'ప్రేమ ప్రబంధం' అనేది ఈ నవలకి రచయిత ఇచ్చిన ఉపశీర్షిక. ఇది చూడగానే పాతికేళ్ల క్రితం చిన్నగా మొదలై హవాగా మారిన 'యూత్' సినిమాలు గుర్తొచ్చాయి. వాటికి టైటిల్ తో పాటు, టాగ్ లైన్ తప్పనిసరిగా ఉండేది, ఓ సెంటిమెంట్ లాగా. కేవలం శీర్షిక చూస్తేనే కాదు, నవల చదువుతున్నంతసేపూ కూడా యూత్ సినిమా చూస్తున్న అనుభూతే కలిగింది. మణిరత్నం 'ఘర్షణ' సినిమా రిలీజవ్వడం మొదలు, 'గీతాంజలి' సినిమా రికార్డులు బద్దలు కొట్టడం వరకూ జరిగిన మధ్య కాలంలో చిత్తూరు జిల్లా పీలేరు టౌన్ లోని కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఓ అబ్బాయీ, అమ్మాయీ ప్రేమలో పడి, ఆ ప్రేమని గెలిపించుకోడం కోసం చేసిన పోరాటమే ఈ నవల. అబ్బాయి పేరు జీకే నాయుడు, అమ్మాయి పేరు స్నేహలతా రెడ్డి.
కథలోకి వెళ్లేముందు, రచయిత గురించి చెప్పుకోవాలి. 'బారతం బొమ్మలు' 'కానగపూల వాన' లాంటి నిరూపమానమైన కథల్ని రాసిన 'కథా మాంత్రికుడు' గోపిని కరుణాకర్ రాసిన తొలి నవల ఇది. నవల సబ్జెక్టుకి అనుగుణంగా కాబోలు, తన పేరుని 'కరణ్ గోపిని' గా మార్చుకున్నారు. కథ చెప్పడంలో గోపినిది ఓ విలక్షణమైన శైలి. తన కథలన్నీ పల్లెటూరి మట్టివాసనల్ని చిమ్ముతూ, జానపద బాణీలో సాగుతాయి. కథాంశాన్ని తాను పూర్తిగా జీర్ణించుకుని, పూర్తిగా తనదైన పద్ధతిలో ప్రతీకాత్మకంగానూ, కొంత మార్మికంగానూ చెప్పడం గోపిని శైలి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ నవల దగ్గరికి వచ్చేసరికి ఆ శైలిని పూర్తిగా విడిచిపెట్టేశారు. కథనంలో బిగి, ప్రకృతిని కథలో భాగం చేయడం లాంటి వాటిని మాత్రం ఎక్కడా విడిచిపెట్టలేదు.
పీలేరు గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ చదివే జీకే నాయుడికి తన ఖర్చులు తానే సంపాదించుకోవాల్సిన పరిస్థితి. చిన్న చిన్న పనులెన్నో చేసి, చివరికి శ్రీ బాలాజీ టాకీస్ లో బుకింగ్ క్లర్కు గా కుదురుకుంటాడు. రోజూ ఉదయాన్నే కాలేజీ, మధ్యాహ్నం నుంచీ థియేటర్ పని చేస్తూ ఉంటాడు. అదే కాలేజీలో, అతనితోపాటు చదివే అమ్మాయి స్నేహలతా రెడ్డి, పీలేరు టౌన్ లోనే రాజకీయ పలుకుబడి ఉన్న కాంట్రాక్టరు కూతురు. తాపీగా సాగే కథనంలో నాటకీయమైన మలుపుల మధ్య వాళ్ళిద్దరి మధ్యా ప్రేమ పుడుతుంది. క్రమేణా అది పెరిగి పెద్దదవుతుంది. మెజారిటీ ప్రేమకథల్లో లాగే ఇక్కడా వాళ్ళ ప్రేమకి కులమూ, డబ్బూ అడ్డు పడతాయి. వాళ్ళ ప్రేమ చిగిర్చినది మొదలు ఫలించే వరకూ చుట్టూ ఉండే మిత్రులతో పాటు ప్రధానమైన పాత్ర పోషించింది శ్రీ బాలాజీ థియేటర్.
ఈ ప్రేమకథకి నేపధ్యంగా కాలేజీ, సినిమా థియేటర్ తో పాటుగా సాహిత్యాన్నీ వాడుకున్నారు రచయిత. లైబ్రరీలో నాయకుడు నాయికను చూసినప్పుడు అతని రెండు చేతుల్లోనూ చెరో పుస్తకం ఉంటాయి. వాటి మధ్య నుంచి ఆమెని చూస్తాడు. ఒకటి చలం 'మైదానం' రెండోది విశ్వనాథ 'చెలియలికట్ట'. ఆమెతో ఇంకా ప్రేమలో పడక మునుపే "తప్పక చదువు" అని చెప్పి యద్దనపూడి సులోచనారాణి 'ప్రేమలేఖలు' నవల ఇస్తాడు - ఓ మోసగాడికి ప్రేమలేఖలు రాసి చిక్కుల్లో పడ్డ అమ్మాయి కథ. భిన్న జాతులకి చెందిన వారైన కారణంగా ప్రేమలో ఓడిపోయిన రోమియో-జూలియట్ ల కథ క్లాస్ రూమ్ పాఠంగా వస్తుంది (నవల్లో నాయికా నాయకులిద్దరివీ వేర్వేరు కులాలు). ఇలాంటివన్నీ ఓ పక్క కథని ముందుకు తీసుకెళ్తూనే, పాఠకుల్ని నాస్టాల్జియా లోకి తీసుకెళ్తాయి. సందర్భానికి తగినట్టుగా పుస్తకాలని భలే ఎంచుకున్నారు.
పుస్తకాల తర్వాత అంత విరివిగా ప్రస్తావించింది సినిమా పాటల్ని. సినిమా థియేటర్ కూడా ఒక పాత్రగా నడిచే కథలో సినిమా పాటల ప్రస్తావన సహజమే కానీ, చాలాచోట్ల పాటల సాహిత్యాన్ని తప్పుగా రాయడమూ, కొన్ని చోట్ల గాయనీ గాయకుల పేర్లు తప్పు పడడమూ (వాణీ జయరాం పాడిన 'మిన్నేటి సూరీడు' ని జానకి ఖాతాలో వేయడం లాంటివి) జరిగాయి. సినిమాలనీ, పాటల్నీ ఇష్టపడే వాళ్ళకి ఇవి పంటికింద రాళ్లు. పీలేరు పరిసర ప్రాంతాలన్నింటినీ కథలో భాగం చేసేయడం బాగుంది కానీ, ఈ క్రమంలో దొర్లిన పునరుక్తుల్ని పరిహరించుకుంటే బాగుండేది. నాయికా నాయకుల ఫ్రెండ్స్, వాళ్ళ లెక్చరరూ అచ్చం యూత్ సినిమాల్లో పాత్రల్లాగే ప్రవర్తిస్తారు. నాయిక కుటుంబాన్ని పరిచయం చేశారు తప్ప, నాయకుడి కుటుంబాన్ని ఎక్కడా ప్రత్యక్షంగా చూపలేదు - తమ్ముడికి, చెల్లికీ ఫీజు కట్టాలి అనే పరోక్ష ప్రస్తావన తప్ప.
ఇది కేవలం నాయికానాయకుల చుట్టూ తిరిగే కథ కాదు. బలమైన సహాయ పాత్రలున్నాయి. వాటిలో ముఖ్యమైన పాత్ర రసూల్. అతని ప్రేమకథ, చిన్న స్థాయి నుంచి ఎదిగిన వైనం ఇవన్నీ బాగా గుర్తుండిపోతాయి. నాకైతే రసూల్ కథని మెయిన్ ప్లాట్ గానూ, నాయుడి కథ సబ్-ప్లాట్ గానూ నవల రాసి ఉంటే బాగుండేది అనిపించింది. నవల నడక మొత్తం సినిమాలాగే సాగింది. కొన్ని మలుపులు ఊహించగలిగేవి, మరికొన్ని కొత్తగా ఉండి ఆశ్చర్యపరిచేవి. అక్కడక్కడా కొంచం నాటకీయత, హీరో ని ఎలివేట్ చేసే సన్నివేశాలు. సగానికొచ్చేసరికి నవల కాక, సినిమా స్క్రిప్ట్ చదువుతున్న భావన కలిగింది. ఫిక్షన్ ఇష్టపడే వాళ్ళకి నచ్చేసే నవల ఈ 'శ్రీ బాలాజీ టాకీస్'. పాలపిట్ట ప్రచురించిన ఈ 344 పేజీల పుస్తకం వెల రూ. 250, పుస్తకాల షాపుల్లోనూ, ఆన్లైన్ లోనూ కొనుక్కోవచ్చు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి