ఆమె ఓ బానిస యువతి. ఆట పాటల్లో మేటి. అనారు పూలంటే ఆమెకి యెడ తెగని ప్రీతి. కేవలం ఆ పూల కోసమే అక్బర్ చక్రవర్తికి చెందిన పూదోటకి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా, చక్రవర్తి సైన్యంలో పనిచేసే ఓ యువకుడిని చూసి భయపడి, అనంతరం ఆ సిపాయితోనే ప్రేమలో పడిపోయింది. ఆ యువతి పేరు నాదిరా.. ఆమె ప్రేమించింది మరెవరినో కాదు, మారు వేషంలో ఉన్న చక్రవర్తి కుమారుడు సలీంని.
అంతస్తుల భేదానికీ, అధికారంలో ఉన్నవారి అహంకారానికీ, ఇంకా సలీం పిరికితనానికీ, మొండి పట్టుదలకీ బలైపోయింది ఆమె ప్రేమ. ఫలితం.. రాజ ప్రాసాదంలో ఆమె సమాధి.. సమాధి ఎదుట వెలుగుతున్న జ్యోతి.. ఆ పక్కనే ఆమెనే కీర్తిస్తూ సలీం. యాభయ్యయిదేళ్ళ క్రితం వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో అంజలీదేవి భర్త పి. ఆదినారాయణ రావు నిర్మించిన సంగీత భరిత ప్రేమకథా చిత్రం 'అనార్ కలి' లో ప్రారంభ దృశ్యం ఇదే.
అనారు పూల తోటలో 'జీవితమే సఫలము..' అని పాడుకుంటున్న నాదిరా (అంజలీదేవి) తో తొలి చూపులోనే ప్రేమలో పడ్డ సలీం (అక్కినేని నాగేశ్వర రావు), తన వివరాలు దాచి ఆమెతో స్నేహం పెంచుకుంటాడు. స్నేహం ప్రేమగా మారాక తన 'సిపాయి' కోసం నాదిరా ఆ పాట పాడుతూ ఉండగా అక్బర్ చక్రవర్తి (యస్వీ రంగారావు) పూదోటకి వస్తున్నారన్న వార్త తెలిసి ఆమెని అక్కడే వదిలి పారిపోతాడు సలీం. వచ్చిన వాడు అక్బర్ చక్రవర్తని తెలీదు అమాయకురాలైన నాదిరాకి.
తమ ఏకాంతానికి భంగం కలిగించినందుకు కోపగించుకుని, ఆపై తగువు పెట్టుకుని, తన ప్రేమ గొప్పదని నిరూపిస్తానని, తన ప్రియుణ్ణి పిలుస్తాననీ శపథం చేస్తుంది నాదిరా. పాట పాడి సలీముని పిలిచినా, అతను చక్రవర్తికి ఎదుట పడక, చెట్టు చాటునే నిలబడతాడు. తాను చక్రవర్తినని చెప్పిన అక్బర్, నాదిరాని ఏం కావాలో కోరుకోమంటాడు. "మీ ప్రేమకి పాత్రమైన ఆ అనారు పుష్పాలని ఇప్పించండి చాలు" అంటుంది నాదిరా.. పూలతో పాటు, ఆమెకి 'అనార్ కలి' అనే బిరుదు కూడా ఇస్తాడు అక్బర్.
సలీం ప్రేమ విషయం అక్బర్ ఆస్థానంలోని మాన్ సింగ్ (చిత్తూరు నాగయ్య) కి తెలిసిపోతుంది. యువ రాజుని మందలించడమే కాదు, తనతో యుద్ధానికీ తీసుకెళతాడు మాన్ సింగ్. ఇంతలో బానిసల స్థావరం మీద దాడి జరగడం, అనార్ కలి ని దుండగులు ఎత్తుకుపోయి, వేలానికి పెట్టడమూ జరిగిపోతుంది. మారువేషంలో వేలానికి వచ్చిన సలీం ఆమెని వేలంలో కొనుక్కుంటాడు. యుద్ధంలో గాయపడ్డ సలీం ని తన పాటతో బతికించుకుంటుంది అనార్ కలి. అప్పుడే ఆమెకి తన ప్రియుడు మామూలు సిపాయి కాదనీ, కాబోయే చక్రవర్తి అనీ తెలుస్తుంది.
అక్బర్ ఆమెకి ఆస్థాన నర్తకి పదవి ఇచ్చి గౌరవిస్తే, రాజా మాన్ సింగ్ ఆమెని సలీం ని మరచి పోవాల్సిందిగా ఆదేశిస్తాడు. తల్లిదండ్రుల ఎదుట అమాయకత్వం నటించే సలీం, చాటుగా అనార్ కలి ని ప్రేమిస్తూ ఉంటాడు. రాజ నర్తకి కుతంత్రం కారణంగా అనార్ కలికి రాజద్రోహ నేరం పై శిక్ష పడ్డప్పుడు, తల్లి జోధా బాయి (కన్నాంబ) తో తాను అనార్ కలి ని ప్రేమిస్తున్న సంగతి చెబుతాడు సలీం. ప్రేమని వ్యతిరేకించిన అక్బర్ చక్రవర్తిపై యుద్ధం ప్రకటించి, తల్లి కోరిక మేరకు రణరంగం నుంచి వెనుతిరుగుతాడు.
సలీం, అనార్ కలి ఇద్దరికీ మరణ శిక్ష విధించిన అక్బర్ చక్రవర్తి, కన్నప్రేమ కారణంగా సలీం కి విధించిన శిక్షని అమలు చేయలేక పోతాడు. అనార్ కలికి యెంతో ఇష్టమైన దానిమ్మ పూల తోటలో ఆమె సమాధి ఎదుట పాటలు పాడుకుంటూ సలీం శేష జీవితాన్ని గడపడం ఈ విషాదాంత ప్రేమ కథకి ముగింపు. వేదాంతం రాఘవయ్య దర్శకత్వ ప్రతిభ, ఆదినారాయణ రావు సంగీత ప్రతిభ సినిమా ఆసాంతమూ ఒకదానితో ఒకటి పోటీ పడుతూనే ఉంటాయి. 'జీవితమే సఫలమూ' తో పాటుగా 'రాజశేఖరా నీపై మోజు తీర లేదురా..' పాట ఎవర్ గ్రీన్. చిత్రీకరణ పరంగా 'కలిసె నెలరాజు కలువ చెలిని' పాట ఒక అద్భుతం.
నాదిరా తన ప్రేమ గురించి అక్బర్ చక్రవర్తి ఎదుట ధైర్యంగా మాట్లాడడం, సలీంతో పీక లోతు ప్రేమలో మునిగాక ఆమె రాజా మాన్ సింగ్ ని ఎదిరించే సన్నివేశం, అక్బర్-జోధా బాయి-సలీం మధ్య వచ్చే సన్నివేశాలు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. నటీ నటుల విషయంలో మొదట చెప్పుకోవాల్సింది అనార్ కలి గా టైటిల్ పాత్ర పోషించిన అంజలీ దేవి గురించే. నర్తకి పాత్రకే అవసరమైన రూప లావణ్యం తో పాటు, నృత్య ప్రతిభా ఆమె సొంతం కావడం తో అనార్ కలి పాత్రకి ప్రాణ ప్రతిష్ట చేసింది అంజలి. తర్వాత చెప్పుకోవాల్సింది అక్బర్ గా ఎస్వీ రంగారావు, జోధాబాయిగా కన్నాంబల గురించి.. పోటీ పడి నటించారు ఇద్దరూ. వీరితో పాటే చిత్తూరు నాగయ్య.
సలీం గా అక్కినేని నాగేశ్వర రావుది పాసివ్ పాత్ర. కొంత పిరికితనం, మరి కొంచం మూర్ఖత్వం మేళవించిన పాత్ర. అక్బర్ ని ఎదిరించే సన్నివేశంలోనూ, తల్లి మాటకి ఎదురు చెప్పలేక యుద్ధరంగం నుంచి వెనుతిరిగే సన్నివేశం లోనూ నాగేశ్వర రావు నటన గుర్తుండి పోతుంది. ముస్లిం యువరాజుగా కనిపించడం కోసం నాగేశ్వర రావు వాడిన విగ్గు బాగుంది. కళ్ళు చెదిరే రాజ మహల్ సెట్టింగులతో భారీగా తీశారీ సినిమాని. ఐదున్నర దశాబ్దాల క్రితం సినిమా కాబట్టి అక్కడక్కడా కొంచం సాగతీత అనిపిస్తుంది. అలా అని అదేమీ ఈ సినిమా చూడడానికి అడ్డంకి కాదు. అన్నట్టు అంజలి-అక్కినేని ల 'సువర్ణ సుందరి' గురించి మరికొన్ని కబుర్లు ఇక్కడ చదవొచ్చు.
సలీం గా అక్కినేని నాగేశ్వర రావుది పాసివ్ పాత్ర. కొంత పిరికితనం, మరి కొంచం మూర్ఖత్వం మేళవించిన పాత్ర. అక్బర్ ని ఎదిరించే సన్నివేశంలోనూ, తల్లి మాటకి ఎదురు చెప్పలేక యుద్ధరంగం నుంచి వెనుతిరిగే సన్నివేశం లోనూ నాగేశ్వర రావు నటన గుర్తుండి పోతుంది. ముస్లిం యువరాజుగా కనిపించడం కోసం నాగేశ్వర రావు వాడిన విగ్గు బాగుంది. కళ్ళు చెదిరే రాజ మహల్ సెట్టింగులతో భారీగా తీశారీ సినిమాని. ఐదున్నర దశాబ్దాల క్రితం సినిమా కాబట్టి అక్కడక్కడా కొంచం సాగతీత అనిపిస్తుంది. అలా అని అదేమీ ఈ సినిమా చూడడానికి అడ్డంకి కాదు. అన్నట్టు అంజలి-అక్కినేని ల 'సువర్ణ సుందరి' గురించి మరికొన్ని కబుర్లు ఇక్కడ చదవొచ్చు.
ఈ సినిమాలో పాటలు అంటే ఇష్టం. ఇది వేదాంతం రాఘవయ్య దర్శకత్వమని తెలియదు. దేవదాసు కి ఫ్యాన్ ని నేను. ఇది కూడా పూర్తిగా చూడాలి. ఎప్పుడూ ముక్కలు ముక్కలుగా చూడటమే.
రిప్లయితొలగించండిఇది ఈ మధ్య ఏమన్నా కొత్త డి వి డి కింద వచ్చిందా.
అన్నట్టు నేను అనార్ కలి ముఘల్ ఎ అజాం కి రీమేక్ అనుకున్నాను. దానికి దీనికి తేడా ఉంది అలా ఐతే. క్లైమాక్స్ లో అందులో అనార్ కలి ని ఉరి తీయకుండా రహస్యంగా బంధించినట్టు చూపిస్తారు (అని గుర్తు). ఆ సినిమా కూడా కూడా భలే ఉంటుంది. డైలాగ్లు పెద్దగా అర్థం కాకపోయినా (అచ్చమయిన ఉర్దూ) వినడానికి బావుంటాయి. పాటలు ఇక చెప్పక్కర్లేదు. కేవలం మధు బాల కోసమే ఒక సారి చూడచ్చు.
రిప్లయితొలగించండిఈ అనార్కలి చూడలేదండీ ...ఎన్ టి రామారావుగారు , బాలకృష్ణ నటించిన సినిమా చూశానుకాని భాష , వేషధారణ చాలా కృతకంగా ఇంకా చెప్పాలంటే కాస్త ఎబ్బెట్టుగానే ఉన్నాయి. ఈ అనార్కలి డివిడి దొరుకుతుందేమో చూడాలి .
రిప్లయితొలగించండిరాజశేఖర , జీవితమే సఫలము పాటలు నాకు ఇష్టం అండీ .అంజలీదేవి ఫ్యాన మీరు :-)
రిప్లయితొలగించండిజీవితమే సఫలమో పాట నాకెంత ఇష్టమో ! ఈ సినిమా మార్నింగ్ షో గా వచ్చినపుడు చూడటము కుదరలేదు .
రిప్లయితొలగించండిఈ సినిమా లోని పాటలు ఇష్టమే కానీ సినిమా చూడలేదు. వీలు చూసుకుని చూడాలి.
రిప్లయితొలగించండి@చిన్ని: అంజలీదేవి ఫానా? ఓసారి ఈసువర్ణసుందరిని http://nemalikannu.blogspot.com/2010/01/blog-post.html చూడండి.
రిప్లయితొలగించండినాకుమాత్రం ఇంకోసినిమానే బాగా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటూంది. హసీనా ఓహసీనా...
ట్రాజిడి సినిమాలు చూడాలంటే భయమండీ నాకు..అది ఎంత బాగున్నా సరే..అందుకే ఇంతవరకూ అనార్కలి చూడలేదు. మీ టపా చదివాక ఒకసారి చూడాలనిపిస్తోంది. చూడ్డానికి ప్రయత్నిస్తాను.
రిప్లయితొలగించండిఅంజలీ పిక్చర్స్ వారి చిత్రాలన్నీ మంచి హిట్సే మ్యూజికల్ గా కూడా.ఆదినారాయణ రావుకి మంచి టేస్ట్ ఉంది దానికి తగ్గట్టే అంజలీదేవి కూడా.మనకున్న మంచి నటీమణుల్లో (గోదారి జిల్లా కి చెందిన) ఒక మణిపూస అంజలి.
రిప్లయితొలగించండిఈ చిత్రం డీవీడీ అట్టమీద ఒక చోట "అనార్ కలి" అని ఇంకోచోట "అనార్కలి" అని ఉంది ఎందుకో మరి(రెండూ ఓల్గా విడియో వారే చేసినా కూడా).
"'రాజశేఖరా నీపై మోజు తీర లేదురా..'పాట ఉత్తమ పాటల్లో ఒకటి. కొంచం సాగతీత వ్యవహారంగా ఉన్నా ఆ కాలానికి సరిపోయే సినిమా కాబట్టి చూసితీరాల్సిన సినిమాల లిస్టులో ఇది కూడా వేసుకోవచ్చు.
అన్నగారి పిచ్చిని భరించే ఓపికుంటే "అక్బర్‌సలీంఅనార్కలి" అన్న సినిమా కూడా చూసి ఆనందించవచ్చు(హిహిహి)
అయితే చూడాల్సిన సినిమాల లిస్టులో ఇది చేర్చాలన్నమాట! మీరు పోస్టులో పెట్టిన అంజలీ దేవి B&W ఫోటో చాలా బాగుంది :-)
రిప్లయితొలగించండిఒక గొప్ప సినిమాకి మంచి పరిచయం
రిప్లయితొలగించండి5 డేస్ - no post. whats happening??
రిప్లయితొలగించండిఇలా అయితే ఎలాగండీ బాబూ?? ఈనాడు పేపర్ లాగా రోజూ కొకటి వస్తే బావుంటుంది మీ టపా.
అంజలీ దేవి బలే గ్లామరస్ గా వున్నారు ఫొటో లో. రాజశేఖర పాట బావుంటుంది కాని సినిమా చూడలేదు, మీ ఇంట్రడక్షన్ చూస్తే చూడాలనిపిస్తోంది.
రిప్లయితొలగించండి@వాసు: వోల్గా వారి డీవీడీలు వచ్చాయండీ.. క్వాలిటీ మరీ అద్భుతంగా లేదు.. అయితే గతంలో వచ్చిన సీడీల కన్నా మెరుగు.. ముఘల్ ఏ ఆజం బ్లాకండ్ వైట్ లోనే బాగుంది అనిపించిందండీ నాకు.. ముఖ్యంగా మధుబాల... ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@పరిమళం: డీవీడీ దొరుకుతోందండీ.. మీరు చెప్పిన అన్నగారి సినిమా గురించి సీరియస్ గా కాక సరదాగా మాట్లాడుకోవాలి :-) :-) ..ధన్యవాదాలు.
@చిన్ని: అవునండీ.. తను నా ఫస్ట్ లవ్(హీరోయిన్లలో) .. ధన్యవాదాలు.
@మాలాకుమార్: అప్పుడప్పుడూ టీవీలో వస్తోందండీ ఈ సినిమా.. ఇప్పుడు డీవీడీ కూడా వచ్చింది.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@వేణూ శ్రీకాంత్: మీకు నచ్చుతుందండీ.. మంచి పాటలున్నాయ్.. ధన్యవాదాలు.
@సుబ్రహ్మణ్య చైతన్య: హసీనా గురించి మీరు రాయకూడదూ? :-) :-) ..ధన్యవాదాలు.
@ప్రణీత స్వాతి: మరీ ట్రాజెడీ కాదండీ.. చాలా వరకూ మామూలుగానే ఉంటుంది.. ముగింపు మాత్రమె ట్రాజెడీ.. ప్రయత్నించండి.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@శ్రీనివాస్ పప్పు: నిజమేనండీ ఆది నారాయణ రావుది అన్ని విధాలా మంచి టేస్టే.. ఒక్క సంగీతం మాత్రమే కాదు.. నిర్మాతగానూ, అలాగే అంజలిని పెళ్లి చేసుకోడం ద్వారా కూడానూ ఆయన టేస్ట్ తెలిసిపోతోంది కదా మనకి.. అన్న గారి సినిమా...!!! ..ధన్యవాదాలు.
@మధురవాణి: ఫోటో గూగులమ్మ ఇచ్చిందండీ.. ధన్యవాదాలు.
@హరే కృష్ణ: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@వాసు: కొన్ని అనివార్య కారణాల వల్లనండీ.. ఇప్పుడు మళ్ళీ వచ్చేశాను :-) :-)
@భావన: కొంచం నెమ్మదిగా సాగినా, సినిమా ఆసక్తికరంగా సాగుతుంది.. ధన్యవాదాలు.