జీవితాన్ని రైలు ప్రయాణంతో పోలుస్తారు చాలామంది. చూసే ఓపిక, ఆసక్తీ ఉండాలే కాని రైలు ప్రయాణంలోనే జీవితం మొత్తం కనిపించేస్తుంది మనకి. రకరకాల మనుషులు. ఎవరి ప్రయాణం ఎక్కడ మొదలవుతుందో ఎక్కడ ఆగుతుందో మరొకరికి తెలీదు. అయినా కలిసిన ఆ కాసేపట్లోనే అపరిచితుల మధ్య ఎన్నో సంభాషణలు నడిచిపోతూ ఉంటాయి. కొండొకచో పోట్లాటలు కూడా. చొరవగా మాట కలిపేవాళ్ళు కొందరైతే, మౌన ప్రేక్షకులుగా మిగిలిపోయే వాళ్ళు మరికొందరు.
మనుషులు ఎంత ఎదిగినా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇష్టంగా గుర్తొచ్చే మొదటి జ్ఞాపకం బాల్యం. ఆ బాల్యంలో ఆడిన తొలి ఆటల్లో 'ఛుక్ ఛుక్ రైలు వస్తోంది..' లేకుండా ఉంటుందా? అలా రైలుకీ బాల్యానికీ అవినాభావ సంబంధం. నావరకు నాకు తొలి రైలు ప్రయాణం ఓ అపురూప జ్ఞాపకం. రైలంటే ఎలా ఉంటుంది? మొదలు, రైలు ఎందుకు కూత పెడుతుంది? వరకూ సవాలక్ష సందేహాలు అప్పట్లో. పెద్దైపోయాక ఎవరినీ అడగక్కర్లేకుండానే జవాబులు తెలుసుకునే వీలున్నప్పుడు బుర్రలో ప్రశ్నలే పుట్టవెందుకో.
రైల్వే ట్రాక్ ల పక్కన బాల్యాన్ని గడిపిన భాగ్యశాలుల రైలు జ్ఞాపకాలు రాయడం మొదలు పెట్టారంటే అది అలా ఎక్ష్ప్రెస్ రైలులా సాగిపోవలసిందే. ట్రాక్ మీద నాణాన్ని ఉంచి నాణెం నాణ్యతని పరిశీలించడం మొదలు రైల్లో వెళ్ళే ముక్కూ మోహం తెలియని వందలాదిమందికి వీడ్కోలు చెప్పడం వరకూ వీళ్ళు ఆడని ఆట ఉండదు. నా చిన్నప్పుడు మా బాబాయ్ వాళ్ళు కొన్నాళ్ళ పాటు రైల్వే ట్రాక్ పక్కన ఉన్నారు. అప్పట్లో నేనూ ఈ ఆటలన్నీ ఆడానని చెప్పడానికి గర్వ పడుతున్నాను.
అన్నట్టు రైలు పెట్టెలు లెక్క పెట్టే ఆట ఎంత బాగుంటుందో. కొత్తగా అంకెలు నేర్చుకునే వాళ్ళ చేత గూడ్సు బండి పెట్టెలు లెక్క పెట్టించాలి. అప్పుడింక వాళ్లకి అంకెలు, సంఖ్యల్లో తిరుగుండదు. కాకపొతే, మామూలు రైలు పెట్టెలని లెక్క పెట్టడంలో ఉండే సరదా, గూడ్సు రైలు పెట్టెలని లెక్క పెట్టడంలో ఉండదుగాక ఉండదు. తిరిగి నవ్వే, చెయ్యూపే ఒక్క ముఖమూ కనిపించక పోతుంటే అలా మన పాటికి మనం పెట్టెలు లెక్కెట్టుకోడం భలే విసుగు.
రైలు ప్రయాణంలో కలిసే బంధుత్వాలు భలే చిత్రంగా ఉంటాయి. నిమిషాల్లో ప్రాణ స్నేహితులు అయిపోయిన వాళ్ళే, రైలు దిగిన మరుక్షణం పరాయివాళ్ళు అయిపోతారు. కొండొకచో రైలుబండి నిజమైన స్నేహాలనీ కూర్చి పెట్టినప్పటికీ, అధికశాతం రైలు స్నేహాలు అవసరార్ధపు స్నేహాలే. అసలు ఈ రైలు పరిచయాల్లో తమ తమ నిజ వివరాలని పంచుకునే వాళ్ళు ఎందరు ఉంటారా అనే విషయం మీద ఓ చిన్న పరిశోధన చేస్తే ఎలా ఉంటుందా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి.
రైల్లో పైతరగతి ప్రయాణాల కన్నా జనరల్ కంపార్ట్మెంట్ ప్రయాణాలు భలే బాగుంటాయి. నాకైతే సరదాగా కూడా అనిపిస్తాయి. అయితే ప్రయాణ కాలం ఓ రెండు గంటలు మించకూడదు. పైతరగతి పెట్టెల్లో ప్రయాణికులు మూతులు బిగించుకుని కూర్చుంటే, జనరల్‌లో ప్రయాణికులు కాసేపు వీళ్ళు మౌనంగా ఉంటే బాగుండు అనిపించే విధంగా మాట్లాడుతూనే ఉంటారు. అసలిక్కడ దొర్లని టాపిక్ అంటూ ఉండదు. ఉన్న ఆ కొంచం జాగాలోనే కూసింత సర్దుకుని నిలబడ్డ వాళ్లకి సీటివ్వగల ఔదార్యం జనరల్ ప్రయాణికుల సొంతం.
అయితే, కొంచం ముందుగా బండెక్కిన ఒకే ఒక కారణానికి సామాను పరుచుకుని సీట్లు ఆక్రమించుకుని నిద్ర నటించే వాళ్ళూ ఇక్కడ కనిపిస్తారు. సమస్త వ్యాపారాలు చేసేవాళ్ళూ తమ తమ వస్తువులని 'కారు చౌక'గ అమ్మేది జనరల్ కంపార్ట్మెంట్ లోనే. తాజా కూరలు, పళ్ళు మొదలు పైరేటెడ్ డిస్కుల వరకూ ఏం కావాలన్నా దొరికే సూపర్ మార్కెట్ ఈ జనరల్ కంపార్ట్మెంట్. రౌడీయిజం మొదలు రాజకీయాల వరకూ ఏ విషయాన్ని గురించైనా అలవోకగా చెప్పేయగల ఎన్ సైక్లోపీడియా కూడా ఇదే.
మన సినిమాలు, సాహిత్యం రైలు ప్రయాణాన్ని ఏమాత్రం చిన్నచూపు చూడలేదు. అలా చేస్తే రైలుబండిని ప్రేమించే జనం తమని చిన్న చూపు చూస్తారేమోనన్న భయసందేహం ఇందుకు కారణం కావొచ్చు. అందుకే ఎందరో నాయికా నాయకులు రైలు ప్రయాణంలో కలుసుకున్నారు. మరికొందరు విడిపోయారు. ఇంకొందరి జీవితాలు ఊహించని మలుపు తిరిగి పాఠ/ప్రేక్షకులని ఉక్కిరిబిక్కిరి చేశాయి. రైలు ప్రయాణాల నేపధ్యంలో వచ్చిన కథలు, కార్టూనులకైతే లెక్కేలేదు. అసలు రైలు ప్రయాణాన్ని ఇష్టపడని వాళ్ళు ఎవరన్నా ఉంటారా?