కాబట్టి పాటలని నేనూ ఇష్టంగా వింటూ ఉంటాను. వినసొంపుగా ఉండే పాట ఏదైనా నాకు నచ్చుతుంది. చాలా మందిలాగే నేను కూడా మొదట విన్నది అమ్మ పాడిన జోల పాటే.

"మరీ విడ్డూరం కాక పోతే నెలల వయసులో విన్నవి కూడా ఎలా గుర్తున్నాయో" అని ఎవరూ అనక ముందే అసలు విషయం చెప్పేస్తున్నా.. నాకు ఏడెనిమిదేళ్ళ వయసు వచ్చే వరకూ అమ్మ పాట విన్నాకే నిద్రపోయేవాడిని. ముఖ్యంగా "వసుదేవ పుత్రుడమ్మా.." పాట.

రేడియో, గ్రామఫోన్, ఇంకా పండగలకీ, పెళ్లిళ్ళకీ ఊళ్లోకి వచ్చే మైకు.. వీటిలో నాకు పాట మీద ఇష్టం పెంచింది ఏదీ అంటే ఇదమిద్దంగా చెప్పలేను. రేడియోలో పాట వస్తుంటే ఇంట్లో ఏ మూల ఉన్నా రేడియో గదికి పరిగెత్తే వాడిని. గ్రామఫోన్ లో పాటలు వచ్చేటప్పుడు నేను హెచ్.ఎం.వీ వారి లోగోలో కుక్క పిల్లలా తల ముందుకు వంచి రెప్ప వెయ్యకుండా చూస్తూ ఉండడాన్ని అమ్మ చాలాసార్లు గుర్తుచేసింది.


ఎక్కడ మైకు పెట్టినా రహస్యంగా వెళ్లి నాకు కావాల్సిన పాటల జాబితా చెప్పి వచ్చేవాడిని, మైకుసెట్టు కుర్రాడికి. ఆ పాటలు వేసినప్పుడు శ్రద్ధగా వినడం, అమ్మ నాకు పెట్టిన అప్పచ్చులు పొట్లం కట్టి పట్టుకెళ్ళి ఆ కుర్రాడికి పెట్టడం.. కొన్నాళ్ళ పాటు అదో ఆనందం. అక్షరాలు రాయడం వచ్చాక చాలా రోజులు రేడియోలో వచ్చే పాటలు రాయడానికి ప్రయత్నించే వాడిని. రాయగలిగినంత రాయడం, మిగిలింది ఆ పాట మళ్ళీ వచ్చినప్పుడు విని రాయడం.

మరికొంచం పెద్దయ్యాక అయితే నాకు నచ్చిన పదాలతో ఖాళీలు పూరించడం. మా ఊళ్ళో సంగీతం మేష్టారు లేక పోవడం వల్ల నేను సంగీతం నేర్చుకోలేక పోయాను. అయితేనేం.. పదే పదే పాటలు విన్నవాడు గాయకుడైపోవడం మామూలు విషయమే కదా.. అలా నేను కూడా పాడడం మొదలు పెట్టాను. హైస్కూల్లో పాటల పోటీలో మొదటి బహుమతి సంపాదించాను.

అలా అని నేనేదో గొప్ప గాయకుణ్ణి అనుకుంటే పొరపాటు. ఓ అమ్మాయి దగ్గర అడిగి తీసుకున్న పాటల పుస్తకం చూస్తూ, నేను పల్లవి పాడి, చరణం అందుకోగానే "కూర్చో అమ్మా.." అన్నారు మేష్టారు అనునయంగా. మరి బహుమతి ఎలా వచ్చిందంటే, బాలుర విభాగం నుంచి పోటీలో పాల్గొన్న వాడిని నేనొక్కడినే మరి.


నాకు మొదటి బహుమతి వచ్చిందంటే అమ్మతో సహా ఎవరూ నమ్మలేదు, సర్టిఫికేట్ చూపించేంత వరకూ. అదీ పాడడంలో మన టాలెంటు. నేను పాడడం కన్నా పాడకపోవడమే అందరికీ క్షేమమన్న విషయం అర్ధమైన మరుక్షణం నేను జనంలో పాడడం మానేశాను. అంత మాత్రాన పాట మీద నాకున్న ఇష్టం తగ్గలేదు.. నిజం చెప్పాలంటే పెరిగింది.

టేప్ రికార్డర్లో నేను పాటలు వినడం మొదలు పెడితే "కేసెట్లు రిబ్బన్లయ్యే వరకూ వింటూనే ఉంటావా?" అని కోప్పడేది అమ్మ. పాటలు నాకు ఇష్టమే అయినా సినిమా జరుగుతుంటే ఉన్నట్టుండి పాటలు ఎందుకు వస్తాయో అర్ధమయ్యేది కాదు చిన్నప్పుడు. చూస్తుండగానే నాయికా నాయకులు డ్రెస్ లు ఎప్పుడు మార్చేసుకున్నారో అని మరో సందేహం.

చాలా సినిమాల్లో ఉమ్మడి కుటుంబం అంతా కలిసి పాట పాడుకోవడం, ఆ తర్వాత ఏదో ఒకటి జరిగి చెట్టుకొకరు, పుట్టకొకరు అయిపోవడం, చివర్లో మళ్ళీ ఆ పాట పాడుకుని కలవడం.. రెండు మూడు సినిమాలు చూశాక ఇంట్లో మేమందరం కలిసి పాట పాడుకుంటే బాగుండు అనిపించేది. ('ఇల్లేరమ్మ కతలు' లో ఇల్లేరమ్మ కూడా ఇలాగే అనుకోడం చదివే వరకూ, ఇలాంటి ఆలోచనలు నాకు మాత్రమే వస్తాయేమో అని సందేహ పడ్డాను..)


మానసిక ఒత్తిడి అంటే ఏమిటో తెలిశాక, పాట గొప్పదనం మరింత బాగా అర్ధమయ్యింది నాకు. ఇయర్ ఫోన్స్ పరిచయం కావడం ఓ గొప్ప మలుపు. చక్కగా ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా మనకి కావాల్సిన పాటలు, కావల్సినంతసేపు వినొచ్చు. ఒక్కోసారి సమూహంలో బలవంతంగా ఉండాల్సి వచ్చినా, ఇయర్ ఫోన్స్ తగిలించేసుకుంటే మన ప్రపంచంలో మనం ఉండొచ్చు. అయితే ఈ ఇయర్ ఫోన్స్ ఒక వరం అనిపిస్తుంది. మన టేస్టు ఫలానా అని అందరికీ చెప్పుకోనవసరం లేదు కూడా.

కొన్ని కొన్ని పాటలతో పాటు కొన్ని జ్ఞాపకాలూ ముడిపడి పోయాయని ఈమధ్యనే తెలిసింది. ఇప్పుడు కొన్ని పాటలు వింటుంటే మొదటి సారి ఆ పాట విన్న సందర్భమో, నాకు పాడి వినిపించిన వాళ్ళో, లేక ఆ పాట గురించి చెప్పుకున్న కబుర్లో గుర్తొస్తున్నాయి. ఒక్కసారి ఆ జ్ఞాపకాలలోకి వెళ్తే ఎన్నెన్నో భావోద్వేగాలు.

ఇంటర్నెట్ లో పాటలు వెతుక్కుంటూ, కావాల్సిన పాటల కోసం జాల మిత్రులని అడిగినప్పుడు చాలా ఆదరంగా పంపుతున్నారు. అలా ఏనాడో విన్న పాటలని మళ్ళీ ఇప్పుడు వినగలుగుతున్నాను. వాటితో పాటే వాటి చుట్టూ అల్లుకుపోయిన జ్ఞాపకాల పరిమళాలని ఆఘ్రాణించ గలుగుతున్నాను. పాట నా ప్రపంచం కాకపోవచ్చు, కానీ నా ప్రపంచంలో ఒక ముఖ్యమైన భాగం.

35 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

పాటలంటె నేను చెవులు కోసుకుంటాను, నాకిష్టమైన పాట చాలా కాలం తర్వాత ఎఫ్.ఎం. లొ వింటే వెంటనే దాన్ని అంతర్జాలంలొ వెతికి మరి పట్టుకొని నా ఫేవరేట్స్ కలెక్షన్స్ లొ భద్రపరుస్తాను..
"పాట నా ప్రపంచం కాకపోవచ్చు, కానీ నా ప్రపంచంలో ఒక ముఖ్యమైన భాగం..." - Superb.

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

అందుకే ఆటా పాటా అన్నారు ఊరికే అన్నారా మరి. అదీకాక అలసిపోయిన మనసుకి స్వాంతన పాటే అని చెప్పచ్చు.మేమూ పనిలో ఉన్నా ఇలా చెవిలో ఆ స్పీకర్లు తగిలించుకునే పాటలువింటూ పనిచేసుకుంటూ ఉంటాం మరి అలసటతెలీకుండా ఉండడం కోసం.ఇదిగో మీరుకూడా దీంట్లో వినండి మరి (ఇపాటికే మీదగ్గర ఉంటే సరి ఈ లింక్ http://www.chimatamusic.com/teluguSongs/radio/radio_60.html లేకపోతే యధేచ్చగా వాడుకుంటూ విచ్చలవిడిగా పనిచేసుకోండి).

సుబ్రహ్మణ్య ఛైతన్య చెప్పారు...

పీర్లపండగప్పుడు మైకులో "ఆకాశంలో ఒకతార .." రోజుకు కనీసం మూణ్ణాలుగుసార్లు పాడాల్సిందే.లేదంటె వెళ్ళక్కడె ఉండి పాటమొదలయ్యేవరకు సతాయించడమే.
ఇకపాడడం అంటే 'పుణ్యభూమినాదేశం నమోనమామి‌' మరి.. అది.. అదన్నమాట.

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

మరొక్క మాట ఈ కింద ఇచ్చిన రెండు లింకులూ ఒకేసారి ఓపెన్ చేసి వినండి (ఇది నాకు ఇలాగే ఒక బ్లాగ్‌మిత్రులు అందచేసారు అది నేను మీకు అందచేస్తున్నా బహుశా మీ-నా అభిరుచి కలవ్వచ్చేమో అనుకుంటూ), విని ఆనందించండి.బాగుందనిపిస్తే అభినందనలు ఆ లింక్ అందచేసినవారికి చెందేట్టు,బాగోపోతే/నచ్చకపోతే దూషణభూషణాలు నాకు సమర్పించుకోండి.
http://www.chimatamusic.com/teluguSongs/radio/radio_60.html

http://www.rainymood.com/

My Dream World చెప్పారు...

Nemali kannu garu mee blog nu intaku mundu chadivanu chala bagundi...mee blog gurinchi "eenadu" lo chadivanu...meeku vilunnapudu na blog nu chudandi, ee madye blog strat chesanu, mee salahalu, suchanalu korutunnanu..

Regards
Radhika.N

My Dream World చెప్పారు...

nemali kannu garu mee blog chala bagundi..

My Dream World చెప్పారు...

Your blog is so good

Vasu చెప్పారు...

శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి: - అని ఊరికే అన్నారా

మీ జ్ఞాపకాలు బావున్నాయి. ముఖ్యంగా మీరు ఆఖరున చెప్పినది - పాటలతో ముడిపడిన జ్ఞాపకాలు. సరిగ్గా నేను ఇదే అనుకుంటాను. కొన్ని పాటలు చాలా నోస్టాల్జిక్ గా ఉంటాయి. వింటూ, ఆ జ్ఞాపకాలు తలచుకుంటూ ఉండిపోవాలనిపిస్తుంది.

అప్పచ్చులు - ఎన్నాళ్లైందో ఈ మాట విని.

సుజాత చెప్పారు...

మురళీ, మీ సంగీతాభిమానం జానకి గురించి టపా రాసినపుడే తెల్సింది! పాడలేని వాళ్ళు ఉండొచ్చు కానీ సంగీతం మనిషి జీవితం నుంచి అవిభాజ్యం!

రుద్ర వీణలో ఒక పాటలో సీతారామ శాస్త్రి అంటాడు చూడండి " బ్రతుకున లేని శ్రుతి కలదా? ఎద సడి లోనే లయ లేదా" అని! ఎంత బావుంటుందో ఆ మాట!

పూరి గుడిసె లో పేద వాడైనా అంతఃపురంలో రాజు గారైనా వారి అభిరుచులకు తగ్గట్టు సంగీతంలోని రసానుభూతిని అనుభవిస్తారు.

ముఖ్యంగా ఇంటర్నెట్ వచ్చాక ఎక్కడా దొరకని పాటలు సైతం వినగలగడం అదృష్టమే!

మొత్తానికి బాలుర విభాగంలో ఏకైక ప్రతినిధిగా బహుమతి కొట్టేసినందుకు అభినందనలు! అయినా ఇక్కడ కూడా బాలురు-బాలికలు అని విభాగాలుంటాయా? జూనియర్స్-సీనియర్స్ అని ఉండాలి గానీ!

నా ప్రపంచంలోని సింహభాగాన్ని కదిలించారు మరి!

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

మీరు గొప్ప గాయకులు కూడా అన్నమాట అని అనుకుంటుండగా తర్వాత పేరాలో గాలి తీసేసారు కదా..:)ఏ మాట కామాటే చెప్పాలి..పల్లవి మాత్రమే పాడి ప్రైజ్ కొట్టారంటే నిజ్జంగా గ్రేట్..:-):-)

>>>>ఇప్పుడు కొన్ని పాటలు వింటుంటే మొదటి సారి ఆ పాట విన్న సందర్భమో, నాకు పాడి వినిపించిన వాళ్ళో, లేక ఆ పాట గురించి చెప్పుకున్న కబుర్లో గుర్తొస్తున్నాయి. ఒక్కసారి ఆ జ్ఞాపకాలలోకి వెళ్తే ఎన్నెన్నో భావోద్వేగాలు<<<

నాక్కూడా సేం టు సేం...కొన్ని పాటలు ఫ్లాష్ బాక్ లతో అతుక్కుని ఉంటాయి మైండ్ లో....పాట విన్నప్పుడలా అవి అలా గుర్తొచ్చేస్తాయి...

sunita చెప్పారు...

>>> మరి బహుమతి ఎలా వచ్చిందంటే, బాలుర విభాగం నుంచి పోటీలో పాల్గొన్న వాడిని నేనొక్కడినే మరి.>>>
hahahaha!

Enaganti (ఇనగంటి) Ravi Chandra (రవిచంద్ర) చెప్పారు...

నేను కూడా ఒక వయసులో బాగా విన్న పాటలు ఇప్పుడు మళ్ళీ వింటే ఒక్కసారిగా ఆ లోకంలోకి వెళ్ళిపోతాను.

జయ చెప్పారు...

మొదటి బహుమతి వొచ్చినందుకు అభినందనలు మురళి గారు. నేను కూడా చిన్నప్పుడు రేడియో లో నా కిష్టమైన పాట పూర్తిగా రాసుకోటానికి మీ లాగే ఎన్నో సార్లు విని రాసుకునే దాన్ని. ఒక్కో సారి కొన్ని నెలల కాలం కూడా పట్టేది ఆ పాట పూర్తి చేసుకోటానికి. కొన్ని పాటలతో ఉన్న సంబంధమైతే అవినాభావ సంబంధమే!!! కొన్ని పాటలకైతే టేప్ నిజంగానే అరిగిపోవాల్సిందే:) మనోభావాలు బాగా వివరించారు.

పరిమళం చెప్పారు...

మురళి గారు , అవార్డు గ్రహీత పాటలు రావంటే అస్సలు నమ్మలేం ...ఏదేమైనా మీరు పాడిన పాట ఆడియో లింకు మీ టపాలో పెట్టాల్సిందే ...లేకపోతే తెబ్లా జాక్ తీవ్రంగా పరిగణిస్తుంది ! న్యూస్ చానల్స్ చూస్తున్నారుగా ..తర్వాత మీ ఇష్టం :) :) మీరు చెప్పింది అక్షరాలా నిజమండీ ..ఎప్పుడైనా పని ఒత్తిడి (ఇంట్లోనేలెండి ) ఎక్కువగా ఉంటే మంచిపాటలు పెట్టేసుకుని ఆడుతూపాడుతూ పనిచేస్తుంటే ...అంటూ చేస్తే అసలు అలసటే తెలీదు :) :)అన్నట్టు అమ్మ పాడిన పాట దశావతారాలపాటే కదూ ...

అనిత.... చెప్పారు...

" మరి బహుమతి ఎలా వచ్చిందంటే, బాలుర విభాగం నుంచి పోటీలో పాల్గొన్న వాడిని నేనొక్కడినే మరి. " ha ha ha

Lakshman చెప్పారు...

అవునండి, మీరు చెప్పింది అక్షరాల నిజం. నాకు కుడా పాటలు అంటే ఎంతో ఇష్టం . నేను మా ఇంట్లో (BPL i guess) color TV కొన్నాక బాగా విన్న పాట క్షణ క్షణం చిత్రావు లోని జామురాతిరి జాబిలమ్మ పాట చిత్రలహరి లో. నేను ఎప్పటికి మర్చిపోలేను. అ పాట విన్నపడల్లా నాకు ఆ రోజులు గుర్తుకి వస్తాయి. నా iPhone, ipod లో నేను melody, party, sleepy అని playlists ni divide చేస్తాను. ఇక ప్రతిసారి సమయాన్ని బట్టి వింటుంటాను.

శ్రీకర్ బాబు చెప్పారు...

అలసిన మనసు సేదతీరాలంటే మన మనసు కు నచ్చిన వారయినా దగ్గర ఉండాలి లేదా మనసుకు నచ్చిన పాటయినా ఉండాలి అని నేను భావిస్తాను.....నిజమే.... ఒక పాట విన్నప్పుడు అప్పటి మన చుట్టూ ఉన్న పరిసరాలు, వ్యక్తులు గుర్తుకురావడం నాకూ అనుభవమే....నా చిన్నప్పుడు మా నాన్నగారు నన్ను సైకిల్ పై కూర్చోబెట్టుకుని అలా బయటకు తీసుకువెళ్ళేవారు... తను అప్పుడు ఒక పాట పాడేవారు...... నాకు ఆ పాట విన్న ప్రతీసారి....ఆ రోజులు గుర్తుకువచ్చి ...మనసంతా ఆనందంతో నిండి పోతుంది.....అందుకే నేను ఆనందంగా ఉన్న ప్రతీసారి ఒక మంచి పాట వింటాను... అలాగే బాధగా ఉన్న ప్రతీసారి ఆ పాటను గుర్తుకు తెచ్చుకుంటాను.....

మంచి టపా ధన్యవాదాలు..

ప్రణీత స్వాతి చెప్పారు...

పాటల పూదోటలో విహరింప చేసి, తీయని తేనెల జ్ఞాపకాల పరిమళాన్ని అద్ది, మమ్మలనందరినీ రిఫ్రెష్ చేసేశారు మురళీ గారూ..ధన్యవాదాలు.

Swathi చెప్పారు...

అయితే మీరు కూడా ఒకప్పుడు "పాడు" వారు అన్నమాట :)
రాగల పల్లకిలో తిప్పారు మమ్మల్ని

anagha చెప్పారు...

బాగుందండి మీ ''పాటలతోట''.

నిషిగంధ చెప్పారు...

మురళీ, మీ టపా మమ్మల్ని పాటలతోటలో వదిలేసిందండీ.. ఒక్కో పాటది ఒక్కో పరిమళం.. ఒక్కో సౌకుమార్యం.. దేన్ని తలచుకోవాలో, దేన్ని విడవకుండా పాడుకోవాలో తెలీటంలేదు!!

నేను రేడియోలో విని లిరిక్స్ రాసిన మొదటిపాట 'Jis Desh Mein Ganga Behti Hai' లోని "O Basanti pavan pagal..."
అది ఒక వేసవి సెలవల్లో మానాన్నగారు నాకప్పగించిన పని :-) పూర్తిచేయడానికి చాలాకాలం పట్టిందని మాత్రం గుర్తుంది..


"మానసిక ఒత్తిడి అంటే ఏమిటో తెలిశాక, పాట గొప్పదనం మరింత బాగా అర్ధమయ్యింది నాకు."
"పాట నా ప్రపంచం కాకపోవచ్చు, కానీ నా ప్రపంచంలో ఒక ముఖ్యమైన భాగం."

Dito... :-)

radhika చెప్పారు...

టీ. వీ.లో ఎం.టి.ఆర్ గులాబీ జామూను పోడర్ యాడ్ లోలా మీరు కూడా ఒక్కరే పాడి ప్రైజ్ కొట్టేసారా.మీ పాటలతొట జ్ఞాపకాలు చాలా బాగున్నాయండి . నేను చిన్నప్పుడు మాజేజమ్మ తో పాట పాడించుకునే నిద్రపోయేదాన్నని మా అమ్మ చెబుతూ వుంటుంది . 9 చదివేటప్పుదు ,సిరివెన్నెల సినిమా లోని విదాత తలపుల ప్రభవించింది పాట మొత్తం రాసుకుని నేర్చుకున్నాను .ఇప్పటికీ ఆపాట వింటూ పాడుకుంటూ ఉంటాను.మంచి జ్ఞాపకాన్నితట్టి లేపారు. ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@నెలబాలుడు: ధన్యవాదాలండీ.
@శ్రీనివాస్ పప్పు: మీకూ, లంకెలని మీకు ఇచ్చినవారికీ కూడా కృతజ్ఞతలు..
@సుబ్రహ్మణ్య చైతన్య: మధ్యలో 'ఝుం ఝుం ఝుం.. ఝుమ్తన ఝుం..' అని ఎవరు అనేవాళ్ళండీ? :-) నేను మా 'ముసలయ్య' గురించి రాయాలి.. వీలు చూసుకుని.. ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@My Dream World: మీ బ్లాగు బాగుందండీ.. కానీ కామెంట బడడం లేదు :( కామెంట్స్ సెట్టింగ్స్ లోకి వెళ్లి 'ఫుల్ పేజి' ఆప్షన్ సెలక్ట్ చేసి సేవ్ చేయండి.. అప్పుడు అందరూ వ్యాఖ్య రాయడానికి వీలవుతుంది.. ధన్యవాదాలు.
@వాసు: ధన్యవాదాలండీ.. అప్పచ్చుల గురించి మరికొన్ని కబుర్లు ఇక్కడ చదవండి.. http://chaduvari.blogspot.com/2009/08/blog-post.html
@సుజాత: మొన్నంతా 'రుద్రవీణ' పాట మళ్ళీ మళ్ళీ వింటూనే ఉన్నానండీ.. సీతారామ శాస్త్రి గురించి ఒక టపా రాయాలి ఎప్పుడైనా.. మా స్కూల్లో పాటల పోటీల్లో పాల్గొనే అవుత్సాహికులు చాలా తక్కువ కావడం వాళ్ళ సీనియర్స్, జూనియర్స్ కేటగిరీల్లో జరపలేదండీ.. నేనైనా అబ్బాయిల పరువు నిలపడం కోసం పాడాను :-) :-) ..ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@శేఖర్ పెద్దగోపు: నిజమేనండీ.. కష్టపడి ప్రాక్టిస్ చేసి, పోటీకి వెళ్లి బహుమతులు గెలుచుకునే మీలాంటి వాళ్ళతో పోల్చుకున్నప్పుడు గ్రేటే.. నేను సింగర్నేఅని రుజువు చేసుకోడానికి చాలా రోజుల పాటు పనికొచ్చింది ఆ సర్టిఫికేట్ :-) ధన్యవాదాలు.
@సునీత: అలా కలిసొచ్చిందండీ అదృష్టం :-) ..ధన్యవాదాలు.
@ఇనగంటి రవి చంద్ర: ధన్యవాదాలండీ..

మురళి చెప్పారు...

@జయ: అభినందనలా!! ధన్యవాదాలండీ..
@పరిమళం: నేను జీవహింస మానేసిన కారణంగా ఆడియో లంకె ఇవ్వడం లేదండీ :-) అమ్మ పాడిన పాట దేవకీ కి, కృష్ణుడికీ సంభాషణ రూపంలో ఉంటుందండీ.. "వసుదేవ పుత్రుడమ్మా.. ఈ బిడ్డ వైకుంఠ వాసుడమ్మా.." అని సాగే జోల పాట. "పాములకి రాజునైన శేషుని పాన్పుపై పవళించగా.. పామేమి చేయునమ్మా నా తల్లి దేవకీ వందనమ్ము" అని కృష్ణుడు చెప్పే జవాబు బాగా గుర్తుంది నాకు. ధన్యవాదాలు.
@అనిత: ధన్యవాదాలండీ..

మురళి చెప్పారు...

@లక్ష్మణ్: చాలా మంచి పాట గుర్తు చేశారు.. ఆ సినిమా కూడా అప్పుడప్పుడూ చూస్తూ ఉంటాను నేను.. ధన్యవాదాలండీ..
@శ్రీకర్ బాబు: చాలా చక్కని అనుభవం అండీ.. నేను కూడా డిట్టో.. ధన్యవాదాలు.
@ప్రణీత స్వాతి: ధన్యవాదాలండీ..

మురళి చెప్పారు...

@స్వాతి: ఇప్పటికీ "పాడు" వాడినేనండీ.. కాకపొతే ఎవరికీ వినబడకుండా జాగ్రత్త తీసుకుంటాను.. జీవహింస మహాపాపం కదా :-) ధన్యవాదాలు.
@అనఘ: ధన్యవాదాలండీ..

మురళి చెప్పారు...

@నిషిగంధ: మీ సంగీతాభిరుచి నాన్నగారి నుంచి వచ్చిందన్న మాట!! చక్కని జ్ఞాపకం.. ధన్యవాదాలండీ..
@రాధిక: 'సిరివెన్నెల' లో పాటలన్నీ చాలా బాగుంటాయండీ.. బాగుంది మీ జ్ఞాపకం.. ధన్యవాదాలు.

భావన చెప్పారు...

పాటలంటే ఇష్టం లేని వాళ్ళు వుంటారు అంటే నేను నమ్మే దాన్ని కాదు చిన్నప్పుడూ. పాట తోటీ అనుభందాన్ని ఎంత రాసినా తరిగదు. మొన్నీ మధ్య వేటురి గారి "కొమ్మ కొమ్మకో సన్నాయి" పుస్తకం చదివి నా కిష్టమైన పాటలు రూపు కట్టిన విధం తెలుసుకుని బలే ఎక్జైట్ అయ్యను. మా అబ్బాయి కి 15 ఏళ్ళు ఇప్పటికి ఎప్పుడైనా అమ్మ "ఏడవకు ఏడవకు నా చిట్టి తండ్రి" పాటో, దశావతారాల పాట వుంటుంది కదా "బొజ్జ నిండ బువ్వ పెట్టవే వో యమ్మ నన్ను బుద్దావతారమనవే" అదో పాడమని అడుగుతాడు. అమ్మ పాటకు అలుపులేదు ( మా అబ్బాయి డైలాగే)..

Amrutha చెప్పారు...

mee blog chaduvuthnte nannu nenu chinnathanam lo chusukunnattu undandi..

తృష్ణ చెప్పారు...

బహుమతి పొందిన ఆ పాటేమిటో కూడా రాసి ఉంటే బాగుండేది కదండీ..?

పాటలేని నేను లేనని నా బ్లాగ్ రెగులర్ గా చదివేవాళ్ళకు తెలుసున్న సంగతే కాబట్టి...ప్రత్యేకం ఇంకేమి రాయట్లేదు..:)

మురళి చెప్పారు...

@భావన: మీకు వీలైనప్పుడు దశావతారాల పాట మీ బ్లాగులో రాయండి.. ఆడియో పెడితే మరీ మంచిది.. ధన్యవాదాలండీ..
@అమృత: ధన్యవాదాలండీ..
@తృష్ణ: గుర్తు చేసుకోడానికి చాలా ప్రయత్నించానండీ.. రెండు మూడు పాటల్లో ఏదో ఇదమిద్దంగా గుర్తురాక వదిలేశాను.. ధన్యవాదాలు.

మధురవాణి చెప్పారు...

చాలా ఆలస్యంగా వ్యాఖ్యానిస్తున్నా మురళీ గారూ.. గ్రామఫోన్ బొమ్మ భలే ఉంది. నేనెప్పుడూ చూళ్ళేదు బయట గ్రామఫోన్ని :-(
మీరు మొదటి బహుమతి గెలుచుకున్న జ్ఞాపకం తెగ నవ్వించిందండీ..! అంటే.. మీరంతలా చెప్పారు మరి ;-)
నేను కూడా శ్రోతల కేటగిరీలోకే వస్తానండీ...మీలాగే చిన్నప్పుడెప్పుడో ఒకే ఒకసారి ప్రైజ్ వచ్చింది. అది కూడా ఏదో దేశభక్తి పాట పాడానని ఇచ్చారు పాపం :-)
నా దినచర్యలో పాటలు వినడం ఒక ముఖ్య భాగం. ఓ పక్క ల్యాబ్ లో పనిచేస్తూ ఉన్నా మరో పక్క చెవులో ఐపాడ్ పాడుతూ ఉండాల్సిందే. ఎంచక్కా పాటలు వింటూ పని చేస్కుంటుంటే అలసటే అనిపించదండీ నాకు :-)
ఇహ పాటలతో జ్ఞాపకాలు ముడిపడిపోవడం....నాకూ అనుభవమే!
ఎప్పట్లాగే మంచి టపా :-)

మురళి చెప్పారు...

@మధురవాణి: పాటలు వినడంతో పాటు వాటి గురించి మీరు అందమైన టపాలు కూడా రాస్తారు కదండీ.. ధన్యవాదాలు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి