బుధవారం, మార్చి 04, 2015

పెసరట్టు కూర

ఉదయాన్నే అల్పాహారంగా పుచ్చుకోడానికి ఉప్మా, ఇడ్లీ, దోశ, పెసరట్టు వగయిరాలు బావుంటాయి. వగయిరాలు ఎందుకంటే కొందరు పొంగల్, వడ, పూరీ కూడా బ్రేక్ఫాస్ట్ జాబితాలో వేసి ఉంచేశారు. వీటిలో ఉప్మా అప్పటికప్పుడు చేసుకునే వంటకం. ఇడ్లీ పిండీ, దోశల పిండీ కూడా నిలవ ఉంటాయి కనుక కొంచం మిగిలినా మరేమీ పర్వాలేదు. కానైతే, పెసరట్టు పిండి ఉంది చూశారూ? ఇది నిలవ ఉంటే అస్సలు బాగోదు.. ఉహు, ఫ్రిజ్జులో పెట్టినా సరే. అందుకే, ఓసారి పెసలు కనుక రుబ్బితే పిండిని వెంటనే చెల్లగొట్టేయాల్సిందే. ఇదిగో, ఈ కండిషన్ కారణంగా పుట్టిన వంటకమే పెసరట్టు కూర.

పేరు బరువుగా వినిపిస్తోంది కానీ, పెసరట్టు కూర చేయడం బహు సింపుల్. కావాల్సిన వాటిలో మొదటిది పెసరట్టు. ఎంత కూర కావాలి అన్నదాన్ని బట్టి పెసరట్లు కాల్చి సిద్ధం పెట్టుకోవాలి. కూర కోసం కాల్చే పెసరట్లు కొంచం మందంగా ఉండాలి. ఈ మందపాటి పెసరట్టుని వేడి మీద ఉండగానే అట్లకాడతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి పెట్టేసుకుంటే ముక్కలకి మంచి షేప్ రావడంతో పాటు, చివరి నిమిషంలో హడావిడి కారణంగా వంట పాడయ్యే ప్రమాదం ఉండదు. 'తనకున్న పని తినకున్నా తప్పదు' కాబట్టీ, కూర తినేదే మనమే కాబట్టీ ఆ ప్రకారం ముందుకు పోదాం.


రెడీగా ఉన్న పెసరట్టు ముక్కలని బట్టి, ఉల్లిపాయలు ఎన్ని వేయాలి అన్నది నిర్ణయించుకోవాలి. కొందరు 'ఎత్తుకి ఎత్తూ' వేసేస్తారు. అంటే, పెసరట్టు ముక్కల పరిమాణానికి సరి సమానంగా ఉల్లి ముక్కలు చేరుస్తారన్న మాట. మరీ అన్ని అక్కర్లేదు అనుకుంటే తగ్గించుకోవచ్చు. ఇబ్బందేమీ లేదు. ఉల్లిపాయలు సన్నగా తరిగి పక్కన పెట్టేసుకుంటే రెండో పని కూడా అయిపోయినట్టే. ఎటూ పెసలు రుబ్బేప్పుడే అల్లం, పచ్చిమిర్చి చేరుస్తాం కాబట్టి మళ్ళీ విడిగా వాటిని చేర్చనవసరం లేదు. ఇప్పుడు, పెసరట్టు ముక్కలు, ఉల్లి ముక్కల పరిమాణానికి అనుగుణంగా చింతపండు నానబెట్టుకోవాలి.

ఇప్పుడింక అసలు సిసలైన కూర వంటకం మొదలు. స్టవ్ మీద బాండీ పెట్టి రెండు మూడు చెంచాల నూనె పోసి వేడెక్కనివ్వాలి. నూనె కొంచం వేడెక్కుతూ ఉండగానే కొంచం ఇంగువ, శనగపప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి ముక్కలు, ఆవాలు, జీలకర్ర ఒకదాని తర్వాత ఒకటి వేసి సన్నని సెగ మీద వేగనివ్వాలి. వేగుతూ ఉండగానే ఉల్లిముక్కలని బాండీలోకి జారవిడిచి రెండు మూడు సార్లు కలియతిప్పాలి. ఉల్లిముక్కలు వేగుతున్నాయి అనగా చిటికెడు పసుపు, దూసిన కరివేపాకు చేర్చి మరికొంచం వేగనివ్వాలి. తొందరపడి మాడ్చేసే కన్నా, కొంచం ఓపికగా, మీడియం ఫ్లేం లో వేగనివ్వడమే మంచింది.


ఉల్లిపాయ ముక్కలు బంగారు వర్ణానికి రాగానే, పెసరట్టు ముక్కల్ని బాండీలోకి బదలాయించాలి. తాలింపూ, ఉల్లిముక్కలూ బాగానే కలిసిపోతాయి కానీ, ఆ మొత్తం మిశ్రమం పెసరట్టు ముక్కలతో యుద్ధం ప్రకటిస్తుంది. కాసేపు ఎడమొహం, పెడమొహంగా ఉంటాయి రెండూ. ఒక్క క్షణం బాండీ మీద మూత పెట్టేసి, మనం చింతపండు రసం పని చూసి వచ్చేలోగా పెసరట్టు-ఉల్లి ముక్కలు అన్యోన్యంగా మారిపోతాయి కాబట్టి, బెంగ పడక్కర్లేదు. చింతపండు రసం మరీ చిక్కగానూ, మరీ పల్చగానూ కాకుండా చూసుకోవాలి. కూర రుచిని నిర్ణయించడంలో ముఖ్యపాత్ర ఈ రసానిదే. కాబట్టి, జాగ్రత్త అవసరం.

బాండీ మూత తీసి, చింతపండు రసం పోసి జాగ్రత్తగా కలపాలి. పెసరట్టు ముక్కల ఆకారం పాడవ్వకూడదు, అదే సమయంలో చింతపండు రసం ముక్కలన్నింటికీ పట్టుకోవాలి. వంట మొత్తంలో జాగ్రత్తగా చేయాల్సిన స్టెప్ ఇది. రెండు క్షణాలు మూత పెట్టి ఉంచి, తగినంత ఉప్పు వేసి మరోసారి కలిపి మళ్ళీ మూత పెట్టేయాలి. నాలుగైదు నిమిషాల్లో చింతపండు రసం పీల్చుకుని పెసరట్టు ముక్కలు ముద్దుగా బొద్దుగా తయారయ్యాయి అంటే పెసరట్టు కూర రెడీ అయిపోయినట్టే. వేడి వేడి అన్నంలో తినడానికి చాలా బావుంటుందీ కూర. రుచి నచ్చితే ఈవెనింగ్ స్నాక్ గా కూడా ప్రయత్నం చేయచ్చు. పెసర పిండి నిలవ ఉంచకుండా, వెంటనే అట్లు వేసేసుకుని, తర్వాత కూర చేసుకోవచ్చు.

10 కామెంట్‌లు:

  1. ఎప్పుడూ వినలేదీ కూర. ప్రయత్నించాలి.

    రిప్లయితొలగించండి
  2. ఈ వంటకానికి సరిపడా (అంటే చేస్తున్నప్పుడు వినాల్సిందన్నమాట) పాట కూడా సెలవివ్వండి సారూ (మా ఇంట్లో పెసరట్లే పెనమ్మీంచి కంచం లోకి డైరెక్ట్ అటాక్, ఇంకా కూర కూడానా,ఎప్పుడూ తినలేదండీ)

    రిప్లయితొలగించండి
  3. అంతా బానే ఉంది కాని, చింతపండు రసం దగ్గరే భయం మొదలయ్యింది. ఇంతకీ మీరు ఈ కూరని రుచి చూసారా?
    అయినా తెలుగువాళ్ళయుండి, మన ప్రియమైన పెసరట్టుకి ఇంత తీవ్రమైన శిక్ష విధించడాన్ని నేను ఖండిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  4. మీ వెర్షన్ భలే సింపుల్ గా వుందండీ... వొకసారి మా ఇంటాయన గ్రేవీ టైప్ రెసిపీ చెప్పి చేయించారు. ఆ కూర చేసేసరికి పొట్ట పట్టకపోయినా ఇంకో నాలుగు అట్లు తినేసుండాల్సిందనుకున్నా :)

    రిప్లయితొలగించండి
  5. @bonagiri గారూ, మరేం భయం లేదు. ఈ రెసిపీలో చింతపండు రసం బదులు ఎంచక్కా పుల్ల పెరుగు వేసుకోవచ్చు. నిజానికి చింతపండురసం చిక్కదనం గురించి బెంగెట్టేసుకుని గాభరాపడేంత సీను పెరుగు వేస్తే ఉండదు.మరీ పుల్లని పెరుగు కాకపోతే కూర చక్కగా కమ్మగా ఉంటుంది. గుర్తుచేసినందుకు థాంక్యూ మురళీ.

    రిప్లయితొలగించండి
  6. ఎల్ కే జీ పిల్లలకి చెప్పినట్లు మీరలా చెప్పకపోతే నాకస్సలు అర్ధమయి ఉండేది కాదు మురళిగారు:) ఇంత బాగా మీతో పాఠం చెప్పించుకున్నాక కూడా నేను చేయకపోతే అస్సలు బాగోదు. పప్పుసార్ అడిగినట్లు ఏదైనా ఓ చక్కని పాట కూడా చెప్పండి. జొన్నవిత్తుల వారి కాఫీ పాట అంత బాగుండాలి:) థాంక్యూ.

    రిప్లయితొలగించండి
  7. @జ్యోతిర్మయి: తప్పకుండా ప్రయత్నించండి.. స్నాక్ లా అయినా తినేయచ్చు :)) ..ధన్యవాదాలు..
    @శ్రీనివాస్ పప్పు: నేను ఫోన్ మాట్లాడుతూ చేశానండీ మరి :) ..ధన్యవాదాలు
    @బోనగిరి: అయ్యో, మరీ చిక్కని రసం లో పెసరట్టు ముక్కల్ని నానబెట్టక్కర్లేదండీ.. రుచి కోసం, అంతే.. జిహ్వకో రుచి కదండీ మరి.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  8. @స్ఫురిత మైలవరపు: మీరు చేసిన వంటకం బహుశా 'బిళ్ళల పులుసు కూర' అయి ఉంటుందండీ.. పెసరట్టు ముక్కలకి గ్రేవీ అక్కర్లేదు మరి.. ధన్యవాదాలు..
    @సుధ: థాంక్యూ.. థాంక్యూ..
    @జయ: మీకు బాహా నచ్చిన పాట పాడుకుంటూ చేసేయండి :)) ..ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి

  9. హాశ్చర్యం ! నెమలి కన్ను వారి టపా యే నా ఇది !!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. @జిలేబి: అవునండీ, అక్షరాలా నేనే :) ..ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి