శుక్రవారం, మార్చి 19, 2010

వడియాలు

పక్క వాళ్ళ కొబ్బరి తోటకి ఇంజిన్ తో నీళ్ళు పెట్టారు కదా.. మట్టంతా తడితడిగా ఉంది. ఎవరూ చూడకుండా నాలుగు దోసిళ్ళ తడి మట్టి తెచ్చి ఇంటి పక్క సందులో కుండ పెంకులో దాచాను. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక తాతయ్య, నాన్న ఏదో పనుందని బయటికి వెళ్ళిపోయారు. అప్పటికే దాచి పెట్టుకున్న మెరుపు కాగితాలు జేబులో పెట్టుకుని సందులోకి పరిగెత్తాను.

రాళ్ళు లేకుండా మట్టి అంతా ముద్దగా కలుపుకుని, ఎన్ని బొంగరాలు చేయాలో ఆలోచించుకుంటూనే, మట్టి మిగిలితే కారు బొమ్మో, రైలు బొమ్మో చేయాలని కూడా ప్లాన్లేస్తున్నా. ఇంతలో నన్ను వెతుక్కుంటూ బామ్మొచ్చేసింది. గుండెల్లో రాయి పడింది కానీ, నాన్న ఇంట్లో లేరని గుర్తొచ్చి హమ్మయ్య అనుకున్నా. అయితే, బామ్మ "మట్టితో ఆడుతున్నావా? మీ నాన్నకి చెబుతానుండు.." అనకుండా "ఒక్కడివీ ఏం చేస్తున్నావు బాబూ?" అని అడిగింది ప్రేమగా.

బామ్మ కేకలేయక పోవడం కొత్తగా అనిపించింది. "బొంగరాలు చేసుకుంటున్నాను.. నీక్కూడా ఒకటి ఇస్తాలే" అని హామీ ఇచ్చాను. బామ్మ అస్సలు సంతోషించకుండా "నా పనిప్పుడు బొంగరాలు ఆడేలాగే ఉంది.. అసలే శాయమ్మని రమ్మని కబురెట్టాను" అంది. "పర్లేదులే బామ్మా.. శాయమ్మ గారికి కూడా బొంగరం చేసిస్తాను.. బోల్డంత మట్టి తెచ్చాను కదా" అన్నాను. అయినా కూడా బామ్మ సంతోష పడలేదు. "శాయమ్మని కత్తిపీట పట్టుకురమ్మని చెప్పేశాను.. మీ తాతా, నాన్నా ఇద్దరికిద్దరే.. చెప్పింది చేయరు. మళ్ళీ అడిగితే కోపాలు" అంది.

నాకేంటో పొడుపు కథలా అనిపించింది. తనే చెబుతుందిలే అని నా పనిలో నేనున్నాను. మట్టి ఆరిపోతే బొంగరాలు సరిగ్గా రావు మరి. "కాఫీలు తాగేసి పని మొదలు పెట్టాలి.. ఓమాటు చెయ్యి కడుక్కుని వస్తావా?" అని అడిగింది ప్రేమగా.. నాతో ఏదో పని ఉందని అర్ధమయ్యింది. "అవును బామ్మా.. కాఫీ తాగితే ఎంత బాగుంటుందో" అన్నాన్నేను. నాకు కావాల్సింది నేరుగా అడిగే అలవాటు లేదప్పుడు. మామూలప్పుడు కాఫీ అడిగితే "మీ నాన్నకి చెబుతా" అని బెదిరించే బామ్మ, ఆ పూట "మా నాయినే.. అదేవన్నా బంగారవా? పలకల గ్లాసుతో ఇస్తాను, రా" అంది, మళ్ళీ ప్రేమగా. పలకల గ్లాసంటే పెద్ద గ్లాసన్న మాట.

నేను ఊదుకుంటూ కాఫీ తాగుతున్నానా.. అప్పుడు విప్పింది బామ్మ పొడుపు కథని. "బూడిద గుమ్మడికాయలకి నాటెట్టి వెళ్ళమంటే మీ తాతకీ, నాన్నకీ చెయ్యి ఖాళీ లేకపోయింది. ఇంట్లో మగ పిల్లాడివి ఉన్నావు కాబట్టి సరిపోయింది. లేకపొతే ఎవర్నన్నా బతిమాలుకోవాల్సి వచ్చేది.." ఇదన్న మాట సంగతి.. "వడియాలు పెడుతున్నారా? కారం లేకుండా వడియం అట్టు కాల్చుకుంటే ఎంత బాగుంటుందో.." అన్నాన్నేను, తగు మాత్రంగా లొట్టలేస్తూ. నిజానికి నాకు 'ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి' అన్న సామెత అప్పటికి తెలీదు. అయినా అన్నీ తెలిసే చేస్తామా ఏంటి?

"ఓస్.. అంతే కదా.. మీ అమ్మకి చెబుతానుండు, కారం కలపకుండా పిండి తియ్యమని.. రేపు మధ్యాహ్నం అన్నంలోకి నీకు అట్టు కాల్చి పెడతాను..సరేనా?" హామీ ఇచ్చేసింది బామ్మ. కాఫీలయిపోయాయి కదా, ఇప్పుడు బామ్మ పని మిగిలింది. పెరట్లో తులసి కోట చుట్టూ పెద్దవీ, చిన్నవీ కలిపి ఓ డజను బూడిద గుమ్మడి కాయలున్నాయి. దేవుడికి కొబ్బరికాయ కొట్టుకునే కత్తి పట్టుకొచ్చింది బామ్మ. ఆ కత్తితో బామ్మ పర్యవేక్షణలో ఒక్కో కాయ మీదా నాటు పెట్టాన్నేను, కత్తి బరువనీ, చెయ్యి నొప్పనీ హడావిడి చేసి..

నా పని పూర్తవుతూనే కత్తిపీటతో శాయమ్మ గారు వచ్చేశారు. అది మొదలు అమ్మ, బామ్మ, శాయమ్మ గారూ ఆ గుమ్మడికాయలు ఒక్కోటీ ముక్కలుగా తరగడం. నా బొంగరాల పని పెరట్లోకి మార్చేశాను, వాళ్లకి కొంచం సాయంగా ఉంటుందని. సాయంత్రానికి తరగడం పూర్తయ్యింది. ఓ చీరలో ముక్కలన్నీ వేసి, రాళ్లుప్పు జల్లి, మీరయ్య పట్టుకెళ్ళే బట్టల మూటంత పెద్ద మూట కట్టి, ఆ మూటని పెద్ద పీట మీద పెట్టారు. ఆ తర్వాత వాళ్ళు ముగ్గురూ కలిసి కుంది రోలు సాయం పట్టి ఆ మూట మీద పెట్టేశారు.

మర్నాడు పొద్దున్నే అమ్మ మినప్పప్పు, పచ్చి మిరపకాయలు విడిగా రుబ్బేసిందా? తర్వాత నాకోసం కారం కలపకుండా విడిగా కొంచం పిండి ఉంచి, మిగిలిన పిండిలో కారం కలిపేసింది. రాత్రంతా మూట లోనుంచి నీళ్ళు కారిపోడంతో అంత పెద్ద మూటా చిన్నదైపోయింది. గుమ్మడి ముక్కల్లో కారంపిండి కలిపేసి అమ్మా, బామ్మా కలిసి వడియాలు పెట్టేశారు. మధ్యాహ్నాలు ఇంట్లో అందరూ పడుకున్నప్పుడు వడియాలు కాకులెత్తుకు పోకుండా కాపలా కాసే పనీ, రోజూ సాయంత్రం వడియాలు లేక్కెట్టే పనీ నామీదే పడ్డాయి.

నాలుగోరోజుకి ఫెళఫెళ్ళాడుతూ ఎండిపోయాయి వడియాలు. ఆవేళ మధ్యాహ్నం భోజనంలోకి వేగించింది బామ్మ. తాతయ్య, నాన్న, నేనూ భోజనాలు చేస్తున్నాం. "బాగున్నాయ్ వడియాలు.. ఇంకో రెండు ఎండలు ఎండితే నిలవుంటాయ్" అన్నారు తాతయ్య. "రెక్కలు ముక్కలైపోయాయ్.. శాయమ్మ కూడా సాయం వచ్చింది కాబట్టి సరిపోయింది.. కాస్త పనా, కూస్త పనా.. రాక్షస చాకిరీ," అంది బామ్మ, నేను కూడా కష్టపడ్డా ఆ విషయం అస్సలు చెప్పకుండా. నాక్కోపం వచ్చేసింది.

నాన్నున్నారనైనా చూడకుండా, "చూడు తాతా.. మొన్న నేను కష్టపడి నాట్లు పెట్టాను కాబట్టి పెట్టారు వడియాలు. ఆవిషయం అస్సలు చెప్పడం లేదు," అని కంప్లైంట్ చేసేశాను. "నువ్వూ, నేనూ ఎంత చేసినా మీ బామ్మకి కనిపించదు లేరా.. ఆవిణ్ణి మెప్పించడం మన వల్ల కాదులే.." అన్నారు తాతయ్య. బామ్మ నా బొంగరాల విషయం నాన్నకి చెప్పేస్తుందేమో అని భయ పడ్డాను కానీ, మర్చిపోయినట్టుంది.. నావైపు కోపంగా చూసి ఊరుకుంది, అంతే..

32 వ్యాఖ్యలు:

మైత్రేయి చెప్పారు...

చాలా బాగుందండి.
మీకు గుర్తు ఎక్కువా? అప్పటి విషయాలు రాసి పెట్టుకొన్నారా? :) మీరు ఇప్పుడు ఏడు, ఎనిమిది ఏళ్ళ పిల్లాడా అన్నట్లు రాస్తున్నారు.
మా అబ్బాయి వాళ్ళ బామ్మ దగ్గర ఇప్పుడు ఇలాగే గారాలు పోతుంటాడు.

spicy చెప్పారు...

bavundandi..motham kallaku kattinatlu undi...chaduthunanthasepu nene mi place unatlu ma ammamma vallu mi bammagari place unatlu uha vachindi

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ చెప్పారు...

చిన్నప్పుడెప్పుడో తిన్నా. మళ్లీ మీరు చెప్తే గుర్తుకు వచ్చాయి. ఈ సారి ఇంటికి వెళ్ళినప్పుడు చేయించుకుని తినాలి.

నీహారిక చెప్పారు...

వడియాలు తెలుసు,అట్టు సంగతేమిటి? ఎపుడూ వినలేదు.

మధురవాణి చెప్పారు...

భలే బాగున్నాయండీ.. మీ మట్టి బొంగరాల జ్ఞాపకాలూ, వడియాల జ్ఞాపకాలూ కూడా.
ఈ వడియాల ప్రాసెస్ అంతా నాకు తెలీనే తెలీదు. మామూలు పిండి వడియాలు మాత్రమే తెలుసు నాకు. నేనెప్పుడూ మీరు చెప్పే గుమ్మడికాయ వడియాలు తినలేదు :-(
అసలు మీ పోస్టు చదవడానికొచ్చినోళ్లందరికీ ఓ కారం లేని వడియపు అట్టు సమర్పించుకోవాలండీ మీరు.. తెలిసిందా ;-) ;-)

తృష్ణ చెప్పారు...

వడియాల గురించి నేను పది రోజుల క్రితమే ఒక టపా మనసులో రాసేసుకున్నానండి...బ్లాగ్లో రాసే ఓపిక వచ్చాకా రాద్దాం అనుకుంటున్నా ఈలోగా మీ టపా చూసా ఇప్పుడే...:)
వడియాలు పెట్టిన అమ్మ,నాన్నమ్మ ల సంగతి పక్కన పెడితే,
వడియాల మీద పీ.హెచ్.డి నే చేసానండోయ్ నేను...బూడిదగుమ్మడి వడియాలు నా ఫేవోరెట్లు...ఒక బూడిదగుమ్మడి పాదునే పెంచాను ఒక టైమ్లో...ఆ వేసంకాలం బోలేడుమందికి నేనే పంచాను బోలెడు బూడిద గుమ్మడికాయలు...
ఇక వడియాల సంగతికొస్తే గుమ్మడి వడియాలు, మినప పొట్టు వడియాలు,ఉల్లిపాయ వడియాలు,రేగు వడియాలు, పిండి వడియాలు..మొదలైన చాలా రకాలు పెట్టేదాన్ని.ఇప్పటికి కొన్ని పెడుతుంటాను... కాకర,బెండ,దొండ వరుగులు అయితే ప్రతి ఏడు తప్పనిసరిగా పెడతాను..!!

పరిమళం చెప్పారు...

మా కజిన్ ఒక మురళి ఉన్నాడు ...ఉగాదిరోజే నేనూ , తనూ బంకమట్టి బొంగారాలగురించి దానిపై గుచ్చే రెండు రంగుల పూలరెక్కల గురించి....అగ్గిపెట్టేలోంచి పుల్లలు ఎవరూచూడకుండా తెచ్చుకోవడం....అన్నీ గుర్తు చేసుకున్నాం ! మీరుగాని వాడికి ఫ్రెండ్ కాదుకదా :)
బామ్మగారి పుణ్యమాని మాక్కూడా వడియాలు పెట్టె విధానం తెలిసిపోయింది సరిగ్గా వేసవి వచ్చేసరికి ఈటపా భలే రాసేరండీ..

భావన చెప్పారు...

నాది సగమ్ మైత్రేయి సగం మధురవాణి కామెంట్. అసలు ఎలా గుర్తు మీక ఇంత. రెండోది ఆ... ఆఅ..మాకుఆట్టు కావాలి. బలే వుందండి.
"నిజానికి నాకు 'ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి' అన్న సామెత అప్పటికి తెలీదు. అయినా అన్నీ తెలిసే చేస్తామా ఏంటి?" సూపరండీ. చిన్ని మురళి ను చూస్తుంటే (మరి కళ్ళకు కట్టీనట్లు రాసేరు కదా) మా అబ్బాయి చిన్నప్పుడు గుర్తు వచ్చింది, వాడు తెలియకుండానే సామెత, కాస్త ముద్దు చేయగానే కోరిక ల చిట్టా విప్పే వాడూ మరి. :-)

చిన్ని చెప్పారు...

ప్రతి వాక్యం కళ్ళకి కట్టినట్లు బుజ్జి మురళి కళ్ళల్లో కనబడ్డాడు .పెద్దగోప్పగా బామ్మకి బొంగరం ఆఫర్ చేయడమా -:):)ఎంత బాగా రాస్తున్నారో మీ జ్ఞాపకాలు అదేమీ బుర్రండి బాబు కంప్యుటర్ అనుకోవచ్చా ,మీ మెమోరీస్ మాత్రం సూపర్బ్ .

నిషిగంధ చెప్పారు...

అదేదో సినిమాలో మహేష్ బాబులా మీరు మీ 'జ్ఞాపకాల' టపాలు రాసేప్పుడు బుజ్జి మురళిలా మారిపోతారనిపిస్తుందండీ!!

ఈ 'వడియాలు'కి నాకెంతో ఇష్టమైన 'పోలిస్వర్గం' పక్కనే పెద్దపీట వేశేశాను :-)

టపా మొదలుపెట్టడమే భలే ఉందండీ.. అయితే బొంగరాలు మట్టితో కూడా చేస్తారా? నాకు తెల్సినవి చెక్కతో చేసేవే.. ఇంకో డౌటు.. నాట్లు పెట్టడమంటే?

"నాకేంటో పొడుపు కథలా అనిపించింది. తనే చెబుతుందిలే అని నా పనిలో నేనున్నాను. మట్టి ఆరిపోతే బొంగరాలు సరిగ్గా రావు మరి."
ఇక్కడైతే నవ్వాగలేదు :-)

మా ఇంట్లో ప్రతి సంవత్సరమూ పట్టేవాళ్ళం గుమ్మడికాయ వడియాలు.. మా అమ్మ స్నేహితురాలు ఇచ్చేవారు గుమ్మడికాయల్ని.. కాస్త చేదుతగిలేదేమో నాకంత నచ్చేవి కాదు :(

swapna@kalalaprapancham చెప్పారు...

maaku kuda kavali attu vadiyalu. nenu epudu vinane ledu ee attu vadiyalu.

Sravya Vattikuti చెప్పారు...

భలే బాగున్నాయండీ మురళి గారు వడియాల జ్ఞాపకాలూ ! భానుమతి గారి అత్త గారి లాగ మీ బామ్మ గారు కూడా మాకందరికీ గుర్తుండిపోతారు .

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

చాలా బాగుంది మురళి గారు. చక్కగా గుర్తుంచుకుని చాలా విపులంగా రాస్తున్నారు. నిజమే మీ ఈ ఙ్ఞాపకాలన్నిటినీ ఒక పుస్తకమేసేయోచ్చేమో ఆలోచించండి. చక్కని కధలవుతాయి, అద్భుతమైన ఆదరణ పొందుతాయి.

Vasu చెప్పారు...

బావుంది. పల్లెటూరి మట్టి వాసనలు, జ్ఞాపకాల సువాసనలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి (గుప్పుమని గుభాలిస్తాయి) మీ టపాలలో. ఇలా వడియాలు పెట్టడం అవీ ఒక పది పదిహేనేళ్ళ కింద ఐతే నగరాల్లో కూడా కనపడేది ఏమో. ఇప్పుడైతే భూతద్దం తో వెతికినా కనపడవు. ఇక తరువాతి తరం వాళ్ళు వడియాలా .. అవేంటి.. బూడిద గుమ్మడి కాయా.. అదెలా ఉంటుంది.. అంటారేమో..
మీరు వారానికి ఒకటి రెండు సార్లు మీ టపాలతో నా (మా) హృదయాంతరాలల్లో నిదిరుస్తున్న మధుర స్మృతులని తట్టి మేల్కొలుపుతున్నారు. నెనర్లు

anagha చెప్పారు...

ఎంత బాగా రాసేరో !చిన్ననాటి తీపి గుర్తులు బాగున్నాయి . గుమ్మడి వడియాల టేస్ట్ నాకు నచ్చేది కాదు ,మరి ఎందుకు అమ్మ కష్టపడి పడుతుంది అనుకునేదాన్ని .గుమ్మడి ముక్కలు మూటకట్టి తిరగలి రాయి పెట్టేవాళ్ళు ....ఎందుకో నాకు అర్ధమైయ్యేది కాదు ,ఎందుకు అని అమ్మని అడిగితె ?అంతేలే నీరు ఉండకూడదు అని చెప్పేది. నేను,వడియాలు పట్టేటప్పుడు హెల్ప్ చెయ్యాలని చూసేదాన్ని ,కానీ అమ్మ రానిచ్చేది కాదు. మీరు చెప్పిన ' అట్టు' అర్ధమవలేదు ?

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

బుల్లి మురళికి వ్యాక్య :
ముందుగా బుల్లి మురళికి బుగ్గ మీద నా ముద్దులు...ఇదిగో మురళి, మొన్న నా దగ్గర రెండు సోడా గోళీలు తీసుకుని మీ ఇంట్లో కారం లేని కాల్చిన వడియం ఇస్తానన్నావు కదా..ఏది..

ఇప్పుడు అసలైన వ్యాక్య పెద్ద మురళి గారికి...:-)
మా ఇంట్లో కూడా ఈ బూడిద గుమ్మడి వడియాలు పెడతారు...నాకు చాలా ఇష్టం...

స్ఫురిత చెప్పారు...

వడియాలు అని చూసి ఇటు వచ్చాను..ఇప్పుడు వడియాల అట్టు గుర్తు చేసారు...ఇక్కడ అరిచి గీ పెట్టినా దొరకదు...:(

మాలా కుమార్ చెప్పారు...

మీ వడియాల ప్రహసనం బాగుందండి .
అవునూ , మీరు , మీవి , మీ బామ్మవి విషయాలు చెబుతున్నారా ? లేక నావీ , నా మనవడి విషయాలు చెబుతున్నారా ????
మమ్మలిని దొంగ చాటుగా చూస్తున్నారా ???? అని అనుమాన మస్తుందండోయ్ .

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

నా బొంగరాలు దొబ్బేసారు,గుమ్మడొడియాలు,అట్టూ కూడా దొబ్బేసారు,ఊఊఊఊ ఇంకా ఇంకా చాలా చాలా దొబ్బేసారు మీ జట్టు పచ్చి అంతే(మళ్ళీ ఇంకో పోస్టు రాసేవరకూ మాత్రమే)...

శిశిర చెప్పారు...

అసలీ నాట్లు పెట్టడం దగ్గరే మొదలవుతూందండి వివక్ష.. :) చిన్న చిన్నగా నాట్లు పెట్టేది తమ్ముడు, ఆ తరువాత తరగడంలో సహాయం దగ్గర నుండి, వడియాలు ఎండే వరకూ పడే పాట్లేమో మేమూనూ.. :(
వాణ్ణి వెదికి పట్టుకుని బ్రతిమాలి మరీ నాట్లు పెట్టించడం(మేమే పెట్టేస్తాం మొర్రో అని అరచి గోలెట్టేస్తున్నా వినిపించుకోకుండా,అక్కడికి వాడేదో పేద్ద హీరో అయినట్టు), తరువాత పనంతా మాచేత చేయించడమూను. :(

మొన్నటికి మొన్న, తమ్ముడు బయల్దేరే రోజు బూడిద గుమ్మడికాయలు నాట్లు పెట్టించాలి, గుర్తుచేయండే అని చెప్పి మరీ వాడి చేత నాట్లు పెట్టించింది అమ్మ. వడియాలు ఎండుతున్నాయి. వాడికి ఒక్కటి కూడా పెట్టనంతే. :)
చాలా బాగుందండీ మీ టపా.. ఇంతకీ ఈ నాట్లు అబ్బాయిలే ఎందుక పెట్టాలో మీకు తెలుసా మురళీ గారు?

అజ్ఞాత చెప్పారు...

నాకు తెల్సిపోయిందిలెండి
గత మూడు రోజులుగా మిసెస్ మురళీ పెట్టిన వడియాలకు కాపలా కాస్తుంటే కదూ,మీకు ఈ జ్ఞాపకాలన్నీ తన్నుకొచ్చాయి ( మురళీ లు అబద్ధాలు చెప్పరు)
ఎవరు తిన్నా తినకపోయినా అలవాటు ప్రకారం ప్రతీ సంవత్సరం వడియాలు మేమూ పెట్టేస్తుంటాం
అమావాస్య వచ్చేస్తుంది అంటూ హడావిడి చేసి మరీ పెట్టించేస్తారు మా అత్తగారు .
@శిశిర : వడియాల కోసమే కాదు , దప్పళం కోసం గుమ్మిడికాయ పగలకొట్టాలన్నా మగ ప్రాణికోసం నెతికేస్తారు . ఇందులో ఏదో పరమార్ధం వుండేవుంటుంది .

ప్రణీత స్వాతి చెప్పారు...

నాకూ చాలా ఇష్టమండీ గుమ్మడి వడియాలు. కాకపోతే ఎలా చేస్తారో మాత్రం తెలిదు. అమ్మ, బామ్మా, అమ్మమ్మ మమ్మల్ని రానిచ్చేవారు కాదుగా అందుకని.

ఇకపోతే నాకూ చిన్న సందేహాలు..బొంగరాలు చెక్కవే తెలుసు, మట్టి తో కూడా చేస్తారా...ఆడేందుకు వీలుగా ఉంటాయా అవి?

నాట్లు పెట్టడం అంటే ఏంటి..? తాతగారూ, నాన్నగారూ ఇంట్లో లేక పోతే బామ్మగారూ , అమ్మగారూ పెట్టచ్చు కదా మీ చేతే ఎందుకు పెట్టించారు..?

మురళి చెప్పారు...

@మైత్రేయి: ఒక జ్ఞాపకం గురించి రాస్తుంటే మరి కొన్ని గుర్తొస్తున్నాయండీ.. అలా రాసేస్తున్నాను.. ధన్యవాదాలు.
@spicy: ధన్యవాదాలండీ..
@లక్ష్మీనారాయణ సునీల్ వైద్య భూషణ్: అవునా.. రుచి చూడండి అయితే.. ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@నీహారిక: వడియాల పిండినే అట్టుగా కాలుస్తారండీ.. ఈ అలవాటు గోదారి జిల్లాల్లోనే ఎక్కువ అనుకుంటా.. ధన్యవాదాలు.
@మధురవాణి: తప్పకుండానండీ.. బూడిద గుమ్మడికాయలు ఎక్కడ సంపాదించాలా? అన్నదే సమస్య.. ధన్యవాదాలు.
@తృష్ణ: హమ్మో.. మీరు వదియాల్లో ఎక్స్పర్ట్ అనుకుంటానండీ.. బూడిద గుమ్మడి పాదుని నేనూ పెంచానండీ, చిన్నప్పుడు.. ఆనప్పాదు, బీర పాదూ కూడా.. :) ..ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@పరిమళం: నా సర్కిల్లోనూ మురళీ లు ఉన్నారు కానీ, ఈ మధ్య ఎవరితోనూ బొంగరాల గురించి మాట్లాడ లేదండీ.. నా టపా చదివి వడియాలు పెడతారా?? మీ ఇంట్లో నా గురించి చెప్పొద్దండీ.. :):) ..ధన్యవాదాలు.
@భావన: చిన్న పిల్లలు అందరూ అంటే అనుకుంటానండీ.. నేను ఒక జ్ఞాపకం నుంచి మరో దానికి 'కోతి కొమ్మచ్చి ' ఆడుతున్నానండీ, నాకు తెలియకుండానే అలా అలా గుర్తొచ్చేస్తున్నాయి.. ధన్యవాదాలు.
@చిన్ని: అదేమిటండీ.. మన ఫ్రెండ్స్ వస్తే ఆఫర్ చేయమూ.. అలాగే.. :-) :-) ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@నిషిగంధ: అవునండీ, బొంగరాలు మట్టితో కూడా చేస్తారు.. అర్ధరూపాయ కాసంత మట్టి బిళ్ళ చేసి దాని మధ్యలో అగ్గి పుల్ల సైజులో ఉన్న పుల్ల గుచ్చితే బొంగరం రెడీ.. ములుకు సూదిలా ఉంటె బొంగరం బాగా తిరుగుతుంది. మెరుపు కాగితం అతికిస్తే చక్కగా మెరుస్తుంది. నాట్లు పెట్టడం అంటే గుమ్మడి కాయని కత్తి తో గుచ్చడం అన్న మాట.. ఆడవాళ్ళు గుమ్మడికాయ పగలగొట్ట కూడదు లాంటి సెంటిమెంట్ ఏదో ఉందండీ.. ధన్యవాదాలు.
@స్వప్న: పల్లెటూళ్ళలో పెరిగిన వాళ్లకి బాగా తెలుస్తాయండీ.. సిటీ వాళ్లకి కొత్తగా అనిపిస్తుంది.. ధన్యవాదాలు.
@శ్రావ్య వట్టికూటి: అంతేనంటారా? :-) ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలండీ..
@వాసు: నిజమేనండీ.. ఇప్పుడే చాలామందికి వడియాలు తెలీదు.. షాపుల్లో దొరకడం వచ్చాక ఇళ్ళలో అస్సలు చేయడం లేదు.. ధన్యవాదాలు.
@అనఘ: గుమ్మడి ముక్కల్లో నీళ్ళు ఉంటే పిండి కలపగానే వడియాల షేప్ రాదండీ.. పైగా ఎండడానికి చాలా టైం పడుతుంది.. అందుకే రాయి.. వడియం పిండి తోనే అట్టు వేసే వాళ్ళు, అన్నంలో తినే వాళ్ళం.. బాగుండేది.. ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@శేఖర్ పెద్దగోపు: #బుల్లి మురళి: మలీ.. నువ్విచ్చిన గోలీలు నాన్న లాగేచుకున్నాలు.. కొత్తాలు కూలా.. నీకోచం ఒలియం తెత్తుంటే కాకి తన్నుకుపోయింది తెలుచా :(
#భవదీయుడు మురళి: మీ ఇంట్లో తెలగ పిండి వడియాలు కూడా పెడతారని ఓసారి చెప్పారు, నాకు గుర్తుంది.. ప్రాసెస్ చెబుతారని ఎదురు చూస్తున్నానండీ.. ధన్యవాదాలు.
@స్ఫురిత: మీకే కాదండీ, నాకూ దొరకదు అట్టు :( ..ధన్యవాదాలు.
@మాలాకుమార్: మీరూ మా బామ్మ లాగే అన్నమాట.. అయితే మీ కాఫీ తాగాల్సిందే :-) ..ధన్యవాదాలండీ..

మురళి చెప్పారు...

@శ్రీనివాస్ పప్పు: అయితే మీకూ అనుభవమే అన్నమాట!! ..ధన్యవాదాలండీ..
@శిశిర: ఈ నాట్లు పెట్టడం అన్నది మగవాళ్ళ ప్రివిలేజ్ అండీ.. ఎందుకో నాకూ తెలీదు :( ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోందన్న మాట!! ..ధన్యవాదాలండీ..
@లలిత: మొన్న పండక్కి ఊరెళ్ళినప్పుడు గుమ్మాల్లో ఎండ బెట్టిన వడియాలు చూడగానే అలా అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోయానండీ.. కట్ చేస్తే ఈ టపా.. మీ ఊహ మాత్రం చాలా అందంగా ఉందండీ.. నిజమైతే నేను అట్టు కూడా తినొచ్చు.. ఇందుకోసం షాపుల్లో వడియాలు అమ్మడాన్ని నిషేధించాలి ముందు. ధన్యవాదాలు.
@ప్రణీత స్వాతి: మట్టి బొంగరాలు ఒకటి రెండు రోజులు ఆడడానికి పనికొస్తాయండీ.. తర్వాత పెళుసెక్కి పోతాయి.. నాటు గురించి పైన రాశాను చూడండి.. ధన్యవాదాలు.

పరిమళం చెప్పారు...

ఆల్రెడీ కమిటైపోయానండీ ....సొంతగూటికి మారబోతున్నాం...అపార్ట్మెంట్ పైన వడియాలు పెట్టేస్తానని ! మరి మీ బామ్మగారి ఇన్స్పిరేషనే ! కాకపొతే ఒకటే గుమ్మడికాయతో ....ఫస్ట్ టైం కదా :) మీ బ్లాగ్ గురించి చెప్పనులెండి బాగా వస్తే క్రెడిట్ అంతా మీకొచ్చేస్తేనో ? వడియాలు వేపాక ఆలోచిస్తా చెప్పాలా వద్దా అని :) :)

అనిత.... చెప్పారు...

"అవును బామ్మా.. కాఫీ తాగితే ఎంత బాగుంటుందో" అన్నాన్నేను. నాకు కావాల్సింది నేరుగా అడిగే అలవాటు లేదప్పుడు.... హ హ హ హ

మురళి చెప్పారు...

@పరిమళం: అంతేనంటారా??!!
@అనిత: ధన్యవాదాలండీ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి