గురువారం, జులై 28, 2011

చలవ మిరియాలు

అచ్చ తెలుగు... జాను తెలుగు... పదహారణాల స్వచ్చమైన తెలుగుకి చిరునామా మల్లాది రామకృష్ణ శాస్త్రి రచనలు. తెలుగు భాషలో సౌందర్యాన్ని ఆస్వాదించాలనుకునే వారు శాస్త్రి గారి వచనాన్ని చదివితే చాలు. రచయిత, కవి, సినీ గీత రచయితగా లబ్ద ప్రతిష్టులైన మల్లాది, 1930 నుంచి తర్వాతి మూడున్నర దశాబ్దాల కాలంలో వెలువరించిన వ్యాసాల సమాహారమే 'చలవ మిరియాలు.'

తనకి స్నేహితులైన కవులు, రచయితలు, నటుల గురించి మాత్రమే కాక, కొన్ని గ్రంధాలకి శాస్త్రి గారు వెలువరించిన పీఠికలూ, ఆనాటి సమస్యలని గురించి హాస్య వ్యంగ్య ధోరణిలో రాసిన వ్యాసాలనీ ఈ సంకలనంలో చేర్చారు. మల్లాది నూట మూడవ జయంతిని పురస్కరించుకుని, 2008 లో విశాలాంధ్ర ప్రచురణ సంస్థ వెలువరించిన ఈ 'చలవ మిరియాలు' సంకలనానికి మల్లాది నరసింహ శాస్త్రి సంపాదకత్వం వహించారు.

వ్యాసాలన్నీ పాఠకులని కాలయంత్రంలో కూర్చోబెట్టి వందేళ్ళ వెనక్కి అలవోకగా తీసుకు పోగలిగేవే. తల్లావఝుల శివ శంకర శాస్త్రి మొదలు కాటూరి మేష్టారు వరకూ మొత్తం పది మంది 'కవి మిత్రుల'ని పరిచయం చేశారు. విశ్వనాథ సత్యనారాయణ, పింగళి నాగేంద్ర రావు వంటి తెలిసిన వారిలో తెలియని కోణాలు తెలుసుకోవడంతో పాటు, వెంపటి నాగభూషణం, మిష్టర్ వెల్లటూరు వంటి వారిని గురించి కొత్తగా తెలుసుకోడానికి ఉపయోగపడే వ్యాసాలివి.

'మన కథకులు' శీర్షికన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, చలం, శిరోమణి లని గురించిన వ్యాసాలున్నాయి. శ్రీపాద వారు రాసిన మొత్తం కథలన్నీ కలిపి ఇరవై సంపుటాలు వెలువరించ వచ్చునంటే, ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నవి సంఖ్యలో ఎంత స్వల్పమో కదా. అంతేనా, శ్రీపాద హిందీ వ్యతిరేకతని వస్తువుగా తీసుకుని హాస్యస్పోరకంగా రాసిన వ్యాసం, హిందీ మన వాడుక భాషలో ఎంతగా విడదీయరానిదిగా కలిసిపోయిందో చెప్పకనే చెప్పారు. 'ఏకైక వీరుడు' అంటూ మొదలు పెట్టిన చలాన్ని గురించిన వ్యాసాన్ని "చిత్రాంగి చలం అజమాయిషీలో తరిఫీయదు అయిన తర్వాత...సారంగునికే దైవమిచ్చిన భార్య" అంటూ చమత్కార భరితంగా ముగించారు.

"కాళిదాసంతటి వాణ్ణి అందరి ఊహలూ సొంతానికి వాడుకుంటున్నాడని దిగ్నానుడు ఎక్కదీశాడు. ఇక సామాన్యుల విషయం చెప్పడం ఎందుకూ.. సరే భాష కూడా ఎవరి పోకడలు వారు పేటెంటు చేసుకున్నప్పుడు ఏమీ అనడానికి వీలు లేదు కదా" అంటూ 'కొత్త పోకడల'ని పరామర్శిస్తూనే, "ప్రతి యుగంలోనూ, ప్రతి దేశంలోనూ, దొంగలు అడపాదడపా ఉద్భవిల్లుతూనే వచ్చారు.దొంగలేని యుగం అందయుగము. దొంగలను కననేరని జాతికి చరిత్ర గాని, తదితర సభ్య జాతుల్లో స్థానం కానీ లేదు," అంటూ 'చోర మీమాంశ' ని సరదాగా వర్ణించారు శాస్త్రి గారు.

తంజావూరు రాజుల ఆస్థాన వేశ్య రంగాజీని గురించి ఎంత సరసంగా చెప్పారో, క్షేత్రయ్య ని గురించి అంత గంభీరంగానూ చెప్పారు. సాహిత్యంలో శృంగార సంబంధ ప్రస్తావనలని విపులంగా రాసిన శాస్త్రిగారు, 'హంస వింశతి' ని గురించి పరిశోధన పత్రం స్థాయిలో వ్యాసాన్ని ప్రచురించారు. 'రాధికా సాంత్వనము' సముఖ వేంకట కృష్ణప్ప నాయకుని రచనగా ప్రచారం చేయడం, ముద్దుపళని ని అవమానించడానికి అయి ఉంటుందని అభిప్రాయ పడ్డారు. సారంగధర-చిత్రాంగి కథని పోలిన కథలు ఏయే సాహిత్యంలో ఏయే రూపాల్లో వున్నాయో, శాస్త్రిగారి ద్వారా తెలుసుకోవచ్చు.

'తెలుగు నటులు' శీర్షికన అలనాటి రంగస్థల నటులు యడవల్లి సూర్యనారాయణ, డి.వి. సుబ్బారావు, నెల్లూరు నాగరాజారావు, స్థానం నరసింహా రావు, టి. రాఘవాచార్యులని గురించిన వ్యాసాలున్నాయి. యడవల్లి కి ఆహార్యం పై ఉన్న ప్రత్యేకమైన శ్రద్ధని గురించి రాస్తూ, కాలం కలిసిరాక కట్టెలు కొట్టే నలుడు పాత్రని పోషించినా, శిల్కు దుస్తులూ, వెండి గొడ్డలితోనే రంగస్థలం మీద కనిపించేవారన్న సంగతిని సరదాగా ప్రస్తావించారు. ఆనాటి రంగస్థల పరిస్థితులనీ, పాశ్చాత్య రంగస్థల ప్రభావాన్నీ తెలుసుకోడానికి ఉపయోగ పడే వ్యాసాలివి. సద్విమర్శ చేసే విషయంలో రెండో ఆలోచనలేదు మల్లాది వారికి. కేవలం విమర్శ కోసం విమర్శ కాకుండా, ఆయా లోపాలని ఎలా సరిచేసుకోవచ్చో సూచనలు ఇవ్వడం గమనించాల్సిన విషయం. (164 పేజీల ఈ సంకలనం వెల రూ. 90. విశాలాంధ్ర తో పాటుగా ఏవీకెఎఫ్ లోనూ లభిస్తోంది.)

14 కామెంట్‌లు:

  1. చలవ మిరియాలు అని టైటిల్ చూసి "మీరు.. వంటల గురించి పోస్ట్ వ్రాశారా.." అని ఆశ్చర్యపోయా...!

    ఓహ్.. చదువుతాను.

    రిప్లయితొలగించండి
  2. రోజుకొకటి వ్రాస్తున్నట్టున్నారు..good going. Good to see you in your full form.

    మీనుండి ఇలానే మంచి మంచి టపాలు మరిన్ని రావాలని కోరుకుంటూ..

    శుభాకాంక్షలతో...

    రిప్లయితొలగించండి
  3. మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మురళి గారు :-)

    రిప్లయితొలగించండి
  4. పుస్తకంలో భాష విషయం ప్రస్తావించలేదేంటండీ. మా గురువు గారు ఈ పుస్తకం చదవమని ఇచ్చారు. చాలా కష్టపడి అలవాటు చేసుకున్నానాయన భాషని చదవడానికి(గ్రాంధికం అనుకుంటారేమో మిగతా మిత్రులు, కాదు ఆ శైలి కొంచం వేగంగా ఉంటుంది). అగాధమౌ జలనిధిలో ఆణిముత్యమున్నటులే ఆయా విశేషాలు తెలుసుకోవాలంటే కష్టపడాలి లెండి కొంత.

    రిప్లయితొలగించండి
  5. మురళి గారికి పుట్టిన రోజు శుభా కాంక్షలు.

    రిప్లయితొలగించండి
  6. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మురళి గారు

    రిప్లయితొలగించండి
  7. పుట్టినరోజు జేజేలు!

    చలవమిరియాలు చదివేసాను. పక్కింటబ్బాయి గారితో ఏకీభవిస్తాను. మల్లాదివారి శైలిలో తెలియని వేగం ఉంటుంది. నారికేళమని అనలేం కానీ, అచ్చ తెనుగు చదివే అలవాటు తక్కువ ఉన్న వారికి ఖచ్చితంగా కదళీ పాకం.

    రిప్లయితొలగించండి
  8. సో, మీ పుట్టిన రోజున ఇవన్నీ చదివారన్నమాట. ఈ రోజంతా చదువుతూనే కూర్చున్నారా:) మీరు పుస్తకాల గురించి ఎంత బాగా వివరించినా....ఇవాళ మాత్రం మీకు బర్త్ డే విషెష్...అంతే.
    Murali garu, I wish you a very Happy returns of the Day. Have a nice Time & enjoy yourself.

    రిప్లయితొలగించండి
  9. అబ్బా మురళీ గారూ,
    మరిచా. జన్మదిన సుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  10. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు!!

    రిప్లయితొలగించండి
  11. @గీతిక: ఈ పుస్తకం కొన్నప్పుడు మిత్రులొకరితో 'చలవ మిరియాలు' కొన్నాను అని చెబితే, 'నల్లవేనా?' అని అడిగారు :)) ధన్యవాదాలండీ..
    @సిరిసిరిమువ్వ: అవునండీ.. కొంచం టైం దొరుకుతోంది.. కుదరనప్పుడు ఎటూ కుదరదు కదా.. అందుకని :)) ..ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  12. @పక్కింటబ్బాయి: మల్లాది వారి భాషని గురించి మాట్లాడగల భాష నాదగ్గర లేదండీ.. ఎవరన్నా professional reviewers రాసిన సమీక్షల కోసం ప్రయత్నించాలి.. ధన్యవాదాలు.
    @బులుసు సుబ్రహ్మణ్యం: ధన్యవాదాలండీ..
    @జ్యోతి: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  13. @సునీత: థాంక్యూ.. థాంక్యూ వెరీ మచ్ అండీ..
    @కొత్తావకాయ: ఇదీ అని చెప్పలేను కానీ.. పరుగులెత్తించే వచనం అండీ.. ధన్యవాదాలు.
    @జయ: లేదండీ.. ఇవాళ అస్సలు పుస్తకం తెరవలేదు!! ..ధన్యవాదాలు.
    @పద్మవల్లి: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి