గురువారం, జనవరి 12, 2012

ఉత్తరాంధ్ర యాత్ర-6

తిరిగి తిరిగి అలసిపోయి, ఆపై భోజనం చేశామేమో, అందరికీ నిద్ర ముంచుకొచ్చే లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆ నిద్రని పోగొట్టడానికా అన్నట్టు ఒక్కసారి డప్పు శబ్దాలు వినిపించాయి. అవేమిటా అనుకునే లోగానే గైడు వచ్చి చెప్పాడు, హోటల్ ప్రాంగణంలోనే టూరిస్టుల కోసం గిరిజనుల 'ధింసా' నృత్యం ఏర్పాటు చేశామని. ఆ ప్రకటన వినగానే అందరూ ఒక్కుదుటన డేన్స్ చూడడానికి కదిలారు. అందరితో పాటే మేమూను. ఓ డజను మంది గిరిజన స్త్రీలు టూరిస్టులతో కలిసి ఫొటోలకి ఫోజులిస్తున్నారు. గిరిజన యువకులు డప్పుల దరువు సరి చూసుకుంటున్నారు.

కాసేపట్లో ధింసా నృత్యం మొదలైపోయింది. నృత్యం జరుగుతూనే ఉంది కానీ, నేనెందుకో లీనం కాలేకపోతున్నాను. అప్పుడు చూశాను కొంచం పరిశీలనగా. అంచున్న శిల్కు చీరలు వాళ్ళు పద్ధతిలో కట్టుకుని, సిగలో ప్లాస్టిక్ పూలు ముడుచుకుని నృత్యం చేస్తున్న మహిళలు ఏదో యాంత్రికంగా కదులుతున్నట్టు అనిపించిందే తప్ప చేస్తున్న నృత్యంలో లీనమైనట్టు అనిపించలేదు. మధ్యమధ్యలో టూరిస్టుల వీడియో కెమెరాల వైపు చూస్తున్నారేమో, నాకు 'సాగర సంగమం' సినిమా ప్రారంభంలో ఎస్పీ శైలజ చేసే డేన్స్ గుర్తొచ్చింది.

నృత్యం అవుతుండగానే అందరినీ బస్సులు ఎక్కమన్న ప్రకటన వచ్చింది. మొదట గాలికొండ వ్యూ పాయింట్ చూపించి, అక్కడినుంచి బొర్రా గుహలు తీసుకెడతారట. బస్సు కిటికీ నుంచి చూస్తుంటే అరకు అందంగానే కనిపిస్తోంది.. ఏదో లోపం.. అదేమిటో అర్ధమయ్యేసరికి మేము గాలికొండ వ్యూ పాయింట్ చేరుకున్నాం. అరకులోనే ఎత్తైన ప్రదేశమట అది. బైనాక్యులర్స్ సరి చేసుకునే వాళ్ళు, ఫోటోలు దిగే వాళ్ళు, ఫోన్ సిగ్నల్స్ కోసం ప్రయత్నించే వాళ్ళు.. అంతటా కోలాహలం. కొందరు గిరిజనులు కాఫీ గింజలు, కాఫీ పొడి, మసాలా దినుసులు అమ్మకానికి పెట్టారక్కడ. మన్యం కాఫీ అంటూ అప్పుడెప్పుడో పేపర్లో చూసింది గుర్తొచ్చి కాఫీపొడి తీసుకున్నాం.


నా ఆలోచన నిజమేనా అని నన్ను నేను పరిక్షించుకుంటూ, చుట్టూ వెతుకుతూ ఉండగానే బస్సు అనంతగిరి కాఫీ తోటలు దాటుకుని బొర్రా గుహలు చేరుకుంది. ఇక్కడ మాకు గంట టైం ఇచ్చాడు గైడు. మెట్లు ఎక్కుతూ, దిగుతూ ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ ఆ గుహలని లైట్ల వెలుగులో చూడడం ఓ చిత్రమైన అనుభూతి. రాక్ ఫార్మేషన్ గురించి ఎప్పుడో ఎక్కడో చదివిన సంగతులు గుర్తొచ్చాయి. గుహల నిర్వహణ బాగుంది. బయటికి వచ్చి రెస్టారెంట్లో టీ తాగుతుండగా గైడు కొంచం ఖాళీగా కనిపించాడు, ఇంకా రావాల్సిన వాళ్ళకోసం ఎదురు చూస్తూ. నాక్కలిగిన సందేహాన్ని అతని ముందు ఉంచేశాను. "అరకు అనగానే పసుపచ్చ పూలే గుర్తొస్తాయసలు. వాటిని చూడ్డం కోసమే ఈ సీజన్ ఎంచుకుని వచ్చాం. ఒక్క పువ్వూ కనిపించడం లేదిక్కడ," నా ప్రశ్న పూర్తి కాకముందే అందుకున్నాడతను.

"వాటిని వలస పువ్వులంటారు సార్ ఇక్కడ. ఆవ నూనె లాంటి నూనె వచ్చే గింజలని ఇచ్చే మొక్కలవి. ఇక్కడ, ఒరిస్సాలోనూ వంటలో ఆ నూనెనే వాడతారు. రెండు మూడేళ్ళ నుంచీ ఆ పంట వెయ్యడం మానేశారు వీళ్ళు. గత ఏడాది వరకూ అక్కడక్కడా కనిపించేది, ఈ ఏడాది ఒక్క మొక్కా లేదు," అతను చెప్పింది విన్నాక చాలా ఆశ్చర్యం కలిగింది నాకు. మరికొంచం కబుర్లలో పెట్టాను. గిరిజనుల నుంచి నూనె గింజలని గిరిజన కార్పోరేషన్ కొంటుందిట. రేటు గిట్టుబాటు కావడం లేదని ట్రైబల్స్ ఎప్పటినుంచో గొడవ చేస్తున్నాకార్పోరేషన్ పట్టించుకోవడం లేదుట. దానితో, ట్రైబల్స్ అంతా కూడగట్టుకుని, పంట వెయ్యడమే మానేశారుట. "ఎవరన్నా సినిమా వాళ్ళు వచ్చి, షూటింగ్ కోసమని డబ్బులిస్తే వాళ్ళు అడిగినంత మేరా పంట వేస్తారు సార్. ఈసారి సినిమా వాళ్ళు కూడా ఎవరూ వచ్చినట్టు లేరు," చెప్పాడు గైడు.

చాలా చాలా ఆశ్చర్యం కలిగింది నాకు. గిరిజనులంతా కలిసి ఓ నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నా, ప్రభుత్వంలో కదలిక లేకపోవడం, అన్నింటికీ మించి అనవసరమైన విషయాలకి హడావిడి చేసే మీడియా ఇంత ముఖ్యమైన విషయాన్ని కనీసం పట్టించుకోకపోవడం.. తరువాతి ప్రయాణమంతా ఇదే ఆలోచన వెంటాడింది నన్ను. పచ్చపూలు లేని అరకు బోసిగా కనిపించింది. అంతకు మించి, గిరిజనుల్లో వచ్చిన చైతన్యం ఓ వెలుగులాగా అనిపించింది. తైదా రిసార్ట్స్ దగ్గర టీ, స్నాక్స్ కోసం బస్సులు ఆగినప్పుడు మళ్ళీ కదిలించాను గైడుని. "బొర్రా గుహలు ఒక్కటే టూరిస్ట్ ఎట్రాక్షన్ సార్ ఇప్పుడు. బాక్సైట్ అంటున్నారు.. ఈ కొండలు ఉంటాయో, తవ్వేస్తారో, నాకు అనుమానంగానే ఉంది," అన్నాడతను.

అరకులో కనిపించిన మార్పులు, యాంత్రికంగా చేసిన ధింసా నృత్యం, పచ్చపూలు లేని అరకు, కొత్తగా వచ్చిన బాక్సైట్ విపత్తు..ఈ లోయ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో, ఆలోచనకి అందలేదు. ఘాట్ రోడ్డులో బస్సు ప్రయాణం.. మెలికలూ, మలుపులూ ఎక్కువకావడంతో మావాళ్ళు కొంచం ఇబ్బంది పడ్డారు. దీనితో అలసట మరీ ఎక్కువగా అనిపించింది నాకు. జవాబు లేని ప్రశ్నలతో విశాఖ చేరుకున్నాను. బహుశా, కాలం మాత్రమే జవాబు చెప్పగలిగే ప్రశ్నలివి. ....."టూర్ అనగానే పొరుగు రాష్ట్రాలు కాదు. మన రాష్ట్రంలో చూడని వాటిని ముందుగా చూసెయ్యాలి," ఇల్లు చేరగానే మావాళ్ళ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఇది. (అయిపోయింది).

21 కామెంట్‌లు:

  1. అరకులోని పచ్చపూల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలియచేశారండీ..

    "టూర్ అనగానే పొరుగు రాష్ట్రాలు కాదు. మన రాష్ట్రంలో చూడని వాటిని ముందుగా చూసెయ్యాలి,"

    నాతో పాటూ మా కుటుంబ సభ్యుల అభిప్రాయం కూడా ఇదే..

    రిప్లయితొలగించండి
  2. ఏదో, మీ వల్ల ఇంత కాలానికి ఆంధ్రా తిరిగొచ్చానండి. లేకపోతే ఇందులో నేను చూసింది కేవలం ఒక్క శాతం మాత్రమే:)

    రిప్లయితొలగించండి
  3. బాగున్నాయండీ మీ యాత్రా విశేషాలు! కళ్ళకు కట్టినట్టు చూపి మమ్మల్ని కూడా మీతో పాటు తీసుకెళ్ళారు. మరి అరకు దగ్గర జలాశయానికి వెళ్ళలేదా? అప్పుడే అయిపోయిందా చదువుతున్న కొద్దీ ఇంకా చదవాలనుంది అంత బాగా వర్ణించారు.

    రిప్లయితొలగించండి
  4. మొత్తం సిరీస్ నేను చాలా ఎంజాయ్ చేశాను మురళిగారు. ప్రదేశాలను చూడడం ఒక ఎత్తైతే వాటిని ఇంత చక్కగా మీమాటల్లో సాహిత్యంతో కలగలిపి చూపించడం బ్రహ్మాండంగా ఉంది. ఖచ్చితంగా నేను ఇపుడు వెళ్ళినా ఇంతగా ఆస్వాదించి ఉండేవాడిని కాదు అంత చక్కటి అనుభూతినిచ్చింది మీ ఈ సీరీస్... టూర్ కి కొత్త అర్ధం నేర్చుకున్నట్లుగా అనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  5. మీ యాత్రా కధనాలు చాలా బాగున్నాయి. యాత్రలకి వెళ్ళడమే కాదు ఏమి చూడాలి, ఎలా చూడాలి అని కూడా తెలియ చెప్పారు. మీ పరిశీలనా దృష్టి సాహిత్య పరం గా, చరిత్ర పరం గా బాగుంది.

    మంచి టపాలు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. I do not know if you have given the tour booking information anywhere. If you did I missed it. Can you provide how you booked the tickets and who to contact etc for us to use? TIA

    రిప్లయితొలగించండి
  7. అవి అవిసె పూలని విన్నానండి. అలాగే గిరిజన్ తేనె కూడా ఆమధ్య వరకు దొరికేది. మీరు చెప్పిన సమస్య లాంటిదే ఏదో జరిగి ఇపుడు దొరకడం లేదు.గిరిజన్ కార్పోరేషన్ కి కాకుండా వాళ్ళు బయటే అమ్ముకుంటున్నారు ఇపుడు. ఆ స్థానంలో మునుపు లేని కంపెనీల తేనె సీసాలు ఎన్నో షాపుల్లో. వాటి తీపి రుచి కి అలవాటు పడిన మా పిల్లలు మేము ఏడాది క్రితం అరకు వెళ్ళినపుడు కొని తెచ్చిన (ప్యూర్ తేనె కాస్త వగరుగా ఉంటుంది) తేనెని వద్దు పొమ్మన్నారు. అల్లాగే కుంకుళ్ళు, శీకాకాయ లాంటివి కూడా. globalisation అంటే ఇదేనా? originality కి ఎన్నెన్ని విధాలుగా దూరమైపోతున్నమో. మీ యాత్ర , ఆలోచింపచేస్తూ, ఆహ్లాదంగా సాగుతోంది.

    రిప్లయితొలగించండి
  8. బాగా అలిసిపోయినట్లున్నారు. మరి సంక్రాంతి శుభాకాంక్షలు అందుకోండి.

    రిప్లయితొలగించండి
  9. చక్కగా ఇన్ని ప్రదేశాలు చూసొచ్చాక ఆ మాత్రం అలసట ఉండడం సహజమే.....
    ఎంతైనా మీకు ఓపిక ఎక్కువేనండీ...... ఈ రోజుల్లో ఒక్క రోజు ఊరెళ్ళొచ్చి రెండు రోజులు రెస్ట్ తీసుకుంటున్నారు......
    ఇంత ఓపికగా ఇన్నింటికి వెళ్ళొచ్చారంటే మాటలా....

    కొన్ని రోజులు రెస్ట్ తీస్కోండి...

    రిప్లయితొలగించండి
  10. అయితే అరకు ఊహల్లోనే బాగుంటుందన్నమాట. ప్చ్.. ఆ పసుపు పచ్చని పూవులు లేని అరకు చూడాలనిపించడం లేదు.

    కనీసం రెండు మూడు నెలలకో మాటు మీరొక యాత్ర చేసి యాత్రావిశేషాలను మాతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. మంచి సిరీస్. మాకూ ఆయా ప్రదేశాలకు వెళ్ళినట్టనిపించడం కాదు, "వెళ్తే ఇలా చూడాలి" అనిపించేలా రాసారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. బాగుంది. అవేవో పూల పంటలు వేయడం మానేసి వేరే ఏదైనా పంట పెట్టకపోతే ఎలా? భూమి వృథా అయిపోదూ? ఆదాయం ఎలా? పోతే పోస్టు, సాహిత్యం, నృత్యం, యాత్రావిశేషాలపై పైన వాళ్ళు వెలిబుచ్చిన అభిప్రాయాలే నావి కూడా, అని భావించండి.

    రిప్లయితొలగించండి
  12. @రాజి: ధన్యవాదాలండీ..
    @జయ: ఈసారి సెలవుల్లో ప్లాన్ చేసుకోండి.. ధన్యవాదాలు.
    @రసజ్ఞ : జలాశయంలో పెద్దగా నీళ్ళు లేవండీ మేం వెళ్ళినప్పుడు :( ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. @వేణూ శ్రీకాంత్: అయ్యబాబోయ్. చాలా చాలా పెద్ద ప్రశంస వేణు గారూ.. ధన్యవాదాలు.
    @బులుసు సుబ్రహ్మణ్యం: చదివినవీ, విన్నవీ ఆ ప్రదేశాలని చూడగానే గుర్తొచ్చాయండీ.. అంతే.. ధన్యవాదాలు.
    @DG :విశాఖలో అకామడేషన్ ముందుగా ఫోన్ ద్వారా బుక్ చేసుకున్నామండీ.. వాళ్ళకే ట్రావెల్స్ ఉంది. అరకు టూర్ మాత్రం టూరిజం వారిది.. ఓ మిత్రుడు ఏర్పాటు చేశాడు మాకు.. ఆన్లైన్ లో బుక్ చేసుకునే వీలుంది.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. @కిరణ్మయి: మీరు విన్నది నిజమనండీ.. కానీ గిరిజనులు వ్యవహరించేది వలసపూలని.. అరకు చూసొచ్చాక ఎన్నో ఆలోచనలండీ.. ధన్యవాదాలు.
    @జై గొట్టిముక్కల: ధన్యవాదాలండీ..
    @జయ: మీకూ సంక్రాంతి శుభాకాంక్షలండీ..

    రిప్లయితొలగించండి
  15. @మాధవి: తరచూ వెళ్ళేది కాదు కదండీ.. క్రోసిన్, బ్రూఫిన్ల సాయం తీసుకున్నాం లెండి :-) ధన్యవాదాలు.
    @కొత్తావకాయ: అలా వదిలేయకుండా చూసి రండి, వీలున్నప్పుడు.. ఊహకీ, వాస్తవానికీ మధ్య భేదం తెలుసుకోవచ్చు కదా.. రెండు మూడు నెలలకో యాత్ర, వినడానికి బాగుంది కానీ, ప్రాక్టికల్గా హ్మం.. చూడాలండీ.. టపాలకి మీ అందరి ప్రోత్సాహానికీ ధన్యవాదాలు.
    @SNKR: పంట వేసి వాళ్ళు నష్టపోలేరు కదండీ మరి . అక్కడక్కడా వారి పండించే ప్రయత్నాలు కనిపించాయి.. కానైతే వాతావరణం అనుకూలించాలి కదండీ.. ముఖ్యంగా ఉష్ణోగ్రత, నీటి లభ్యత.. చూడాలి, ఏం జరుగుతుందో :( ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. మీకు తెలియదని కాదు. అరకు ని (ముఖ్యంగా అక్కడి చాలా మంది స్త్రీలని)ఇపుడు పట్టి పీడిస్తోంది ఎయిడ్స్ మహమ్మారి. కేవలం పర్యాటకులే వారికి ఆర్ధిక వనరు కావడంతో స్థానికులకి పర్యాటకులతో ఇంటరాక్షన్ ఎక్కువ కావడం తప్పనిసరి. బీదరికం వల్ల, వివిధ పరిస్థితుల వల్ల వ్యభిచారం ద్వారా డబ్బు సంపాయించడం కూడా ఎక్కువవుతోంది. అలా, చదువూ, పెద్ద లోకజ్ఞానమూ లేని వీళ్ళూ అసురక్షిత లైంగిక సంబంధాల వల్ల సులువుగా ఎయిడ్స్ బారిన పడుతున్నారు. ఇది చాలా పెద్ద సమస్య గా మారడంతో కొన్ని ఎన్.జీ.వో లు ఉచితంగా కండోంలు, యాంటీ రిట్రో వైరల్ డ్రగ్స్, జెనెరిక్ మందులూ పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ సంస్యని గుర్తించడం జరిగింది. విశాఖపట్నం లో అరుకు, పాడేరు నుణ్చీ వచ్చ్చే పసుపు, అల్లం, చింతపండూ ప్రసిద్ధి ! ఏజెన్సీ లో జీవితం చాలా దుర్భరం. విషజ్వరాలకే ఎంతో మంది చనిపోతూంటారు. మీకు కుదిరితే 'ఇంగ్లీష్ ఆగస్ట్ సినిమా అన్నా చూడండీ, నవలన్నా చదవండి. మంచిగా అంతా పర్యటించి కళ్ళకు కట్టినట్టు రాసేరు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. మీ ఉత్తరాంధ్ర యాతలో పరిచయం చేసిన ఏ ఊరూ నేనెప్పుడూ చూడలేదు. మీ యాత్రానుభవాలు బాగున్నాయి. మీ మాటల్లో మమ్మల్ని కూడా ఊర్లు తిప్పేసి తీసుకొచ్చారు. :)
    మీరన్న పచ్చ పువ్వులు ఇవే.. rape seed అంటారు.
    http://en.wikipedia.org/wiki/Brassica_napus

    రిప్లయితొలగించండి
  18. చాలా బాగున్నాయండీ మీ యాత్రా విశేషాలు...మా అత్తవారిది విశాఖే..India వెళ్ళిన ప్రతి సారీ ఆ అందాలన్నీ చూసెయ్యొచ్చు అని బోల్డు ఆశ పెట్టుకున్నా...ఇప్పటికి మూడు సార్లు వచ్చినా ఆఖరికి RK బీచ్ కూడా చూడటం కుదరట్లేదు...సిమ్హా చలం...పైడితల్లి గుడీ చూస్తాం గానీ నకెందుకో అవి పెద్ద తృప్తినివ్వవ్...

    అరకు ప్రయాణం ఐతే నా చిన్నప్పటినుంచీ వూరిస్తోన్న కల...మీరు బొర్రా గుహల గురించి చెప్పినది చూస్తే అసలు నేను అవి వుండగా చూడగలనా అన్న బెంగొచ్చేసింది...

    అన్నట్టు మీ బ్లాగుకి మూడవ వసంతం నిండిన సందర్భంగా శుభా కాంక్షలు...అటునించే ఇటొచ్చా... ఆ టపా కూడా చాలా నచ్చింది...సరిగ్గా తేదీ గుర్తు లేదు కానీ ఈ జనవరి చివర్లోనే నా బ్లాగుకీ మూడేళ్ళు నిండుతాయి...పాపం దానికెప్పుడూ పుట్టినరోజు పండగ చేసి ముచ్చట తీర్చలేదు నేను...:)

    రిప్లయితొలగించండి
  19. @సుజాత: ఎయిడ్స్ సమస్య గురించి కొంత అవగాహన ఉందండీ.. అలాగే విష జ్వరాల గురించీ ఏటా పేపర్లు గోల పెడుతూనే ఉంటాయి.. మన మంత్రులు దోమతెరలు పంచుతాం అంటూ ఉంటారు కూడా.. ధన్యవాదాలు.
    @మధురవాణి: అవునండీ.. ఇవే పూలు.. అరకులో కనిపించలేదు :( ..ధన్యవాదాలు.
    @స్ఫురిత: ధన్యవాదాలండీ.. పుట్టిన రోజు జరపండి మీ బ్లాగుకి...

    రిప్లయితొలగించండి
  20. మీతో పాటు ప్రయాణం చేపిచారు....చక్క గా ఉంది మొత్తం ప్రయాణం :)
    అరకు ని ఉహలలోనే ఉంచుకోవాలి అని నిర్ణయించుకున్న మీ టపా చదివాక...

    రిప్లయితొలగించండి