బుధవారం, మార్చి 31, 2010

ఇది కథ కాదు

మూడున్నర దశాబ్దాల క్రితం ఆయన మా ఊరికి వచ్చారు. భార్య, పదేళ్ళ కూతురితో కలిసి మా ఇంటికి నాలుగిళ్ళ అవతల ఖాళీగా ఉన్న ఓ ఇంటి పక్క వాటాలో దిగారు. రెండు గోతాలతో సామాను, ఓ ట్రంకు పెట్టెతో వాళ్ళు ముగ్గురూ ఒంటెద్దు బండి దిగడాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. వద్దనుకున్నా ఒకరి వివరాలు మరొకరికి తెలిసిపోతూ ఉండడం పల్లెటూళ్ళ ప్రత్యేకత. అలా మర్నాటికి వాళ్ళ గురించి కొన్ని వివరాలు తెలిశాయి.

వాళ్ళు బతుకు తెరువు వెతుక్కుంటూ మా ఊరికి వచ్చారు. ఓ పదెకరాల భూస్వామి దగ్గర రైతుగా చేరాడాయన. వాళ్లకి పిల్లలు లేరు. ఆవిడ చెల్లెలి కూతురిని పెంచుకుంటున్నారు. మా ఊరోచ్చిన మర్నాడే ఆవిడ తన మెళ్ళో గొలుసు తాకట్టు పెట్టించి రెండు గేదెల్ని కొనిపించింది. వాళ్ళ చిన్న వాటా వెనుక ఉన్న కాసింత ఖాళీ స్థలం లోనే వాటికోసం ఒక పాక వేయించింది. ఆయన పొలం పనులకి వెళ్తే, ఆవిడ గేదెల సంరక్షణ చూసుకునేది. ఇంటి పనంతా ఆ పిల్లదే.

వాళ్ళ ఇంటికి ఐదారు ఇళ్ళ అవతలే సాటి కులస్తులు ఓ పదిహేను కుటుంబాలుగా ఉన్నారు. అప్పటికే వాళ్ళు పచ్చగా ఉండడంతో వీళ్ళని పట్టించుకోలేదు. వాళ్ళ వాళ్ళు అని చెప్పుకోడానికి సిగ్గు పడ్డారు. "కులం ఒకటే కానీ, బంధుత్వం లేదు" అని భుజాలు తడుముకున్నారు. సైకిలుకి పాల బిందె కట్టుకుని పొరుగూళ్లో ఉన్న కాఫీ హోటళ్ళకి పాలు పోసి రావడంతో ఆయన దినచర్య ప్రారంభమయ్యేది. ఆ పని అవ్వడంతోనే పొలం వెళ్ళిపోయే వాడు. మళ్ళీ ఏ రాత్రికో తిరిగి రావడం.

పాల మీద వచ్చిన డబ్బుతో ఆవిడ వడ్డీ వ్యాపారం మొదలు పెట్టింది. డబ్బు దగ్గర ఆవిడ నిక్కచ్చి మనిషి. శుక్రవారమైనా అప్పిస్తుంది, కానీ వడ్డీ మిగిలిన రోజుల కన్నా కొంచం ఎక్కువ వసూలు చేస్తుంది. ఆవిడ ఒంటి మీద చిన్నగా నగలు అమురుతున్నాయి. అరకల కాలంలో ఊళ్ళోనూ, పొరుగూళ్ళ లోనూ అరకలకి డిమాండ్ ఉండడం గమనించాడాయన. ధైర్యం చేసి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొన్నాడు. మా ఊళ్ళో మొదటి ట్రాక్టర్.

రెండేళ్ళు గడిచేసరికి పొలం యజమాని పొలంలో కొంత భాగాన్ని అమ్మకానికి పెడితే ఆయనే కొన్నాడు. మరో పక్క నల్లని ఆవిడ మెడ బంగారంతో పచ్చబడుతోంది. పెంపుడు కూతురికి పెళ్లీడు రావడంతో తన చెల్లెలి కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసి, అతన్ని తన దగ్గరికే తెచ్చుకుని వ్యాపారం పెట్టించాడాయన. ట్రాక్టర్ల సంఖ్య మూడుకి పెరిగింది. ఆవిడ పాల వ్యాపారం, వడ్డీ వ్యాపారమూ అదే స్థాయిలో పెరిగాయి. చూస్తుండగానే పొలం యజమాని నుంచి మిగిలిన పొలాన్నీ, ఇంటినీ కొనేశాడాయన.

కూతురికి పిల్లలు బయలుదేరి, వాళ్ళు కొంచం పెద్దవాళ్ళు అయ్యే నాటికి పాత ఇల్లు స్థానంలో మేడ వెలిసింది. అప్పటికే ఊళ్ళో పెద్ద మనిషిగా వెలిగిపోతున్న ఆయన, రాజకీయాల మీద దృష్టి పెట్టాడు. పార్టీలని నమ్ముకోలేదు, నాయకులకి మద్దతు ఇచ్చాడు. ఒకప్పుడు వాళ్ళని తమవాళ్ళు అని చెప్పుకోడానికి సిగ్గు పడ్డ వాళ్ళని ఆయనిప్పుడు లెక్కే చేయడం లేదు. వాళ్ళు మాత్రం ఆయన ప్రాపకం కోసం పాకులాడుతున్నారు.

ఈ వారంలో జరగబోతున్న ఆయన మనవరాలి పెళ్ళికి ఇద్దరు ప్రముఖ రాజకీయ నాయకులు రాబోతున్నారానీ, అందుకోసం మా పంచాయితీ వారు యుద్ధ ప్రాతిపదికన రోడ్లకి మరమ్మతులు చేస్తున్నారనీ మా ఊరి నుంచి ఇప్పుడే అందిన తాజా వార్త.

23 వ్యాఖ్యలు:

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

బాగుందండీ :-) పసలపూడి కథలో, దిగువ గోదారి కథలో చదువుతున్నట్లు అనిపించింది :-) బాగా రాశారు.

మాలా కుమార్ చెప్పారు...

అంతే కదా , డబ్బుకు లోకం దాసోహం .

3g చెప్పారు...

good inspiring.

3g చెప్పారు...

good story (sorry 'real story')....... inspiring

మధురవాణి చెప్పారు...

భలే ఉందండీ కథ లాంటి వాస్తవ గాథ! చదువుతుంటే నాకు శ్రీ రమణ గారి 'ధనలక్ష్మి' (పేరు సరిగ్గానే చెప్పానా?) గుర్తొచ్చింది :-)

Enaganti (ఇనగంటి) Ravi Chandra (రవిచంద్ర) చెప్పారు...

మన పని మనం శ్రద్ధగా చేసుకుంటూ పోతుంటే కీర్తి, సంపద, గౌరవం వాటంతట అవే వస్తాయని ఈయన నిరూపించాడు.

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

మరే సొమ్ములుంటే లక్ష్మీదేవి గారూ అని లేకపోతే ఒసే లచ్చమ్మా అని పిలుస్తార్రా నాన్నా అని మా నాయనమ్మ చెప్తుండేది ఎప్పుడూ(శ్రమజీవికి జగమంతా లక్ష్మీనివాసం).

హరే కృష్ణ . చెప్పారు...

కష్టే ఫలి
రవిచంద్ర గారు చెప్పింది అక్షరాలా నిజం
మీ ఊరు తీసుకెళ్ళారు మమ్మల్ని కూడా మీ టపా తో :)

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ చెప్పారు...

బావుంది.వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లో యండమూరి చెప్పే కథలా అనిపించింది చదివాక.కష్టేఫలి అన్నారు కదా.

Vasu చెప్పారు...

బావుంది. కానీ అదేమిటో డబ్బునిబట్టే విలువ. ఎందుకని ఇలాగ??

నాకు చివరి ప్యారా వరకూ శ్రీపాద వారి తాపీ ***** కథ (పేరు గుర్తులేదు, చూద్దామంటే పుస్తకం నా దగ్గర లేదు, స్నేహితుడి దగ్గర ఉంది, నెట్ లో దొరకలేదు :) ) గుర్తొచ్చింది.

మురళి చెప్పారు...

@వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలండీ..
@మాలాకుమార్: అంతే కదండీ.. ధన్యవాదాలు.
@3g: ధన్యవాదాలండీ..

మురళి చెప్పారు...

@మధురవాణి: సరిగ్గానే చెప్పారండీ.. ధన్యవాదాలు.
@ఇనగంటి రవిచంద్ర: నిజమండీ.. ధన్యవాదాలు.
@శ్రీనివాస్ పప్పు: ఈ సామెత నేను కూడా విన్నానండీ.. ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@హరే కృష్ణ: ధన్యవాదాలండీ..
@బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్: కథలాంటి వాస్తవ సంఘటన అండీ.. ధన్యవాదాలు.
@వాసు: శాస్త్రి గారి కథ పేరు 'తాపీమేస్త్రి రామదీక్షితులు బీయే' .. ఎందుకో తెలుసుకునే ప్రయత్నంలోనే నేనూ ఉన్నానండీ.. ధన్యవాదాలు.

భావన చెప్పారు...

"ఇది కధ కాదు" సినిమా గరించి అనుకున్నా. బాగుంది. కంగ్రాట్యులేషన్స్ మురళి. మీ కధ చదివేను కౌముది లో. బాగుంది.

మురళి చెప్పారు...

@భావన: ధన్యవాదాలండీ..

ప్రణీత స్వాతి చెప్పారు...

చాలా ఇన్ స్పైరింగ్ గా వుంది వాస్తవ గాధ.

మురళి చెప్పారు...

@ప్రణీత స్వాతి: ధన్యవాదాలండీ..

Radhika చెప్పారు...

hello..I like almost all articles in your blog

మురళి చెప్పారు...

@రాధిక: ధన్యవాదాలండీ..

స్ఫురిత చెప్పారు...

బాగుంది మురళి గారూ మీ కథ కాని కథ.
మధురవాణి గారూ, మీరన్న ధనలక్ష్మి, india today లో నెను చిన్నప్పుడు చదివిన ధనలక్షిమి ఒక్కరేనా??

మురళి చెప్పారు...

@స్ఫురిత: మధురవాణి గారు చెప్పింది ఈ ధనలక్ష్మి గురించండీ.. http://nemalikannu.blogspot.com/2009/04/blog-post_15.html
ఇంతకీ మీరు చదివిన కథ కూడా ఇదేనా?
..ధన్యవాదాలు.

స్ఫురిత చెప్పారు...

అవును మురళి గారు, ఈ ధనలక్ష్మే నేను చదివినది. 8th లోనో 9th లోనో వున్నప్పుడు. అప్పట్లో India Today వి special Editionలు ఏడాదికొకసారి అనుకుంటా వచ్చేవి. అందులో కథలు అన్నీ చాలా బాగుండేవి. ఆ special edition మా నాన్నగారు తప్పకుండా కొనేవారు.

బంగారం గొలుసు ఇస్తున్న ధనలక్ష్మీ, నల్లగా నిగ నిగలాడే రామంజనేయులు, రామాంజనేయులు సైకిలూ, లక్ష్మణ్ వేసిన అద్దం చూసుకుంటున్న గిరిజన స్త్రీ బొమ్మ ముఖచిత్రం తో వున్న పుస్తకం తో సహా చాలా గుర్తు వచ్చేసాయి మీరు రాసిన పరిచయం తో.

పరిమళం చెప్పారు...

కొన్ని వాస్తవాలు కధల్లాగే ఉంటాయి మరి !!!

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి