మంగళవారం, మే 31, 2011

కోమలి గాంధారం

మొన్నీమధ్య పురాణం వారి 'ఇల్లాలి ముచ్చట్లు' గురించి టపా రాస్తుండగా యధాలాపంగా గుర్తొచ్చింది కోమలి. ఓ పుష్కర కాలమ్ క్రితం 'వార్త' దిన పత్రికలో వీక్లీ కాలమ్ గా వచ్చిన 'కోమలి గాంధారం' నాయిక. బహుముఖ ప్రజ్ఞాశాలి సి. మృణాళిని సృష్టించిన కోమలి, 'స్వీట్ హోం' విమలకి కసిన్ కాదుకదా అన్న సందేహం వచ్చింది చాలాసార్లు. అప్పట్లోనే ఓసారి మృణాళిని గారిని కలిసినప్పుడు "మీ కోమలి మీద విమల ప్రభావం కనిపిస్తోందండీ" అంటే, ఆవిడ దానిని కాంప్లిమెంట్ గా తీసుకుని, "ఈతరహా పాత్రల మీద విమల ప్రభావం ఉండకుండా ఉండదు" అన్నారు.

దాదాపు ఏడాది పాటు వారం వారం కాలమ్ గా వచ్చిన గాధలన్నీ తర్వాత సంపుటిగా మార్కెట్లోకి వచ్చాయి. పుస్తకావిష్కరణ గురించి పేపర్లో చూడగానే షాపుకెళ్ళి కాపీ తెచ్చేసుకున్నా. అనగనగా ఓ కోమలి. ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్. ఆవిడకో భర్త, అత్తమామలూ. కొత్తగా పెళ్లై కాపురానికి వచ్చి తనకి ముగ్గేయడం రాదన్న విషయాన్ని అత్తగారికి అర్ధమయ్యేలా చెప్పడం మొదలు, అప్పుడే పుట్టిన తమ పాపాయిని 'పరిపూర్ణ స్త్రీ' గా పెంచాలన్న భర్త కోరిక ఎంత అసమంజసమైనదో అతగాడికి అర్ధమయ్యేలా చేయడం వరకూ కోమలి చేసిన పనులు బోలెడన్ని.

కోమలి సుదీర్ఘమైన లెక్చర్లివ్వదు, మిన్ను విరిగి మీదపడ్డా అస్సలు కంగారు పడదు. కాకపొతే కీలెరిగి వాత పెడుతుంది, తన మాటలతోనూ, చేతలతోనూ. కొత్తగా పెళ్లి కుదిరిన స్నేహితురాలు వత్సల, తన కాబోయే భర్త ప్రేమని తట్టుకోలేక పోతున్నానని మొర పెట్టుకుంటూ కోమలికో ఉత్తరం రాస్తుంది. "ఇంత ఘాటైన ప్రేమకి నివారణోపాయం చాలా సింపుల్. పెళ్లి చేసుకోవడమే" అంటూ ఠక్కున జవాబు రాసేస్తుంది కోమలి.

అసలు ఈ కోమలి గాంధారం లో ముఖ్యమైన పాత్ర కోమలి భర్త. (ఇతగాడికి కనీసం పేరు కూడా ఉండదు, కో.భ. అనే ఉంటుంది పుస్తకమంతా). ఊహించగలిగేట్టే ఇతగాడు 'స్వీట్ హోం' బుచ్చిబాబుకి నకలు. కొంచం ఎక్కువ అమాయకప్పురుషుడు. ఉదాహరణకి ఒకరోజు ఇతగాడికి ఆఫీసులో ఆడవాళ్ళంతా తన వంక ఆరాధనగా చూస్తున్నారన్న అనుమానం వచ్చేస్తుంది. ఇక అద్దం ముందు గడిపే సమయం పెంచేస్తాడు. పాపం, ఈ విషయం భార్యతో చెప్పాలనుకుంటాడు. "ఇవాళ సునంద నన్ను చూసి ఏమందో తెలుసా? నేను వరండాలో నడుస్తుంటే 'రాజు వెడలె రవి తేజములలరగ' అన్నట్టు ఉందట"

దీనికి కోమలి సమాధానం ఏమిటో తెలుసా? "పాపం. ఆ అమ్మాయి ఎప్పుడూ రాజుల్ని చూసుండదు.." కో.భ పరిస్థితి ఏమిటన్నది అర్ధం చేసుకోవడం ఇప్పుడు చాలా ఈజీ. ఒకటని పది పడుతూ ఉంటాడు ఎప్పుడూ. ఈ కాలమ్ పేపర్లో వచ్చే రోజుల్లో మృణాళిని కొలీగ్ ఒకరు 'కో.భ. ఫ్యాన్స్ అసోసియేషన్' పెడతామని బెదిరించారట మరి. అన్నట్టు, కో.భ. దే కాదు కాలేజీలో మగ కొలీగ్స్ దీ అదే తీరు. వాళ్ళు కూడా కోమలి జోలికి వెళ్ళడం, ఊహించని విధంగా దెబ్బ తినేయడం. అక్కడికీ ఆడ లెక్చరర్లని విభజించి పాలిద్దామని ప్లానేశారు కానీ, కోమలి ముందా వాళ్ళ కుప్పిగంతులు?

హాస్యంగా, వ్యంగ్యంగా రాసిన ఈ కాలమ్స్ ని హోమియోపతి మాత్రలతో పోల్చవచ్చు. మేల్ ఇగో ని టార్గెట్ చేస్తూ రాసినవే ఇవన్నీ. చేదు మందుకి వ్యంగ్యం అనే తీపి పూత పూసి హాస్య భరితంగా చెప్పడమే కోమలి విజయ రహస్యం. కోమలి బావగారు మహిళల చేత కంట తడి పెట్టించే సినిమా తీసి అవార్డు అందుకోవాలని కలగంటుంటే "మన దేశంలో ఆడవాళ్ళు ఏడవడానికి సినిమాలు అవసరమా?" అని ఆశ్చర్యంగా అడుగుతుంది కోమలి. సరదా సరదాగా చదివేసినా, పుస్తకం పూర్తి చేసి పక్కన పెట్టక అప్పుడప్పుడూ అయినా గుర్తొచ్చి ఆలోచింపజేసే పుస్తకం ఈ 'కోమలి గాంధారం.' (నాదగ్గర ఉన్నది తొలి ప్రచురణ. 'హాసం' వారి తాజా ప్రచురణ మార్కెట్లో ఉంది.)

10 కామెంట్‌లు:

  1. నిన్న సాయంత్రమే ఈ పుస్తకం తెచ్చా. రాత్రి మొదలెట్టా. మీ రివ్యు చూసి వెంబడే పూర్తి చెయ్యాలనిపించింది.అన్నట్టి తాజా ప్రచురణ "నవోదయా" వాళ్ళది హాసం వాళ్ళది రెండవది అనుకుంటా. వీరిదే ఆంధ్రజ్యోతి లో రాసిన కాలం తాంబూలం కూడా పుస్తక రూపం లో వచ్చిందట. చదివార ఎలా ఉందొ?

    రిప్లయితొలగించండి
  2. నాకు చాలా నచ్చిందండి కోమలి గాంధారం , నా అల్ టైం ఫావ్స్ లో ఇది ఒకటి !

    రిప్లయితొలగించండి
  3. చదువుతూ వుంటే ఎంతబాగుంటుందో చెప్పలేను ..చిన్న విషయాలు అద్భుతంగా చెప్పారు మృణాళిని గారూ

    రిప్లయితొలగించండి
  4. భానుమతి గారి అత్తగారి కదల తరవాత కోమలి గాంధారం మళ్ళీ అంత అద్భుతంగా అనిపించింది.

    రిప్లయితొలగించండి
  5. పేరే బలే గమ్మత్తుగా ఉంది...వెంటనే చదవాలి అయితే. మంచి పరిచయం...thanks!

    రిప్లయితొలగించండి
  6. ఈ బుక్ నేను కూడా చదివానోచ్. మృణాళిని గారు నాక్కూడా తెలుసోచ్. మృణాళిని గారిని మీరు ఏ ఊరిలో కలిసారు.

    రిప్లయితొలగించండి
  7. @భాను: నేను 'హాసం' దగ్గరే ఆగిపోయానన్న మాట అయితే :)) ..'తాంబూలం' ఆదివారం ఆంధ్రజ్యోతిలో వీక్లీ కాలమ్ గా వచ్చినప్పుడే ఒక్క వారం కూడా మిస్సవ్వకుండా చదివానండీ.. కొన్ని కాలమ్స్ చాలా బాగున్నాయి. ధన్యవాదాలు..
    @శ్రావ్య వట్టికూటి: సరదాగా సాగడంతో పాటు, చదివించే గుణం పుష్కలంగా ఉండడం ఈ పుస్తకం ప్రత్యేకత అండీ.. ధన్యవాదాలు.
    @లక్ష్మీ రాఘవ: అవునండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. @ప్రణీత స్వాతి: హాస్యం, వ్యంగ్యం రెంటిలోనూ కామన్ గా ఉన్న విషయాలండీ.. ధన్యవాదాలు.

    @ఆ.సౌమ్య; చదవండి.. మీకు నిరాశ కలగదు.. నాదీ హామీ! ధన్యవాదాలు.

    @జయ: కాలమ్ వస్తున్నా కాలంలోనే హైదరాబాద్ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ లో కలిశానండీ.. బహుశా, ఆవిడకి గుర్తుండి ఉండకపోవచ్చు :(( ..ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  9. బాధపడకండి మురళి గారు. పోనీ, నన్నెళ్ళి మిమ్మల్ని గుర్తుచేయమంటారా.

    రిప్లయితొలగించండి