బుధవారం, మే 25, 2011

కొంచం..కొంచం...

మనక్కావాల్సింది ఏదైనా సమృద్ధిగా దొరకడం బాగుంటుందా? లేక కొంచం కొంచంగా దొరకడమే మంచిదా? 'సమృద్ధిగా' ఆప్షన్ కి వందశాతం వోట్లు పోలై ఉంటాయి. కానైతే అలా కావల్సినంతా దొరికేయడం అన్నది ఏ రకంగా చూసినా అంత సమర్ధనీయం కాదనిపిస్తూ ఉంటుంది నాకు. కావాల్సింది సాధించేశాం.. తర్వాత? అదే, పూర్తిగా దొరకని పక్షంలో, మన కృషి కొనసాగుతూనే ఉంటుంది కదా. పైగా, మనకి కావాల్సిన దానిమీద ఆసక్తి అంతకంతకూ పెరుగుతూ ఉంటుంది కూడా.

ఆర్ధిక శాస్త్రంలో డిమాండ్ అండ్ సప్లై సూత్రం మొదలుకొని, గబుక్కుని పేరు జ్ఞాపకానికి రాని అదేదో మామిడిపళ్ళ సిద్ధాంతం వరకూ, ఏవీ కూడా సమృద్ధిగా దొరకడాన్ని సమర్ధించడం లేదు. సప్లై పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. అంటే ఏమిటన్న మాటా, ఆసక్తి తగ్గిపోతుంది. అలాగే మొదటి మావిడి పండు తిన్నప్పుడు కలిగిన తృప్తి కన్నా, రెండో మామిడి పండు తిన్నప్పటి తృప్తి, దానికన్నా మూడో మామిడిపండు తిన్నప్పుడు కలిగే తృప్తి తగ్గుతూ వస్తుంది. ఇది క్రమ క్షీణోపాంత సిద్ధాంతం అనుకుంటా.

మన శతక కారులు కూడా కొంచముండడాన్నే సమర్ధించారు. సందేహమైతే 'గంగిగోవు పాలు గరిటెడైనను చాలు..' ఇంకా '....కొంచముండుటెల్ల కొదవ కాదు' తదితర పద్యాలని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి, మనక్కావాల్సింది పూర్తిగా దొరకలేదన్న చింత వలదు. అలాగని ఈ కొంచాన్ని తక్కువ చేసి చూడడం కూడా అస్సలు సరైన పని కాదు. 'సూక్ష్మం లో మోక్షం' లాంటి వాడుకలు ఊరికే పుట్టలేదన్నది ఇక్కడ గమనించాల్సిన విషయం.

అసలైతే 'నిదానమే ప్రధానము' లాంటి సూక్తులన్నీ ఈ కొంచాన్ని సమర్ధించేవే. పరిగెత్తి పాలు తాగడం కన్నా, నిలబడి నీళ్ళు తాగడం ఉత్తమం అన్నది ఎంత గొప్ప వాడుక అసలు? అలాగే 'అన్నప్రాశన నాడే ఆవకాయ తినిపించడం' అన్నది కూడా. ముందుగా తినడం నేర్పి, ఆ తర్వాత రుచులు మప్పి, ఆపై నెమ్మదిగా ఆవకాయ అలవాటు చేయాలే తప్ప, మొదలే ఆవకాయతో మొదలు పెట్టకూడదన్న మాట. అన్నట్టు 'రుచిగలదని మిక్కిలి తినరాదు' సూక్తి కూడా కొంచాన్నే సపోర్ట్ చేస్తోంది.

ఈ కొంచం విలువే వేరు.. వర్షాకాలంలో రోజూ వానోస్తుంది, పట్టించుకుంటామా? అదే మండు వేసవిలో నాలుగు చినుకులు రాలితే 'మహా ప్రసాదం' అనుకోమూ? అలాగే, ఇప్పుడు ఎండలని విసుక్కున్నా, రేప్పొద్దున్న చలికాలం వచ్చేస్తే ఎండ కోసం ఎదురు చూడమూ? కొంచాన్ని గురించి నాలుగు మంచి మాటలు చెప్పిన పెద్దోళ్ళే 'అతి సర్వత్ర వర్జయేత్' అన్నారు సంస్కృతంలో. దీని భావమేమి తిరుమలేశా అంటే, అతి ఎప్పుడూ కూడా పనికి రాదు అని. మాట వెండి అయితే మౌనం బంగారం అన్న వాడుకని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.

కొంచమే దొరకడం అన్నది మనకి అవసరాలని కుదించుకోవడం నేర్పుతుంది. అంటే చాప ఉన్నంత మేరకే కాళ్ళు జాపుకోవడం అన్నమాట. పైగా, కావాల్సింది సాధించుకోవాలన్న తపనని పెంచుతుంది. ఎవరో వడ్డించిన భోజనం పళ్లాన్ని మన చేతికి ఇవ్వడానికీ, మనమే ఒక్కటీ వడ్డించుకోడానికీ ఒకటే భేదం ఉంది.. అది 'తృప్తి.' మాటలకందనిదీ, అనుభవానికి మాత్రమే వచ్చేదీ. కాబట్టి కొంచం లోని ఆనందాన్ని కొంచం కొంచంగా ఆస్వాదిద్దాం.

10 కామెంట్‌లు:

  1. :) బావుంది మీ కొంచమోపాఖ్యానం.

    రిప్లయితొలగించండి
  2. మురళి గారు, ఏదైనా టాపిక్ మీద మాట్లాడటం లో మీకు మీరే సాటి. ఇంతకీ ఈ టపా వెనక కారణం మీకు కావాల్సింది ఏదో కొంచెం కొంచెం గ దొరుకుతోంది అని అనుకోవచ్చ? as usual గ చాల బాగా రాసారు. మీరు సామెతల్లో దిట్ట అనుకుంట :-)
    ఏదైనా మనకి కావలసినంతగా దొరికితే దాని విలువ మనకి తెలియదు, మనకు దూరం అయినప్పుడే దాని విలువ బాగా తెలిసి వస్తుంది, ఇది అన్ని విషయాల్లోనూ వర్తిస్తుంది.

    రిప్లయితొలగించండి
  3. నాణేనికి మరో వైపు, కొ౦చెమున్న వాటి కోసమే మనసు లాగుతు౦దేమొ.:)

    రిప్లయితొలగించండి
  4. >> కాబట్టి కొంచం లోని ఆనందాన్ని కొంచం కొంచంగా ఆస్వాదిద్దాం.

    సారీ, ఎక్కువగానే ఆస్వాదించాము. :):)

    రిప్లయితొలగించండి
  5. మురళి గారు, కొంచం లోని ఆనందాన్ని కొంచం కొంచంగా ఆస్వాదిస్తూ...ఇంకొంచం "కొంచం" గురించి చెప్తాను.
    పిట్ట కొంచం..కూత ఘనం
    మన వాడుక భాషలో కూడా 'కొంచానికి' చాల ప్రాముఖ్యత...
    ౧. "ఇదిగో కొంచం ఇలా వస్తారా?" శ్రీవారిని పిలిచే శ్రీమతి
    ౨ "గురూ కొంచం చేబదులు ఉంటే ఇస్తావా?" అతనికి కావసినది ఎక్కువ మొత్తం అయినా సరే!!
    ౩ "ఇంకొంచం వడ్డించమంటారా?, ఆ కొంచం వడ్డించండి"
    ౪ "కొంచం మురళి గారి అడ్రస్ చెప్తారా?"
    ౫ "కొంచం ఈ పని చేసిపెట్టు బాబు...."
    ౬ "నీతో కొంచం మాట్లాడాలి" ఫోన్ లో ప్రియురాలు...(అయ్యే బిల్లు రెండొందలు)

    ఇలా అన్నమాట...ఒకసారి కొంచం స్థానంలో "అధికం" లేదా "చాల" అని మార్చి ఊహించుకోండి :)

    రిప్లయితొలగించండి
  6. అందుకని మీరు కూడా కొన్ని కొన్ని టపాలు మాత్రమే వ్రాస్తూ ఉంటారా ఏంటి.!?

    రిప్లయితొలగించండి
  7. ఈ కొంచెం కొంచెం నాకస్సలు సరిపోదు. తృప్తి అస్సలే లేదు. ప్రేమ చాలా కావాలి. అభిమానమెంతో కావాలి. మనసంతా ఇచ్చేయాలి. స్నేహం ఇంకా ఇంకా...ఎంతో చాలా కావాలి. అబ్బా...ఇంకా చాలా కావాలిలెండి:)

    రిప్లయితొలగించండి
  8. @పద్మ: ధన్యవాదాలండీ..
    @కరుణ: స్వానుభవం కాదండీ.. ఓ ఫ్రెండ్ తో ఈదిశగా సంభాషణ జరిగింది. కొద్దిపాటి మార్పు చేర్పులతో టపాగా రాసేశాను. సామెతలు వింటూ పెరిగాను లెండి :)) ..ధన్యవాదాలు.
    @Mauli: నిజమేకందండీ.. మానవ నైజం మరి... ...ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. @బులుసు సుబ్రహ్మణ్యం: అయ్యయ్యో..ఎలా అండీ ఇప్పుడు?? :))) ...ధన్యవాదాలు.
    @శ్రీ: ఓహ్.. చాలా బాగున్నాయండీ.. ధన్యవాదాలు.
    @మేధ: అబ్బబ్బే.. అదేమీ లేదండీ.. రాస్తూనే ఉన్నాను కదా.. తగ్గించమంటారా? :)) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. @జయ: హమ్మో.. అయితే కష్టమే అన్నమాట!! ..ధన్యవాదాలండీ..
    @వ్యాఖ్య ప్రచురించ వద్దన్న మిత్రులు: తృప్తి పడడం అన్నది మనసుకి సంబంధించిన విషయమే తప్ప, ఆర్ధిక స్థాయికి సంబంధించింది కాదని నా అభిప్రాయం అండీ.. అలాగే తృప్తి పడడం వల్ల అభివృద్ధి ఆగిపోతుందని కూడా నేను అనుకోను.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి