గురువారం, నవంబర్ 19, 2009

పెద్దక్క పెళ్లిచూపులు

నా మొదటి పెళ్ళిచూపుల గురించి టపా రాస్తున్నప్పుడే అమ్మమ్మ వాళ్ళింట్లో జరిగిన మొదటి పెళ్ళిచూపుల గురించి అమ్మ చెప్పిన కబుర్లు గుర్తొచ్చాయి.. వాటి గురించి ఇప్పుడు. ఇంట్లో ఏడుగురు ఆడపిల్లలు ఉన్నారంటే, ఇంటాయన (అంటే ఇంటి ఓనరు కాదు, ఇంటి పెద్ద) పట్టించుకోక పోయినా చుట్టాలూ, స్నేహితులూ ఆ పిల్లలకి సంబంధాలు చూడడం, ఉచిత సలహాలు ఇవ్వడం వాళ్ళ బాధ్యతగా భావిస్తారు కదా.. అలా ఇంట్లో చివరి పిల్లలు ఇంకా బళ్లోకి వెళ్తుండగానే పెద్దమ్మాయికి పెళ్ళిసంబంధాలు రావడం మొదలయ్యాయి.

అమ్మ అప్పటికి హైస్కూలికి వెళ్తోంది.. పిన్నిలిద్దరూ, మామయ్య ఎలిమెంటరీ స్కూల్. పెద్ద పెద్దమ్మ, అంటే అమ్మ వాళ్ళ పెద్దక్కని చదువు మానిపించేశారు. పెద్ద పిల్లకి పెళ్లి చేసేయాలని అమ్మమ్మ తొందర పడుతున్నా, తాతగారు అస్సలు పట్టించుకోకుండా పనులు చూసుకుంటున్న సమయంలో బంధువులెవరో అమ్మమ్మ పాలిట దేవుళ్ళలా వచ్చి ఓ సంబంధం తెచ్చారు. ఫలానా రోజున పెళ్ళివారు అమ్మాయిని చూసుకోడానికి వస్తారు అని కబురొచ్చింది.. ఇంకేముంది.. ఇల్లంతా హడావిడి.

ఇంటి నిండా ఉన్న పిల్లల్ని చూసి, వచ్చిన వాళ్ళు హడిలి పోతారనుకున్నారో లేకపొతే పిల్లలందరినీ పరిచయం చేయడం ఎందుకనుకున్నారో, అమ్మమ్మ తాతగారు పిల్లలెవరూ పెళ్లివారుండగా బయటికి రాడానికి వీల్లేదని ఆర్డరేశారు. పాపం ముందు రోజు ఒళ్ళు హూనంయ్యేలా ఇల్లంతా సర్దింది వీళ్ళే కాని, అసలు ముఖ్యమైన పెళ్ళిచూపుల ఘట్టం వచ్చేసరికి సైడైపోవాల్సి వచ్చింది. తాతగారు సున్నితంగానూ, పెద్ద మావయ్య ఘాటుగానూ మరోసారి గుర్తు చేశారు పిల్లలందరికీ, ఎత్తి పరిస్థితుల్లోనూ పెళ్లి వాళ్ళుండగా బయటికి రావొద్దని.

పెళ్ళికూతురిని వంటింట్లో తన దగ్గర ఉండమని, మిగిలిన పిల్లలందరినీ వెనుక గదిలో ఉండమని చెప్పింది అమ్మమ్మ. పిల్లలంతా వెనుక గదిలో నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఎవరో వచ్చిన అలికిడి, తర్వాత తాతగారు, పెద్ద మావయ్యల హడావిడి వినబడుతున్నాయి. అమ్మ వాళ్ళ మూడో అక్క, నాలుగో అక్కలకి కుతూహలం మొదలయ్యింది.. అవతలి గదిలో ఏం జరుగుతో ఉండి ఉండొచ్చో గుసగుసగా ఊహాగానాలు చేస్తున్నారు పిల్లలందరూ. ఇద్దరక్కలూ కూడబలుక్కుని ఒక ప్లాన్ వేశారు.

పిల్లలున్న గదిలోనే ఒక మూలకి నిచ్చెన ఉంది. ఆ నిచ్చెనని మధ్య గోడకి ఆన్చి పైకి ఎక్కితే గోడ అవతల గదిలో జుర్గుతున్న పెళ్లిచూపుల తతంగమంతా చూడొచ్చు. ప్లాన్ విని మొదట భయ పడ్డ పిల్లలంతా ఏం జరుగుతోందో అన్న కుతూహలం కొద్దీ ఆ ప్రకారం ముందుకు పోడానికి సరే అనేశారు. చప్పుడవకుండా నిచ్చెనని తెచ్చి గోడకి ఆన్చి వేశారు. ఇద్దరు పిల్లలు నిచ్చెన పట్టుకోగా మొదట మూడో అక్క నిచ్చెన ఎక్కి అవతలి గదిలోకి తొంగి చూసింది.

అక్కడ కనిపించిన దృశ్యం ఏమిటంటే తాతగారు, పెద్ద మావయ్య తో పాటు మరో ఆయన కుర్చీలో కూర్చుని మాట్లాడుతున్నాడు. ఆయన జుట్టు సగం నెరిసిపోయింది. "పెళ్ళికొడుకు బాగా ముసలాడే" అని ప్రకటించింది ఆమె నిచ్చెన దిగి. పిల్లలంతా బోల్డంత నిరాశ పడ్డారు. ఎలాంటి వాడైనా పెళ్లి కొడుకు కదా.. చూడక తప్పదు కదా.. ఒక్కొక్కరుగా నిచ్చెన ఎక్కడం, తొంగి చూసి దిగిపోవడం.

ఇక చివరికి మిగిలింది ప్లానేసిన నాలుగో అక్క. ఆమెకూడా నెమ్మదిగా నిచ్చెన ఎక్కి తొంగి చూస్తూ, సరిగ్గా అదే సమయానికి ఎందుకో తల పైకెత్తిన పెద్ద మావయ్యకి దొరికి పోయింది.. తర్వాత పెద్దమావయ్య ఏం చేశాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా.. ఇంతకీ ఆ వచ్చినతను పెళ్ళికొడుకు కాదు.. పెళ్ళివారికి వీలవక వాళ్ళ బంధువుని చూసి రమ్మని పంపించారుట.

25 వ్యాఖ్యలు:

సుబ్రహ్మణ్య ఛైతన్య చెప్పారు...

మొత్తానికి మళ్లీ జముకుల‌ఆట చూపించాడా పెద్దమామ.

తృష్ణ చెప్పారు...

ఏమిటో...పక్కింటి వాళ్ళ పెళ్ళి చూపులూ....అమ్మగారి పెద్దక్కగారి పెళ్ళి చూపులూ....అంటారు మీరు!!
...కాస్త మీ పెళ్ళి చూపుల గురించి కూడా రాయకుడదూ ..:) :)

చిన్ని చెప్పారు...

హ హ హ్హ ......బాగుంది .

Rani చెప్పారు...

sweet :)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

:-):-)

భావన చెప్పారు...

హ్మ్.. ఒక్క పని పెద్దోళ్ళు చెప్పినట్లు చెయ్యరు కదా.. ఇది మన అందరికి మన పెద్ద వాళ్ళ నుంచే వచ్చింది అన్నమాట ఐతే.. మా అమ్మ కూడా ఇలాంటి కబుర్లే చెపుతుంది. :-) ఇంతకు తరువాత పెళ్ళి కొడుకు వచ్చాడా?

లక్ష్మి చెప్పారు...

తృష్ణ గారి మాటే నా మాట

మురళి చెప్పారు...

@సుబ్రహ్మణ్య చైతన్య: చెప్పిన మాట వినకపోతే అంతే కదండీ మరి.. ధన్యవాదాలు.
@తృష్ణ: పెళ్ళిచూపుల కన్నా ముందు చెప్పాల్సిన సంగతులు చాలా ఉన్నాయండీ.. వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాను కదా.. చదువుతూనే ఉండండి :):) ..ధన్యవాదాలు.
@చిన్ని: :):)..ధన్యవాదాలండీ

మురళి చెప్పారు...

@Rani: :):) Thank you..
@శేఖర్ పెద్దగోపు: :):) ..ధన్యవాదాలు.
@భావన: పెద్దవాళ్ళు కూడా ఒకప్పటి పిల్లలే కదండీ.. అబ్బే.. 'నేటి బాలలే రేపటి పౌరులు' ని తిరగేశానంతే.. ధన్యవాదాలు.
@లక్ష్మి: తృష్ణ గారికి చెప్పిన మాటే మీకూను :):) ..ధన్యవాదాలు.

sunita చెప్పారు...

బాగుంది.

పరిమళం చెప్పారు...

మళ్ళీ మాట దాటేశారు మురళిగారు ! అదేనండీ మీ పెళ్లి చూపుల గురించి ..అప్పుడే టైటిల్ చూసి మోసపోయాం ..అది సరే అప్పటి రోజుల్లో అలా ఇప్పుడు చెప్తే వింత ! అమ్మాయికంటే ముందు మరదళ్ళకి , బావమరుదులకీ నచ్చాలి మరి !ఇంతకు పెళ్ళికొడుకు వచ్చాక ఏం జరిగిందో మరో టపాలో రాస్తారా ?

జయ చెప్పారు...

మొత్తానికి 'పెళ్ళిచూపుల' అనుభవాలు చాలానే ఉన్నాయన్నమాట.

srujana చెప్పారు...

హ హ్హ ......బాగుంది

'Padmarpita' చెప్పారు...

బాగుంది...

మా ఊరు చెప్పారు...

మురళి జీ
అప్పట్లో ఆ సందడి వేరే అనుకుంట ఎంతైనా
సూపర్ రాసారు

మురళి చెప్పారు...

@సునీత: ధన్యవాదాలు
@పరిమళం: అసలు పెళ్లి చూపుల కథ వేరే ఉందండీ.. నా విషయం అంటారా.. చెబుతానంటున్నాను కదా:):) ..ధన్యవాదాలు.
@జయ: ఇవి నావి కాదండీ.. అమ్మవి.. ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@సృజన: :):) ధన్యవాదాలు
@పద్మార్పిత: ధన్యవాదాలు.
@మాఊరు: నిజమేనండీ.. ఆ సందడే వేరు.. ధన్యవాదాలు.

వీరుభొట్ల వెంకట గణేష్ చెప్పారు...

మురళి గారు, ఎప్పటి లాగానే, మీ నోస్టాల్జియా బాగుంది!!

హరే కృష్ణ . చెప్పారు...

:) :)
బావున్నాయి

మురళి చెప్పారు...

@వీరుభొట్ల వెంకట గణేష్: ధన్యవాదాలండీ..
@హరే కృష్ణ: :-) :-) ధన్యవాదాలు.

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

హహ బగున్నాయి కబుర్లు :-)
ఏంటి సార్ ఈ మధ్య TV9 ఎక్కువ చూస్తున్నారా !! ఏంలేదు "చదువుతూనే ఉండండి" అంటేనూ అనుమానం వచ్చింది :-)

Karuna చెప్పారు...

బలే రాస్తారండి మీరు. అచంగా మీరు చూసినట్టే. మీ అమ్మ గారిని కదిలిస్తే ఇంకా చాల విషయాలు తెలుస్తాయి అనుకుంట కదా. అప్పట్లో పెళ్లి చుపులంటే చాల సందడిగా వుండేది అనుకుంట. ఇప్పుడైతే ఎంత సింపుల్ గ వుంటే అంట బెటర్ అనుకుంటున్నారు కదా. ఇంతకీ మీ పెళ్లి చూపుల గురించి ఎప్పుడు రాస్తున్నారు మరి :-)

మురళి చెప్పారు...

@కరుణ: ఆ క్రెడిట్ అమ్మదేనండీ.. అంతగా వర్ణించి వర్ణించి చెప్పేది.. ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: హ..హ.. బ్లాగుని చదివుతూనే ఉండండి అనే కదండీ అనాలి..ఏమంటారు?? ..ధన్యవాదాలు.

lakshmi చెప్పారు...

nijam cheppalantey e site nenu ninna open cheysanu edo vethukuthu net lo appudu e naval gurinchi vishleshan choosi net lo vethiki mari chadivanu......2 ki start cheysi 5.30 varaku chduvuthoone unnanu.......really winderful kiranmayi character chala bagundhi alaney apuroopa laxmi pathra aythe kantatahdi pettinchindhi.........chal badheysindhi....asalu marchipolekhapothunnanu...........manasulo natukupoindhi

kallurisailabala చెప్పారు...

మీ అమ్మగారు ఇవి అన్ని ఎంతో అపురూపంగా గుర్తుంచుకుని మీకు చెప్పడం నాకు బాగా నచ్చింది.మీ రచనా శైలి చాల చాల బావుంది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి