శుక్రవారం, ఫిబ్రవరి 27, 2015

రాగం

ఆమె పచ్చని కోనసీమలో కాపురముండే  మధ్యతరగతి ఇల్లాలు. కర్ణాటక సంగీతాన్ని ప్రాణప్రదంగా ప్రేమించే ఆమె గొంతు విప్పిందంటే ఆ గమకాల ముందు అక్కడ ప్రవహించే గోదారి మూగబోవాల్సిందే. కానీ, ఆమె గొంతు విప్పదు. తన సంగీతాన్ని దేశమంతటికీ వినిపించాలని ఒకప్పుడు కలలు కన్న ఆమె, ఉన్నట్టుండి మూగదైపోయింది. తన కళ్ళముందే కన్నకొడుకు, ప్రాణ స్నేహితురాలు ఓ ప్రమాదంలో ప్రాణం విడవడంతో తన స్వర ప్రస్థానాన్ని ఆరంభించకుండానే ఆపేసింది. తన ఇల్లు దాటి బయటికి రాడానికి ఇష్టపడని ఆ నడివయసు స్త్రీ పేరు స్వర్ణలత.

అతను సంగీతమే ఊపిరిగా భావించే కుర్రాడు. సొంత ఊళ్ళో గోదారొడ్డున వందలాది ఎకరాల వ్యవసాయం ఉంది. కానీ చేయడు. వ్యాపారం, ఉద్యోగం.. ఇవేవీ అతనికి నచ్చవు. చరిత్రలో చార్మినార్ కి ఓ ప్రత్యేక స్థానం ఉన్నట్టుగానే తను సృజించే సంగీతానికీ చోటుండాలి అన్నది అతని కల. వాయులీన విద్వాంసురాలైన తల్లిని చిన్నతనంలోనే పోగొట్టుకుని, తనని ఏమాత్రం అర్ధం చేసుకోని తండ్రికి తన మార్గాన్ని వివరించి చెప్పలేక, వచ్చిన కొద్దిపాటి పేరుతో ఆగిపోలేక, సంగీతంలో ఎదిగే దారులు వెతుక్కుంటున్న ఆ కుర్రాడి పేరు అభినయ్.

ఆ అమ్మాయి తండ్రి లేని పిల్ల. తల్లి ఓ ఫ్యాషన్ డిజైనర్. నగరంలో ఆమె నడిపే బోతిక్ కి వచ్చే కస్టమర్స్ అందరూ బాగా డబ్బున్న వాళ్ళే. వ్యాపారం చేయడం వెన్నతో పెట్టిన విద్య ఆమె తల్లికి. కానీ, ఆ అమ్మాయి జీవితంలో ఒంటరితనం. తనని ఎంతగానో ప్రేమించిన తండ్రిని చాలా చిన్నతనంలోనే కోల్పోయింది ఆ అమ్మాయి. ఓ ప్రమాదంలో మరణించిన తండ్రిని గురించి మాట్లాడడం తల్లికి ఇష్టం ఉండదు. తన ఒంటరి తనం నుంచి దూరంగా జరగడం కోసం సంగీతాన్ని ఆశ్రయించింది ఆ అమ్మాయి. పాప్ మ్యూసిక్ నేర్చుకుని పాటలు పాడడంలో ఆనందాన్ని వెతుక్కుంటోంది. ఆమె పేరు ప్రియాంక. ముద్దు పేరు పింకీ.


ఒకప్పుడు సంగీతాన్ని తన శ్వాసగా చేసుకున్న స్వర్ణలత, నగరంలో కచేరీ ఇవ్వడం కోసం బస్సులో ప్రయాణం చేస్తూ ఉండగా గోదారి వంతెన మీద బస్సుకి ప్రమాదం జరిగి కొడుకునీ, స్నేహితురాలినీ కోల్పోయింది. అప్పటినుంచీ, తనా వంతెన మీదకి వెడితే అరిష్టం అని నమ్మకం ఆమెకి. అరిష్టం స్వర్ణలతకి కాదు, ఊరికి. అందుకే తనని తాను ఇంటి నాలుగు గోడలకీ పరిమితం చేసేసుకుంది. అప్పటి వరకూ వ్యాపార ప్రకటనలు తయారు చేస్తున్న వాడల్లా, చేతిలో పని వదిలేసి మ్యూసిక్ ట్రూప్ ఆరంభించడం కోసం ప్రయత్నం చేస్తున్న అభినయ్ కి పింకీ పరిచయమవుతుంది. వీళ్ళిద్దరూ కలిసి ఓ గిటారిస్ట్ నీ, డ్రమ్స్ ప్లేయర్ నీ కూడా ఓ చోటకి చేర్చి రిహార్సల్ ఆరంభిస్తారు.

తనకున్న కాంటాక్ట్స్ ఉపయోగించి ఈ ట్రూప్ కి ఓ కార్యక్రమం ఏర్పాటు చేయిస్తుంది పింకీ తల్లి. ఎంతో నమ్మకంగా ప్రోగ్రాం చేసిన అభినయ్ కి నిరాశ ఎదురవుతుంది. వీళ్ళ ట్రూప్ ఇచ్చిన కచేరీలో ఎలాంటి ప్రత్యేకతా లేదని పెదవి విరుస్తారు నిర్వాహకులు. పాప్, ర్యాప్ సంగీతానికి ప్రత్యేకతని అద్దాలంటే ఫ్యూజన్ ని మించింది ఏముంది? శాస్త్రీయ సంగీతం తెలిసిన గాయని తోడైతే ట్రూప్ కి మరి తిరుగుండదు. అప్పటికే అభి కి స్వర్ణలత పరిచయం. కానీ, ఆమె వంతెన దాటి బయటికి రాదు. ఆమె వంతెన దాటకపోతే అవకాశాలు ఉండవు. తనకంటూ ఓ ప్రత్యేకత నిలుపుకోవాలన్న అభి కోరిక, పదుగురెదుట పాడాలన్న స్వర్ణలత అభిలాష ఎలా సాకారమయ్యాయో చెబుతుంది పదకొండేళ్ళ క్రితం విడుదలైన 'రాగం' సినిమా.


'మార్నింగ్ రాగా' పేరిట ఇంగ్లీష్ లో నిర్మించి, 'రాగం' గా తెలుగులోకి అనువదించిన ఈ సినిమాలో స్వర్ణలత గా షబానా ఆజ్మీ, అభి గా ప్రకాష్ కోవెలమూడి (దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు తనయుడు), పింకీ గా పెరిజాద్ జొరాబియన్ నటించారు. సుధా రఘునాథన్, కల్యాణి మీనన్ పాడిన "మాతే.. మలయధ్వజ పాండ్య సంజాతే" తో ఆరంభమయ్యే ఈ ఎనభై తొమ్మిది నిమిషాల నిడివిగల సినిమా సుధా రఘునాథన్, రంజని రామకృష్ణన్ పాడిన "తాయే యశోదా" తో పూర్తవుతుంది. 2004 అక్టోబర్ లో విడుదలైన ఈ సినిమా కథకి అదే సమయంలో విడుదలైన శేఖర్ కమ్ముల 'ఆనంద్' సినిమా కథతో రేఖామాత్రపు పోలిక ఉండడం కేవలం యాదృచ్చికం.

కథకుడు మహేష్ దత్తాని స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని కె. రాఘవేంద్ర రావు నిర్మించారు. మణిశర్మ, అమిత్ హేరీ సంగీతాన్ని సమకూర్చారు. నటీనటుల్లో అగ్ర తాంబూలం స్వర్ణలతగా చేసిన షబానా ఆజ్మీకే ఇవ్వాలి. ఒక్క నడకని మినహాయించుకుంటే, వెనుకటి తరం కోనసీమ స్త్రీగా ఆమె పాత్రలో ఇమిడిపోయింది. ఇంగ్లీష్ లో తీసి తెలుగుకి అనువదించడం వల్ల కాబోలు ధర్మవరపు సుబ్రహ్మణ్యానికి వేరే వాళ్ళ చేత డబ్బింగ్ చెప్పించారు. అభి తండ్రిగా జమీందారు పాత్రలో నాజర్ ఒప్పించాడు. రాజీవ్ మీనన్ కెమెరాలో మరింత అందంగా కనిపించింది కోనసీమ. తెలుగు వన్ సమర్పించిన యుట్యూబ్ వీడియోలో మొదటి పది పదిహేను నిమిషాలు ఆడియో క్వాలిటీని భరించాలి. మొత్తం మీద చూసినప్పుడు ఈ సినిమాకి రావల్సినంత పేరు రాలేదేమో అనిపించింది.

10 వ్యాఖ్యలు:

Sujata చెప్పారు...

Yes. Absolutely brilliant music. Hero is raghavendra rao, BA' s son. He is a pleasant sueprise. Nice movie.

అజ్ఞాత చెప్పారు...

ఆ సినిమా నాకు చాలా ఇష్టమైన సినిమా.

krishna చెప్పారు...

Chala man hi paatalu..

రాధిక(నాని ) చెప్పారు...

బావుందండి . టివి లో అస్తమాను వేసిన సినిమాలే వంద సార్లయినా వేస్తుంటారు కాని ఇటువంటి సినిమాల జోలికి మాత్రం పోరేంటో పాటలు ఇష్టం .

మురళి చెప్పారు...

@Sujata: ఎన్నాళ్ళకెన్నాళ్ళకీ... పాత బ్లాగు రోజులు గుర్తొచ్చాయండీ ఒక్కసారిగా.. ..అవును, రాఘవేంద్ర రావు బీయే గారబ్బాయి బాగా చేశాడు, సర్ప్రైజింగ్ గా :)) ..ధన్యవాదాలండీ..
@chitralaxman: ధన్యవాదాలండీ..

మురళి చెప్పారు...

@Krishna: ధన్యవాదాలండీ..
@రాధిక (నాని): శాటిలైట్ రైట్స్ ఎవరికీ ఇవ్వలేదేమోనండీ మరి.. ..ధన్యవాదాలు..

అజ్ఞాత చెప్పారు...

టివిలో ఈ సినిమాని ఇంగ్లీషులో చూసాను. ఎందుకో సహజంగా అనిపించలేదు. సినిమాకి తక్కువ, డాక్యుమెంటరీకి ఎక్కువలా ఉంది.

మురళి చెప్పారు...

బోనగిరి: చిన్నసినిమా అండీ :) కోనసీమ, గోదారి కనిపించడం వల్లేమో, నాకు నచ్చేసింది :) .. ధన్యవాదాలు.

prasad చెప్పారు...

"taaye yasoda " paata , yenni saarlu vinna , malli malli vinalanipisthundi.

మురళి చెప్పారు...

@ప్రసాద్: అవునండీ.. నాకు నచ్చే అతి తక్కువ ఫ్యూజన్ లలో ఇదీ ఒకటి.. ధన్యవాదాలు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి