బుధవారం, జనవరి 19, 2011

బంగారు మురుగు

అనగనగా ఓ బామ్మ, మనవడు. ఆ బామ్మకి కాశీ, రామేశ్వరం అన్నీ మనవడే. మనవడికి అమ్మ, నాన్న, చుట్టం, పక్కం అన్నీ బామ్మే. బామ్మది కలిగిన కుటుంబం. కొడుక్కీ, కోడలికీ విపరీతమైన దైవ భక్తి. ఎప్పుడూ పూజా పునస్కారాలూ, మడీ ఆచారాలూ. వాళ్ళిల్లు స్వాములార్లకీ, పీఠాధిపతులకీ విడిది. అందుకే ఆ ఇంట్లో బామ్మదీ, మనవడిదీ ఓ జట్టు. వాళ్ళిద్దరూ ఒకే కంచంలో తింటారు. ఒకే మంచంలో పడుకుంటారు.

ఆరేళ్ళ మనవడిని వీపున వేసుకుని, అతగాడు సగం నిద్రలో జోగుతుంటే, దేవుళ్ళందరికీ మేలుకొలుపులు పాడుతూ, గుమ్మం ముందు ముగ్గులు తీర్చి దిద్దడంతో బామ్మగారి దినచర్య ప్రారంభమవుతుంది. "మేలుకొలుపులూ మనకోసమే, చక్రపొంగలీ మనకోసమే.." అంటుందావిడ చమత్కారంగా. "దయ కంటే పుణ్యం లేదు. నిర్దయకంటే పాపం లేదు. చెట్టుకి చెంబెడు నీళ్ళు పోయడం, పక్షికి గుప్పెడు గింజలు చల్లడం, పశువుకి నాలుగు పరకలు వేయడం, ఆకొన్న వాడికి పట్టెడు అన్నం పెట్టడం..." ఇది ఆవిడ సిద్ధాంతం.

పెరట్లో ఉండే బాదం చెట్టు బామ్మా మనవాళ్ళ స్థావరం. రోజులో ఎక్కువసేపు వాళ్ళు కాలం గడిపేది ఆ చెట్టు కిందే. తను కాపురానికి వచ్చేటప్పుడు మూడే బుల్లి బుల్లి ఆకులతో ఉండే బాదం మొక్కని తనతో తెచ్చిన బామ్మ, దానిని పెంచి పెద్ద చేసింది. ఇప్పటికీ చెంబెడు నీళ్ళు దాని మొదట్లో పోస్తుంది. నీడన కట్టేసిన ఆవుకి పరకలు వేస్తుంది. బాదం కాయలు వైనంగా కొట్టి మనవడికి తినిపిస్తుంది. బాదం ఆకులతో విస్తళ్ళు కుడుతుంది.

బామ్మ చేతికో బంగారు మురుగు. ఆవిడ దానిని ఎల్ల వేళలా ధరిస్తుంది. నెలకోసారి భజంత్రీ వాడొచ్చి తల పని చేసినప్పుడు మాత్రం, కాసేపు దాన్ని మనవడికిస్తుంది, లక్ష జాగ్రత్తలు చెప్పి. కోడలితో పాటు, ఆవిడ కూతురి కళ్ళు కూడా ఆ మురుగు మీదే. ఎలా అయినా ఆ మురుగుని సొంతం చేసుకోడానికి వాళ్ళు చేయని ప్రయత్నాలు లేవు. బామ్మ ముందా వాళ్ళ ప్రయత్నాలు?

బామ్మకి లౌక్యం తెలుసు. ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. అందుకే పంట శిస్తు తెచ్చే రైతులతో నేరుగా వ్యవహారం మాట్లాడకుండా, ఎండన పడి వచ్చిన వాళ్లకి ముందుగా విస్తరి నిండా వడ్డించి కడుపు నిండుగా భోజనం పెడుతుంది. ఆ తర్వాతే, పంటల కబుర్లు, శిస్తు లెక్కలు. మనవడికోసం బామ్మ ఎంతైనా చేయగలదు. అతనికి చిరుతిళ్ళు అందనివ్వక పోతుంటే, పీచ్మిఠా వాడికి దేవుడి గంట అమ్మేసి చిరుతిళ్ళు కొని తినిపించగలదు.

కొడుక్కీ, కోడలికీ పీఠాలని సేవించుకోవడం అంటే భయమూ, భక్తీని. బామ్మకి మాత్రం వాటి లెక్కేమీ లేదు. మనవడి తర్వాతే పీఠమైనా, దేవుడైనా. ఇంటికి వచ్చిన పీఠాధిపతికి తెలియక అపచారం చేసిన మనవడిని, కొడుకు చావ బాదుతుంటే అడ్డుపడింది బామ్మే. ఆక్షణంలో మనవడికి వెయ్యి చేతులు తనకోసం చాపిన అమ్మవారిలా కనిపించింది బామ్మ. "అరిసెల్నీ అప్పాల్నీవదలలేని వాడు అరిషడ్వర్గాలనేఁ వదులుతాడు" అంటూ కొడుకునీ, స్వాములార్నీ కలిపి తిట్టేసింది.

కాలం గడిచిపోయింది. ఆస్తులు కరిగిపోయాయి. బామ్మేమీ బాధ పడలేదు సరికదా, "మా ఉయ్యాల వెండి గొలుసులని గున్న ఏనుగు మింగేసింది" అని సరసంగా నవ్వుతుంది. గున్న ఏనుగు పీఠాల వారిది. ఇప్పుడు గత వైభవమూ లేదు, అలా అని దరిద్రమూ లేదు. మనవడి వైభవం బామ్మా, బాదం చెట్టూ -- రెండూ ఉన్నాయి. మనవడి ఎఫ్.ఏ. చదువు పూర్తి కావడం, సర్కారు కొలువు దొరకడంతో పెళ్లి సంబంధాలు రావడం మొదలవుతుంది. పిల్లనిస్తానంటూ మేనత్తే వచ్చినా, బామ్మ వద్దు పొమ్మంటుంది.

ఎట్టకేలకి బామ్మకి నచ్చిన సంబంధం వచ్చింది. చిన్న మాట పట్టింపు దగ్గర ఆగింది. బామ్మకి ఆ సంబంధం చేయాలని. ఎటూ చెప్పలేని పరిస్థితి మనవడిది. మనవడి పెళ్లి పల్లకీ ఊరేగింపు చూడాలన్న ఆ బామ్మ కల నెరవేరిందా? అంత ప్రేమగా చూసుకున్న బంగారు మురుగుని ఆవిడ ఏం చేసింది? ఇత్యాది ప్రశ్నలకి సమాధానం శ్రీరమణ రాసిన కథ 'బంగారు మురుగు.'

వెనకటి తరం కుటుంబ బంధాలని అద్దంలో చూపిస్తూ రాసిన ఈ కథని ఆసాంతమూ చదవకుండా విడిచి పెట్టలేం. కేవలం ఒక్కసారి మాత్రమే చదివి సరిపెట్టుకోలేము కూడా. ఇప్పటికీ ఈ కథని చదువుతుంటే చివరి వాక్యాల దగ్గర కళ్ళు మసకబారతాయి. 'మిథునం' కథల సంపుటిలో ఉందీ కథ.

13 కామెంట్‌లు:

  1. చాలా మంచి కథని పరిచయం చేసారు. మీరు చెప్పినట్టు ఒకసారి చదివి వదిలేయ్యలేని కథ(లు). అవును, ఈ కథని చదివినప్పుడల్లా చివరికి కళ్ళు మసకబారాకుండా ఉండటం దాదాపు అసాధ్యం. అచ్చం ఇలాంటి బామ్మ మనకి కూడా ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. కొన్నిచోట్ల మన బాల్యం, మన బామ్మ/అమ్మమ్మ, తాతలు చేసిన గారాబం కూడా గుర్తుకు వస్తుంది.ఇందులో నాకు బాగా నచ్చిన బామ్మ మాటలు కొన్ని
    "చెట్టుకి చెంబెడు నీళ్ళు, పక్షికి గుప్పెడు గింజలు, పశువుకి ఇన్ని పరకలు, ఆకలిగొన్న వాడికి పట్టెడు మెతుకులు, ఇదే నాకు తెలిసింది."
    మనిషి బ్రతుకుకి సార్ధకత ఎంత సులభంగా చెప్పారో.. ఈ మధ్య అందరి బందువయా చూసినపుడు, అచ్చం ఇలాంటి వాక్యాలే విన్నప్పుడు, ఈ కథ గుర్తుకు వచ్చింది. (క్రెడిట్స్ , స్ఫూర్తి అంటూ రమణి గారు ఏమైనా మెన్షన్ చేసారేమో తెలీదు.)
    "నువ్వు ఆకు వక్కా వేసుకుంటే, తన నోరు పండాలి
    ఆ పిల్ల గోరింటాకుతో పారాణి పెట్టుకుంటే నీ కాళ్ళు పండాలి"
    ఎంత సున్నితంగా, కళాత్మకంగా చెప్తారో కదా...
    శ్రీరమణ గారి కథలు కూడా నేను దాచుకుని చదువుకునే కథల్లో 'మిధునం' ఒకటి. నా పక్షపాతం అయితే అవ్వొచ్చు కానీ, నామొదటి వోటు మాత్రం మిధునం కథకే. అదో అందమయిన ప్రేమ కావ్యంలా అనిపిస్తుంది నామనసుకి. బాపు గారి సొంత చేతి వ్రాతతో ఉన్నదాన్ని చదవటం ఇంకో అపురూపమైన అనుభవం.
    పద్మవల్లి

    రిప్లయితొలగించండి
  2. మురళి గారు సంక్రాంతి శుభాకాంక్షలు
    ఆణిముత్యాలన్నీ ఏరుకొచ్చి మీ బ్లాగులో దాచేసుంకుంటారు మీరు . మీ బ్లాగు పేరు మార్చి భోషాణం అని పెట్టెయ్యాలి

    రిప్లయితొలగించండి
  3. "దయ కంటే పుణ్యం లేదు. నిర్దయకంటే పాపం లేదు. చెట్టుకి చెంబెడు నీళ్ళు పోయడం, పక్షికి గుప్పెడు గింజలు చల్లడం, పశువుకి నాలుగు పరకలు వేయడం, ఆకొన్న వాడికి పట్టెడు అన్నం పెట్టడం." అన్నబామ్మమాటలు ఈమధ్య 'అందరిబందువయా'సినిమాలో నరేష్ చేత చెప్పించిన డైలాగ్ ఇంచుమించుగా ఇటువంటిదే చాలాకాలం గుర్తుండిపోతుంది.అందుకే బామ్మ మాట బంగారు మూట మరి! బంగారు మురుగు కధ మా అమ్మగారి నాన్నమ్మ మురుగుల్ని గుర్తుకు తెచ్చింది.

    రిప్లయితొలగించండి
  4. ఈ కథ, 'మిధునం' కథ "రచన"లో పడినప్పుడే కాపీలు తీసి ఎంతమంది మిత్రులకు పంపామో నేనూ,నాన్న.

    నాకు చాలా చాలా ఇష్టమైన కథ. "చెట్టుకి చెంబెడు నీళ్ళు పోయడం, పక్షికి గుప్పెడు గింజలు చల్లడం, పశువుకి నాలుగు పరకలు వేయడం, ఆకొన్న వాడికి పట్టెడు అన్నం పెట్టడం." ఈ వాక్యం కథకే హైలైట్.

    ఈ కథ గురించి రాద్దామని నెల నుంచీ కంప్యూటర్ పక్కనే పెట్టుకున్నాను...కానీ వీలుపడలేదు...:)

    రిప్లయితొలగించండి
  5. మళ్ళీ మామూలుగానే మంచి కథే చెప్పారు. మళ్ళీ మామూలుగానే నేనూ చదవలేదనుకోండి. మురళిగారు, పనిలో పని ఓ మాట చెప్పనా. మీ సుమనోహరుడు మీ కన్నుల విందు చేయటానికి మాంచి రొమంటిక్ రోల్ లో వస్తున్నట్లున్నాడు. రెడీయేనా మరి:) ఇంక మేము కూడా రెడీ అవ్వలిగా మీ రివ్యూ కోసం.

    రిప్లయితొలగించండి
  6. ఈ కథ నేను సాక్షి కథా పరిచయం లో చదివేసానొచ్, కాబట్టి నాకు ఆ మురుగు ఏమైందో తెలుసోచ్ !!!
    ఐనా మురళి గారు, ఇలా మీరు మాకు తెలిసిన కథలు గట్రా పరిచయం చేస్తే ఎలాగండీ? పైగా నాకెందుకో మీ ఫాం తగ్గిందనిపిస్తోంది ఈ మధ్య (అంటే, selection లో కాదు, Writing quality లో) ఇలా చెప్పటం తప్పైతే మన్నించండి. కాని మీ అభిమానులకు మీ మీద చాలా expectations ఉన్నాయి, మీరు వాటికి తగ్గ కూడదని............

    రిప్లయితొలగించండి
  7. @పద్మవల్లి: ఆణిముత్యాల్లాంటి వాక్యాల్లు చాలానే ఉన్నాయండీ కథ నిండా.. మిధునం, షోడా నాయుడు, బంగారు మురుగు... మూడూ ప్రత్యేకమైన కథలే.. దేని ప్రత్యేకత దానిదే.. 'అందరి బంధువయ' లో డైలాగు విన్నప్పుడు నాకీ కథే గుర్తొచ్చిందండీ.. క్రెడిట్ ఏమీ ఇవ్వలేదు.. స్ఫూర్తి పొంది ఉంటారు, బహుశా :-) ..ధన్యవాదాలు.
    @లలిత: అంతేనంటారా? :-) ..ధన్యవాదాలు.
    @పరిమళం: ఆ డైలాగ్ కి స్ఫూర్తి ఈ కథేనండీ.. వాళ్ళు ప్రకటించలేదు, అంతే.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. @తృష్ణ: మిధునం మొదట ఆంధ్రభూమిలో వచ్చినట్టు ఉందండీ.. నేనూ చాలామంది చేత చదివించాను, చదివిస్తున్నాను.. ధన్యవాదాలు.
    @జయ: రొమాంటిక్ రోల్ కాదండీ, బాధ్యతాయుతమైన తండ్రి పాత్ర అనుకుంటా, చూడాలి :-) ... ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. @Ruth: నిజంగా నాకు మీ వ్యాఖ్య చాలా చాలా సంతోషాన్ని కలిగించిందండీ.. ఫాం అని కాదు కానీ, నా రాతలని నేను సమీక్షించుకుంటున్న ఈ సమయంలో మీరు మీ అభిప్రాయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పడం నాకు ఎంతో ఉపయోగ పడుతుంది. మీరిలా చెప్పడం తప్పు ఎంతమాత్రం కాదు కాబట్టి 'మన్నింపు' ప్రస్తావన అనవసరం అండీ. రైటింగ్ క్వాలిటీ విషయంలో మీరు చెప్పిన అంశాన్ని దృష్టిలో ఉంచుకుంటాను.. చాలా చాలా కృతజ్ఞతలు..

    రిప్లయితొలగించండి
  10. మిధునం..చాలా మంచి పుస్తకం. అన్ని కధలూ బాగుంటాయి ఈ పుస్తకం లో. మంచి కధని మళ్ళీ రిఫ్రెష్ చేశారు. మళ్ళీ పుస్తకం కొనుక్కోవాలి.

    రిప్లయితొలగించండి
  11. ఎన్నోరోజుల ఎదురు చూపుల తర్వాత వారం క్రితమే నా చేతికివచ్చిన ఈ పుస్తకంలో నేచదివిన మొదటి కథ ఇదే మురళి గారు. మీ పరిచయం బాగుంది.

    రిప్లయితొలగించండి
  12. @ప్రణీత స్వాతి: నేను మొన్ననే ఓ రెండు కాపీలు కొన్నానండీ.. (కొత్త ప్రింట్)... ఆసందర్భంగా రాసిన టపా ఇది.. ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: ఒకట్రెండు మినహా మిగిలిన అన్ని కథలూ చాలా బాగుంటాయండీ.. ఈపాటికి మీరు చదివేసే ఉంటారు :-) ..ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  13. మీ పరిచయం చాలా బాగుంది. :) శ్రీరమణ గారి 'మిథునం' పుస్తకంలో ఉన్న అన్నీ కథల్లోకీ నాకు బాగా నచ్చిన కథ ఇదీ, ఇంకా షోడానాయుడు! మిథునం కంటే కూడా ఓ పిసరు ఎక్కువే నచ్చాయివి. :)

    రిప్లయితొలగించండి