"ఈయనెవరో తాపీ ధర్మారావు గారి అభిమాని అనుకుంటా.." ఈ సంవత్సరం మొదట్లో 'కొత్తపాళీ' బ్లాగు మొదటి సారి చూసినప్పుడు ఆ బ్లాగర్ గురించి నాకు అనిపించిందిది. తాపీ వారి రచనల్లో 'కొత్తపాళీ' ఒకటి. అప్పట్లో బ్లాగు లోకంలో దాదాపు ప్రతిరోజూ ప్రముఖంగా కనిపించిన పేర్లలో 'కొత్తపాళీ' ఒకటి.. ఆరకంగా బ్లాగులు చదివే తొలి రోజుల్లోనే కొత్తపాళీ గారి బ్లాగుతో పరిచయమయ్యింది. చాలా బ్లాగుల్లో ఆయన వ్యాఖ్యలు కనిపించేవి.. అభిప్రాయాలు, సలహాలు, సూచనలు.. ఇలా..
బ్లాగుల్లో మాత్రమే కాకుండా 'నవతరంగం' వ్యాఖ్యల్లోనూ అప్పుడప్పుడూ ఈ పేరు కనిపించేది. అడపా దడపా వ్యాసాలూ వచ్చేవి. 'కొత్తపాళీ' బ్లాగులో నేను చదివిన మొదటి టపా నాకు బాగా జ్ఞాపకం.. 'చిగిర్చే చెట్టు' ఆ టపా పేరు. అప్పుడే బ్లాగుల్లోకి వచ్చిన నాకు ఇక్కడి పోకడలు అర్ధం చేసుకోడానికి ఎంతగానో సాయపడిన టపా అది. బ్లాగర్లకి రాడానికి అవకాశం ఉన్న ఇబ్బందులు, వాటిని ఎదుర్కోవలసిన పద్ధతులు ఇవన్నీ తెలుసుకోగలిగాను.
వేదం, వేదాంత సారం మొదలు ,రాజకీయాలు సైన్సు సంగతుల వరకు, తెలుగు కథ మొదలు ప్రపంచ సాహిత్యం వరకు, శాస్త్రీయ సంగీతం, భరత నాట్యం మొదలు నుంచి జాజ్, రాక డేన్స్ వరకు, పాత సినిమాల నుంచి నేటి సినిమాల వరకూ...ప్రతి అంశం మీదా దాదాపు సాధికారంగా మాట్లాడగల వ్యక్తి రాసే బ్లాగులో ఆయా అంశాలన్నింటి గురించీ ప్రస్తావనలు ఉండడం సహజమైన విషయమే కదా. కేవలం తెలుగు సినిమాల గురించే కాదు విదేశీ సినిమాల కబుర్లూ చదవొచ్చు ఇక్కడ. పేరడీ రాసినా, సమీక్ష రాసినా, విమర్శ రాసినా 'సమగ్రత' మిస్సవకుండా చూస్తారన్నది నా చిన్న పరిశీలన.
ఏ అంశాన్ని ఎన్నుకున్నా, ఆ సబ్జక్టు గురించి ఏమాత్రం అవగాహన లేని వాళ్లకి సైతం అర్ధమయ్యేలా రాయడం బ్లాగర్ కొత్తపాళీ గారి ప్రత్యేకత. బాపట్ల జ్ఞాపకాలు, ఆటవా విశేషాలు లాంటి సరదా విషయాలు మొదలు, 'గట్టు తెగిన చెరువు' లాంటి సీరియస్ కథల పుస్తకం మీద సమీక్ష వరకూ అందరిచేతా చదివించేలా రాయడం అంత ఆషామాషీ విషయం ఏమీ కాదు. కథ రాయమని బ్లాగర్లని ప్రోత్సహించడం మొదలు వారం వారం కబుర్లు చెప్పడం వరకూ బ్లాగులో ఆయన చేసిన ప్రయోగాలు అనేకం. కొత్త టపాలతో పాటు పాత ముత్యాలూ దొరుకుతాయి ఈ బ్లాగులో.
కొత్తపాళీ గారి అసలు పేరు నారాయణ స్వామి అనీ, అమెరికా లో ఉంటారనీ, అక్కడ కొందరు ఆయన్ని 'నాసీ' అని పిలుస్తారానీ కాలక్రమంలో తెలిసింది. 'బ్లాగులందు తెలుగు బ్లాగులు మేలయా' అన్నది కొత్తపాళీ బ్లాగు ట్యాగ్ లైన్. తను గురించి తను చెప్పుకున్నది ఒకటే వాక్యం 'రాయాలని ఆశ..' అందుకేనేమో పాఠకులకి ఈ బ్లాగు 'చదవాలని ఆశ' కలుగుతూ ఉంటుంది. కేలండర్ ప్రకారం కచ్చితంగా టపాలు రాయడం బ్లాగుల్లో అంతగా ఆచరణ సాధమైన విషయం కాకపోయినా, ప్రతి సోమ, గురు వారాల్లో కొత్త టపాలు వెలువరిస్తూ ఉంటారు కొత్తపాళీ, అప్పుడప్పుడూ మినహాయింపులు ఉన్నప్పటికీ.
ఆయన బ్లాగు ప్రొఫైల్ కొత్తపాళీ అక్టోబర్ 2006 నుంచి బ్లాగ్లోకం లో ఉన్నారని సూచిస్తోంది. అయితే 'కొత్తపాళీ' బ్లాగు మొదలయ్యింది ఫిబ్రవరి 2007 లో. ఈ బ్లాగర్ కి మరో మూడు బ్లాగులున్నాయి మరి. ఈ బ్లాగర్ కథారచయిత, కవి, సాహితీ, సిని విమర్శకుడు కూడా. జాల పత్రికల్లో ప్రచురితమైన ఆయన కథలు కొన్ని చదవ గలిగాను నేను. వాటిని పుస్తక రూపం లోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు వినికిడి. భాష మీద ఈయనకి ఎంత అభిమానం అంటే, బ్లాగుల్లో ఎక్కడైనా భాషా, వ్యాకరణ దోషాలు కనబడితే సరి చేయకుండా వదలరు. ఈ బ్లాగులో తరచూ కనిపించే 'కాల్చేసి' (కాల్ చేసి) అనే పదం మాత్రం ఎప్పుడూ కొంత అయోమయ పరుస్తూ ఉంటుంది నన్ను.
కొత్తబ్లాగర్లని ప్రోత్సహించడం, రాయడానికి బద్ధకిస్తున్న వాళ్లకి రాయమని గుర్తు చేయడం మాత్రమే కాదు, ఒక విషయం మీద భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు తను చెప్పింది మాత్రమే సరైనది అని కాకుండా ఎదుటి వాళ్ళ అభిప్రాయాలని గౌరవించే లక్షణం కూడా కొత్తపాళీ గారిని చాలా మంది బ్లాగర్లు 'గురువు గారు' అని పిలుచుకునేలా చేసిందన్నది నా అభిప్రాయం. పోలిక సరికాదేమో కానీ, ఎంకి గురించి నాయుడు బావ 'కన్నెత్తితే సాలు కనకాభిసేకాలు' అనుకున్నట్టుగా మన బ్లాగ్మిత్రులు చాలా మంది కొత్తపాళీ గారు 'కామెంటితే చాలు..' అని వ్యాఖ్యల్లో రాయడం చూశాన్నేను.
గత నెలలోనే పుట్టిన రోజు జరుపుకున్న కొత్తపాళీ గారికి (ఎన్నో పుట్టిన రోజని నన్నడగొద్దు.. ఆయన్నే అడగండి) బ్లాగ్లోకం తరపున మన కృష్ణపక్షం భావన గారు ఒక అందమైన కానుక ఇచ్చారు. నిజానికి ఆ కానుక బ్లాగు పాఠకుల కోసమే.. అది మరేమిటో కాదు..కొత్తపాళీ గారి టపాల సంకలనం. తీరిక చిక్కినప్పుడల్లా తిరగేయాల్సిన సంకలనం. కొత్తపాళీగారు సెలవులివ్వకుండా బ్లాగు రాయాలనీ, ఇతర కళా, సాహితీ ప్రక్రియలనీ కొనసాగించాలనీ కోరుకుంటున్నాను.