శనివారం, మే 07, 2011

ఎ'వరి'కోసం?

"వ్యవసాయం దండుగ" అంటూ అల్లప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పిన మాట నిజమే అనిపిస్తోంది. లేకపొతే, అంచనాలకి మించి దిగుబడులు సాధించినా పంటకి వస్తున్న ధర కనీసం పెట్టుబడులకి తగ్గట్టుగా లేకపోవడం అన్నది ఎందుకు జరుగుతుంది? బస్తా ధాన్యం అమ్మకానికి పెడితే వచ్చే ధర ఒక రోజు ఇద్దరు కూలీలకి చెల్లించాల్సిన కూలీ మొత్తం కన్నా తక్కువగా ఉన్నప్పుడు వ్యవసాయం పండుగ ఎలా అవుతుంది?

గడిచిన ఖరీఫ్ సీజన్ లో పంట చేతికి వచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలు రైతులకి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. అందుకు ఊరటగానా అన్నట్టు ప్రస్తుత రబీ సీజన్ ధాన్యం దిగుబడి అంచనా మన రాష్ట్రంలో అక్షరాలా వంద లక్షల టన్నులు. ప్రస్తుత పంట తో పాటుగా, గడిచిన పంటకోసం చేసిన అప్పులు తీర్చుకుని కొద్దో గొప్పో మిగుల్చుకోడానికి గొప్ప అవకాశం. ప్రకృతితో ఆడిన జూదంలో ఎక్కువసార్లు ఓడిపోయే రైతు ఈసారి గెలిచాడు. కానీ ఏం లాభం, ప్రభుత్వం చేతిలో ఓడిపోతున్నాడు.

బస్తా ధాన్యానికి ఏడొందల రూపాయలకి మించి ధర పలకడం లేదిప్పుడు. పంటకోత, నూర్పిళ్ళ కోసం కూలీలకి చెల్లించిన రోజుకూలీ తల ఒక్కింటికీ మూడు వందల యాభై రూపాయలు. కూలీ ఒక్కటేనా? ఎరువులూ, పురుగు మందులూ అన్నింటి ధరలూ పైపైకే ప్రయాణం చేస్తున్నాయి. నష్టపోయిన పంటకి గాను ప్రభుత్వం నుంచి పరిహారం వస్తుందో, రాదో తెలియని పరిస్థితి. అటు ప్రభుత్వంలో వారిని మచ్చిక చేసుకునే తెలివితేటలు కానీ, ఇటు కళ్ళంలో పంటని తగలబెట్టే తెగింపు కానీ లేకపోవడం వల్ల మంచి రోజుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు మన రైతు.

ధర ఎందుకు రావడం లేదు? ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే ధాన్యం నిల్వలు పేరుకుపోయి ఉన్నాయి. నలభైలక్షల టన్నుల ధాన్యం గోదాముల్లో మగ్గుతోంది. పక్క రాష్ట్రాలకి గానీ, విదేశాలకి గానీ ధాన్యం ఎగుమతి చేయడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఆదేశాలు అమల్లో ఉన్న కారణంగా మన ధాన్యం మన గోదాముల్లోనే మగ్గుతోంది. ఇప్పుడు కొత్తగా వస్తున్న పంటని ఎక్కడ నిల్వ చేయాలన్నది మొదటి సమస్య. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేసి కేంద్రంతో మాట్లాడి రైల్వే వేగన్లకి అనుమతి తీసుకుని ఉంటే వాటిలో నిల్వ చేసుకునే అవకాశం ఉండేది. కానీ, కనుచూపు మేరలో వేగన్లు వచ్చే సూచనలేవీ కనిపించడం లేదు.

ఇప్పుడు రైతుల పరిస్థితి ఏమిటంటే, చేతినిండా పంట ఉంది. ఈ పంటని మంచి ధరకి అమ్మితే చేసిన అప్పులు తీర్చుకుని, కొత్త పంటకి పెట్టుబడులు సిద్ధం చేసుకోవచ్చు. కానీ, ఉన్న పంటని ప్రభుత్వం కొనదు, మరొకరికి అమ్మనీయదు. ఈనేపధ్యంలోనే ప్రణాళికా సంఘం దేశంలోని రైతుల స్థితిగతుల మీద నివేదిక విడుదల చేసింది. దేశం మొత్తం మీద ఉన్న రైతుల్లో 48.5 శాతం మంది అప్పుల్లో ఉన్నారు. రాష్ట్రాలకి వస్తే ఆంధ్ర ప్రదేశ్ అగ్ర స్థానంలో ఉంది. ఈ నివేదిక ప్రకారం మన రైతుల్లో అక్షరాలా ఎనభైరెండు శాతం మంది ఋణవలయంలో విలవిలలాడుతున్నారు.

ఇక ప్రభుత్వం నుంచి వ్యవసాయ రంగానికి అందుతున్న సబ్సిడీల పరిస్థితి దినదిన గండంగానే ఉంది. ఏ సబ్సిడీని ఎప్పుడు ఎత్తేస్తారో తెలియని అయోమయం కొనసాగుతోంది. పంటల బీమా అతికొద్ది మందికి మాత్రమే అందుబాటులో ఉంది. వ్యవసాయానికి సంబంధించి చాలా సమస్యలు కౌలురైతుల సమస్యతో ముడిపడి ఉన్నాయి. కౌలురైతుల హక్కుల విషయంలో ప్రభుత్వం ఎటూ చెప్పడం లేదు. ఇదే అనిశ్చితి కొనసాగితే మాత్రం వ్యవసాయం భవిష్యత్తు ప్రశ్నార్ధకం కావడం ఖాయంగా కనిపిస్తోంది.

9 కామెంట్‌లు:

  1. మురళి గారు ఏమి చెప్పాలో తెలియని పరిస్తితి ! ఎక్కడో సమాచారలోపం ఉంది . ఊరికి ఒక VDO ఉంటారు అనుకుంటా కదా, అసలు వాళ్ళు అసలు రైతులకి ఏదన్న సలహాలు ఇస్తారా ఏ పంటలు వేయాలి అని ? వాళ్ళు ఇచ్చినవి సగం మంది ఎటు తిరిగి వినరు అది వేరే సంగతి . ఎందుకు ప్రతి సారి ఇలాంటి సమన్వయలోపం ఉంటుందో అర్ధం కాదు . ఒకసారి ఉల్లి 40 రూపాయలు అమ్ముంది , ఇక అది చూసి వేలం వెర్రి గా అదే పంట దిగుబడి పెరుగుతుంది కేజీ అధ రూపాయికి పడిపోతుంది , ఇక టమోటా అంతే పెరిగితే 40 నుంచి 50 లేదు గేదేలకి గడ్డి బదులు అదే ! ప్రభుత్వం ఏ పంటలు ఈ సంవత్సరం లో ఎంత స్తాయి లో పండించాలి అనేది సర్వే చేయాటానికి చాలానే ఖర్చు పెడుతుంది మరి ఆ సమాచారం అంతా ఏమవుతుంది :(

    అవునూ ఆ ఎండోసల్ఫాన్ వాడద్దు అని ఏదో గొడవ జరుగుతుంది కదండీ అది ఏమయింది ?

    రిప్లయితొలగించండి
  2. @శ్రావ్య వట్టికూటి: క్షేత్ర స్థాయిలో సమస్యలు చాలానే ఉన్నాయండీ.. మనవి సారవంతమైన భూములు కావడం, నీటి పారుదల సౌకర్యం ఉండడం వల్ల పంటలు బాగానే పండుతున్నాయి. ఇప్పటివరకూ గోదాముల సమస్య పరిష్కారం కాలేదు. ప్లాన్స్ లో మాత్రం బోల్డన్ని గోదాములు ఉంటాయి. దళారీలకీ, రాజకీయ నాయకులకీ ఉండే సంబధాలు, రైతులు బలమైన లాబీయింగ్ చేయగల శక్తులుగా ఎదగక పోవడం లాంటి చాలా కారణాలే ఉన్నాయి..ఎండో సల్ఫాన్ గొడవ ఇంకా కొనసాగుతోంది.. ఇక నా విషయానికి వస్తే పుట్టి, పెరిగింది పల్లెటూరిలో కావడం వల్ల వ్యవసాయం ఆంటే ఆసక్తి. మిత్రులు కొందరు వ్యవసాయం లోనే ఉన్నారు. క్రమం తప్పకుండా వ్యవసాయ వార్తలు చదవడం (ప్లానింగ్ కమిషన్ నివేదిక ఇవాళ పేపర్లలో వచ్చింది), అప్పుడప్పుడూ మిత్రులతో మాట్లాడ్డం వల్ల కలిగే ఆలోచనలని ఇదిగో, ఇలా... ..ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  3. మురళి గారు,

    నిజమే, రైతు ఎన్ని సంవత్సరాలు ఓడాలి. ఎప్పటికి మన నాయకులు ప్రజల కొసం పని చెస్తారు ?

    రిప్లయితొలగించండి
  4. ధన్యవాదాలండి, మురళి గారు.
    వ్యవసాయం మీద ఎంతో సమాచారాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ వెబ్ సైట్ ( /http://agri.ap.nic.in/ ) లో పొందు పరచింది. ఆసక్తి వున్న వారు చదివి ఆకలింపు చేసుకోగలరు. ఇందులో Annual Action plan, weekly crop report, soil test labs' information వంటివి ఉంటాయి అంటే నమ్మగలరా మీరు

    వ్యవసాయం దండుగ అని ఛంద్రబాబు గారు అన్న వార్తని మీకు వీలు పడితే మీ వెబ్ సైట్ లో పెట్ట గలరా? ఇది అతిసయోక్తి కోసం వ్రాసింది కాకుంటే బాగుండు అనుకుంటూ....

    రిప్లయితొలగించండి
  5. ఎందుకో ఈ కోట్ గుర్తువచ్చింది ఈ పోస్ట్ చదువుతున్నప్పుడు:

    " Only after the last tree has been cut down. Only after the last river has been poisoned. Only after the last fish has been caught. Only then will you find that money cannot be eaten. "

    రిప్లయితొలగించండి
  6. @మైథిలి రాం: స్పందనకి ధన్యవాదాలండీ..
    @రమేష్: మీరిచ్చిన సైట్ గతంలో ఒక సారి చూశానండీ.. మంచి సమాచారాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఇక మీరడిగిన విషయం 'చంద్రబాబు నాయుడు ఆన్ అగ్రికల్చర్' అని ఒకసారి గూగులించి చూడండి...
    @Ruth: Appropriate... అంతేనండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. బాగుందండి మి పోస్ట్.ఇప్పుడు మా పని అలానె ఉంది .దిగుబడి ఉన్నా రేటు లేదు.ఐనా అమ్ముకోక తప్పని పరిస్తితి.

    రిప్లయితొలగించండి
  8. @రాధిక (నాని): దాదాపు రైతులందరి పనీ ఒక్కలాగే ఉందండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. Dear Ramesh,

    I don't think our farmers have internet connectivity to check nic.in . My dad is a farmer.

    http://creative-oracle.blogspot.com/

    రిప్లయితొలగించండి