ఆదివారం, మార్చి 08, 2015

ఆరుగజాల అద్భుతం ...

సరికొత్త ఫ్యాషన్ల వెల్లువ అనునిత్యం మార్కెట్ ని ముంచెత్తుతున్నా, భారతీయ వస్త్ర విశేషం 'చీర' తన స్థానాన్ని కోల్పోలేదు సరికదా, ఏటికేడూ బలాన్ని పెంచుకుంటోంది. సామాన్య ధరకి అందుబాటులో ఉండే చేనేత, మిల్లునేత రకాల మొదలు లక్షలు విలువచేసే డిజైనర్ వెరయిటీల వరకూ భారతీయ మహిళల ఆదరణకి పాత్రం కాని చీర రకం లేదనడం అతిశయోక్తి కాదు. కేవలం మధ్య వయసు మహిళలని మాత్రమే కాదు, విద్యార్ధినులు, నవతరం ఉద్యోగినులను సైతం ఆకర్షిస్తోంది చీర. అందుకే, వెస్ట్రన్ వేర్ తాకిడికి తట్టుకుని నిలబడడమే కాదు, దేశీయ మార్కెట్లో బలమైన పోటీనీ ఇస్తోంది మన ఆరుగజాల అద్భుతం.

దేశీయ 'ఎత్నిక్ వేర్' మార్కెట్ లో మహిళల వాటా అక్షరాలా ఎనభై ఏడు శాతం. చీరలు, సల్వార్లు, లెహంగాలు, గాగ్రాల మధ్య పోటీలో మళ్ళీ చీరదే అగ్రస్థానం. ఈ మార్కెట్ ఏటా ఎనిమిది శాతం వృద్ధిరేటుని నమోదు చేసుకుంటోంది. మార్కెట్ లెక్కల ప్రకారం, గడిచిన సంవత్సరంలో 'ఎత్నిక్ వేర్' మార్కెట్ మొత్తం విలువ సుమారు యాభై ఐదు వేల కోట్లు కాగా అందులో కేవలం చీరల వాటా ఇరవైనాలుగు వేల కోట్లు! రానున్న ఐదేళ్ళలో 'అపారెల్' మార్కెట్లో వేగంగా వృద్ధి చెందడానికి అవకాశం ఉన్న సెగ్మెంట్లలో 'శారీస్' ఒకటి. ఆ వెనుకే సల్వార్లు, గాగ్రాలూను. ఏ సంస్థ వేసిన అంచనాని చూసినా ఎనిమిది శాతానికి తగ్గడంలేదు వృద్ధిరేటు.


సింధు నాగరికత వెల్లివిరిసిన కాలంలోనే భారతీయ మహిళలు చీరలు ధరించారని చరిత్రకారులు పరిశోధించి కనుగొన్నారు. మెజారిటీ భారతీయలు 'పంచమవేదం' గా గౌరవించే మహాభారతంలో ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టం చీర ఉనికిని ప్రస్తావించింది. దేశంలో ఏ మూలకి వెళ్ళినా వనవాస కాలంలో సీతమ్మవారు నారచీరెలు ఆరేసుకున్న స్థలాలని భక్తితో పూజించే జనం నేటికీ కనిపిస్తారు. అయితే, కాలంతోపాటు అన్ని రంగాల్లోనూ వేగంగా వచ్చి పడిపోతున్న మార్పు, చీర విషయంలో కాస్త వెనక్కి తగ్గాల్సి రావడం ఆశ్చర్యమే. ఫ్యాషన్లకి అనుగుణంగా చీరల డిజైన్లలో ఊహాతీతమైన మార్పులు వచ్చాయి.  ధరలతో నిమిత్తంలేకుండా అమ్మకాలూ ఆ స్థాయి లోనే పెరిగాయి. ఉద్యోగం చేసే మహిళల సంఖ్య పెరగడం ఇందుకు ఒక కారణం.

భారతదేశంలో ఏటా సుమారు ఎన్ని చీరలు అమ్ముడవుతాయి? ప్రతి మగవాడికీ జీవితంలో కనీసం ఒక్కసారన్నా ఆలోచనలోకి వచ్చే ఈ ప్రశ్నకి ఠకీమని జవాబు చెప్పే వీలులేదు. ఎందుకంటే, చీరల మార్కెట్లో 'ఆర్గనైజ్డ్' సెక్టార్ కన్నా, 'అనార్గనైజ్ద్ ' సెక్టార్ వాటా అధికం. దీనికి కారణం, మొత్తం చీరల మార్కెట్లో అరవైశాతానికి పైచిలుకు గ్రామీణ భారతంలోనే ఉండడం, అక్కడి అమ్మకాలు నేటికీ  షాపుల ద్వారా కాక, చిరువ్యాపారుల ద్వారా ఎక్కువగా జరగడమూను. కాబట్టి, ఎవరికివాళ్ళు ఓ సంఖ్యని మనసులో అనేసుకోవచ్చు. (రెండు వందల కోట్ల నుంచి రెండు వందల యాభై కోట్లు ఉండవచ్చని ఓ అంచనా).

పల్లెలే కాదు, ఓ మోస్తరు పట్టణాల్లోనూ ఈ తరహా వ్యాపారస్తులని చూడొచ్చు. మధ్యాహ్నపు వేళల్లో సైకిళ్ళ మీదో, మోటారు సైకిళ్ళ మీదో తిరుగుతూ ఏదో ఓ ఇంటి చావిట్లో చాప పరుచుకుని కూర్చుని చుట్టూ చేరిన మహిళలకి కొత్తచీరల గడివిప్పి నాణ్యతని వర్ణిస్తూ ఉంటారు వీళ్ళు. మంచి చీరలని చూపించి, మెప్పించి, వెంటనే విక్రయించి, సొమ్ముని మాత్రం వాయిదాలలో వసూలు చేసుకోవడం వీళ్ళ ప్రత్యేకత. అసలు 'మంత్లీ ఇన్స్టాల్మెంట్' అనే వ్యాపార సూత్రానికి ఆద్యులు వీళ్ళేనేమో అని సందేహం కలిగేస్తూ ఉంటుంది. నేతపనివారి మొదలు, ఈ చిరు వ్యాపారులు, టైలర్ల వరకూ ఎందరికి ఉపాధి చూపిస్తోందో కదూ చీర.

ఇంత గొప్ప చీరని ఊరికే వదిలేస్తారా మన సినిమా వాళ్ళు? 'పుట్టింటి పట్టుచీర' లాంటి సినిమాలతో అటు సెంటిమెంట్ నీ ఇటు బాక్సాఫీసునీ కూడా పిండేశారు. 'ఆరేసుకోబోయి పారేసుకో'డం మొదలు  'నీలిరంగు చీరలో చందమామ' వరకూ ఎన్ని పాటలకి వస్తువయ్యిందో కదూ ఈ చీర. దాదాపు పుష్కర కాలం క్రితం వచ్చిన ఓ సినిమాలో చీర గొప్పదనాన్ని వర్ణిస్తూ చొప్పించిన పాటని గురించి మిత్రులొకరు చేసిన వ్యాఖ్య గుర్తొస్తోంది. "ఆ పాట సాహిత్యాన్ని లైను పక్క లైను రాసుకుంటూ పోతే చీర మీద చక్కని వ్యాసం తయారవుతుంది.." టీవీలో ఆపాట వచ్చినప్పుడల్లా ఈ వ్యాఖ్య గుర్తొస్తూ ఉంటుంది.


అలనాటి ఆణిముత్యం 'మల్లీశ్వరి' చూసినవాళ్ళకి, నేతపని వారు ఒకప్పుడు ఎంత వైభవంగా జీవించారో ప్రత్యేకం చెప్పక్కర్లేదు. (ఒంటినిండా నగలతో మెరిసిపోయే 'మల్లీశ్వరీ వాళ్ళమ్మ' కనీసం రెండు మూడు తరాల మగ పురుషులకి ఓ పీడకల!) మరి ఇప్పుడు, చీరల అమ్మకాలు విపరీతంగా పెరిగినా నేసే వారి జీవితాలు నానాటికీ తీసికట్టుగానే ఉంటున్నాయి ఎందుకని? ఎందుకంటే, వేలు, లక్షల రూపాయల ఖరీదుకి అమ్ముడయ్యే డిజైనర్ చీరలు మగ్గాల మీద తయారవ్వడంలేదు. చేనేత మార్కెట్లో పేరుకుపోయిన మధ్యవర్తుల పెత్తనం, కొన్ని షాపింగ్ మాల్స్ వాళ్ళు మిల్లునేత చీరలని చేనేతలుగా చలామణి చేసేయడం ఇవన్నీ నేత వృత్తిలో ఉన్న వారి ఆదాయాన్ని దారుణంగా దెబ్బ తీస్తున్నాయి.

మనసుకి నచ్చిన చీరని కొనుగోలు చేసే విషయంలో ఏమాత్రం రాజీ పడని అతివలు, ఆ చీరకి వెచ్చిస్తున్న మొత్తంలో ఎక్కువ శాతం చీరని తయారు చేసేవాళ్లకి చెందాలన్న ఆలోచన చేస్తే నెమ్మదిగా అయినా చేనేత మగ్గాలకి పూర్వ వైభవం దక్కే అవకాశం ఉంది. దగ్గరలో మగ్గాలుంటే సరే. లేదూ, ఏటా ఒకరి రెండు టూర్లు ఏదో రూపంలో ఉంటాయి కాబట్టి, అలా వెళ్ళినప్పుడు చుట్టుపక్కల ఉన్న మగ్గాలని దర్శించి, నచ్చిన చీరలని కొనుగోలు చేయడం ద్వారా ఇటు మహిళలు, అటు నేత పని వారూ కూడా లాభపడే వీలుంది. ఉత్పత్తి స్థలంలో నిర్ణయించే ధర, మార్కెట్ ధరకన్నా తక్కువగా ఉంటుందని కదా అర్ధ శాస్త్రం చెబుతోంది. తయారీ దారుల నుంచే నేరుగా కొనుక్కున్న చీరలు మరింత అందంగా కనిపిస్తాయి. కాదంటారా?

3 కామెంట్‌లు:

  1. అరుణం అరుణం ఒక చీర
    అంబర నీలం ఒక చీర
    హరితం హరితం ఒక చీర
    హంసల వర్ణం ఒక చీర

    రిప్లయితొలగించండి
  2. అమీర్ పేట ఉప్పాడ వీవర్ సొసైటీలో కొంటే అక్కడి రేట్ కే ఇస్తారు. పైగా మనీ ఆ వీవర్స్ కి పంపిస్తారట. పోచంపల్లి వెళ్ళి అక్కడ ఇళ్ళల్లో వాళ్ళ మగ్గాలు, నేతవిధానము అన్నీ చూసి అక్కడ చీరలు కొన్నాం. ఎంత సంతోషించారో వాళ్ళు. మా దగ్గిర ప్రతి శనివారం మధ్యాన్నం ఎన్నో ప్రాంతాల చీరల వాళ్ళని రానిస్తారు. ఆనందంగా తక్కువరేట్ కే ఎన్నో వెరైటీ చీరలు కొనుక్కుంటాము. ఇళ్ళకి వచ్చే చీరల వాళ్ళదగ్గిర కూడా తీసుకుంటాను. ముఖ్యంగా వెంకటగిరి నుంచి ఎన్నో ఏళ్ళుగా వచ్చే ఓ ముస్లిం అతను ఉన్నాడు. నేను పరిచయం చేసిన అందరూ తీసుకుంటున్నారు. మా అబ్బాయైతే ఏంటమ్మా నువ్వూ ఓ షాప్ పెడ్తావా అంటాడు:))) తూర్పు వెళ్ళే రైలు పాట గుర్తుకొస్తోంది. ఈ పోస్ట్ నాకు భలే నచ్చింది మురళి గారు:)

    రిప్లయితొలగించండి
  3. @శ్రీనివాస్ పప్పు: "శరద్వేళ అభిసారికలా.." అని పాడుకున్నానండీ రోజంతా :) ..ధన్యవాదాలు..
    @జయ: టపా రాస్తూ మిమ్మల్ని, మాలాకుమార్ గారిని తలచుకున్నానండీ.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి