మంగళవారం, జనవరి 27, 2009

చీకట్లో గోదారి

'బద్దరగిరి రామయ్య పాదాలు కడగంగా పరవళ్ళు తొక్కింది గోదారి గంగ.. పాపి కొండలకున్న పాపాలు కరగంగా పరుగుల్లు తీసింది బూదారి గంగ...' ఇది నాకు చాలా ఇష్టమైన పాట. 'సీతారామయ్య గారి మనవరాలు' సినిమాలో ఈ పాట విన్నప్పుడల్లా ఉరకలెత్తుతున్న గోదారి గుర్తొస్తుంది. కాని ఇప్పుడు ఇదే పాట వింటుంటే మనసంతా చేదుగా ఐపోతోంది. ఎందుకంటే ఇప్పటి గోదారి బద్దరగిరి రామయ్య పాదాలను కడగలేదు..పాపికొండలకి ఉన్న పాపాలనూ కరిగించలేదు. అందుకు సరిపోయేంత నీరు గోదారిలో లేదు... ఎందుకిలా జరిగింది? అంటే ఎవరి సమాధానం వారు చెబుతారు. రానున్న రోజుల్లో ఇది ఒక రాజకీయ అంశంగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

అవును..గోదావరి లాంటి ఓ జీవనది ఎండిపోయే దశకు చేరుకోడం మామూలు విషయం కాదు. నిజానికి గోదారి కేవలం ఒక నది మాత్రమే కాదు..పరీవాహక ప్రాంతంలో నివసించే ప్రజల జీవితంలో ఓ భాగం. కాటన్ మహాశయుడు ధవళేశ్వరం ఆనకట్ట కట్టి కోస్తా జిల్లాల ప్రజలని కరువు కోరల నుంచి విముక్తి చేసిన నాటి నుంచి అక్కడి ప్రజలకి గోదారి సాక్షాత్తూ అన్నం పెట్టె అమ్మ..అన్నపూర్ణ. కరుణించి ఏడాదికి మూడు పంటల వరమిచ్చినా, కోపగించి వరదై ముంచెత్తినా అక్కడి ఇల్లాళ్ళకి గోదారి తమ ఇంటి ఆడపడుచు. అంతేనా..కోడెకారు కుర్రకారు ఊహల్ని పూల పడవపై ఊరేగించి వారిలో భావుకత్వం పుట్టించే జాణతనం గోదారి సొంతం.

ఎంత వివశుడు కాకపొతే ఆరుద్ర 'గోదావరి వరద లాగ కోరిక చెలరేగింది..' అంటాడు? ఇదే గోదావరి గలగలలు మోదుకూరి జాన్సన్ కి వేదఘోష లా వినిపించాయి. 'వయ్యారి గోదారమ్మ వళ్ళంతా ఎందుకమ్మా కలవరం?' అని అడిగారు వేటూరి. తన కథా సంపుటానికి 'గోదారి కథలు' అని పేరుపెట్టిన బి.వి.ఎస్. రామారావు ఆ కథలని తనచేత రాయించింది గోదావరేనని ప్రకటించారు.

'గోదారి మీద మీకు ఎంత అభిమానం ఉంది?' జవాబు చెప్పడం కష్టమే.. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే 'వంశీ కి ఉన్నంత..' ఈ జవాబు 'ఆకాశమంత' లేదా 'గోదావరంత' అన్న జవాబులకన్న గొప్పదని ఒప్పుకొని వారెవరు? గోదావరి ప్రస్తావన లేకుండా వంశీ రాసిన కథలు, తీసిన సినిమాలు అరుదు. ఈ మధ్య కాలంలో వచ్చిన వంశీ పుస్తకం 'మా పసలపూడి కథలు' కి ప్రేరణ, నేపధ్యం గోదావరే. 'గోదారి గాలికి నా ఫెయిల్యుర్స్ ని మర్చిపోయాను..' అని తన 'ఫెయిల్యూర్ స్టోరి' లో వంశీ నే చెప్పాడు. అసలు వంశీ నరాల్లో రక్తానికి బదులు గోదారి ప్రవహిస్తోందేమో అని అనుమానించేవాళ్ళూ ఉన్నారు. గోదారిని తెరపై అందంగా చూపించడంలో వంశీ, బాపు, విశ్వనాద్ లది ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకమైన శైలి.

గోదారిని చూసిన వాళ్ళెవరూ ఆ నదితో ప్రేమలో పడకుండా ఉండలేరు..ఇది రుజువు చేయడానికి పరిశోధనలూ అవీ అవసరం లేదు. అక్కడివారే కానవసరం లేదు.. ఓ సారి ఆ నదిని చూసొచ్చిన వాళ్ళని ఎవరినైనా అడగండి.. రెండో ఆలోచన లేకుండా నిజమేనని ఒప్పుకుంటారు. నిశ్చల గోదారి కానివ్వండి లేదా వరద గోదారైనా కానివ్వండి, మిమ్మల్ని మీరు మర్చిపోయి అలా చూస్తూ ఉండాల్సిందే. వెన్నల రాత్రి గోదారి మీద పడవ ప్రయాణం ఓ జీవిత కాలం గుర్తుండే జ్ఞాపకం.

మరి ఇవాల్టి గోదారి? పంటలకి నీరు ఇవ్వలేక పోతోంది..కనీసం పాపి కొండలు చూడాలనుకునే వాళ్ల పడవలు అద్దరికి చేరేంత నీటినైనా తనలో మిగుల్చుకోలేక పోయింది. అలిగినప్పుడు తన ఉద్ధృత రూపం చూపించి భయపెట్టడం మాత్రమే తెలిసిన గోదారి ఇప్పుడెందుకో ఓ పిల్ల కాలువలా మారిపోతోంది. ఇంత తక్కువ నీటిమట్టం గడిచిన కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ రికార్డు కాలేదట. ఈసారి పంటనష్టం ఖాయమని, తాగునీటి సమస్య రావచ్చుననీ వార్తలు వస్తున్నాయి. గోదారి ఎవరినో శిక్షించాలనుకుని తనను తాను శిక్షించుకోవడం లేదు కదా?

9 వ్యాఖ్యలు:

సుజాత చెప్పారు...

మురళి గారు, మీలో చాలా భావుకత ఉంది.

నేను ఏ నదితోనైనా ప్రేమలో పడతాను. ముఖ్యంగా కృష్ణ తర్వాత, గోదావరి, కావేరి ఎంత అందాలొలికిస్తుంటాయో చెప్పలేను.

వేసవి వస్తోంది కాబట్టి గోదావరి వడిలో ఒడిదుడుకులు సహజం! కానీ ఇంతలా తగ్గిపోవడం ఆందోళన చెందాల్సిన విషయమే!ఇదే గోదావరిని ఒక సారి అక్టోబరులో ఉధృతంగా ఉగ్ర రూపంలో చూసి ఎండలో చలి వేసింది. గోదావరికి ఆవేశం ఎక్కువ. ఆ ఆవేశం తిరిగి జులై లో ఆగస్టులో తెచ్చుకుంటుందని చూద్దాం!

మురళి చెప్పారు...

@సుజాత: ధన్యవాదాలు.

మధుర వాణి చెప్పారు...

గోదారి గురించి మీరు రాసింది చదివాకా నేను ఆలోచనా ప్రవాహంలో కొట్టుకొని గోదారొడ్డున ఉండే మా ఊరికెళ్ళిపోయాను. 'బద్దరగిరి రామయ్య' పాత అంటే నాక్కూడా చాలా చాలా ఇష్టం. ఎన్నిసార్లు విన్నా గానీ పాట వింటుంటే నాకెందుకో కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటాయి. అదో రకమైన భావావేశం అనుకుంటా :)
భద్రాచలంలో అయితే మాత్రం ఎండాకాలం నీటి మట్టం కాస్త తగ్గినా వర్షాకాలంలో బాగా విజ్రుంభిస్తుందండీ గోదావరి..!
గోదారిని మరోసారి అందమైన మాటల్లో పేర్చి గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదాలు.

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

"గోదారి ఎవరినో శిక్షించాలనుకుని తనను తాను శిక్షించుకోవడం లేదు కదా"?
కోనసీమ వాసులకి తల్లి కన్నా పరమ పవిత్రమయింది గోదావరి అంటే.మరి అటువంటి తల్లి శిక్షించడమేమిటి?అంటే వరద రూపంలో అనా మీ ఉద్దేశ్యం..
గోదావరి నిండా నీళ్ళు పొంగి పొర్లిపోతున్నాయని ప్రోజెక్టుల మీద ప్రోజెక్టులు కడితే ఏమవుతుందో మరి గ్రహించలేరా.
పక్క వాడి కొంప పచ్చగా ఉందని వాడి కొంపకి నిప్పెడితే గాలెగేసి వీడి కొంప కూడ అంటుకుని ఇద్దరూ మాడి చచ్చారట అందులో..అలాగన్నమాట...

మురళి చెప్పారు...

@మధురవాణి: ఆ భావావేశానికి నేనూ లోనవుతూ ఉంటానండి. ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@శ్రీనివాస్ పప్పు: ముందుగా మీకు ధన్యవాదాలు. తల్లి సహనానికి కూడా మనం పరీక్షలు పెడుతున్నామేమో అనిపిస్తోంది. తనకి కోపం వచ్చినప్పుడల్లా దానిని వరద రూపంలో చూపిస్తూనే ఉంటుది తల్లి గోదారి. ఈసారి సహనం కోల్పోయి నీళ్లు ఇవ్వకుండా శిక్షిస్తోందేమో అనిపిస్తోంది. ఈ క్రమంలో తను చిక్కిపోయి రూపు కోల్పోతోంది కదా..

బొల్లోజు బాబా చెప్పారు...

నిజమే
గోదావరి అలల యాస వంశీ కలల శ్వాస.
మీ వ్యాసం చాలా బాగుంది

మురళి చెప్పారు...

@బొల్లోజు బాబా: ధన్యవాదాలు.

తృష్ణ చెప్పారు...

మీ 'వందనాలు' టపాలో చూసాకా గొదావరి మీద అభిమానం కొద్దీ మీ 'చీకట్లో గోదారి' టపా చూసాను.చిన్నప్పటి నుంచీ చూస్తున్న ఆ నది అలా ఎండిపోతూంటే నాకు కూడా బాధగా ఉండేది.గొదావరితో నా అనుబంధాన్ని నా "గోదావరి జ్ఞాపకాలు " టాపాలో రాసాను.వీలుంటే చదవండి.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి