గురువారం, అక్టోబర్ 15, 2009

అనగనగా ఒక చేప

ఇంటి ఎదురుగా పెద్ద చెరువు.. చెరువు లోకి దిగడానికి రాళ్ళతో కట్టిన మెట్లు. ఆ మెట్ల మీద కాసేపు కూర్చుంటే చాలు.. నీళ్ళలో అటూ ఇటూ చురుగ్గా తిరిగే చేప పిల్లలెన్నో కంట పడతాయి.. అన్నీ బహు చిన్నవి.. పట్టుకుందామని ప్రయత్నిస్తే వేళ్ళ సందుల్లోనుంచి జారిపోయేవి.. నల్లవి, తెల్లవీ, మెరిసే కళ్ళవీ.. కాళ్ళు చల్లని నీళ్ళలో పెట్టి కదలకుండా కూర్చుంటే తాకి గిలిగింతలు పెట్టేవి చేప పిల్లలు. చేపలకి సంబంధించిన తొలి జ్ఞాపకాలివి. ఇంట్లో ఎవరిమీదైనా అలిగితే వెళ్లి కూర్చునేది చెరువు గట్టు మీదే.. పరిక్షలు వస్తే పుస్తకం పట్టుకుని చదువుకుంటూ కూర్చునేదీ ఆ చెరువు ఒడ్డునే.. రెండు సందర్భాలలోనూ తోడుండేవి చేప పిల్లలే..

పొడవాటి కర్ర.. ఆ కర్రకి చిరవ ఒక పొడవాటి దారం.. ఆ దారానికి చివర ఒక చిన్న ఇనుప కొక్కెం.. గాలం అంటారు దాన్ని. పక్కనే ఒక కొబ్బరి చిప్ప నిండా నల్ల మట్టి. దగ్గరికి వెళ్లి చూస్తే కనిపిస్తాయి ఆ మట్టిలో మెదిలే వాన పాములు.. 'ఎర' అంటారు వాటిని. పిల్లలకీ, పనిలేని పెద్దలకీ చెరువు గట్టు పెద్ద కాలక్షేపం.. ఎర ని కొక్కానికి గుచ్చి గాలం పట్టుకుని కూర్చుంటే కాసేపటికి గాలం బరువుగా ఒంగేది.. ఒడుపుగా వెనక్కి లాగితే కొక్కెం చివర చిన్నదో పెద్దదో చేప పిల్ల.. కొరమీనో, మట్టగడసో మరొకటో.. చిక్కిన చేపకి ఆయుష్షు ఉంటే పట్టిన వాడికి నచ్చేది కాదు.. చెరువులోకి విసిరేసే వాడు.

ఎందుకో తెలీదు కానీ గాలానికి చిక్కిన చేప మళ్ళీ చెరువులోకి వెళ్లిపోతుంటే భలే సంతోషంగా ఉండేది. తాటాకు బుట్టలో పడ్డ చేపల మీద జాలేసేది. ఈ గాలాలు కాకుండా ఏడాదికి ఒకసారి చెర్లో వేట జరిగేది. ఎక్కడి నుంచి వచ్చేవారో ఒక పది పదిహేను మంది జాలర్లు వంటికి నూనె రాసుకుని వలలతో చెర్లో దిగిపోయే వాళ్ళు. అది మొదలు రెండు రోజుల పాటు చెరువు అక్షరాలా రణక్షేత్రం అయిపోయేది. వేట ముగిసిన మరో నాలుగైదు రోజుల వరకూ ఆ నీళ్ళు ఇంట్లో వాడకానికి పనికొచ్చేవి కాదు.. అంతలా కలిగిపోయేవి.

చేపలే కాదు, చెర్లో కలువపూలనూ దుంపలతో సహా ఊడ్చేసేవాళ్ళు జాలర్లు. వేట జరిగిన రెండు రోజులూ ఊరంతటికీ చెరువు గట్టు ఒక యాత్రా స్థలి.. ఒక సంత.. ఎక్కడెక్కడి జనం వచ్చేసే వాళ్ళు.. కొందరు వేటలో దొరికిన చేపలని చూసి తృప్తి పడితే మరికొందరు కొసరి కొసరి బేరం చేసి తృప్తి పడే వాళ్ళు. పొరుగూరి వాళ్ళే అయినా కొనే వాళ్ళెవరో, కొన్ని వాళ్ళెవరో ఇట్టే తెలిసిపోయేది జాలర్లకి. వీధి అరుగు మీదకి వచ్చినా రేడియో గదిలో కూర్చున్నా, చివరికి పెరట్లో ఉన్నా బేరసారాలు చెవిన పడుతూనే ఉండేవి..

వేట జరిగిన మర్నాడు మరో కోలాహలం. చేపలు కొనుక్కునే తాహతు లేని వాళ్ళు ఆ చుట్టు పక్కలే తచ్చాడే వాళ్ళు.. పొరపాటున తప్పించుకున్న చేపలు ఏవైనా దొరుకుతాయన్న ఆశ. ఒకరిద్దరికి అలాగే దొరికేవి. వేట ముగిశాక రెండు మూడు నెలల వరకూ గాలాలు కనిపించేవి కాదు చెరువు గట్టున. గాలం వేసినా వృధానే కదా.. వేసవి కి ముందు చేపల వేట సాగేది. వర్షాకాలానికి చెరువు మళ్ళీ కొత్త చేపలతో కళకళ లాడేది. ఇంట్లో కొత్త తగువులు, అలకలు.. బళ్ళో కొత్త క్లాసు.. కొత్త పుస్తకాలు.. చదువుకోడానికి చెరువు గట్టుకి వెళ్తే చెర్లో కొత్త నేస్తాలు.. వాళ్ళని వేటాడే గాలాలు, వలలు.. మళ్ళీ అనగనగా నుంచీ మొదలయ్యే కథ.. ('జలపుష్పాభిషేకం' చేస్తున్న మరువం ఉష గారికి అభినందనలతో..)

16 కామెంట్‌లు:

  1. మొదటి వాక్యం చూడగానే అనుకున్నానండి..ఇదేదో.."అక్కడికే.." అని.....

    బాగుంది మీ చెరువు కధ..మీ చెరువులో కలువ పువ్వులు ఉండేవా?భలే!చెరువులోంచి కలువ పువ్వు ఒక్కటైనా కొయ్యాలని చిరకాల కోరిక నాకు.జీవితంలో తీరుతుందో లేదో మరి...

    రిప్లయితొలగించండి
  2. అఫ్సర్ గారి చిన్నప్పటి చెరువు పద్యం గుర్తొచ్చింది అప్రయత్నంగా.
    చాలా బాగా రాశారు.

    రిప్లయితొలగించండి
  3. చదువుతూ నేను కూడా ఆ చెరువు ఒడ్డు దగ్గరకు వెళ్ళిపోయానండీ....

    రిప్లయితొలగించండి
  4. :):) చాలా జ్ఞాపకాలను తట్టిలేపావు సోదరా!!!

    రిప్లయితొలగించండి
  5. భలే తీపి గుర్తులండి మీవి......

    రిప్లయితొలగించండి
  6. మా చెరువు చేపలు: మా చెరువు గట్టు న అవి వూసుపోని కాలానికి కోపమొచ్చిన క్షణాలకు, ఆలోచనల తరంగాలను పంచుకునేందుకు నాకో తోడు..
    ఆ పూట ఆధరువుకో లేక వేట మోజుకో కొందరికి ఆధారం,
    మరి వేసవి లో వేయి తలల కరాళ నృత్యం సాగించి వాటికోసం వాటి రుచి కోసం ప్రశాంతమైన కాసారాన్ని అతలా కుతలం చేసి
    మహా విష్ణువు ని ఆయన సతి పీఠాన్ని పెకిలించి,పెరికించి మా కోసం కేవలం మా స్వార్ధం కోసం మాత్రమే చూసే మా అందరికి... అవి ఏమవుతాయో మరి మేమవుతామో వాటికి ఏమో ఆ బేల చూపుల మత్స్యవతులే చెప్పాలి మరి...

    రిప్లయితొలగించండి
  7. నేనే చివరిదాన్ననుకున్నా ...నా వెనుక మీరూ ఉన్నారన్నమాట !బావుందండీ అనగనగా ...మురళి గారి చేపపిల్లల కధ !

    రిప్లయితొలగించండి
  8. మా వూరి కోవెల ఎదురుగా చెరువు ఉంది. ఇప్పుడు అందులో నీళ్ళు ఉన్నాయో లేవో కాని అప్పుడు మా సాయంత్రాలన్నీ అక్కడే గడిచేవి. కోవెల చుట్టుపక్కల అడుగు లోతులో ఇసుక ఉండేది. చిన్నప్పుడు మా ఆటలన్నీ అక్కడే. ఆ చెరువు నింపడానికి మా వూరి కాలువనుండి పైపులైను ఉండేది. అలాగే చెరువు ఖాళీ చేయడానికి గోదావరికి ఇంకో పైపులైను ఉండేది. చెరువు ఖాళీ చేసినపుడు కొంతమంది వచ్చి అందులోని చేపలు, పాములు మొదలైనవి అక్కడే కోసుకుని పట్టుపోయేవారు. ఆ చెరువులోనే తెప్పోత్సవం జరిగేది.

    రిప్లయితొలగించండి
  9. @తృష్ణ: ఎర్ర కలువలు ఉండేవండీ.. మా పక్కూరి చెరువులో తామరపూలు ఉండేవి.. మరీ తీరని కోరికేమీ కాదండీ.. ఆల్ ది బెస్ట్.. ధన్యవాదాలు.
    @కొత్తపాళీ: అవునా.. నేను చదవలేదండీ ఆ కవిత.. ధన్యవాదాలు.
    @శేఖర్ పెద్దగోపు: ఏటిగట్టు నుంచి చెరువు గట్టుకి.... ..ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  10. @భాస్కర్ రామరాజు: ధన్యవాదాలు.
    @పద్మార్పిత: ధన్యవాదాలు.
    @భావన; మత్స్యవతులు మాట్లాడలేవు కదండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. @పరిమళం: మీరందరూ రాసినవి చదివాక నాకు గుర్తొచ్చినవి రాసుకున్నానండీ.. ధన్యవాదాలు.
    @బోనగిరి: పాములు కోయడం నేనూ చూశానండి.. బాగున్నాయి మీ ఊరి జ్ఞాపకాలు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. చెరువులో తామరపూలు చిన్ని చేపలు కళ్ళకి కనబడుతున్నాయండీ .....చాల బాగున్నాయి జ్ఞాపకాలు

    రిప్లయితొలగించండి
  13. Don't publish the previous comment
    మీ జ్ఞాపకాలు భలే ఉంటాయండి. పైగా వాటి గురించి మీరు చాలా బాగా వ్రాస్తారు.

    రిప్లయితొలగించండి
  14. మురళి గారు, ముందుగా నా కృతజ్ఞతలు. నా సంకలనంలోకి ఈ కథ ని అందించినందుకు.

    చక్కని ఫ్లో, అలా అలా ప్రతి ఘట్టంలోకి తీసుకెళ్ళిపోయారు.

    నాకు వాన పాములంటే చాలా వెరపు, ఇప్పటికీ గార్డెనింగ్ చేసేప్పుడు కనపడితే ఆకాశం అందేవరకు గెంతుతాను. కనుక అలా గేలాలేసి మా తామర చెరువులో చేపలు పట్టలేదు కానీ ఒడ్డున కూర్చుని చిన్న గుంట తీసి, మా సత్తియ్య పట్టిచ్చే చేపపిల్లలతో ఆడేదాన్ని.

    ఈ మధ్య వేట కథ ఒకటి చదివాను. మీది నిజానుభూతి కదా. ఇంకా బాగుంది. నాకూ అంతేనండి, ఇక్కడ మా లేక్ లో పట్టి వదిలేస్తే భలే ఆనందం. కానీ ఒకరు మాత్రం అక్కడిక్కడే బి.బి.క్యు. మీద (మన నిప్పుల కుంపటి మాదిరిదే) కాల్చుకుని తినేస్తుంటారు. ఏదో బాధ.

    రిప్లయితొలగించండి
  15. @భాస్కర్ రామరాజు: మీక్కూడా శుభాకాంక్షలు.. ధన్యవాదాలు.
    @చిన్ని: ధన్యవాదాలండీ..
    @భవాని: వాటిని అక్షరాల్లో పెట్టడం నాకు చాలా సంతోషం కలిగిస్తోందండీ.. ధన్యవాదాలు.
    @ఉష: 'వానపాములంటే భయం' ..చాలా ఆశ్చర్యం కలిగిందండీ.. పాపం అవేమీ చేయవు కదా.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి