మంగళవారం, మార్చి 30, 2010

ఓ ప్రయాణం

సూర్యుడింకా ఉదయించే ప్రయత్నాలు మొదలు పెట్టలేదు. కాటుక లాంటి చీకటి అతి నెమ్మదిగా కరుగుతోంది. గోదారి బ్రిడ్జి మీద ప్రయాణం అత్యంత ఆహ్లాదంగా సాగుతోంది. దట్టమైన మంచు దుప్పటి కప్పుకున్న బాల గోదారి గాఢ నిద్రలో ఉన్నట్టుంది. కళ్ళింతలు చేసుకుని చూసినా కాసింతైనా దుప్పటి సవరించలేదు, దర్శనమే ఇవ్వలేదు..ప్చ్.. చైత్ర మాసం సగం గడిచినా మంచు కురుస్తూనే ఉంది. ఆసరికే బయలుదేరాల్సిన పడవల జాడ ఎక్కడా కనిపించనే లేదు.

మంచు కరిగే క్షణాల్లో అప్పుడే బద్ధకంగా నిద్ర లేచిన గోదారి అందం ఎలా ఉండి ఉంటుంది? నారింజ రంగు సూర్య కిరణాల తాకిడికి తెల్లని మంచుతెర నెమ్మదిగా, అతి నెమ్మదిగా కరుగుతూ ఉంటే.. ఆపై నల్లని వర్ణంలో కనిపించే నీళ్ళమీద ఆ కిరణాలు పరావర్తనం చెంది ఓ వింత కాంతిని వెద జల్లుతూ ఉంటే.. ప్రశాంతంగా ఉన్న నీళ్ళు, అప్పుడప్పుడూ వెళ్ళే పడవల బరువుకి తుళ్ళి పడి, అంతలోనే సర్దుకుంటూ ఉంటే.. ఓ చక్కని సూర్యోదయాన్ని మిస్సయ్యాను కదా? అనిపించింది చాలాసేపు.

బ్రిడ్జి మీద ప్రయాణం చేస్తున్నంత సేపూ రెప్ప వెయ్యకుండా గోదారినే చూస్తున్నా.. మంచు దుప్పటి కాసింతైనా పక్కకి తొలగక పోతుందా? నిద్ర కళ్ళతో గోదారి దర్శనం ఇవ్వక పోతుందా? అన్న చిన్న ఆశ. ఉహు.. ఆశ తీరనేలేదు.. చూస్తుండగానే కళ్ళ ముందు దృశ్యం మారిపోయింది. గోదారి స్థానంలో కొబ్బరి తోపులు. రోడ్డుని ఆనుకుని ప్రవహిస్తున్న గోదారి కాలవ. మసక చీకట్లో నల్ల నల్లగా.. నలుపు-తెలుపుల వర్ణ మిశ్రమాలతో గీసిన చిత్రంలా..

కాసేపటి తర్వాత.. వీధి అరుగు మీద కూర్చుని చెరువు మీద నుంచి ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ, కాఫీ తాగుతూ, మధ్య మధ్యలో పేపర్ తిరగేస్తున్నా.. శివాలయంలో గంట మోగడంతో మామిడి చెట్టు కొమ్మల మీద కూర్చున్న కొంగలన్నీ ఒక్కసారిగా పైకెగిరాయి. ఓ కొంగ ఉన్నట్టుండి మెరుపు వేగంతో నీళ్ళ అంచు మీదికి వచ్చి ఓ చేపని ముక్కున కరుచుకుని అంతే వేగంతో పైకెగిరింది. కొంగ ముక్కు తాకినంత మేరా చెరువు నీళ్ళలో వలయాలు.. అనాసక్తిగా పేపర్ పూర్తి చేసి, తూగో జిల్లా తోక పేపర్ చేతిలోకి తీసుకుని, ఓ వార్త దగ్గర ఒక్కసారిగా ఆగాను..

రెండు రోజుల పాటు ఏ పని చేస్తున్నా ఆ వార్త నన్ను వెంటాడుతూనే ఉంది. చేయాల్సిన పనులు పూర్తి చేశాక తిరుగు ప్రయాణం.. గోదారి సమీపిస్తుండగా నాకు తెలియకుండానే నా మనసులో కలకలం. ఆకాశంలో సూర్యుడు అస్తమించడానికి తొందర పడుతున్నాడు. పక్షులు గూళ్ళు చేరే హడావిడిలో ఉన్నాయి. అరుణ వర్ణపు సూర్యకిరణాలు నల్ల బడుతున్న గోదారి నీళ్ళమీద పడుతున్నాయి. ఎక్కడా పడవల జాడ లేదు. నీళ్ళ మధ్యలో ఇసుక మేటలు. నిజం చెప్పాలంటే గోదారి ఇసుక తిప్పల మధ్య ప్రవహిస్తున్న పిల్ల కాలువలా అనిపించింది.

ఇంకిపోతున్న నీళ్ళని చూడగానే పేపర్లో వార్త మళ్ళీ గుర్తొచ్చింది. గోదారి ఎండిపోతున్న కారణంగా పంట నిలబడదేమో అని ఆందోళన చెందుతున్న రైతులు.. ఇది మొదటి సారి కాదు.. వరుసగా రెండో సారి.. ఇలా జరగడం. కాటన్ మహాశయుడు ఆనకట్ట కట్టక పూర్వం వచ్చిన కరువు గురించి విన్న కథలన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చి ఒళ్ళు జలదరించింది. పచ్చని సీమ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అన్న ఆలోచన వెన్నులో చలి పుట్టించింది. తనని చూసిన వాళ్ళ కళ్ళలో తడిని చూడడం గోదారికి అలవాటై పోయినట్టుంది.. అభావంగానే నాకు వీడ్కోలు ఇచ్చింది.

23 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

>>>>చూస్తుండగానే కళ్ళ ముందు దృశ్యం మారిపోయింది. గోదారి స్థానంలో కొబ్బరి తోపులు. రోడ్డుని ఆనుకుని ప్రవహిస్తున్న గోదారి కాలవ.<<

మురళీ గారూ ..దీని ఆధారంగా మీ ఎడ్రస్స్ కనిపెట్టే ప్రయత్నం చేస్తూ తూ.గో.జి . తోక పేపర్ చేతిలోకి తీసుకున్నాను. ఏ వార్త మిమ్మల్ని కలవరపెట్టిందా అని అలోచిస్తున్నాను.
ఇంతకీ గోదారి ఎండిపోయిందనేగా మీ దిగులు ..ఏం పర్లేదు మళ్ళీ నిండిపోతుందిలెండి . నాదీ భరోసా !

hanu చెప్పారు...

mee visleshaNa chala bagumdi

'Padmarpita' చెప్పారు...

ఇంతందంగా చెప్పిన గోదావరి అందాలు ఎండిపోతాయంటే భాధగా ఉందండి!

జాన్‌హైడ్ కనుమూరి చెప్పారు...

గిలిగింతలుపెట్టే జ్ఞాపకాల మద్య కన్నీటి చెమ్మ తడిమింది

జయ చెప్పారు...

మురళి గారు ఏమీ జరగదండి. నేను చేసిన పాపికొండల ప్రయాణం, భద్రాచల దర్శనం నాకు ఆ నమ్మకాన్ని పెంచుతున్నాయి. మనిషి ఆశాజీవి కదా!!! సీజనల్ గా ఇటువంటి మార్పులు ఒస్తాయేమో. యుగయుగాల చరిత్ర ఉన్న గోదారి ఎలా మాయమైపోతుందండి. అసంభవం. ఉప్పొంగులె గోదావరి, వెతలు తీర్చులె గోదారి. వెన్నెల్లో గోదారి అందం...ఎలా మాయమైపోతుంది. గోదారమ్మ గట్టున, వాలుగా తోసే నావతో, చుక్కానే చూపుగా, వేదమంటి ఈ తల్లి గోదారి మీకు ఈ సారి తన అందాలన్నీ ఆరబోసి తృప్తినిస్తుంది చూడండి మరి. పచ్చని చేలో గోదారి నీలాంబరై...కోనసీమకు చీనాంబరై... బ్రతుకుతెరువుకు కుంకుమబొట్టు దిద్ది,ఈ పండు ముత్తైదువ, గల గలా ఈ సారి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది చూడండి. మీకు కావాల్సినన్ని తాంబూలాలు పుచ్చుకొని ఒస్తారు. మీకు ఎక్కువై నన్నుకూడా తీసుకో మంటారు. మీకు నమ్మకం కుదరటానికి ఏ ఒట్టు వేయమంటారో చెప్పండి...

Sravya Vattikuti చెప్పారు...

హ్మ్ !

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

"నిజం చెప్పాలంటే గోదారి ఇసుక తిప్పల మధ్య ప్రవహిస్తున్న పిల్ల కాలువలా అనిపించింది."

నమ్మలేకున్నాను.. నిజమా !! ఇంజనీరింగ్ చదివిన నాలుగేళ్ళూ రైలు లో వెళ్తూ, కృష్ణమ్మను ఇలా చూసి, ఏ కాలమైనా నిండుగా కళ కళ లాడే గోదారి ఎపుడొస్తుందా అని వేయికళ్ళతో ఎదురు చూసేవాడ్ని. ఇపుడు గోదారి ఇలా అయిందంటే ఆశ్చర్యమే..

Vasu చెప్పారు...

"తనని చూసిన వాళ్ళ కళ్ళలో తడిని చూడడం గోదారికి అలవాటై పోయినట్టుంది."
ఇది చదవగానే కలుక్కు మంది. మళ్లీ రెన్నెళ్ళలో గోదారి మామూలుగా ఐపోతుందని ఆశ ఉంది.

"గిలిగింతలుపెట్టే జ్ఞాపకాల మద్య కన్నీటి చెమ్మ తడిమింది"
జాన్ హైడ్ గారి మాటలే నావి.

హరే కృష్ణ . చెప్పారు...

గోదావరి కష్టాలను కళ్ళముందు ఉంచారు మురళి గారు

కొత్త పాళీ చెప్పారు...

Beautifully written

భావన చెప్పారు...

అయ్యో.... వింటుంటేనే బాధ గా వుంది గోదారి తో మమైక మైన ప్రాణాలకు ఎలా వుందో.. మా వూర్లో వానలు వరదలు. మా ఇంటి ముందు నది చిందులు తొక్కేస్తోంది. ఆ వురవళ్ళు చూసి ఇటు వచ్చి ఇది చదివితే బాధ అనిపించింది.

జాన్‌హైడ్ కనుమూరి చెప్పారు...

నా బాల్యం (తొమ్మిదవతరగతి ప్రారంభం వరకు 1973 అనుకుంట) పట్టిసీమ, పోలవరంలో జరిగింది. పోలవరంలో గోదావరి ఈ గట్టునుంచి ఆగట్టు వరకు సుమారు రెండు కిలో మిటర్ల పైనే వుంటుంది. వేసవి ప్రారంభంలోనే దాదాపు ఒక కిలోలోమీటరుపైనే ఇసుకమేటలు వేసేవి. ఎనిమిదవ తరగతి వేసవి శెలవులలో ఈ దరినుంచి ఆ దరికి(సుమారు అర కిలోమీటరు) దోస్తులతో కలిసి ఈదిన జ్ఞాపకం ఇంకా పదిలంగా వుంది. తర్వాతి కాలంలో బహుశ ఈ ఇసుకమేటల పరిస్థితి ఇంకా పెరిగింది. అందుకే గిలిగింతలుపెట్టే జ్ఞాపకాల మద్య కన్నీటి చెమ్మ తడిమింది

మురళి చెప్పారు...

@లలిత: నా టపా మీలోని షెర్లాక్స్ హోమ్స్ ని నిద్ర లేపిందన్న మాట ;-) :-) మా స్వస్థలం కోనసీమ.. మీ భరోసాకి ధన్యవాదాలండీ..
@హను: ధన్యవాదాలండీ..
@పద్మార్పిత: గతంలో ఎప్పుడూ ఇలా లేదండీ.. ఈ మధ్య గత రెండేళ్లుగా ఇలా.. ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@జాన్ హైడ్ కనుమూరి: యెంత అందంగా చెప్పారండీ!! మీది కూడా గోదారితో పెన వేసుకున్న బాల్యమే అన్నమాట.. ధన్యవాదాలు.
@జయ: వేటూరి భావావేశమంతా మీ వ్యాఖ్యలో కనిపించిందండీ.. మీరు చెప్పినట్టే జరిగితే అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి?? ..ధన్యవాదాలు.
@శ్రావ్య వట్టికూటి: ధన్యవాదాలండీ..

మురళి చెప్పారు...

@వేణూ శ్రీకాంత్: ఆశ్చర్యం, దిగులు, బాధ.. అన్నీనండీ.. ధన్యవాదాలు.
@వాసు: నాకూ అదే ఆశ అండీ.. ధన్యవాదాలు.
@హరే కృష్ణ: ఇంకేమీ చేయలేను కదండీ.. ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@కొత్తపాళీ: Thank you
@భావన: అక్కడ వరదలా మీకు??!! ఏమిటోనండీ మాయ.. ధన్యవాదాలు.

చిన్ని చెప్పారు...

మీ వర్ణనలు చదువుతుంటే అర్జెంటుగా 'గోదావరి ' కోనసీమ ' చూడలన్పిస్తుంది ,అయిన ఈ గోదావరి వాళ్ళు మరీ అపురూపంగా రాసేస్తారనుకుంటాను ఉన్నదానికన్నా :-):)

మధురవాణి చెప్పారు...

మురళీ గారూ,
మీర్రాసిన ప్రతీ పదం గోదారంత అందంగా ఉంది. చదువుతుంటే.. గోదారొడ్డున నించుని అలల్ని చూస్తున్న ఫీలింగ్!
"నిజం చెప్పాలంటే గోదారి ఇసుక తిప్పల మధ్య ప్రవహిస్తున్న పిల్ల కాలువలా అనిపించింది." పోయినేడాది భద్రాచలం దగ్గర గోదారిని చూస్తే అచ్చం నాకిలాగే అనిపించింది.
ఈ వానాకాలం మళ్ళీ మన గోదారి పొంగి పరవళ్ళు తొక్కుతూ మనని అలరిస్తుందని ఆశిద్దాం!

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

ఏం రాయాలో తెలీక రాయలేకపొయ్యాను ప్చ్.జాన్ హైడ్ గారు అది పూర్తిచేసేసారు అంతే,చెప్పడానికేమీ లేదు ఎదురుచూపులు తప్ప.

మురళి చెప్పారు...

@చిన్ని: మీరోసారి గోదారిని చూసొస్తే నేను రాసిన దానికన్నా కొంచం ఎక్కువే రాస్తారు తప్ప, తక్కువ రాయరండీ.. ధన్యవాదాలు.
@మధురవాణి: చాలా పెద్ద ప్రశంస .. ధన్యవాదాలండీ..
@శ్రీనివాస్ పప్పు: నిజమేనండీ.. మనం చేయగలిగేది అదే.. ధన్యవాదాలు.

ప్రణీత స్వాతి చెప్పారు...

ఐతే ఉగాదికి ఊరు వెళ్లి వచ్చారన్నమాట..!! గోదారమ్మ మళ్ళీ త్వరలోనే నిండుగా ప్రవహించి రైతన్న కష్టాలు తప్పక తీరుస్తుందండీ.

మురళి చెప్పారు...

@ప్రణీత స్వాతి: ధన్యవాదాలండీ..

పరిమళం చెప్పారు...

గోదావరి ...ఈపేరువింటే చాలు ఆనదికంటే వేగంగా పరవళ్ళు తొక్కుతుంది హృదయం ! మీతోపాటూ ప్రయాణం చేసినట్టే ఉంది మురళిగారు ....ఆలస్యంగాచదివాను కాని ఇప్పటికి ఉప్పొంగే గోదావరిపై మరో టపా రాసేసి ఉంటారేమో .........
@ తృష్ణ గారూ ! కనిపెట్టేశారా మరి ? అప్పుడెప్పుడో కోనసీమలో గోదారొడ్డున ఉన్న అందమైన పల్లెటూరు అని చెప్పినట్టు గుర్తు ! ఈ క్లూ ఏమైనా ఉపయోగపడుతుందేమోచూడండి తెలిసిపోతే ముందుగా నాకే చెప్పాలి సుమా :)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి